జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్‌ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’

John Bolton and Donald Trump

ఫొటో సోర్స్, AFP

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలవటానికి చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సహాయం కోరినట్లు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ కొత్త పుస్తకం చెప్తోంది.

అమెరికా రైతుల నుండి వ్యవసాయ ఉత్పత్తులను చైనా కొనుగోలు చేయాలని ట్రంప్ కోరినట్లు బోల్టన్ తన పుస్తకంలో చెప్పారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలోని కొన్ని అంశాలను అమెరికా మీడియా ప్రచురించింది.

అధ్యక్ష భవనాన్ని ఎలా నడపాలనేది ట్రంప్‌కి ఇప్పటివరకూ తెలియదని.. అది నిర్ఘాంతపరిచే విషయమని కూడా బోల్టన్ పేర్కొన్నారు. ఈ పుస్తకం మార్కెట్‌లోకి రాకుండా అడ్డుకోవటానికి ట్రంప్ యంత్రాంగం ప్రయత్నిస్తోంది.

"అతడు చట్టాన్ని ఉల్లంఘించాడు. ఇది అత్యంత రహస్య సమాచారం. (దీనిని వెల్లడించటానికి) అతడికి ఆమోదం లేదు" అని బోల్టన్‌ను ఉద్దేశించి ట్రంప్ ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

"నేను అతడికి ఒక అవకాశం ఇచ్చాను. అతడు కొట్టుకుపోయాడు" అని కూడా ట్రంప్ పేర్కొన్నారు.

John Bolton - 15 June

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, జాన్ బోల్టన్

పుస్తకాన్ని అడ్డుకునేందుకు చివరి ప్రయత్నం

ఈ పుస్తకాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ ప్రభుత్వం చిట్ట చివరి ప్రయత్నం చేస్తోంది. జాతీయ భద్రత అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం విడుదలను ఆపేయాలని కోరుతూ న్యాయ విభాగం అత్యవసర ఆదేశాలను సిద్ధం చేసింది.

అయితే, ఈ ప్రయత్నం ఫలించే అవకాశం లేదని అమెరికా రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే, అమెరికాలోని చాలా వార్తా పత్రికల్లో ఆ రచనలోని ముఖ్యాంశాలు ప్రచురితమయ్యాయి.

'ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్' అనే ఈ గ్రంథం జూన్ 23న విడుదల కాబోతోంది.

వైట్ హౌస్‌లో జాన్ బోల్టన్

జాన్ బోల్టన్ 2018 ఏప్రిల్‌లో వైట్‌హౌస్‌లో చేరారు. మరుసటి సంవత్సరం సెప్టెంబర్‌లో తప్పుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు అప్పుడు ప్రకటించారు. అయితే, బోల్టన్ తనతో "బలంగా" విభేదించినందున తానే ఆయనను తొలగించానని ట్రంప్ పేర్కొన్నారు.

మొత్తం 577 పేజీలున్న ‘ది రూమ్ వేర్ ఇట్ హాపెండ్’ అనే ఈ పుస్తకం జూన్ 23న మార్కెట్‌లోకి రానుంది.

అయితే ఈ పుస్తకం విడుదలను ఆపటానికి అత్యవసర ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయ శాఖ బుధవారం రాత్రి ఒక న్యాయమూర్తిని కోరింది.

"ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలు కోరటం పనికిమాలిన, రాజకీయ ప్రేరేపిత చర్య’’ అని ఈ పుస్తక ప్రచురణ సంస్థ సైమన్ & షుస్టర్ ఒక ప్రకటనలో విమర్శించింది.

ఈ పుస్తకం లక్షలాది కాపీలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అయ్యాయని, నిషేధ ఉత్తర్వుల వల్ల సాధించేదేమీ ఉండదని పేర్కొంది.

ఈ నవంబర్ జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ మీద పోటీచేస్తున్న డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ ఈ పుస్తకం మీద ఒక ప్రకటనలో స్పందిస్తూ.. ‘‘ఇందులో చెప్పిన విషయాలు నిజమే అయితే.. అది నైతిక పొరపాటే కాదు.. అమెరికా ప్రజల పట్ల పవిత్రమైన విధిని డోనల్డ్ ట్రంప్ ఉల్లంఘించినట్లే అవుతుంది" అని వ్యాఖ్యానించారు.

ట్రంప్, షీ జిన్‌పింగ్ గత ఏడాది జపాన్‌లో జరిగిన జీ20 సదస్సులో కలుసుకున్నారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ట్రంప్, షీ జిన్‌పింగ్ గత ఏడాది జపాన్‌లో జరిగిన జీ20 సదస్సులో కలుసుకున్నారు

జిన్‌పింగ్‌తో సమావేశం గురించి బోల్టన్ ఆరోపణలు ఏమిటి?

ఈ ఆరోపణలు.. గత ఏడాది జూన్‌లో జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జి 20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశాన్ని ప్రస్తావిస్తున్నాయి.

"ట్రంప్, అద్భుతరీతిలో చర్చను రాబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల (2020లో) మీదకు మళ్లించారు. చైనా ఆర్థిక సామర్థ్యాన్ని సూచిస్తూ.. తాను గెలిచేలా చూడాలని జిన్‌పింగ్‌కు విజ్ఞప్తి చేశారు’’ అని బోల్టన్ రాశారు.

"అమెరికా రైతులు, అమెరికా నుంచి సోయాబీన్స్, గోధుమలను చైనా కొనుగోలు చేయటం పెరగటం.. ఎన్నికల ఫలితాలకు ఎంత ముఖ్యమో ఆయన బలంగా చెప్పారు’’ అని పేర్కొన్నారు.

అమెరికాలో రైతులు కీలకమైన ఓటు బ్యాంక్‌గా ఉన్నారు. వీరు 2016 ఎన్నికలలో ట్రంప్‌కు ఎక్కువగా మద్దతు ఇచ్చారు.

బోల్టన్ మాటలతో అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లీత్జర్ విభేదించారు. ఆయన బుధవారం సాయంత్రం మాట్లాడుతూ.. ట్రంప్ తన పునరెన్నికకు సాయం కోరటం అనేది "ఎప్పుడూ జరగలేదు" అని పేర్కొన్నారు.

జి20 శిఖరాగ్ర సదస్సులో అంతకుముందు ప్రారంభ విందులో సంభాషణ గురించి కూడా బోల్టన్ ప్రస్తావించారు. చైనాలోని పశ్చిమ జిన్జియాంగ్ ప్రాంతంలో శిబిరాల నిర్మాణం గురించి వారు చర్చించారు.

ఆ నిర్మాణం ముందుకు సాగాలని "అది సరిగ్గా సరైన పని" అని ట్రంప్ చెప్పారు.

చైనా ఈ శిబిరాల్లో దాదాపు 10 లక్షల మంది యూగర్లను, ఇతర మైనారిటీ జాతుల వారిని శిక్ష, శిక్షణల కోసం నిర్బంధించింది.

యూగర్ల విషయంలో చైనా తీరును ట్రంప్ ప్రభుత్వం బహిరంగంగా విమర్శిస్తోంది.జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో ముస్లింల అణచివేతకు బాధ్యులైన చైనా అధికారులపై అమెరికా ఆంక్షలు విధించే ఉత్తర్వుల మీద అధ్యక్షుడు ట్రంప్ బుధవారం సంతకం చేశారు.

యూగర్లను వేధిస్తున్నామనే ఆరోపణలను చైనా ఖండిస్తోంది. అమెరికా చర్య దురుద్దేశపూరితమని మండిపడుతోంది. దీనిపై ప్రతి చర్యలు చేపడతామనీ హెచ్చరించింది.

John Bolton

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, బోల్టన్ 2018-19లో అమెరికా భద్రతా సలహాదారుగా పని చేశారు

విశ్లేషణ: ఆంథొనీ జుర్చర్, నార్త్ అమెరికా రిపోర్టర్

జాన్ బోల్టన్ తన కొత్త పుస్తకంలో వివరించిన విశేషాలు.. కొంత బాగా తెలిసిన విషయాలుగానే అనిపిస్తాయి.

డొనాల్డ్ ట్రంప్‌కు మాజీ సలహాదారు లేదా అనామక ప్రస్తుత సహాయకుడు.. ఒక అధ్యక్షుడు పరిపాలనకు సంబంధించిన విషయాల మీద అనాసక్తిగా ఉంటారని, విదేశాంగ విధానం గురించి ప్రాథమిక విషయాలూ తెలియవని.. డోనల్డ్ ట్రంప్ మాజీ సలహాదారులో, ప్రస్తుత రహస్య సహాయకులో కథలుకథలుగా చెప్పటం ఇదే మొదటిసారి కాదు.

అంతర్గత ఆధిపత్య పోరాటాలు, ఒకరి మీద మరొకరి దుష్ప్రచారాలతో నిండిపోయిన వైట్‌హౌస్ గురించి గత మూడున్నర సంవత్సరాలుగా చాలా కథలు వినిపిస్తున్నాయి.

అయితే.. బోల్టన్ పుస్తకం బాగా తెలిసిన ఈ విషయాలను దాటి బయటకు వెళ్లింది. తన దేశీయ, వ్యక్తిగత రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి విదేశాంగ విధానాన్ని మార్చటానికి సిద్ధంగా ఉన్న అధ్యక్షుడిని ఇది చూపుతోంది. కాంగ్రెస్‌లోని డెమొక్రాట్లు జనవరిలో ట్రంప్‌ మీద మోపిన అభిశంసన కేసుకు ఇదే మూలం.

తన డెమొక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్‌ను దెబ్బతీసే సమాచారం అందించాలని ఉక్రెయిన్‌ మీద ఒత్తిడి తెచ్చేందుకు ఆ దేశానికి సైనిక సహాయాన్ని నిలిపివేయటానికి అధ్యక్షుడు ప్రయత్నించారన్న వారి ఆరోపణలను బోల్టన్ ధృవీకరించారు.

చైనాతో వ్యవహారాలను కూడా.. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై దృష్టితోనే ట్రంప్ నెరిపారని బోల్టన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తనతో స్నేహపూర్వకంగా ఉండే నిరంకుశవాదులకు సహాయం చేయడానికి ట్రంప్ పదేపదే జోక్యం చేసుకున్నారని చెప్పారు.

అయితే.. ఇదంతా ఓ అసంతృప్త ఉద్యోగి తన పుస్తకాలను అమ్ముకోవటానికి చేస్తున్న ప్రయత్నమని రిపబ్లికన్లు కొట్టివేస్తున్నారు.

మరోవైపు.. అభిశంసన సమయంలో బోల్టన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ విస్ఫోటనకరమైన విషయాలను వెల్లడించి ఉండాల్సిందని డెమొక్రాట్లు మండిపడుతున్నారు. ఆ అవకాశం పోయింది. అయితే.. బోల్టన్ పుస్తకం ఇంకా తన ప్రభావం చూపగలదు.

అధ్యక్ష ఎన్నికల రోజుకు ఐదు నెలల కన్నా తక్కువ సమయమే ఉంది. ఎన్నికల ప్రచారం ఇంకా కుదురుకోవటానికి తంటాలు పడుతోంది. ఈ స్థితిలో ప్రచారం దృష్టిని ఈ పుస్తకం మరల్చింది.

ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

బోల్టన్ ఇంకా ఏం చెప్పారు?

అధ్యక్షుడిపై అభిశంసన విచారణ ఉక్రెయిన్ దాటి వెళ్లి.. రాజకీయ జోక్యాలకు సంబంధించిన ఇతర ఆరోపణలు, సంఘటనలను దర్యాప్తు చేసి ఉంటే.. ఫలితం వేరేగా వచ్చి ఉండేదని బోల్టన్ అంటారు.

జో బిడెన్, ఆయన కుమారుడు హంటర్‌ల మీద అవినీతి ఆరోపణలతో దర్యాప్తును ప్రారంభించమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ మీద ఒత్తిడి తెచ్చేందుకు.. అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశానికి సైనిక సహాయాన్ని నిలిపివేశారంటూ జనవరిలో ఆయన మీద అభిశంసన అభియోగాలు మోపారు.

ట్రంప్ తాను ఈ తప్పు చేయలేదని తిరస్కరించారు. ఫిబ్రవరిలో రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్న సెనేట్‌లో.. సాక్షులు ఎవరూ లేని రెండు వారాల విచారణ తర్వాత ఆయనను నిర్దోషిగా ప్రకటించారు.

ఆ విచారణల్లో సాక్ష్యం ఇవ్వడానికి నిరాకరించిన బోల్టన్‌ను డెమొక్రాట్లు తప్పుపట్టారు. ఉక్రెయిన్‌ విషయంలో ట్రంప్ చర్యలు అభిశంసించతగ్గవా లేదా అనే విషయంలో తన అభిప్రాయాల గురించి ఆయన తన పుస్తకంలో చర్చించలేదు.

ట్రంప్ , బోల్టన్

ఫొటో సోర్స్, Reuters

ఈ పుస్తకంలో అనేక ఇతర ఆరోపణలూ ఉన్నాయి:

‘ఓహ్, మీ దగ్గర అణు బాంబులు ఉన్నాయా?’

ట్రంప్‌కి అనేక విషయాలతో పాటు.. బ్రిటన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయనే విషయం కూడా తెలియదని ఈ పుస్తకంలో ఆరోపించారు.

2018లో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మేతో జరిగిన సమావేశంలో.. ఆ దేశపు అణ్వస్త్ర సామర్థ్యం గురించి థెరెసా అధికారి ఒకరు ప్రస్తావించారు.

అప్పుడు ట్రంప్.. "ఓహ్, మీ దగ్గర అణ్వస్త్రాలున్నాయా?" అని స్పందించారు. అది కావాలని చేసిన జోక్ కాదని తాను చెప్పగలనని బోల్టన్ తన పుస్తకంలో వ్యాఖ్యానించారు.

ఫిన్లాండ్ అనేది రష్యాలో భాగమేనా అని కూడా ట్రంప్ ఒకసారి తన మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ కెల్లీని అడిగారని బోల్టన్ రాశారు.

‘‘వెనిజువెలాను ఆక్రమించటం 'కూల్‌'గా ఉంటుంది’’

వెనిజువెలాను ఆక్రమించటం ‘‘బాగుటుంది’’ అని.. ఆ దక్షిణ అమెరికా దేశం "నిజంగా అమెరికాలో భాగం" అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు బోల్టన్ పుస్తకం చెప్తోంది.

అయితే ఆఫ్ఘానిస్తాన్ ఆక్రమణను.. "జార్జ్ బుష్ అనే తెలివితక్కువ వ్యక్తి చేశాడ’’ని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు ఈ పుస్తకం పేర్కొంది.

ఈ ఆదివారం ప్రసారం కానున్న ఏబీసీ న్యూస్‌ ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ.. ‘‘ట్రంప్‌ను పుతిన్ ఫిడేల్ లాగా వాయించగలడని నేను అనుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.

అధ్యక్ష భవనంలో ట్రంప్ సన్నిహితులుగా ఉన్నవారే ఆయనను ఎంతగా చీదరించుకుంటారనే విషయాలను కూడా బోల్టన్ ప్రస్తావించారు.

ట్రంప్ 2018లో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో సమావేశం జరుపుతున్న సమయంలో.. విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపేయో ఒక చిట్టీని బోల్టన్‌కు అందించారు. అందులో ట్రంప్‌ను ఉద్దేశించి ఇలా రాసి ఉందంటే: "అతడు నిలువెల్లా చెత్తే."

ట్రంప్ కోసం పనిచేయడంలో నిస్పృహకు లోనై, అసహ్యం పెరిగి రాజీనామా చేయాలని భావించిన సహాయకులలో.. ట్రంప్ విధేయుడిగా తరచుగా చెప్తుండే పాంపేయో కూడా ఉన్నారని బోల్టన్ రాశారు.

‘‘రాళ్ళ వెనుక కుట్రలు జరుగుతుంటాయని ట్రంప్ భావిస్తాడు. భారీ ఫెడరల్ ప్రభుత్వం సంగతి తర్వాత.. అసలు అధ్యక్ష భవనం శ్వేతసౌధాన్ని నడపటం కూడా అతడికి ఎంతగా తెలియకదో తెలిస్తే నిర్ఘాంతపోతాం’’ అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)