అర్మేనియా - అజర్బైజాన్ యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందంటే... బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఇల్యా బరాబనోవ్, మరినా కటయేవా
- హోదా, బీబీసీ రష్యా ప్రతినిధులు, నగోర్నో-కరబఖ్ నుంచి
అర్మేనియా, అజర్బైజాన్‌ల మధ్య పరస్పర నిందారోపణలు, దాడులు కొనసాగుతున్నాయి. నాగోర్నో-కరబఖ్ అనే ప్రాంతం కోసం ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది.
ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో అంతర్భాగమైన అర్మేనియా, అజర్బైజాన్... సాంస్కృతిక, మతపరమైన విభేదాల కారణంగా రెండు దేశాలుగా విడిపోయాయి.
నాగోర్నో-కరబఖ్‌ను అజర్బైజాన్‌లో అంతర్భాగంగా అంతర్జాతీయంగా గుర్తిస్తారు. కానీ, ఇక్కడ నివసించేవారిలో అత్యధికులు అర్మేనియన్లే. ఈ ప్రాంతం వారి నియంత్రణలో ఉంది.
ఈ ప్రాంతం కోసం రెండు దేశాల మధ్య చాలా ఏళ్లుగా ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు అవి మరింత తీవ్రరూపం దాల్చాయి. తాజా యుద్ధం మొదలై, వారం రోజులు దాటింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. సైనికులతోపాటు సాధారణ పౌరులు కూడా వీరిలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
పరిస్థితి ఇదీ
నాగోర్నో-కరబఖ్ రాజధాని స్టెపానకెర్ట్‌పై బాంబుల దాడి జరిగినట్లు అర్మేనియా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తమ దేశంలోని రెండో అతిపెద్ద నగరం గంజాలో తీవ్ర నష్టం జరిగిందని అజర్బైజాన్ అంటోంది.
నాగోర్నో-కరబఖ్ ప్రాంతంలోని కొన్ని పట్టణాల్లో మేం పర్యటించాం. అక్కడ జరుగుతున్న పోరాటాన్ని దూరం నుంచి గమనించాం. స్థానికులతో మాట్లాడాం.
నగోర్నో-కరబఖ్, అర్మేనియా సరిహద్దులకు సమీపంలో ఉన్న లాచిన్ పట్టణం నుంచి మేం ప్రయాణించాం. అక్కడ సైరెన్‌లు, షెల్లింగ్ జరుగుతున్న చప్పుళ్లు వినిపించాయి.
ఇక్కడున్న ఓ వంతెనను కూల్చేందుకు అజర్బైజాన్ సైన్యం మూడు రోజులుగా పదే పదే దాడులు చేస్తోంది. ఇది కూలితే అర్మేనియా, కరబఖ్‌ల మధ్య రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది.
అర్మేనియా నుంచి కరబఖ్‌కు వచ్చేందుకు రెండు రోడ్డు మార్గాలు ఉన్నాయి. సెవన్ సరస్సు ఒడ్డు వెంబడి ఉత్తరం వైపు ఉన్న రోడ్డు అజర్బైజాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఉంటుంది.
యుద్ధం మొదలైన కొద్ది రోజులకే ఈ మార్గం మూసుకుపోయింది. నగోర్నో-కరబఖ్ రాజధాని స్టెపానకెర్ట్, అర్మేనియా రాజధాని యెరెవాన్‌ల మధ్య ప్రధాన మార్గం ‘లాచిన్ కారిడార్’.
స్టెపానకెర్ట్ వైపు ఆదివారం ఉదయం మేం ప్రయాణం ప్రారంభించాం. సాయంత్రం కల్లా వంతెన వాహనాలు వెళ్లేందుకు ప్రమాదకరంగా మారింది. కింద నది తక్కువ లోతులేనే ఉంది. రోడ్డు పనిచేసేవాళ్లు దానిపై కంకర పోసి, తాత్కాలికంగా కార్లు దాటి వెళ్లే ఏర్పాటు చేశారు.
లాచిన్ మధ్యలో నుంచి మేం వెళ్తున్నప్పుడు కొత్తగా షెల్లింగ్ మొదలైంది. వైమానిక దాడులకు సంబంధించి సైరెన్‌లు కూడా మార్మోగుతూ ఉన్నాయి. వీధుల్లో నుంచి ఓ కారు వేగంగా వెళ్తోంది. అందులో నుంచి ఓ వ్యక్తి లౌడ్ స్పీకర్‌లో.. ‘ఎక్కడైనా తలదాచుకోండి’ అంటూ జనాలకు సూచిస్తూ అరుస్తూ ఉన్నారు.
ఓ సూపర్ మార్కెట్ సెల్లార్‌లోకి మేం వెళ్లి తలదాచుకున్నాం. ఆ సూపర్ మార్కెట్ ఓనర్ పేరు నెల్లీ. ఆమె 17 ఏళ్లు అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉండి, సాంత ప్రాంతమైన లాచిన్‌కు తిరిగివచ్చి ఉంటున్నారు.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
టొమాటోలు, బియ్యం సంచులు, బ్రాందీ సీసాలతో ఉన్న రెండు గదుల్లో జనం నిండటం మొదలైంది. స్థానికులతో పాటు, మాలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చి, లాచిన్ మీదుగా వెళ్తున్నవాళ్లు కూడా అందులో ఉన్నారు.
కొందరు యుద్ధం నుంచి తప్పించుకునేందుకు స్టెపానకెర్ట్ నుంచి దూరంగా వెళ్లిపోతున్నవారు ఉంటే, ఇంకొందరు ఆ నగరంవైపే ప్రయాణిస్తున్నవారు ఉన్నారు.
నెల్లీ అక్కడే సెల్లార్‌లో కాఫీ, ఆహారం వంటివి చేసి, అక్కడి ఉన్నవారికి ఇచ్చారు.
యుద్ధంలోకి వెళ్తున్న కళాకారుడు
వెయిస్ట్ కోట్ వేసుకున్న ఓ బక్క పల్చని వ్యక్తి అక్కడున్నారు. ఆయన జుట్టు కూడా తెల్లబడింది. ఆయన కూడా జర్నలిస్ట్ అయ్యుంటారని మేం భావించాం.
ఆయన పేరు గ్రాచిక్ అర్మేనాకియన్ అని, ఆయనో కళాకారుడని తర్వాత తెలిసింది. మొదటి కరబఖ్ యుద్ధం జరిగినప్పుడు ఆయన చదువుకుంటున్నారట. 2016లో పోరాటం చివరి దశలో ఉన్నప్పుడు ఆయన మాస్కోలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
ప్రస్తుతం ఆయన యెరెవాన్‌లో ఉంటున్నారు. యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకుని కరబఖ్ వచ్చేసినట్లు చెప్పారు.
ఈ విషయాన్ని తన స్నేహితులను, కుటుంబ సభ్యులకు కూడా ముందుగా చెప్పలేదని ఆయన అన్నారు.
‘‘చెబితే వాళ్లు వారించేవారు. ఈ రోజు ఉదయమే కరబఖ్ వెళ్తున్నానని వారికి చెప్పాను’’ అని అన్నారు.
ఇదివరకు ఎప్పుడూ యుద్ధంలో పాల్గొన్న అనుభవం గ్రాచిక్‌కు లేదు. నగోర్నో-కరబఖ్‌లో ఏం చేద్దామనుకుంటున్నారని మేం ఆయన్ను ప్రశ్నించాం.
‘‘కళాకారులుగా మాకు దూరం, స్థలం గురించి మంచి అవగాహన ఉంటుంది. ఫిరంగుల వంటి వాటికి నేను దారి చూపగలను అనుకుంటున్నా’’ అని గ్రాచిక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
గ్రాచిక్‌కు సైనికపరమైన నైపుణ్యాలు లేవు. కానీ, సైన్యం తనకు శిక్షణ ఇస్తుందని, యుద్ధంలో తాను ఏ రకంగా ఉపయోగపడగలిగినా ముఖ్యమేనని ఆయన అన్నారు.
యుద్ధంలో పాల్గొనాలని గ్రాచిక్ తీసుకున్న నిర్ణయం వింతగా అనిపించి ఉండొచ్చు. కానీ, వివిధ దేశాల్లో ఉంటున్న చాలా మంది అర్మేనియన్లు యుద్ధంలో పాల్గొనాలని కరబఖ్‌కు వస్తుండటం మేం చూశాం.
మాస్కోకు చేరుకుని, అక్కడి నుంచి వాళ్లు కరబఖ్ వస్తున్నారు. యెరెవాన్‌కు, మాస్కోకు మధ్య ఇదివరకు చిన్న విమానాలు నడిచేవి. ఇప్పుడు పెద్ద బోయింగ్-777 విమానాలు నడుస్తున్నాయి.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
వయసు 50ల్లో, 60ల్లో ఉన్నవాళ్లు కూడా పదుల సంఖ్యలో కరబఖ్‌కు వస్తున్నారు. వారిలో చాలా మంది ఇదివరకు ఇక్కడ ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్న పోరాటాల్లో పాల్గొన్నవారే.
లాచిన్ సహా కరబఖ్‌లోని అన్ని పట్టణాలు, నగరాలు తమ ప్రాంతానికి కీలకమని స్థానిక ప్రభుత్వ ప్రతినిధి గెవోర్గ్ మ్నట్సాకన్ అన్నారు.
లాచిన్‌లో మరీ తీవ్రంగా షెల్లింగ్ గానీ, విధ్వంసం గానీ జరగలేదని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
మేం ఆయనతో మాట్లాడుతుండగా, చాలా సార్లు సైనిక దుస్తుల్లో ఉన్న కొందరు అడ్డుపడ్డారు.
తాజా యుద్ధం మొదలైనప్పుడు సైన్యం ఈ ప్రాంతంలో మీడియా ఉండాలని కోరుకుంది. ఇప్పుడు మాత్రం వారి తీరు మారింది.
లైవ్ స్ట్రీమింగ్, ప్రసారాలు వద్దని వారు అంటున్నారు. అలాంటివాటి వల్ల సైనికుల ఉనికి వంటివి ప్రత్యర్థులకు తెలుస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాక్‌గ్రౌండ్‌లో అక్కడి ప్రదేశాలేవీ కనిపించకుండా, ఖాళీగా ఉన్న చోట ఉండేలా చూసి ఇంటర్వ్యూలు తీసుకోగలుగుతున్నాం.
ఇక షెల్లింగ్ ఆగిపోవాలని మేం సెల్లార్‌లో ఎదురుచూస్తూ ఉన్నాం. అక్కడ జనం పెరుగుతూ ఉన్నారు.
ఇక్కడ అన్ని రకాల వాళ్లు ఉన్నారు. స్టెపానకెర్ట్ నుంచి వచ్చిన జర్నలిస్టులు, అజర్బైజాన్ సరిహద్దుకు సమీపంలోని గ్రామాల నుంచి వచ్చేసిన శరణార్థులు, యుద్ధం జరుగుతున్న ప్రాంతానికి వెళ్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు.
కొందరు ఆడవాళ్లు ఏడుస్తున్నారు. ఇల్లు వదిలిరావాల్సి వచ్చినందుకు బాధపడుతున్నారు. కొందరు ధైర్యంగానే కనిపించారు. మళ్లీ తమ సొంత ప్రాంతాలకు ఎప్పుడు తిరిగి వెళ్లగలుగుతామోనని చర్చించుకుంటున్నారు.
సెల్లార్ డోర్ వద్ద ఇద్దరు వ్యక్తులు సిగరెట్ తాగుతూ ఉన్నారు. వాళ్లు భయం లేనట్లుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. జనం తలదాచుకోవలని అధికారులు హెచ్చరికలు చేసినా, ఇక్కడ సమీప ప్రాంతాల్లో బాంబులేవీ పడటం లేదని వాళ్లు అన్నారు.
వాళ్లు అలా అన్నారో, లేదో మాకు దగ్గరలోనే ఓ బాంబు పేడింది. వెంటనే సెల్లార్ లోపల మిగతా వాళ్లు ఉన్న చోటుకు ఆ ఇద్దరూ వచ్చేశారు.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
స్టెపానకెర్ట్ నుంచి 10-15 నిమిషాలు ప్రయాణిస్తే, షుషా నగరం వస్తుంది. షుషా కొండ ప్రాంతంలో ఉంది. పక్కనే లోయ ప్రాంతంలో స్టెపానకెర్ట్ ఉంది. షుషాలో షెల్లింగ్ కాస్త తక్కువగా ఉంది. కానీ, షెల్లింగ్ మొదలైతే అక్కడ తలదాచుకునేందుకు సెల్లార్‌లు దొరకడం చాలా కష్టం.
షుషాలో కొందరు శరణార్థులు తలదాచుకుంటున్న సాంస్కృతిక కేంద్రంపై ఆదివారం షెల్లింగ్ జరిగింది. ఆదివారం షుషా, స్టెపానకెర్ట్‌ల్లో నలుగురు పౌరులు చనిపోయారని ఇక్కడి స్వయంప్రకటిత నగోర్నో-కరబఖ్ రిపబ్లిక్ ప్రభుత్వం వెల్లడించింది.
షుషా నుంచి స్టెపానకెర్ట్ బాగా కనిపిస్తుంది. అక్కడ రెండు గంటలపాటు మేం చిత్రీకరించాం. అప్పుడు షెల్లింగ్ జరగలేదు.
కానీ, స్టెపానకెర్ట్‌లో రోజూ ఉదయం, రాత్రి బాంబులు పడుతూనే ఉన్నాయని, రోజురోజుకీ పరిస్థితి తీవ్రమవుతోందని అక్కడే ఉన్న కొందరు జర్నలిస్టులు మాతో చెప్పారు.
షుషాలో కొందరిని మేం కలిశాం. వారిలో చాలా మంది వృద్ధులే ఉన్నారు. వాళ్లంతా అజర్బైజాన్ సరిహద్దుకు సమీపంలోని గ్రామాల నుంచి వచ్చినవారు.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
‘కొడుకు బతికి ఉన్నాడో, లేదో తెలియదు’
రష్యన్ టీచర్ అయిన రయా గెవోర్కియన్ కూడా వీరిలో ఉన్నారు. స్థానిక యంత్రాంగం తనకు అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించిందని ఆమె అన్నారు.
‘‘వీలైనంతగా పౌరుల ప్రాణాలు పోకూడదని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 50 మంది వెళ్లిపోయారు’’ అని చెప్పారు.
1988లో అజర్బైజాన్ నుంచి ఆమె వెళ్లిపోవాల్సి వచ్చింది. 1992, 2016ల్లో నగోర్నో-కరబఖ్‌ను కూడా ఆమె తాత్కాలికంగా విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్లు ఇప్పుడు యుద్ధంలోనే పోరాడుతున్నారు. వాళ్లు బతికి ఉన్నారా, లేదా అన్న విషయం కూడా ఆమెకు తెలియదు.
శరణార్థుల్లో ఐడా మెల్కానియన్ అనే మరో మహిళ కూడా ఉన్నారు. ఆమె కొడుకు కూడా యుద్ధంలో పోరాడేందుకు స్వచ్ఛందంగా వెళ్లారు. అతడి వయసు 18 ఏళ్లు.
‘‘నా కొడుకు ఉన్న చోట ఫైరింగ్ జరిగిందని, రవాణా సదుపాయాలు లేకపోవడంతో స్టెపానకెర్ట్‌కు కాలినడకన వస్తున్నామని మా సోదరుడు చెప్పాడు. వాడికి గాయాలేవీ కాలేదని చెప్పాడు. కానీ, ఆ గొంతు వింటే నాకు అనుమానంగానే ఉంది’’ అని ఐడా అన్నారు.
‘‘ఇది ఘోరమైన పరిస్థితి. ప్రపంచమంతా మౌనంగా ఉంది. ఇది 21వ శతాబ్దం. శాంతియుతంగా బతుకుతున్న పౌరులపై బాంబులు వేస్తున్నారు. ఇది అమానవీయం’’ అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Vladimir Komissarov / BBC
‘మమ్మల్ని మేమే నమ్ముకోగలం’
నగోర్నో-కరబఖ్‌ను స్వతంత్ర దేశంగా ఎవరూ గుర్తించలేదు. అర్మేనియా కూడా గుర్తించలేదు. అయితే, ఇక్కడి స్వయంప్రకటిత నగోర్నో-కరబఖ్ రిపబ్లిక్ ప్రభుత్వానికి యెరెవాన్‌లో ప్రతినిధి ఉన్నారు. కానీ, అది దౌత్య కార్యాలయం కాదు.
యుద్ధంలో అజర్బైజాన్ వాళ్లు ఒక్కరుంటే, ప్రతిగా 13 మంది అర్మేనియన్లు ఉన్నారని నగోర్నో-కరబఖ్ రిపబ్లిక్ ప్రభుత్వ ప్రతినిధి సెర్జీ గజారియన్ అన్నారు. యుద్ధం వారం రోజులుగా సాగుతున్నా, అజర్బైజాన్ పెద్దగా సాధించిందేమీ లేదని చెప్పారు.
నగోర్నో-కరబఖ్ రష్యా నుంచి ఏమైనా సహకారం కోరుకుంటుందా అని మేం ఆయన్ను ప్రశ్నించాం.
‘‘మేం వేచి ఉండలేం. ఎంతకాలమని చూడాలి? మమ్మల్ని మేమే నమ్ముకోగలం. యుద్ధం తప్పదంటే, మొదటి దెబ్బ మనమే కొట్టాలి. కొన్ని నెలలుగా అజర్బైజాన్ ఇందుకోసం సిద్ధమవుతోంది. దీన్ని మొదలుపెట్టే అవసరం అర్మేనియాకు లేదు’’ అని గజారియన్ అన్నారు.
యుద్ధం మొదలై వారు రోజులు దాటింది. గత 30 ఏళ్లలో ఇప్పుడే తొలిసారి టర్కీ అజర్బైజాన్‌కు మద్దతుగా ఉంటోంది. టర్కీ ప్రాంతీయంగా కీలకశక్తి. అజర్బైజాన్‌తో ఆ దేశానికి జాతిపరంగా, భాషపరంగా మంచి సంబంధాలు ఉన్నాయి.
రష్యా, ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలు... ఐరాస, నాటో, యూరప్ భద్రత సహకార సంస్థ లాంటి సంస్థలు యుద్ధం ఆపి, శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నాయి.
అర్మేనియా ‘నగోర్నో-కరబఖ్ ఆక్రమణ’ను ఆపినప్పుడే చర్చలు మొదలవుతాయని టర్కీ, అజర్బైజాన్ అంటున్నాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అజర్బైజాన్‌కు చెందిన ఆ భూభాగం నుంచి గుర్తింపు లేని అక్కడి ప్రభుత్వం, అర్మేనియా శక్తులు వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- బొప్పాయి పండుతో అబార్షన్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- పుండ్లలోని చీముతో ప్రమాదకరంగా ఆ వ్యాక్సీన్ ఎక్కించేవారు, అది లక్షల మంది ప్రాణాలు కాపాడింది
- భారతదేశంలో కోవిడ్ మరణాలు 1,00,000 దాటాయి... ఈ మరణాలకు కారణాలేమిటి?
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- కరోనావైరస్: వ్యాక్సీనా, హెర్డ్ ఇమ్యూనిటీనా... ఏది వస్తే మేలు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








