అమెరికా నిరసనలు: జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరువాత చెలరేగిన అల్లర్లను అణచివేయటానికి సైన్యాన్ని పంపిస్తున్నానన్న ట్రంప్

ఫొటో సోర్స్, AFP
పోలీసుల చేతిలో నల్లజాతి వ్యక్తి జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి నిరసనగా అమెరికాలో నిరసనలు హింసాత్మకంగా మారటంతో.. అల్లర్లను అణచివేయటానికి వేలాది మంది భారీ సాయుధ బలగాలను రంగంలోకి దించుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
పోలీసుల చేతిలో అమెరికన్ ఆఫ్రికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లాయిడ్‌ది హత్యేనని పోస్టుమార్టం నివేదిక కూడా రావడంతో నిరసనకారుల ఆందోళన తీవ్రమైంది.
దేశంలో అనేక నగరాలలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతో.. అల్లర్లను అణచివేయటానికి సైన్యాన్ని రంగంలోకి దింపుతానని ట్రంప్ బెదిరించారు.
ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ఇది శాంతియుత నిరసన కాదని, ప్రశాంతతకు భంగంవాటిల్లితే సహించేది లేదన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘అల్లర్లు, లూటీలు, విధ్వంసం, దాడులు.. ఆస్తుల ధ్వంసాలను ఆపటానికి నేనిప్పుడు మాట్లాడుతుండగానే వేలాది మంది భారీ ఆయుధాలు ధరించిన సైనికులు, సాయుధ బలగాలు, పోలీసు సిబ్బందిని పంపిస్తున్నాను’’ అని చెప్పారు.
ట్రంప్ మాట్లాడిన తర్వాత.. అమెరికా సైనిక బలగాల చైర్మన్ జనరల్ మైలీ వాషింగ్టన్ డీసీ నగరంలో వీధుల్లో కాలినడకన పర్యటించారు. పరిస్థితిని పరిశీలిస్తున్నానని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అంతకుముందు.. ఈ ఆందోళనలను దేశీయ టెర్రరిజంగా ట్రంప్ అభివర్ణించారు. వామపక్షాలు, అరాచకవాదులే ఈ హింసకు కారకులంటూ ఆయన నిందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
వివిధ రాష్ట్రాల గవర్నర్లు ఈ అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

ఫొటో సోర్స్, Reuters
వైట్‌హౌస్ సమీపంలో హింసాత్మక ఘటనలతో బంకర్‌లో దాక్కున్న ట్రంప్
అంతకుముందు.. సోమవారం ఆందోళనలు హింసాత్మక రూపందాల్చిన సమయంలో కొద్దిసేపు డోనల్డ్ ట్రంప్‌ను వైట్‌హౌస్‌లోని భూగర్భ బంకర్‌లోకి తరలించారు.
వాషింగ్టన్ డీసీలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. వైట్‌హౌస్‌కు సమీపంలోని భవనాలు కూడా దాడులకు గురయ్యాయి. కార్లు, చారిత్రక చర్చి ధ్వంసమయ్యాయి.
వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డ్స్‌కు చెందిన అదనపు బలగాలను రంగంలోకి దించారు. సాయుధులైన సెక్యూరిటీ సిబ్బంది భద్రతా వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నారని, వైట్‌హౌస్‌లాంటి చారిత్రక కట్టడాలకు ఎలాంటి హానీ జరక్కుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని ఓ భద్రతాధికారి వెల్లడించారు.
వాషింగ్టన్ డీసీలో ఇప్పటికే 1200మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉన్నారని ఆ అధికారి తెలిపారు.
ఫ్లాయిడ్ హత్యపై ఇప్పటికే పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఆందోళనలను అణచివేసే క్రమంలో జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించారు.

ఫొటో సోర్స్, EPA
నల్ల జాతివారిపై పోలీసుల అరాచకత్వానికి వ్యతిరేకంగా అమెరికాలో వరుసగా ఆరో రోజూ రాత్రి పూట నిరసనలు జరిగాయి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. అయితే, వీటిని లెక్క చేయకుండా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చారు. చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అల్లర్లను నియంత్రించే పోలీసులతో న్యూయార్క్, చికాగో, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజెలస్ తదితర నగరాల్లో నిరసనకారులు ఘర్షణలకు దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, పెప్పర్ బుల్లెట్లు ప్రయోగించారు.
పోలీసు వాహనాలకు నిరసనకారులు నిప్పుపెట్టారు. చాలా నగరాల్లో దుకాణాలను లూఠీ చేశారు.
దేశీయంగా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వినియోగించే అమెరికా రిజర్వు సైనిక దళం నేషనల్ గార్డ్ తమ సిబ్బందిలో ఐదు వేల మందిని 15 రాష్ట్రాల్లో క్రియాశీలం చేసినట్లు తెలిపింది.
వాషింగ్టన్ డీసీలోని అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్ దగ్గర కూడా జనాలు మరోసారి పోగయ్యారు. మంటలు పెట్టారు. రాళ్లు రువ్వారు. భద్రతకు రాష్ట్ర, స్థానిక లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలదే బాధ్యత అని నేషనల్ గార్డ్ తెలిపింది.

ఫొటో సోర్స్, Reuters
నిరసనల్లో తాజాగా ఏం జరిగిందంటే?
ఆదివారం చాలా చోట్ల పోలీసు వాహనాలను నిరసనకారులు ధ్వంసం చేశారు. తగులబెట్టారు. పోలీసులు టియర్ గ్యాస్, ఫ్లాష్ గ్రెనేడ్లను ప్రయోగించారు.
ఫిలడెల్ఫియాలో నిరసనకారులు పోలీసు కార్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు, ఓ షాపును లూఠీ చేస్తున్న దృశ్యాలు స్థానిక టీవీ ఛానెళ్లలో కనిపించాయి.
‘‘ఫిలడెల్ఫియాలో శాంతి భద్రతల పరిస్థితి ఇదీ. వాళ్లు షాపులను దోచుకుంటున్నారు. నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దించాలి. క్కాలిఫోర్నియాలోని శాంటా మోనికాలోనూ లూఠీ జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి’’ అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన మినియాపోలిస్ నగరంలో హైవేపై గుమిగూడిన నిరసనకారుల వైపు ఓ వ్యక్తి పెద్ద ట్రక్కుతో దూసుకువచ్చారు.
ఆ ట్రక్కు ఆగిపోయిన తర్వాత అందులో నుంచి ఆ వ్యక్తిని అక్కడున్న జనాలు బయటకు లాగారు. ఈ దృశ్యాలున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి.
ఆ వ్యక్తి స్వల్పగాయాలతో ఆసుపత్రిలో చేరికయ్యారు. ఈ ఘటనలో ఇంకా ఎవరూ గాయపడ్డట్లైతే కథనాలు రాలేదు.
ఆ ట్రక్కు నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి ఏ ఉద్దేశంతో అలా చేశారన్నది ఇంకా తెలియరాలేదని మినెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ అన్నారు.
‘‘విషాదం, ప్రాణ నష్టం లేకుండా ఈ ఉదంతం ముగియడం గొప్ప విషయం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Reuters
డెన్వర్ నగరంలో కొలరాడో స్టేట్ కాపిటల్ భవనం ముందు వేల మంది శాంతియుతంగా నిరసన తెలిపారు. నేలపై పడుకుని, ‘ఐ కాంట్ బ్రీత్’ అంటూ నినాదాలు చేశారు.
అట్లాంటా, బోస్టన్, మయామి, ఓక్లహామా సిటీ తదితర ప్రాంతాల్లోనూ భారీ నిరసనలు జరిగాయి.
కొన్ని చోట్ల నిరసనకారులపై పోలీసులు అతిగా స్పందించినట్లుగా కూడా కథనాలు వచ్చాయి. జార్జియాలోని అట్లాంటా నగరంలో అవసరానికి మించి బలాన్ని ప్రయోగించినందుకు ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. ఆ అధికారులు ఇద్దరు విద్యార్థులపై టేజర్ ప్రయోగించారు.
నల్ల జాతివారిపై పోలీసుల అరాచకత్వం విషయమై చాలా కాలంగా వ్యక్తమవుతున్న జనాగ్రహానికి జార్జ్ ఫ్లాయిడ్ మరణం ఘటన మరోసారి ఆజ్యం పోసింది.
ఆర్థిక, సామాజిక అసమానత్వం, తారతమ్యాలపై ఏళ్లుగా కూడగట్టుకున్న అసంతృప్తి, ఆవేదన కూడా ఈ నిరసనల్లో బయటపడుతోంది.
తాజా నిరసనలు మొదలైనప్పటి నుంచి వందల మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇదివరకు కూడా నల్ల జాతి వ్యక్తులు పోలీసుల చేతుల్లో మరణించిన ఉదంతాలు చాలా ఉన్నాయి. మైకేల్ బ్రౌన్, ఎరిక్ గార్నర్ లాంటి వారి మరణాలు సంచలనమయ్యాయి. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి దారితీశాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎంతటి సమర్థ నాయకులనైనా పరీక్షించే పరిస్థితులు ఇవి
బీబీసీ ఉత్తర అమెరికా రిపోర్టర్ఆంటోనీ జర్చర్విశ్లేషణ
ముందుతో పోల్చితే గత మూడేళ్లుగా కాస్త శాంతియుతంగా ఉన్న అమెరికానే ట్రంప్ పాలిస్తున్నారు. ఆయనకు ఎదురైన సంక్షోభాల్లో ఎక్కువ భాగం ఆయన చర్యల ఫలితాలే. తన మద్దతుదారులను ఆకట్టకుంటూ, ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ఆయన వీటిని ఎదుర్కొన్నారు.
అయితే, ఇప్పుడు ట్రంప్ ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి విభజనవాద సూత్రాలతో పరిష్కరించేది కాదు. కరోనావైరస్ సంక్షోభం అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో దేశవ్యాప్తంగా జాతికి సంబంధించి అశాంతి నెలకొంది. ప్రజలు అనిశ్చితితో, భయంతో ఉన్నారు. వారిలో ఆగ్రహం కూడా కట్టలు తెంచుకుంటోంది.
ఎంతటి సమర్థ నాయకులనైనా పరీక్షించే పరిస్థితులు ఇవి. ఆయన శాంతి, ట్విటర్‌లో ట్రంప్ చేసే నిందారోపణలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు... ఐకమత్యం, శాంతి కోసం ఆయన ఇచ్చే పిలుపుల విలువను తగ్గిస్తున్నాయి. రాజకీయ పరిణతితో మాట్లాడటం ట్రంప్‌కు అలవాటు లేని పని.
కరోనావైరస్ సంక్షోభం ఆర్థికంగా, సామాజికంగా చూపించిన ప్రభావంతో ఎండిన రాజకీయ గడ్డి మైదానానికి ఫ్లాయిడ్ మరణంతో నిప్పు అంటుకున్నట్లైంది. ఈ మంటలను చల్లార్చే శక్తి ట్రంప్‌కు లేకపోవచ్చు. వాటిని ఆయన పెంచకుండా ఉండటమే ఎక్కువ.
బరాక్ ఒబామా, రిచర్డ్ నిక్సన్ లాంటి వాళ్లే ఇలాంటి అశాంతి జ్వాలలను ఆపలేకపోయారు.

ఫొటో సోర్స్, AFP
జార్జ్ ఫ్లాయిడ్‌కు ఏం జరిగింది?
మినియాపోలిస్‌లో మే 25న సాయంత్రం కప్ ఫుడ్స్ అనే ఓ షాపులో జార్జ్ ఫ్లాయిడ్ ఓ సిగరెట్ ప్యాకెట్ కొన్నారు. అందుకు ఆయన 20 డాలర్ల నోటు ఇచ్చారు.
షాపులో పని చేసే ఉద్యోగి ఆ నోటును నకిలీదిగా భావించి, పోలీసులకు ఫోన్ చేశారు.
ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో డెరెక్ షావిన్ అనే ఓ తెల్ల జాతి పోలీస్ అధికారి ఆయన మెడపై మోకాలితో బలంగా నొక్కి కూర్చున్నారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జార్జ్‌తో పాటు అక్కడున్న మిగతా వాళ్లు కూడా పోలీసును అలా చేయొద్దని వారించడం అందులో కనిపించింది.
‘‘ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు’’ అంటూ జార్జ్ మొరపెట్టుకున్నారు కూడా. పోలీసు వినిపించుకోలేదు. జార్జ్‌కు అవే ఆఖరి మాటలయ్యాయి. ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఎనిమిది నిమిషాల 46 సెకన్ల పాటు షావిన్ తన మోకాలితో ఫ్లాయిడ్ మెడను అలాగే నొక్కిపట్టి ఉంచారని విచారణకర్తల నివేదికలో ఉంది.
అయితే, అది మొదలైన ఆరు నిమిషాల్లో ఫ్లాయిడ్‌లో కదలికలు ఆగిపోయాయి. వీడియోల్లో అక్కడున్నవాళ్లు పోలీసులను ఫ్లాయిడ్ నాడీ స్పందన చూడాలని అడగడం కనిపించింది.
ఫ్లాయిడ్ కుడి చేతి మణికట్టును నాడీ స్పందనల కోసం ఓ అధికారి చూశారు. నాడీ స్పందన తెలియలేదు. అయినా, పోలీసులు కదల్లేదు.
8.27కు ఫ్లాయిడ్ మెడపై నుంచి షావిన్ తన మోకాలిని పక్కకు జరిపారు. ఏ కదలికలూ లేకుండా ఉన్న ఫ్లాయిడ్‌ను అప్పుడు హెనేపిన్ కౌంటీ మెడికల్ సెంటర్‌కు అంబులెన్స్‌లో తరలించారు.
ఫ్లాయిడ్ మృతి చెందినట్లు ఆ తర్వాత ఓ గంటకు వైద్యులు ప్రకటించారు.
డెరెక్ షావిన్‌పై హత్య అభియోగంపై నమోదైంది. సోమవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు.
ఇవి కూడా చదవండి:
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- ప్రైవేట్ స్పేస్ షిప్లో అంతరిక్షంలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు.. నింగిలోకి ఎగసిన 'క్రూ డ్రాగన్'
- భారత్‌లో కరోనా మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారా? వాస్తవ సంఖ్యను గుర్తించడం ఎందుకంత కష్టం?
- వైఎస్ జగన్మోహన్రెడ్డి: ‘ఆటుపోట్లను తట్టుకుని గెలిచిన సీఎం... ఎవరినయినా ఎదిరించి నిలిచే తత్వం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









