అమెరికా: "జో బైడెన్, మీరు తప్పు చేశారు... అధ్యక్ష రేసు నుంచి తప్పుకోండి": లైంగిక వేధింపుల బాధితురాలి డిమాండ్

ఫొటో సోర్స్, MEGYN KELLY
(హెచ్చరిక: ఇందులోని కొన్ని విషయాలు కొందరు పాఠకులను కలత పెట్టవచ్చు)
27ఏళ్ల కిందట తనను లైంగిక వేధింపులకు గురిచేశారని, ఆయనకు అమెరికా అధ్యక్ష రేసులో ఉండే అర్హత లేదని, తక్షణం పోటీ నుంచి వైదొలగాలని డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ను ఓ మహిళ డిమాండ్ చేశారు.
''మీరు తక్షణం తప్పుకోండి... జరిగిన దానికి బాధ్యత వహించండి'' అని ఓ ఇంటర్వ్యూలో బైడెన్‌కు టారా రీడ్ అనే మహిళ సూచించారు. 'మీరు మీ వ్యక్తిత్వంతో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడలేరు' అని ఆమె అన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను ఎదుర్కొంటున్న జో బైడెన్ మాత్రం, ఆమె ఆరోపణలను ఖండించారు.
లైంగిక దాడి విషయంలో టారా రీడ్ ఏం చెప్పారు?
56ఏళ్ల టారా రీడ్, 1992-93 మధ్యకాలంలో బైడెన్ కార్యాలయంలో స్టాఫ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. అప్పట్లో బైడెన్ డెలావేర్ తరఫున సెనెటర్‌గా ఉన్నారు.
1993లో ఒకరోజు బైడెన్‌కు జిమ్ బ్యాగ్ అందించడానికి వెళ్లిన సమయంలో ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్టు ఆమె వెల్లడించారు. తనను గోడకు అదిమిపెట్టి, జాకెట్లోకి, స్కర్ట్‌లోకి చేతులు పెట్టారని, తన జననావయవాలలోకి వేలిని చొప్పించారని ఆమె చెప్పారు.
ఇంత వరకు బయటపెట్టని ఈ లైంగిక దాడి వ్యవహారాన్ని మెగిన్‌కెల్లీ అనే జర్నలిస్టుకు టారా రీడ్ వివరంగా చెప్పారు. తన మెడపై బైడెన్ ముద్దు పెట్టుకున్నారని, నీతో శృంగారంలో పాల్గొనాలని ఉందంటూ తనను అసభ్యకరమైన పదజాలంతో కోరారని రీడ్ వెల్లడించారు.
''ఒక చేతిని నా షర్ట్‌లో ఉంచారు. మరో చేతిని నా స్కర్ట్‌లోకి పోనిచ్చారు. నాకు బాగా గుర్తుంది. నేను ఆ సమయంలో మునివేళ్లపై నిలబడ్డాను'' అని వెల్లడించారామె.
''ఒకపక్క నా స్కర్ట్‌లోకి చేతులు పోనిస్తూనే మరోవైపు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన దాదాపు నా మీద పడిపోయారు. నేను ఆయన నుంచి తప్పించుకోడానికి గింజుకున్నాను'' అని గుర్తు చేసుకున్నారు రీడ్.
అతని ప్రవర్తనను తాను వ్యతిరేకించానని ఆమె అన్నారు. అప్పుడు ''నేనంటే నీకు చాలా ఇష్టమని ఎవరో చెప్పారే'' అని బైడెన్ అన్నారని రీడ్ వెల్లడించారు. ''నావైపు వేలు చూపిస్తూ.. నువ్వు నాకొక లెక్కకాదు'' అని అన్నారని వెల్లడించారు రీడ్.

ఫొటో సోర్స్, Reuters
ఆమె ఇంకా ఏం చెప్పారు?
మీరు బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని కోరుకుంటున్నారా? అని రీడ్‌ను జర్నలిస్టు కెల్లీ ప్రశ్నించారు.
''ఆయన పోటీ నుంచి తప్పుకోవాలన్నది నా అభిప్రాయం. కానీ తప్పుకోరు. కానీ నా కోరిక మాత్రం అదే. మానసికంగా ఇది నా ఫీలింగ్'' అన్నారామె. ఈ వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమేనన్నారు రీడ్. అయితే బైడెన్ కూడా రావాలని ఆమె షరతు పెట్టారు. ''బైడెన్ కూడా సిద్ధమైతే నేను టెస్టుకు రెడీ'' అన్నారామె.
ఎలాంటి ఆధారాలు లేకుండానే తాను రష్యన్ ఏజెంటునంటూ కొందరు బైడెన్ అభిమానులు విమర్శించారని, చంపుతామంటూ తనను బెదిరించారని రీడ్ వెల్లడించారు.
''ఆయన అనుచరులు నా మీద సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్వయంగా నన్ను బెదిరించి ఉండకపోవచ్చు. కానీ తన ప్రచారంలో అందరికీ భద్రత గురించి వాగ్దానాలు చేస్తున్నారు. వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. నా సోషల్ మీడియా ఎకౌంట్లన్నీ హ్యాక్ అయ్యాయి. నా వ్యక్తిగత సమాచారమంతా సేకరించారు'' అని ఆమె ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
బైడెన్ వర్గం ఎలా స్పందిస్తోంది?
రీడ్ ఇంటర్వ్యూ టీవీలో ప్రసారమైన తర్వాత బైడెన్ టీమ్ స్పందించింది.
''ఆమె చెబుతున్న కథనంపై అనేక సందేహాలున్నాయి'' అని బైడెన్ ప్రచారానికి కమ్యూనికేషన్ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్న కేట్ బెడింగ్‌ఫీల్డ్ ఒక ప్రకటనలో అన్నారు.
మహిళలు ఏ ఆరోపణ చేసినా దాన్ని చాలామంది నిజమేననుకుంటారు అని ఆయన అన్నారు.
''వారు ఎలాంటి భయంలేకుండా తమకు జరిగిన అన్యాయాన్ని, అనుభవాలను అందరితో పంచుకోవచ్చు. మనం వాటిని కచ్చితంగా పరిశీలించాలి'' అన్న బెడింగ్‌ఫీల్డ్... ''కానీ అదే సమయంలో వారు నిజాలు చెప్పడం మర్చిపోకూడదు. ఇక్కడ వాస్తవమేంటంటే ఈ ఆరోపణలన్నీ అబద్ధాలు. వారి వెనక ఎవరున్నారు అన్న విషయాన్ని బయటపెట్టడానికి మేం ప్రయత్నిస్తూనే ఉంటాం'' అని చెప్పుకొచ్చారు.
జో బైడెన్ కూడా వారం కిందట ఈ వ్యవహారంపై పెదవి విప్పారు. ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలు అని ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
తాజా పరిణామాలేంటి?
ఆఫీసులో ఆమెపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి టారా రీడ్స్ మాజీ భర్త 1996లో కోర్టుకు సమర్పించిన ఓ డాక్యుమెంట్ బయటికు వచ్చింది.
''యూఎస్ సెనెటర్ జో బైడెన్ ఆఫీసులో ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు'' అని ఆ డాక్యుమెంటులో ఆమె మాజీ భర్త పేర్కొన్నట్లు శాన్‌లూయిస్ ఒబిస్పో ట్రిబ్యూన్ అనే పత్రిక వెల్లడించింది.
''నిజమే. ఈ విషయంలో ఆమె చాలా వేదనను అనుభవించారు. ఆ వేదన నుంచి ఇప్పటికీ బయటపడలేదు'' అని తన విడాకులకు సంబంధించిన ఒక లీగల్ డాక్యుమెంట్‌లో ఆమె మాజీ భర్త థియోడర్ రోనెన్ పేర్కొన్నారు. ఈ డాక్యుమెంట్‌ను కాలిఫోర్నియాకు సంబంధించిన ఓ న్యూస్‌పేపర్ సంపాదించింది. రీడ్ ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు అందుబాటులో ఉన్న నాటి డాక్యుమెంట్ ఇదొక్కటే.
తాను లైంగిక వేధింపులకు గురైనట్లు రీడ్ తమకు చెప్పారని అదే ఆఫీసులో పనిచేసిన ఆమె సోదరుడు వెల్లడించారు. 1993నాటి ఈ ఘటనకు సంబంధించి సీఎన్‌ఎన్ టెలివిజన్‌లో చర్చకు రీడ్ తల్లి ప్రయత్నించినట్లు కూడా తెలుస్తోంది. తాను రీడ్ తరఫున ఈ కేసును వాదిస్తున్నట్లు మన్‌హటన్‌లో బాగా పేరున్న లాయర్ డగ్లస్ విగ్డార్ వెల్లడించారు. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌కు జైలుశిక్ష పడిన కేసులో, డగ్లస్ బాధితుల తరఫున వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ వ్యవహారం బైడెన్‌ను ఇబ్బంది పెడుతుందా?
మహిళలకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాడతామని చెప్పుకునే డెమొక్రాట్లు రీడ్ విషయంలో ఆత్మవంచనకు పాల్పడుతున్నారని రిపబ్లికన్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌పై కూడా గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చాలా వచ్చాయి. కానీ వాటిని ఆయన తిరస్కరించారు. ఓ మహిళను తాకరాని చోట తాకారని ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక్కడ ఇంకో విశేషమేంటంటే మీటూ ఉద్యమానికి డెమొక్రాట్లు గతంలో పెద్ద ఎత్తున మద్దతిచ్చారు. లైంగిక వేధింపుల గురించి బయటికు చెప్పుకోలేకపోయిన మహిళలకు కూడా వారు అండగా నిలిచారు. అనేక నియోజకవర్గాల్లో మహిళలు డెమొక్రాట్లకు మద్దతు ఇస్తుంటారు. రిపబ్లికన్లతో పోలిస్తే డెమొక్రాట్లకు మహిళలు సంప్రదాయ ఓటుబ్యాంకుగా వ్యవరిస్తుంటారు. రీడ్ ఆరోపణలను చాలామంది మహిళలు నిజమేనని నమ్ముతున్నా, ఓటు మాత్రం బైడెన్‌కే వేస్తామంటున్నారు. ఎందుకంటే వారి దృష్టిలో ట్రంప్‌కన్నా బైడెన్ చాలా నయమట.
మీటూ ఉద్యమం తర్వాత రాబోయే నవంబర్‌లో జరగబోయే ఎలక్షన్లే మొదటివి. బైడెన్ మాత్రం ఇది ''అమెరికా ఆత్మ కోసం జరుగుతున్న పోరాటం''గా అభివర్ణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








