తనిష్క్: హిందూ కోడలికి ముస్లిం అత్త సీమంతం చేస్తున్నట్లుగా వాణిజ్య ప్రకటన.. ‘లవ్ జిహాద్’ అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం

ఫొటో సోర్స్, Tanishq
‘తనిష్క్’ ఆభరణాల సంస్థ ఇటీవల 'ఏకత్వం' పేరుతో వాణిజ్య ప్రకటనలను విడుదల చేసింది.
అయితే అందులో ఒక వాణిజ్య ప్రకటనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో ఆ సంస్థ దాన్ని తమ సోషల్ మీడియా పేజీల నుంచి తొలగించింది.
ఈ ప్రకటనలో ఒక హిందూ మహిళకు ముస్లిం కుటుంబంలో జరుగుతున్న సీమంతాన్ని చిత్రీకరించారు.
దీంతో ఆ ప్రకటన 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి చేసే కుట్రే ‘లవ్ జిహాద్’ అని కొన్ని హిందూ సంస్థలు పేర్కొంటాయి.
సోషల్ మీడియాలో కొందరు సంప్రదాయవాదులు తనిష్క్ బ్రాండ్‌ను బహిష్కరించాలని పిలుపునిస్తూ ట్రోలింగ్ చేశారు.
ఈ పరిణామాన్ని ఖండిస్తూ మరికొందరు నెటిజన్లు పోస్టులు, కామెంట్లు పెట్టారు.
సంస్థ యూట్యూబ్‌లో పోస్టు చేసిన ప్రకటనకు ‘‘కోడలిని సొంత బిడ్డలా చూసుకునే కుటుంబంలో ఆమె అడుగుపెట్టింది. ఆమె కోసం వారి ఇంట్లో సాధారణంగా ఎప్పుడూ జరపని ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇది రెండు మతాలు, సంస్కృతులు, పద్ధతుల మధ్య జరుగుతున్న శోభాయమానమైన సమ్మేళనం" అనే వివరణను రాశారు.
ఏకత్వం పేరుతో ఆ సంస్థ విడుదల చేసిన 43సెకండ్ల ప్రకటనను, తనిష్క్ సోషల్ మీడియా ఛానళ్ల నుంచి ఉపసంహరించారు.
దీనిపై బీబీసీ సంస్థను సంప్రదించగా వారి నుంచి ఎలాంటి స్పందనా లేదు.
సంస్థ ఫేస్ బుక్, యుట్యూబ్‌లలో పోస్ట్ చేసిన ప్రకటనపై నెటిజన్లు కామెంట్లు, లైకులు చేయడానికి వీల్లేకుండా తొలుత మార్చారు. ఆ తరువాత ఏకంగా వీడియోను కూడా తొలగించారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ దీనిపై స్పందిస్తూ ‘‘హిందూ ముస్లిం ఐక్యతను చూపిస్తున్న ఈ ప్రకటనను హిందూత్వ దురభిమానులు బహిష్కరించమని పిలుపునిచ్చారు” అని ట్వీట్ చేశారు.
"హిందూ ముస్లింల మధ్య నున్న ఐక్యత వారిని అంతగా ఇబ్బంది పెడుతుంటే హిందూ ముస్లింల ఐక్యతకు సుదీర్ఘ కాలంగా ప్రతీకగా నిల్చిన దేశాన్ని కూడా బహిష్కరించవచ్చు కదా" అని ఆయన ట్వీట్ లో రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారతదేశంలో ఇప్పటికీ చాలా కుటుంబాలు తమ సొంత మతం, కులంలోని వారితోనే వివాహాలు జరిపేందుకు ప్రాముఖ్యం ఇస్తారు.
కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న వారు హత్యలకు గురైన ఘటనలూ ఉన్నాయి.
దేశంలో జరిగే వివాహాలలో మతాంతర కులాంతర వివాహాలు కేవలం 5 శాతం మాత్రమే ఉంటాయని మానవ అభివృద్ధి సర్వే అంచనా వేసింది.
2016లో దిల్లీ, ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్‌లలో సోషల్ యాటిట్యూడ్ సర్వే (సరి) నిర్వహించిన ఒక అధ్యయనంలో ఎక్కువ మంది కులాంతర మతాంతర వివాహాల పట్ల విముఖత చూపినట్లు తెలిసింది.
అటువంటి వివాహాలను బహిష్కరించే చట్టం రావాలని కూడా కొంత మంది భావించారు.
ఈ పరిణామాలపై తనిష్క్ షోరూమ్ నిర్వహిస్తున్న ఒక వ్యాపారవేత్త బీబీసీతో మాట్లాడారు.
"నేను వ్యక్తిగతంగా కులాంతర, మతాంతర వివాహాలకు మద్దతు పలకడం కానీ, వ్యతిరేకత వ్యక్తం చేయడం కానీ చేయను. ఎవరైనా తమ జీవితానికి కావాలనుకున్న దానిని నిర్ణయించుకునే స్వతంత్రాన్ని గౌరవిస్తాను. వివాహం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. దాని గురించి ఎవరినీ శాసించే అధికారం లేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"తనిష్క్ ఏకత్వం ప్రకటనలో నాకయితే ఎటువంటి తప్పు కనిపించలేదు. ప్రతీ విషయాన్ని సంకుచితంగా చూసి మతాన్ని ఆపాదించడం సరైన పద్దతి కాదు. మానవత్వం మతానికంటే భిన్నమైనది. మన ప్రజాస్వామ్యపు విలువలైన నా భావ ప్రకటనా స్వేచ్ఛను , నా అంతరాత్మను అనుసరించే స్వతంత్రాన్ని నేను గౌరవిస్తాను" అని ఆమె అన్నారు.
గతంలో హిందీ సినిమా పద్మావత్ విడుదల సమయంలో దీపిక పోస్టర్ పెట్టినందుకు దానిని తొలగించమని షో రూమ్ కి వచ్చి కొంత మంది వ్యక్తులు బెదిరించినట్లు చెప్పారు. పద్మావత్ సినిమాకి తనిష్క్ జ్యువెలరీ పార్టనర్‌గా పని చేసింది.
సంస్కృతి, సంప్రదాయాలు, పవిత్రతలను కాపాడే బాధ్యత మహిళలపైనే వేసి, ఒక వేళ ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తిస్తే ఆ కుటుంబం, సమాజం పరువు తీసేసినట్లుగా చూస్తారని మహిళా ఉద్యమకారులు అంటారు.
2018 లో హిందూ మహిళలతో సంబంధాలు ఉన్న 102 మంది ముస్లిం యువకుల పై దాడులు జరపమని పిలుపునిస్తూ తయారు చేసిన ఒక ఫేస్ బుక్ పేజీని తొలగించారు.
ఆ లిస్టులో ఉన్న యువకులను వెంటాడి పట్టుకుని వేటాడమని పిలుపునిచ్చిన ఆ పేజీపై ఆన్‌లైన్లో ఆగ్రహం వెల్లువెత్తింది.
ప్రకటనలపై మతపరమైన ట్రోలింగ్ జరగడం ఇదే తొలిసారి కాదు.
గతంలో హోలీ సందర్భంగా సర్ఫ్ ఎక్సెల్ విడుదల చేసిన ప్రకటనపైనా సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి.
అందులో ఒక హిందూ అమ్మాయి తన ముస్లిం స్నేహితుడు రంగులు పడకుండా మసీదుకు వెళ్లి నమాజు చేసుకునేందుకు పిల్లల దగ్గర రంగులు అయిపోయేవరకు తన మీద రంగులు చల్లనిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశంలో కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందా?
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధ రంగంలో పరిస్థితి ఏమిటి... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








