అమెరికా ఎన్నికలు: భారతీయ హిందూ ఓట్లు ట్రంప్‌కేనా? డెమొక్రాట్లు భయపడుతున్నారా?

ఫొటో సోర్స్, JIM WATSON,DOMINICK REUTER/AFP via Getty Images
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి, అమెరికా నుంచి
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం రెండు నెలలకన్నా తక్కువే ఉంది. ఇప్పుడు హిందూ- అమెరికన్ అనే కొత్త నినాదం అమెరికాలో వినిపిస్తోంది.
హిందువులపై జరిగిన జాతి వివక్ష దాడులలో నిందితులను శిక్షించడానికి, ఆరాధన స్థలాలను రక్షించడానికి డెమొక్రాటిక్ పార్టీ కట్టుబడి ఉందని “హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్’’ అనే ప్రచార కార్యక్రమంతో ఆ పార్టీ చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
"డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో హిందూ అమెరికన్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. ఇది అపూర్వం" అని 'హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్' ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మురళి బాలాజీ అన్నారు.

ఫొటో సోర్స్, Alex Wong/Getty Images
ఆగస్టు 14న "హిందూ వాయిసెస్ ఫర్ ట్రంప్" ప్రచారం ప్రారంభం కావడంతో.. దేశంలోని లక్షలమంది హిందువులను ఆకర్షించడానికి బైడెన్ కూడా ప్రచారాన్ని ప్రారంభించాల్సి వచ్చింది.
'హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్' ప్రచారంలో పరోక్షంగా ట్రంప్ పాలనను గుర్తు చేస్తూ, హిందువులపై విద్వేష నేరాలు దాదాపు మూడురెట్లు పెరిగాయని చెబుతున్నారు.
"2015లో హిందువులపై కేవలం ఐదుచోట్లే దాడులు జరిగాయి. కానీ 2019 లో ఈ సంఖ్య 14కి పెరిగింది. 2017లో ఈ నేరాలు 15కి పెరిగాయి" అని ప్రభుత్వ గణాంకాలను ఉటంకిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
“గత నాలుగేళ్లలో విద్వేష, వివక్ష దాడులు పెరిగాయి. అసహనంతో హిందువులపై దాడులు చేస్తున్నారు’’ అని ‘హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్’ ప్రచారం ప్రారంభం సందర్భంగా జరిగిన వెబినార్‌లో ఇండియన్ అమెరికన్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి అన్నారు.
‘హిందూ వాయిసెస్ ఫర్ ట్రంప్’ అందించిన గణాంకాల ప్రకారం అమెరికాలో 662 హిందూ దేవాలయాలున్నాయి.

ఫొటో సోర్స్, SAUL LOEB/Getty Images
ఓట్లు చేజారతాయని డెమొక్రాట్లు భయపడ్డారా?
భారతీయ అమెరికన్లు చాలాకాలం నుంచి డెమొక్రాట్లకు మద్దతు ఇస్తూ వస్తున్నారు. భారత సంతతికి చెందిన దాదాపు 45 లక్షలమంది ప్రజలు అమెరికాలో నివసిస్తున్నారు.
2016లో భారత అమెరికన్లలో కేవలం 16శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటు వేశారు. అయితే ఈసారి ట్రంప్ మద్దతుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని డెమొక్రాట్ ఇండియన్ అమెరికన్లలోని ఒక విభాగం భావిస్తోంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
కశ్మీర్, ఎన్‌ఆర్‌సి వంటి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ట్రంప్ ప్రభుత్వం మౌనంగా ఉండగా, డెమొక్రాట్‌లు బెర్నీసాండర్స్, ప్రమీలా జైపాల్ భారతదేశపు విధానాలను తీవ్రంగా విమర్శించారు.
"జో బైడెన్ ఎజెండా ఫర్ ముస్లిం-అమెరికన్ కమ్యూనిటీస్" అనే పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్‌ను ప్రకటించి అందులో కశ్మీర్, ఎన్నార్సీ, సీఏఏ వంటి సమస్యలను ప్రత్యేకంగా పేర్కొన్నారు.

అయితే అమెరికాలో హౌడీ-మోదీ కార్యక్రమానికి ట్రంప్ హాజరు కావడం, ఆ తర్వాత ఆయన భారత పర్యటన కూడా చేయడంతో చాలామంది భారతీయ అమెరికన్లు, ముఖ్యంగా హార్డ్ కోర్ హిందువులు ట్రంప్‌వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని డెమొక్రాట్లు భావించారు.
అందుకే హిందూ అమెరికన్ విషయంలో కూడా డెమొక్రాట్ల నుంచి ఒక పాలసీ పేపర్ ఉండాలని డిమాండ్ వినిపించింది. పైగా ట్రంప్‌కు భారతదేశానికి మద్దతిచ్చే వ్యక్తిగా గుర్తింపు ఉంది. దీంతో డెమొక్రాట్లు జాగ్రత్త పడ్డారు.
భారతీయ అమెరికన్ల కోసం బైడెన్ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయడం, భారత స్వాతంత్ర్య దినవేడుకలు జరపడం, గణేశ్ చతుర్థికి కమలా హారిస్ సందేశం ఇవ్వడం, 'హిందూ-అమెరికన్స్ ఫర్ బైడెన్’’లాంటి నిర్ణయాలన్నీ ఈ క్రమంలోనే పుట్టుకొచ్చాయి.
భారత్ ఎదుర్కొంటున్న సరిహద్దు ఉగ్రవాదం, చైనాతో సమస్యలను కూడా బైడెన్ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. బైడెన్ క్యాంప్ అంచనా ప్రకారం అమెరికాలోని 8 రాష్ట్రాలలో 13లక్షలకు పైగా భారతీయ అమెరికన్ ఓట్లున్నాయి.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- అంతర్వేదిలో అసలేమైంది.. రథం చుట్టూ రాజుకుంటున్న వివాదంలో బీజేపీ, జనసేన నేతల గృహ నిర్బంధం
- ‘సెల్ఫిష్’ మాస్క్‌లు: ఇవి వాడుతున్న వాళ్లు మీ పక్కన ఉంటే జాగ్రత్త..
- తులసీ గబార్డ్: అమెరికా అధ్యక్ష పీఠంపై ఈ హిందూ మహిళ కూర్చోగలరా?
- ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








