ఒక మహిళ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యేది ఎప్పుడు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కేటీ కే
- హోదా, ప్రెజెంటర్, బీబీసీ వరల్డ్ సర్వీస్
తులసి గబ్బార్డ్‌కు అనేక విశిష్ట లక్షణాలు ఉన్నాయి. ఆమె హవాయియన్ ఆర్మీ నేషనల్ గార్డ్ మేజర్, కాంగ్రెస్‌లో తొలి హిందూ సభ్యురాలు, కాంగ్రెస్‌లో మొదటి సమోవన్-అమెరికన్ ఓటింగ్ సభ్యురాలు. కానీ ఆమె ఈసారి అమెరికా అధ్యక్షురాలు కాబోవటం లేదు.
ఆమె కనీసం అధ్యక్ష పదవికి పోటీచేసే డెమొక్రటిక్ పార్టీ నామినీ కూడా కాదు.
(నిజానికి 2017లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ సైనిక బలగాలు అలెప్పో మీద బాంబులతో దాడి చేసిన తర్వాత ఆయనను కలిసిన తులసి గబ్బార్డ్ అసలు డెమొక్రటిక్ పార్టీ రేసులో ఉండటమే అసాధారణమైన విషయం.)
ఇప్పుడు.. ఆమె అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలు కాబోరు.
ఆమేకాదు.. ఈసారి కూడా మరే మహిళా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికవరు.
ఎలిజబెత్ వారెన్ చెప్పినట్లు.. అమెరికా బాలికలు శ్వేతసౌథంలో తమకు స్ఫూర్తిప్రదాతను చూడాలనుకుంటే.. మరో నాలుగేళ్లు ఆగాల్సిందే.

ఫొటో సోర్స్, Getty Images
'భిన్నత్వం' ఏమైంది?
ఈ పోటీని డెమొక్రాట్లు ప్రారంభించారు.. ఎప్పుడో నియాండర్తల్ మానవులు భూమి మీద తిరుగాడినపుడే.. శ్వేతజాతీయేతర, పురుషేతర అభ్యర్థులతో ఈ పోటీని మొదలు పెట్టినట్లు అనిపిస్తుంది. వాళ్లు ఒక్కొక్కరూ తప్పుకుపోయారు.
అమెరికాలో 2020లో మార్పు కావాలనుకుంటే.. ఏడు పదుల వయసున్న శ్వేతజాతీయుడిని ఎన్నుకోవటమే మంచిదన్నట్లు కనిపిస్తోంది.
ఎలిజబెత్ వారెన్ తన వీడ్కోలు ప్రసంగంలో లింగ వివక్ష గురించి ప్రస్తావించారు. హిల్లరీ క్లింటన్ మొదటిసారి 2008లో ఈ రేసులోకి వచ్చినపుడు ఎదుర్కొన్న అదే తరహా లింగ వివక్ష కాదిది.
అప్పుడు సావనీర్ షాపుల్లో.. అమెరికా సెనెటర్‌గా, విదేశాంగ మంత్రిగా విజయవంతంగా పనిచేసిన ఒక మహిళ నమూనాలో నట్‌క్రాకర్లు విక్రయించారు. ఒక మహిళ విజయవంతమైందంటే.. ఆమె ఒక బాల్-క్రాకర్ (మగవాళ్ల మీద పెత్తనం చేసే మహిళ) కూడా అయ్యితీరాలనేది దాని అర్థం.
''మగాళ్లూ జాగ్రత్త'' అనేది దాని సందేశం.

ఫొటో సోర్స్, Getty Images
అలాగని.. క్లింటన్ ధరించే ట్రౌజర్స్ సూట్ల మీద అర్థంలేని చర్చ వంటి లింగ వివక్ష కూడా కాదు.
ఇప్పుడు వివక్ష మరింత నిగూఢంగా ఉంటుంది. ఎలిజబెత్ వారెన్ చెప్పింది వాస్తవం.. లింగ వివక్ష ఇంకా ఉంది.
అది ''ఎన్నికయ్యే అర్హత'' అనే అంశం మీద చర్చగా రూపం తీసుకుంది.
డోనల్డ్ ట్రంప్‌ను ఓడించాలని డెమొక్రాట్లు తహతహలాడుతున్నారు. ఆ పని చేయగల అభ్యర్థి కావాలని వారు కోరుకుంటున్నారు.
ఎలిజబెత్ వారెన్ చాలా బలంగా ప్రచారం చేశారనే విషయంతో ఎవరూ విభేదించలేదు. ఓటర్లు పట్టించుకునే చాలా కీలకమైన అంశాలకు సంబంధించి ఆమె సవివరమైన విధానాలను ముందు పెట్టారు. వాటిలో కొన్ని.. మరీ వామపక్ష విధానాల తరహాలో ఉన్నట్లు కనిపించాయనేది నిజమే. కానీ ఆమె ప్రణాళికలతో ఏకీభవించినా లేకున్నా.. ఈ పోటీలోని పురుషులకు ఉన్న అన్ని అర్హతలూ ఆమెకు ఖచ్చితంగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
ఎలిజబెత్ వారెన్ కీలక విధానాలేమిటి?
- అపర కుబేరుల మీద సంపద పన్ను
- సార్వజనీన శిశు సంరక్షణ
- సింగిల్-పేయర్ ఆరోగ్య రక్షణ వ్యవస్థ - కార్పొరేట్ కంపెనీల మీద పన్నులు విధించటం ద్వారా చెల్లిస్తారు
- ఉచిత ప్రభుత్వ కాలేజీలు
- ఆదాయం ప్రాతిపదికగా విద్యార్థులకు రుణ విముక్తి
- అసాల్ట్ తరహా ఆయుధాలపై నిషేధం, సార్వజనీన నేపథ్య తనిఖీల అమలు
ఈ ప్రమాణాలను బట్టి ఈ దశలో ఆమె ముందు వరుసలో ఉండాలి. కానీ.. 'ఎన్నికవ్వగలగటం' అనే అంశం ఆమెను వెనక్కు నెడుతూ వచ్చింది. ఈ మాటకు అసలు అర్థం.. ''అమెరికన్లు ఒక మహిళను ఇప్పుడే ఎన్నుకోరు.. ఈసారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది'' అని.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్నికల సర్వేల్లో అడిగినపుడు.. చాలా మంది తాము ఒక మహిళకు ఓటు వేస్తామని చెప్పారు. కానీ తమ పొరుగువారు అలా ఓటు వేయరని వారు ఖచ్చితంగా నమ్ముతున్నారు.
కాబట్టి.. జాతీయ అభ్యర్థిగా ఎలిజబెత్ వారెన్‌తో ఉపయోగం తక్కువ. అందుకు ప్రధాన కారణం.. ఆమె మహిళ కావటమే.
దీనికి.. ఐక్యరాజ్యసమితి మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఒక కొత్త అంతర్జాతీయ సర్వే సామాజిక లింగ సమానత్వ సూచీలో జవాబు దొరకొచ్చు. ఇది కేవలం అమెరికా సమస్య మాత్రమే కాదు.
ప్రపంచ జనాభాలో 80 శాతం మంది ఉన్న 75 దేశాల సమాచారాన్ని చూస్తే.. జనంలో దాదాపు సగం మంది పురుషులే గొప్ప నాయకులు కాగలరని భావిస్తున్నారు.
నేను ఆశ్చర్యపోయానని చెప్తే బాగుండు అనిపిస్తుంది కానీ.. అలాంటిదేమీ లేదు. (అయితే.. ప్రపంచ పురుషుల్లో మూడో వంతు మంది.. ఒక మగాడు తన భార్యని కొట్టటంలో తప్పులేదని భావిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడైన మరో విషయం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది.)
అంటే.. ఎన్నికవగలగడం అనేది మగవాడికి సంకేతం అని తేలింది. అమెరికాలో అయితే.. వృద్ధ, శ్వేత, స్వలింగ సంపర్కుడు కాని మగవాడికి అది సంకేతం.
ఇది మారేది ఎప్పుడు?

ఇవి కూడా చదవండి:
- పీటీ ఉష: ఎలాంటి సదుపాయాలూ లేని పరిస్థితుల్లోనే దేశానికి 103 అంతర్జాతీయ పతకాలు సాధించిన అథ్లెట్
- పీతల నీలి రంగు రక్తం ప్రతి ఏటా లక్షలాది ప్రాణాలను కాపాడుతోందని మీకు తెలుసా?
- కరోనావైరస్ టెన్షన్: టాయిలెట్ పేపర్లను జనం వేలం వెర్రిగా ఎందుకు కొంటున్నారు?
- యస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మారటోరియం: ఇప్పుడు ఏమవుతుంది? ఖాతాదారుల పరిస్థితి ఏమిటి?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు
- కరోనావైరస్లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- జోసెఫ్ స్టాలిన్: అలనాటి సోవియట్ అధినేత జీవితం... ఇలా ముగిసింది
- కరోనావైరస్: పదేపదే ముఖాన్ని తాకే అలవాటు మానుకోవడం ఎలా?
- మీ స్మార్ట్ ఫోన్ రెండేళ్లకంటే పాతదా? అయితే జాగ్రత్త.. వంద కోట్ల ఆండ్రాయిడ్ డివైజ్‌లకు హ్యాకింగ్ ముప్పు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









