కరోనావైరస్: లాక్‌డౌన్ ప్రభావంతో పాఠశాలలు ఎలా మారిపోయాయంటే..

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శ్రుతి మేనన్
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో పిల్లలు స్కూలుకు వెళ్లడం మొదలైంది. అయితే ఇప్పటికీ దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో పాఠశాలలు మూతపడే ఉన్నాయి.

దక్షిణాసియాలోని భారత్‌తోపాటు పొరుగునున్న దేశాల్లో పరిస్థితులను ఇప్పుడు పరిశీలిద్దాం. కరోనావైరస్ లాక్‌డౌన్‌తో ఇక్కడ 60 కోట్ల మందికిపైగా పిల్లలపై ప్రభావం పడినట్లు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.

ఇప్పటికీ నిబంధనలు అమలులోనే..

దక్షిణాసియా దేశాల్లో మార్చి, ఏప్రిల్ నెలల్లో లాక్‌డౌన్‌లు మొదలయ్యాయి. ఇక్కడి చాలా ప్రాంతాల్లో అప్పుడే కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంటుంది.

ప్రస్తుతం చాలా చోట్ల లాక్‌డౌన్ నడుమ పాఠశాలలు మూతపడే ఉన్నాయి. ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి.

  • భారత్‌లో పాఠశాలలు చాలా వరకూ మూతపడే ఉన్నాయి. ఆన్‌లైన్ విధానంలో టీచర్లు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. అయితే సెప్టెంబరు 21 నుంచి తల్లితండ్రుల అనుమతిపై తొమ్మిది నంచి 12వ తరగతి పిల్లలు కావాలంటే స్వచ్ఛందంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లొచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
  • బంగ్లాదేశ్, నేపాల్‌లలో పాఠశాల మూసివేతను మరింత పొడిగించారు. ఆన్‌లైన్ విధానంలోనే బోధన సాగుతోంది.
  • శ్రీలంకలో జులైలో పాఠశాలలు తెరవాలని భావించారు. అయితే ఆగస్టులో ఇవి తెరచుకున్నాయి. కేసులు పెరగడంతో కొన్నింటిని మళ్లీ మూసివేశారు.
  • కరోనావైరస్ కేసులు తగ్గడంతో సెప్టెంబరు 15 నుంచి దశల వారీగా పాఠశాలలను తెరవాలని పాకిస్తాన్ నిర్ణయించింది.
ఆన్‌లైన్ ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్నెంట్ ఎంత మందికి ఉంది?

ఆన్‌లైన్ క్లాసులు రెండు విధాలుగా నిర్వహిస్తున్నారు. వీటిలో మొదటిది లైవ్ ఆన్‌లైన్ క్లాసులు. రెండోది డిజిటల్ రూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లాసులను అందుబాటులో ఉంచడం.

అయితే, చాలా దేశాల్లో సరైన ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులోలేని ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం పడుతోంది.

14.7 కోట్ల మంది చిన్నారులకు ఆన్‌లైన్ లేదా రిమోట్ లెర్నింగ్ అందని ద్రాక్షగానే మిగిలిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. భారత్‌లో కేవలం 24 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నట్లు 2019నాటి ప్రభుత్వ సర్వే తెలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో అయితే, ఇంటర్నెట్ అందుబాటులో ఉండే వారు కేవలం 4 శాతం మాత్రమేనని పేర్కొంది.

భారత్ కంటే బంగ్లాదేశ్‌లో ఇంటర్నెట్ సదుపాయాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. మొత్తంగా దేశంలో 60 శాతానికిపైనే ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. అయితే ఆ నెట్ బ్రాడ్‌బ్యాండ్ నాణ్యత చాలా నాసిరకంగా ఉన్నట్లు ఎప్పటికప్పుడే వార్తలు వస్తుంటాయి.

ఇక్కడి చాలా స్కూళ్లలో మౌలిక వసతులు కూడా సరిగ్గా ఉండవు.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

నేపాల్‌లోని దాదాపు 30,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక కంప్యూటర్ కూడా లేని పాఠశాలలు 30 శాతం వరకూ ఉన్నట్లు తాజా ఆర్థిక సర్వే తెలిపింది. కేవలం 12 శాతం పాఠశాలలు మాత్రమే ఆన్‌లైన్ బోధనకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది.

కొన్ని దేశాల్లో ఇంటర్నెట్ లేదా బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోలేని వారికి విద్యను చేరువ చేసేందుకు టీవీలు, రేడియోలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ మాధ్యమాలు చాలా మంది ప్రజలకు ఇప్పటికే చేరువయ్యాయి.

భారత్‌లోని ప్రభుత్వ ఛానెల్ దూరదర్శన్, రోజూ విద్యా సంబంధిత కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. మరికొన్ని టీవీ ఛానెళ్లు, రేడియో సేవలు కూడా ఇదే బాటపట్టాయి.

బంగ్లాదేశ్ ప్రభుత్వ ఛానెల్ సంగ్‌సాద్ టెలివిజన్ కూడా రికార్డెడ్ క్లాసులను ప్రసారం చేస్తోంది.

''ఇవి చాలా విజయవంతమైన విధానాలు.. చాలా మంది పిల్లలకు ఇవి చేరువ అవుతున్నాయి''అని యూనిసెఫ్ దక్షిణాసియా డైరెక్టర్ జీన్ గో.. బీబీసీకి తెలిపారు.

నేపాల్ కూడా ఇలాంటి విధానాలనే అనుసరించింది. అయితే ఇక్కడ సగం కంటే తక్కువ మంది ప్రజలకు మాత్రమే టీవీలు ఉన్నాయి.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

వైరస్ వ్యాప్తి ముప్పు

శ్రీలంకలో పాఠశాలలు తెరిచారు. అయితే, ఎలాంటి సామాజిక దూరం నిబంధనలు పాటించలేదు. కొన్ని పాఠశాలల్లో మాత్రమే మాస్క్‌లు వేసుకోవడం తప్పనిసరి చేశారని సిలోన్ టీచర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జోసెఫ్ స్టాలిన్ వివరించారు.

''మౌలిక నిబంధనలు అమలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించలేదు''అని బీబీసీ సింహళ సర్వీస్‌తో ఆయన చెప్పారు.

సెప్టెంబరులో పాఠశాలలను తెరవడాన్ని ద ఆల్ పాకిస్తాన్ ప్రైవేట్ స్కూల్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోంది. కరోనావైరస్ పరీక్షలు నిర్వహించడానికి, సామాజిక దూరం నిబంధనలు పాటించడానికి ప్రభుత్వం నిధులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

భారత్‌లోనూ స్కూళ్లను తెరవడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

''స్కూళ్లను తెరిస్తే.. తల్లిదండ్రులు, టీచర్ల పనులు, రవాణా సదుపాయాలు, ఇరత సేవలు అన్నీ పెరుగుతాయి. దీంతో ప్రజల కదలికలు ఎక్కువవుతాయి''అని బీబీసీతో చైల్డ్ రైట్స్ అండ్ యూకు చెందిన ప్రీతి మహరా తెలిపారు.

దీర్ఘకాలంపాటు మూసివేయడంతో ప్రైవేటు పాఠశాలలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. వారి ట్యూషన్ ఫీజులతోపాటు ఆదాయానికి గండి పడుతోంది.

బంగ్లాదేశ్‌లో వందకుపైగా పాఠశాలలను ఇప్పటికే అమ్మకానికి పెట్టారు.

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్

ఫొటో సోర్స్, Getty Images

''జీతాలు ఇవ్వడానికి, అద్దె కట్టడానికి ఇప్పటికే అప్పులు చేశాను''అని ఢాకాలో ఓ స్కూలు నడుపుతున్న తక్బీర్ అహ్మద్ వివరించారు.

కొన్ని అణగారిన వర్గాల కోసం పనిచేస్తున్న పాఠశాలలను ఆదుకొనేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి.

''ఇంట్లో కనీసం ఒక మొబైల్ ఫోన్ ఉండే పిల్లలను ఆన్‌లైన్‌తో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం''అని భారత్‌లో ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌ను నడిపిస్తున్న డాక్టర్ రుక్మిణి బెనర్జీ తెలిపారు.

కొన్ని కేసుల్లో, పిల్లలను ఆన్‌లైన్ విధానంలోకి తీసుకురావడం సాధ్యపడకపోవడంతో బడిని పూర్తిగా మానేసే పిల్లల సంఖ్యా పెరుగుతోంది.

దీని వల్ల చాలా దేశాల్లో బడి మానేసే పిల్లల శాతం భారీగా పెరగబోతోందని యూనిసెఫ్‌కు చెందిన జీన్ గో వ్యాఖ్యానించారు. సమర్థమంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థలులేని ప్రాంతాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.

''ఎబోలాతోపాటు ఇతర అత్యవసర పరిస్థితుల్లో పాఠశాలలు మూతపడినప్పుడు వేసిన అంచనాల ప్రకారం చూస్తే.. విద్యా పరంగా భారీ నష్టం జరగబోతున్నట్లు తెలుస్తోంది''అని ఆయన బీబీసీకి చెప్పారు.

(పరిశోధనలో సాయం అందించినవారు: వాలీవుర్ రెహ్మాన్ మిరాజ్, ముహమ్మద్ షాన్‌వాజ్, సరోజ్ పథిరానా)

ఇవి కూడాచదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)