‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనలు: అమెరికాలోని భారత్, పాకిస్తాన్‌ సంతతి ప్రజలు ఏమంటున్నారంటే..

రాహుల్ దూబే

ఫొటో సోర్స్, Rahul Dubey

ఫొటో క్యాప్షన్, భారతీయ సంతతికి చెందిన రాహుల్ దూబే 70 మంది నిరసనకారులకు తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు
    • రచయిత, వినీత్ ఖరే
    • హోదా, బీబీసీ ప్రతినిధి, వాషింగ్టన్ డీసీ

అమెరికాలో ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. వేల మంది వీధుల్లోకి వచ్చి తమ ఆవేదన, ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ నిరసనల్లో పాల్గొంటున్నవారిలో అన్ని వర్గాల వారూ ఉంటున్నారు. దక్షిణాసియాకు చెందినవాళ్లు కూడా ఇందుకు అతీతం కాదు. నల్ల జాతీయుల్లాగే పోలీసుల అతిగా ప్రవర్తనకు దక్షిణాసియాకు చెందినవాళ్లు కూడా బాధితులే.

‘‘నల్ల జాతి వారికి వ్యతిరేకంగా వ్యవస్థీకృత, వ్యక్తిగత స్థాయిల్లో కూడగట్టుకుపోయిన విద్వేషంపై మాట్లాడాల్సిన అవసరం దక్షిణాసియా వారిగా మాకు ఉంది. అలా మాట్లాడాకపోతే, నల్ల జాతి అమెరికన్ల మరణాలకు మేమూ బాధ్యత పంచుకున్నట్లే’’ అని సౌత్ ఏషియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (ఎస్ఏఏఎల్‌టీ) వ్యాఖ్యానించింది.

ఫ్లాయిడ్ మరణం, దాని తర్వాత చెల రేగిన నిరసనలతో ప్రభావితమైనవారిలో దక్షిణాసియాకు చెందిన కొందరితో బీబీసీ మాట్లాడింది. వాళ్లు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే...

‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనల్లో దక్షిణాసియా వాళ్లు కూడా పాల్గొంటున్నారు
ఫొటో క్యాప్షన్, ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ నిరసనల్లో దక్షిణాసియా వాళ్లు కూడా పాల్గొంటున్నారు

రాహుల్ దూబే - వైద్య ఆవిష్కరణల రంగంలో పనిచేస్తున్నారు. తన ఇంట్లో 70 మంది నిరసనకారులకు ఆశ్రయం కల్పించారు

పోలీసులు, నిరసనకారులు బయట ఉన్నారు. నిరసనకారులు నినాదాలు చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ఉన్న నిరసనకారులపై రాత్రి 9.15కు పోలీసులు దాడి చేశారు.

బయట జనాల సునామీ ఉంది. పోలీసులు వారిని కొడుతూ ఉన్నారు. నేను మా తలుపు దగ్గర నిల్చున్నా. త్వరగా ఇంట్లోకి రండంటూ అరిచా.

పది నిమిషాల పాటు అలా అరుస్తూనే ఉన్నా. సుమారు వంద మంది మా ఇంట్లోకి వచ్చారు. వాళ్ల కళ్లలో మంటతో బాధపడుతున్నారు. కళ్లపై నీళ్లు చల్లుకుంటున్నారు. ఇంకొందరు ఏడుస్తూ ఉన్నారు. భావోద్వేగానికి గురవుతూ ఉన్నారు.

పోలీసులు మమ్మల్ని చూసి నవ్వుతూ ఉన్నారు. మా ఇంట్లోకి పెప్పర్ స్ప్రే కొడుతూ ఉన్నారు.

మా ఇల్లు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. మాకు ఇంటి వెనుక స్థలం కూడా ఉంది. అక్కడో ఇరవై మంది కూర్చొని ఉన్నారు. మెయిన్ ఫ్లోర్‌లో 30 మంది దాకా ఉన్నారు.

ఆకలి వేయడంతో అర్ధరాత్రి పిజ్జా ఆర్డర్ చేశాం. కానీ, పోలీసులు ప్రధాన దారికి అడ్డంకిగా ఉన్నారు. మరుసటి రోజు ఉదయం 6-7 గంటల వరకూ ఆ నిరసనకారులు మా ఇంట్లోనే ఉన్నారు.

రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. కొందరు అక్కడ జరుగుతున్నదంతా సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్ చేశారు. మా భయాలు, తదుపరి ఏం చేయాలి? భద్రత దళాలు ఏం చేస్తాయి?... ఇలా అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం. నల్లజాతి, తెల్లజాతి, హిస్పానిక్, భారతీయులు... ఇలా అందరూ ఉన్నారు వారిలో.

నిరసనకారులు వెళ్లిపోయిన ఓ ఆరు గంటల తర్వాత నాకు కరోనావైరస్ ముప్పు గుర్తుకు వచ్చింది. ఇంత మంది ఒక్కచోట చేరాం. అందుకే ఈ రోజు నుంచే సెల్ఫ్ క్వారంటీన్‌లో ఉండాలని నిర్ణయం తీసుకున్నా.

రజా రుమీ
ఫొటో క్యాప్షన్, రజా రుమీ

రజా రుమీ – ఇతకా కాలేజ్‌లోని సెంటర్ ఫర్ ఇండిపెండెంట్ మీడియా డైరెక్టర్. నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు

పోలీసుల జులుం ఎక్కువగా ఉండే ప్రాంతాలు మావి. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. పోలీస్ ఎన్‌కౌంటర్లపై భారత్‌లో ఎన్నో సినిమాలు, నాటకాలు, పుస్తకాలు వచ్చాయి.

రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇదో పెద్ద అంశం కాబోతోంది. వివిధ జాతుల వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. క్రితం సారి హిల్లరీ, శాండర్స్ మధ్యలో వాళ్లు చీలిపోయారు.

ఏదైనా నేరం మీద నల్ల జాతి వాళ్లు జైలుకు వెళ్తే, వాళ్లకు అవకాశాలు తగ్గిపోతాయి. 9/11 తర్వాత అమెరికన్ ముస్లింలపై నిఘా ఎక్కువైంది. నేను వారి కథలు విన్నా. వారి గురించి మాట్లాడా. పోలీసులు వారిపైనా జులుం చూపించారు.

సమయంతోపాటు ఇది మారాలి. రాత్రికి రాత్రే ఏదీ జరగదు. వారి వాణిని వినకతప్పదని అమెరికన్లకు ఈ నిరసనలు గుర్తుచేశాయి. పరిస్థితి ఇలాగే కొనసాగకూడదు.

నేనూ బాధితుడిని కావొచ్చు. నేనొక ముస్లింను. పాకిస్తాన్‌తో నాకు సంబంధాలు ఉన్నాయి. నేనూ అనుమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.

పారదర్శకమైన పోలీసు వ్యవస్థ లేకపోతే, నా లాంటి వాళ్లందరికీ ఇబ్బందే.

హిస్పానిక్, ఆఫ్రికన్ అమెరికన్ జాతులతో పోల్చితే దక్షిణాసియా వాళ్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. మాలో మాకు విభేదాలు ఉన్నా, వాటిన్నింటినీ పక్కనపెట్టి మేం బయటకు వస్తున్నాం.

మినాహిల్ మెహ్దీ

ఫొటో సోర్స్, Minahil

మినాహిల్ మెహ్దీ – విద్యార్థిని. నిరసనల్లో పాల్గొన్నారు

నేను హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నా. నేను పుట్టి, పెరిగింది పాకిస్తాన్‌లో. అక్కడ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా.

జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంలో నిరసనలు మొదలైనప్పుడు, దానికి సంఘీభావం తెలియజేయాల్సిన బాధ్యత విద్యార్థులుగా మాపై ఉందని భావించా.

శతాబ్దాలుగా అణిచివేతకు గురైన వారితో మేం కలిసి నిల్చున్నాం. పాకిస్తాన్‌లోనూ మహిళలు, విద్యార్థులు, పష్తూన్‌ల సమస్యల గురించి మేం అలాగే చేశాం.

బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతు నిలవడం మా బాధ్యత. మేం రెండో ఆలోచన పెట్టుకోలేదు.

కోవిడ్-19 సంక్షోభం కారణంగా అందరూ మాస్క్‌లు ధరిస్తున్నారు. శానిటైజర్లు అందించుకుంటూ భౌతిక దూరం పాటిస్తున్నారు. దాదాపు నాలుగైదు వందల మంది ఉన్నాం. అందరూ మర్యాదగా నడుచుకున్నారు. ఒకరి కథలు మరొకరం విన్నాం. పాకిస్తాన్‌లో అధికార పెత్తనం, క్యాపిటలిజం, ఫ్యూడలిజంతో సమస్యలు ఉన్నాయి.

అమెరికాలో నల్ల జాతి వ్యక్తిగా జీవించడం ఎలా ఉంటుందో అనుభవించనవారు చెబుతూంటే విన్నాం. ఒక స్టోర్‌కు వెళ్లాలంటే తాము ఎలా భయపడాల్సి వస్తుందో వాళ్లు చెప్పారు.

ఓ విధమైన ఐకమత్యపు భావన నాకు కలిగింది. అదో గొప్ప అనుభవం.

వలసపాలన ముగిసిన తర్వాత దక్షిణాసియాలో జాత్యహంకార సమస్య ఉంది. ఉద్యోగాల్లో, వివాహాల్లో... ఇలా చాలా చోట్ల వర్ణ వివక్ష సమస్య ఉంది.

స్వీయ విశ్లేషణ చేసుకునే అవకాశం ఇది. మన దేశంలో మనం బలహీనుల కోసం నిలబడుతున్నామా అన్న ప్రశ్నను రేకెత్తించింది.

భారత్‌లో ఉన్నవాళ్లైతే, దళితుల గొంతు వినిపిస్తున్నామా? పాకిస్తాన్‌లోని వాళ్లైతే, బలూచ్ ప్రజల కోసం మాట్లాడుతున్నామా? అని ఆలోచించుకోవాలి. వ్యవస్థీకృత హింసను ఎదుర్కొంటున్న వారి పక్షాన మనం నిలబడాల్సిన అవసరం ఉంది.

బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనలు

శాంతి సింగ్ – కిరాయిదారుల సంఘంలో పనిచేస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్నారు

దక్షిణాసియా వారిని ఆదర్శ మైనార్టీలుగా వర్ణిస్తూ, వేరే జాతులవారి మీద దాడికి ఈ వాదనను ఉపయోగించుకుంటున్నారు.

‘ఎవరికీ అన్యాయం జరగట్లేదు. భారతీయులను చూడండి’ అని తెల్ల జాతి వాళ్లు అంటుంటారు. కానీ, మాతో అంతా సవ్యంగా లేదు. అదొక భ్రమ.

మాపై అణిచివేత ఉంది. జాత్యహంకారానికి మే బాధితులం కాకపోవచ్చు. మరో రకమైన వివక్ష మాపై ఉంటుంది. అందుకే, మేం బయటకు రావడం ఇంకా ముఖ్యం.

నేను ఇలాంటి నిరసనల్లో ఇదివరకు కూడా పాల్గొన్నా. కానీ, ఏమీ మారలేదు. అందుకే, మరింత ఆగ్రహాన్ని మనం చూస్తున్నాం.

అలీ ఇలాహీ

ఫొటో సోర్స్, Ali

ఫొటో క్యాప్షన్, అలీ ఇలాహీ

అలీ ఇలాహీ- విద్యార్థి. నిరసనల్లో పాల్గొన్నారు

జార్జ్ ఫ్లాయిడ్ వీడియో నేను చూశా. ఆయనపై వాళ్లు హింసకు పాల్పడిన తీరు నా హృదయాన్ని ముక్కలు చేసింది. పోలీసుల అరాచకత్వం ఉన్న ప్రాంతం నుంచే మేం వచ్చాం. కానీ, అక్కడ కూడా పోలీసులు పట్టపగలు నడిరోడ్డు మీద ఇలా ప్రవర్తించడం చూడం. రోడ్డు పక్కన ఉన్నవాళ్లు వేడుకుంటున్నా, ఆ పోలీసులు ఊరుకోలేదు.

వివిధ జాతులవారితో, మైనార్టీలకు, ముఖ్యంగా శతాబ్దాలుగా చట్టపపరంగా వివక్ష ఎదుర్కొంటున్న నల్లజాతి వారికి సంఘీభావంగా నిలవాలనుకుని ఈ నిరసనల్లో పాల్గొన్నాం.

కరోనావైరస్ సంక్షోభం ఉన్నా, జనాలు బయటకు వచ్చారు. స్థానిక నల్ల జాతి వాళ్లు తమ అనుభవాలను పంచుకున్నారు. తాము కూడా ఈ విషయంపై మౌనంగా ఉండబోమని తెల్ల జాతి వాళ్లు ముందుకు వచ్చారు.

మౌనంగా ఉన్నవాళ్లు, తటస్థంగా ఉన్నవాళ్లు కూడా నేరస్థులే.

పాకిస్తాన్‌లో ఇలాంటి వీడియో బయటకు వస్తే, కఠిన చర్యలు తీసుకుంటారు. బాధ్యులపై వేటు పడుతుంది. దేశ ప్రధాని స్థాయి వరకూ విషయం వెళ్తుంది. కానీ, ఇక్కడ చర్యలు చాలా నెమ్మదిగా ఉన్నాయి.

దేశమేదైనా ఓ మైనార్టీ వర్గానికి ఇలా జరిగితే, వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. మొదట వాళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. తర్వాత మన వరకూ వస్తారు. అందుకే అందరం కలిసి గొంతు ఎత్తడం చాలా ముఖ్యం.

ఈ నిరసనల్లో జాతి వైవిధ్యం కనిపించింది. జనాలు శాంతియుతంగా నడుచుకున్నారు. అలాగే ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాలనుకుని ప్రయత్నిస్తున్న దుండగులు కూడా కొందరు ఉన్నారు.

నిరసనల సందర్భంగా ఓ 16 ఏళ్ల నల్ల జాతి బాలిక మాట్లాడింది. ఓ నల్ల జాతి వ్యక్తి స్టోర్‌కు వెళ్తే, చేతిలో ఆయుధాలు లేవని చూపించుకోవాల్సిన పరిస్థితి గురించి ఆమె వివరించింది.

వకాస్

ఫొటో సోర్స్, Waqas

వఖాస్ అహ్మద్ – వ్యాపారి. ఈయన నడుపుతున్న ఓ స్టోర్‌పై దాడి జరిగింది

మేరీలాండ్‌లో మాకు ఫోన్ల స్టోర్లు ఉన్నాయి. మొత్తంగా మాకు 20 స్టోర్లు ఉన్నాయి.

ఒక రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ స్టోర్‌పై కొందరు రాళ్లు విసిరి అద్దాలు పగులగొట్టారు. ఏడు నుంచి ఎనిమిది మంది ఓ వాహనంలో షాపులోకి దూసుకువచ్చారు.

ఓ ఫోన్ తీసుకువెళ్లారు. ఇదంతా 30 సెకన్లలో జరిగిపోయింది.

ఆ ఫోన్ విలువ రూ.4 లక్షలకు అటూ ఇటూ ఉంటుంది. ఆస్తి నష్టం కలిగించారు. స్టోర్‌కు ఇన్సూరెన్స్ ఉంది. మరమ్మతులు జరుగుతున్నాయి.

స్టోర్ తెరుచుకుంది. కానీ, మళ్లీ ఇలా జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మాకు భయంగా ఉంది.

నా స్నేహితుల్లో కొందరి వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఇప్పటికే కరోనావైరస్ సంక్షోభం ప్రభావం మాపై పడింది. ఇంకా దాని నుంచి తేరుకోలేదు.

ఇదివరకటి నిరసనలతో పోల్చితే ఇప్పుడు జరుగుతున్న నిరసనలు చాలా భిన్నంగా ఉన్నాయి. జరిగింది పెద్ద తప్పని అర్థమవుతూనే ఉంది. మానవతా కోణంలో ఈ విషయాన్ని అందరూ చూస్తున్నారు.

వ్యాపారం వేరు. మానవత్వం వేరు.

ఆ ఘటనకు సైడ్ ఎఫెక్ట్‌గా వ్యాపారాలు ప్రభావితమవడం దురదృష్టకరం. శాంతియుత నిరసనలు జరుగుతున్నాయి. కానీ, కొందరు మాత్రం ఈ పరిస్థితి నుంచి ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)