దాఫియా బాయి: దేశ విభజనలో విడిపోయిన ఆమె కుటుంబం ఆచూకీ 73 ఏళ్ల తర్వాత తెలిసింది

దాఫియా బాయి
    • రచయిత, ఉమర్‌ దరాజ్‌ నంగియానా
    • హోదా, బీబీసీ ఉర్దూ, బహావల్పూర్‌

పాకిస్తాన్‌లో నివసిస్తున్న ఆయేషా గులాం తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. బాల్యంలో ఆమె పేరు దాఫియా బాయి. తన తల్లిదండ్రులు పనులు చేసుకుంటున్న సమయంలో ఇసుక దిబ్బలపై తోబుట్టువులతో కలిసి ఆడుకోవడం ఆమెకు గుర్తుంది. అప్పటికి దేశ విభజన జరగలేదు.

తన మామ పెళ్లి చూసేందుకు ఆమె బికానేర్‌లోని మోర్ఖానాకు చాలా మైళ్ల దూరం నడిచి వెళ్లినట్లు కూడా ఆమెకు జ్జాపకముంది. ఈ ప్రాంతం ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్‌ రాష్ట్రంలో ఉంది. కొంతకాలం తర్వాత దాఫియా బాయికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కాపురానికి వెళ్లే సమయానికి ఆమె వయసు 12 సంవత్సరాలు.

భర్త హేమరామ్‌తో కలిసి అత్తగారింటికి బయలుదేరిన దాఫియా బాయి, తల్లిదండ్రులకు వీడ్కోలు తెలిపారు. అయితే వారిని చూడటం అదే ఆఖరుసారి అవుతుందని ఆమె అనుకోలేదు. దాఫియా బాయి అత్తగారి ఊరు ఖైర్‌ఫూర్‌ చేరుకున్న మూడు, నాలుగు రోజుల తర్వాత దేశ విభజన జరిగినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

ఆ ప్రకటనతో అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని ఆమె గుర్తు చేసుకున్నారు. దోపిడీలు మొదలయ్యాయని తెలిసినప్పుడు తన అత్తింటి వారు నగలన్నింటిని మూటగట్టి చాచిపెట్టారట. దీంతో ఆ ఆభరణాలు ఎవరికీ దొరక లేదట.

“ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాటలే. ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది పరుగులు తీస్తూ కనిపించే వారు" అని చెప్పారామె.

అక్కడున్న అనేక హిందూ కుటుంబాల మాదిరిగానే దాఫియా బాయి అత్త మామలు కూడా పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు బయలుదేరిన రోజునే ఆమెను బక్షాండేఖాన్‌ కంజు అనే స్థానిక భూస్వామి దాఫియా బాయిని తన ఇంట్లో పని మనిషిగా ఉంచమని ఆదేశించాడు.

"నేను చిన్నదానిని. సాయంత్రం వరకు తోటి పిల్లలతో ఆడుకున్నాను. రాత్రయ్యే సరికి నా అత్తమామలు కనిపించలేదు. ఏమయ్యారో తెలియలేదు. వాళ్లు పారిపోయారని కొందరు మహిళలు నాతో చెప్పారు" అని వెల్లడించారు దాఫియా బాయి. ఈ సమయంలో ఆమెకు బక్షాండే ఖానే దిక్కుగా మారారు.

అయితే బక్షాండేఖాన్‌ రెండు ఎద్దులను తీసుకుని ఆమెను మరో కుటుంబానికి అమ్మేశాడు. దాంతో దాఫియా బాయి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇదంతా తన సొంత ఊరిలో ఉంటున్న ఆమె తల్లిదండ్రులకు తెలియదు.

భారతదేశ విభజన

ఫొటో సోర్స్, THE PARTITION MUSEUM, TOWN HALL, AMRITSAR

ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారు?

చాలా రోజుల వరకు దాఫియా బాయికి తన కుటుంబం గురించి ఎలాంటి సమాచారం రాలేదు. తనను కొనుక్కున్న ముస్లిం కుటుంబంలో ఆమె కలిసిపోయారు. వాళ్ల పిల్లలతో కలిసి ఖురాన్‌ చదవడానికి వెళ్లేవారు. అంటే ఆమె ముస్లింగా మారిపోయారు. పేరు కూడా ఆయేషా గులాంగా మారింది.

ఈ పరిస్థితిలో ఆమె తన తల్లిదండ్రుల గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయారు. అసలు వాళ్ల గురించి ఎవరికైనా చెప్పవచ్చో లేదో కూడా ఆమెకు తెలియదు. చెప్పాలనుకున్నా ఎవరికి చెప్పాలో అర్ధం కాలేదు.

అయితే తన తల్లిదండ్రులు, అక్కలు, తమ్ముళ్లను కలుసుకోవాలన్న కోరిక ఆయేషా గులాంగా మారిన దాఫియా బాయి గుండెల నుంచి చెరిగి పోలేదు. ఆమెతోపాటే అవి కూడా పెరుగుతూ వచ్చాయి. ఆమె తల్లిదండ్రులు కూడా దాఫియా బాయిని ఎక్కడుందో కనుక్కోడానికి ప్రయత్నించారా లేదా అన్న విషయం వారు మాత్రమే చెప్పగలరు.

కొన్నాళ్లకు దాఫియా బాయిని కొనుక్కుని ఆయేషా గులాంగా మార్చిన రసూల్‌ఖాన్‌ ఆమెను వాళ్లబ్బాయి అహ్మద్‌బక్ష్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. తన కొత్త కుటుంబం తనను ఎంతో ప్రేమగా చూసుకుందని ఆయేషా గులాం చెప్పారు. తనకు ప్రత్యేకంగా ఒక గది ఇచ్చారని, ఇంట్లో పని కూడా చెప్పేవారు కాదని ఆమె అన్నారు.

అహ్మద్‌ బక్ష్‌, ఆయేషా గులాం దంపతులకు ఏడుగురు పిల్లలు కలిగారు. అందులో ముగ్గురు మగ పిల్లలు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె మళ్లీ తన కుటుంబం కోసం వెతకడం ప్రారంభించారు. భర్త అహ్మద్‌ బక్ష్‌ ఆమెకు సాయం చేసేవారు.

“నేను ఏడుస్తుంటే ఆయన (అహ్మద్‌ బక్ష్‌) గమనించేవారు. అందుకే నా ప్రయత్నాలకు సాయం చేసేవారు. ఎవరైనా అహ్మద్‌పూర్‌ వెళుతున్న వ్యక్తులు దొరుకుతారేమోనని వెతికే వాళ్లం. ఎవరైనా కనిపిస్తే నా తల్లిదండ్రుల గురించి వాకబు చేయవచ్చన్నది మా ఆలోచన” అన్నారు ఆయేషా గులాం.

ఎవరైనా అహ్మద్‌పూర్‌వైపు వెళుతుంటే వారికి డబ్బులు, నెయ్యి ఇచ్చేదాన్ని. నా తల్లిదండ్రుల గురించి వాకబు చేయమని అడిగేదాన్ని. కానీ ఎవరూ తిరిగి వచ్చేవారు కాదు’’ అన్నారామె.

కొంతకాలం తర్వాత ఆయేషా గులాం తన భర్తతో కలిసి ఖైర్‌పూర్‌ నుండి జిల్లా వహ్దికి చెందిన మల్సీ తహసీల్‌కు మారారు. ఇప్పుడు ఆమె తన మనవరాళ్ళు, పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. ఇప్పుడు ఆయేషా వయస్సు సుమారు 86 సంవత్సరాలు. భర్త చనిపోయారు. పిల్లల్లో ఇద్దరు కూతుళ్లు మాత్రమే బతికి ఉన్నారు.

దాఫియా బాయి

నా తమ్ముడు నా దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తుంది

దాదాపు 12 ఏళ్ల నుంచి ఆమె తన కుటుంబ సభ్యుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే 73 సంవత్సరాల తరువాత ఆమె తన కుటుంబం అడ్రస్‌ను కనుక్కోగలిగారు.

ఆమె తన సోదరుడి కొడుకు ఖజారీలాల్‌, అతని కుమారుడితో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. వారు ఇప్పుడు భారతదేశంలో ఉంటున్నారు. పచ్చని పొలాల మధ్య ఒక మల్బరీ చెట్టు నీడలో కూర్చుని తన మేనల్లుడితో మొదటిసారి మాట్లాడినప్పుడు ఆమె కళ్లు చెమర్చాయి.

మొబైల్‌ స్క్రీన్‌పై తన తోడబుట్టిన వాడి కొడుకులను చూసి ముద్దు పెట్టుకుని “నా తమ్ముడు నా దగ్గరకు వచ్చినట్లు అనిపిస్తోంది. మిమ్మల్ని చూడటం కోసం రోజూ ఏడుస్తూ ఎదురు చూసేదాన్ని’’ అని ఆమె మేనల్లుడితో చెప్పారు.

కానీ ఆయేషా కంటి చూపు సరిగా లేదు. మేనల్లుడి ముఖాన్ని మొబైల్‌లో స్పష్టంగా చూడలేకపోయారు. పైగా వాళ్లు మార్వాడీ భాష మాట్లాడుతుండటంతో ఆమెకు అది అర్ధం కాలేదు. పాకిస్థాన్‌ పంజాబ్‌లో మాట్లాడే సరాయిక్కి అనే భాష మాత్రమే ఆమెకు తెలుసు.

"నేను ఫోన్‌లో అతన్ని చూసినప్పుడు నాకు ముఖం స్పష్టంగా కనబడలేదు. అతను నవ్వుతుంటే తెల్లని పళ్లు మాత్రం కనిపించాయి’’ అని చెప్పారు ఆయేషా గులాం. నసీర్‌ఖాన్‌ ఆమెకు అనువాదకుడిగా పని చేశారు.

దాఫియా బాయి

దాఫియా బాయి తన కుటుంబాన్ని ఎలా కనుక్కున్నారు?

ఆమె తన కుటుంబాన్ని కనుక్కోవడంలో నసీర్‌ఖాన్‌ సాయం చేశారు. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు భారత దేశంలోని పంజాబ్‌ రాష్ట్రంలో ఉన్న మోర్ఖానా ప్రాంతంలో కొన్నాళ్లు ఉంది. దేశ విభజనకు ముందు దాఫియా బాయి తన మామ పెళ్లికి వెళ్ళిన ఊరు కూడా ఇదే.

ఆయేషా గులాంలో మిగిలి ఉన్న చిన్ననాటి జ్జాపకాలు ఆమె తన మేనల్లుళ్లను చేరుకోడానికి సాయపడ్డాయి. కానీ ఆమె మదిలో నిలిచిపోయిన కొందరు కుటుంబ సభ్యులు మాత్రం జ్జాపకంగానే మిగిలిపోయారు. ఆమె ఎప్పటికీ వారిని కలుసు కోలేరు.

"నా సోదరుడు చనిపోయాడని చెప్పారు. అయితే వాళ్ల పిల్లలు ఉన్నారు. వారిని కలవాలనుకుంటున్నాను. నా సోదరి కూడా బతికే ఉందని తెలిసింది. ఆమెను కలుసుకోవాలని ఉంది’’ అని చెప్పారు ఆయేషా గులాం. తన చెల్లెలు మీరాబాయితో ఆమె ఇంకా మాట్లాడలేక పోయారు. త్వరలోనే ఆమెతో మాట్లాడిస్తామని మేనల్లుళ్లు ఆమెకు మాట ఇచ్చారు.

భర్త మరణం తరువాత ఆమె కూతురు కొడుకు నసీర్‌ ఖాన్‌ అమ్మమ్మకు ఆమె కుటుంబ అన్వేషణలో సాయపడ్డారు. ఇందుకోసం ఆమెను అహ్మద్‌పూర్‌, ఖైర్‌పూర్‌లకు కూడా తీసుకెళ్లారు. కానీ వారు ఎక్కడున్నారో తెలియలేదు. అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక నసీర్‌ఖాన్‌ సోషల్ మీడియా సాయం తీసుకున్నారు.

ఆమె కథను నసీర్‌ఖాన్‌ స్థానికవార్తా పత్రికలో వచ్చేలా చూశారు. అది టీవీ ఛానల్‌లో కూడా ప్రసారమైంది. కానీ ఎవరూ స్పందించ లేదు. మరోసారి పేపర్‌లో వచ్చేలా చేయడం, అది సోషల్ మీడియాకు ఎక్కడం జరిగిపోయాయి. ఈ కథనాన్ని చూసిన మహ్మద్‌ జాహిద్‌ అనే ఢిల్లీ జర్నలిస్టు ఒకరు నసీర్‌ఖాన్‌ను సంప్రదించారు.

తరువాత రోజు ఆయేషా గులాం ఇంటికి ఆమె కుటుంబీకుల నుంచి కాల్‌ వచ్చింది. ఆయేషా గులాం చెబుతున్న చిరునామాకు, ఆమె మేనల్లుళ్లు చెబుతున్న చిరునామాకు ఆనవాళ్లు సరిపోలాయి. ప్రభుత్వ రికార్డులు, సంఘటనలు అన్నీ కుదిరాయి. వాళ్లు తన వాళ్లేనని ఆమెకు తెలిసింది.

దాఫియా బాయి

‘‘నన్ను ఒక్కసారి వాళ్లను కలవనీయండి’’

ఇప్పుడు 86 ఏళ్ల అయేషా గులాం దశాబ్దాల అన్వేషణ చివరకు ఫలించింది. ఆమెకిప్పుడు సంతృప్తిగా ఉంది. 12 ఏళ్ల వయసునాటి దాఫియాబాయి ఆమెలో ఇంకా నిలిచే ఉంది.

అయితే.. ఆయేషా గులాం ఇప్పుడు నడిచే స్థితిలో కూడా లేరు. మంచం మీద కూర్చుని ఆమె తన బంధువుల ఫొటోలను చూస్తూనే ఉన్నారు. వాళ్లను కలుసుకోడానికి ఆమె ఎదురు చూస్తున్నారు. తన తమ్ముడి పిల్లలకు వీసాలు ఇవ్వాలని ఆమె భారత, పాకిస్థాన్‌ ప్రభుత్వాలకు విజ్జప్తి చేస్తున్నారు.

"నా జీవితంలో వారిని ఒకసారి దగ్గరగా చూడాలనుకుంటున్నాను. వారు నన్ను కలవడానికి అవకాశం కల్పించండి’’ అన్నారామె. కానీ భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణం దీనికి ఎంత వరకు సహకరిస్తుందన్నది ప్రశ్న.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)