తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు మొదలయ్యేది ఎప్పుడు?

ఫొటో సోర్స్, facebook/jangaondept
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
లాక్‌డౌన్ తర్వాత అన్ని రాష్ట్రాల్లో సాధారణ జీవనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో ఆంక్షలను దాదాపుగా తొలగించారు. అంతర్ రాష్ట్ర రవాణా విషయంలోనూ అడ్డంకులు తొలగిపోయాయి. సరిహద్దుల చెక్‌పోస్టులను ఇప్పటికే ఎత్తేశారు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య మాత్రం ఆర్టీసీ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు.
ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం కనిపించడం లేదు. ఏపీ క్యాబినెట్‌లో కూడా దీనిపై చర్చించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సూచనతో అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం బస్సుల రూట్లు కుదించాలని తెలంగాణ చెబుతోంది. అంతర్ రాష్ట్ర ఒప్పందం కోసం చర్చలకైనా సిద్ధం అని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విభజన నాటి వివాదం
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రం నాటి ఏపీఎస్ ఆర్టీసీ నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 2015 జూన్ 3 నుంచి అది కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటికీ ఏపీఎస్ ఆర్టీసీ తరఫున తెలంగాణలో 3,37,000 కిలోమీటర్ల మేర బస్సులు తిరిగేవి.
తెలంగాణకి చెందిన బస్సులు ఏపీలో 94 వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగేవి. ఆ లెక్కలు సరిచేయాలని తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. కానీ, ఉమ్మడి నిర్ణయానికి రాలేకపోయారు. కోవిడ్ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడంతో మార్చి 24 తరువాత రెండు రాష్ట్రాల మధ్య రవాణా నిలిచిపోయింది.
దీనిని మళ్లీ ప్రారంభించడానికి రెండు రాష్ట్రాల ఆర్టీసీ యాజమాన్యాలు చేసిన ప్రయత్నాల అనంతరం ప్రస్తుతం బస్సులు రోడ్డు మీదకు వచ్చాయి. ఏపీ నుంచి కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు బస్సులు తిరుగుతున్నాయి.
తెలంగాణ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక సర్వీసులు కూడా నడుపుతున్నారు. కానీ ఏపీ, తెలంగాణ మధ్య మాత్రం బస్సు సర్వీసులు నడపడం లేదు.
మొదట అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగాలని తెలంగాణ ఆర్టీసీ కోరుతోంది. దానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రజల సౌకర్యార్థం తక్షణం చెరో 70వేల కిలోమీటర్ల చొప్పున బస్సు సర్వీసులు నడుపుదామని ఏపీఎస్ ఆర్టీసీ తరపున ప్రతిపాదించినట్టు చెబుతున్నారు. దశల వారీగా ఉమ్మడి అంగీకరానికి రావాలని ఏపీఎస్ ఆర్టీసీ ఆశిస్తోంది. కానీ ప్రస్తుతానికి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
అంతర్ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగాలని తెలంగాణ చెబుతుంటే ఏపీ మాత్రం ఒకేసారి పెద్ద సంఖ్యలో సర్వీసులు నిలిపివేయడం సమస్య అవుతుందని వాదిస్తోంది.

చర్చలు, కొలిక్కిరాని యత్నాలు
వివిధ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్రం నుంచి పూర్తిస్థాయి అనుమతులు ఉన్నాయి.
దాంతో ఏపీ, తెలంగాణ మధ్య కూడా బస్సులు నడుస్తాయని అనుకున్నవారి ఆశలు నెరవేరలేదు. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల స్థాయిలో తొలుత విజయవాడలో, అనంతరం హైదరాబాద్‌లో రెండు దఫాలుగా ఈ చర్చలు సాగాయి.
వాటితో పాటుగా సంప్రదింపుల కోసం పలు మార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. వీడియో కాన్ఫరెన్స్‌లోనూ చర్చలు జరిపారు. అయినా, ఆర్టీసీ బస్సులకు మాత్రం పచ్చజెండా ఊపడం లేదు.
ప్రస్తుతం ఐదేళ్ల తర్వాత ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులను తెలంగాణ రాష్ట్రంలో 2.65 లక్షల కిలోమీటర్లకు తగ్గించారు. దాదాపుగా 70 వేల కిలోమీటర్లను తగ్గించారు. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు ఏపీలో 94 వేల నుంచి 1.52 లక్షల కిలోమీటర్లకు పెంచారు. సుమారుగా 60వేల కిలోమీటర్లు పెంచగలిగారు. ఫలితంగా రెండు రాష్ట్రాల ఆర్టీసీ సర్వీసుల మధ్య ఉన్న దూరాన్ని కొంత మేరకు తగ్గించగలిగారు.
తెలంగాణ ఏమంటోంది.. ఏపీ ఏం ఆశిస్తోంది?
రెండు రాష్ట్రాల సర్వీసులు సమానంగా నడుపుకొనేందుకు గాను 2.15 లక్షల కిలోమీటర్లు చొప్పున తిప్పాలని గతంలోనే ఒప్పందం ఉంది.
అందుకు గానూ 52 వేల కిలోమీటర్లు తాము తగ్గుతామని, ఆ మేరకు తెలంగాణ సర్వీసులను ఏపీలో పెంచుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కోరుతోంది. కానీ దానికి తెలంగాణ నుంచి అంగీకారం లభించడం లేదు. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ నడుపుతున్న సర్వీసుల మేరకు ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులను కుదించాలని చెబుతోంది.
అలా చేస్తే, తాము ఒకేసారి లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవలసి ఉంటుందని ఏపీఎస్ ఆర్టీసీ చెబుతోంది. అదే జరిగితే 350 బస్సులను నిలిపివేయాల్సి ఉంటుందని వాదిస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఉన్న 128 ఆర్టీసీ డిపోలకు గానూ 100 డిపోల నుంచి ఏపీఎస్ ఆర్టీసీ వారి సర్వీసులు హైదారాబాద్‌కు నడుస్తున్నాయి.
కానీ తెలంగాణ ఆర్టీసీ అధికారులు మాత్రం కేవలం విజయవాడ, కర్నూలు నుంచి సర్వీసులు నడపాలని ప్రతిపాదిస్తున్నారు. దాని వల్ల తమ సర్వీసులకు సమస్యలు వస్తాయని ఏపీఎస్ ఆర్టీసీ అంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరి వాదన వారిది
ఈ వ్యవహారంపై ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానందరెడ్డి బీబీసీతో మాట్లాడారు. రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నా, అవి ఫలించడం లేదని, తెలంగాణ నుంచి ఆశించిన స్పందన లేదని అన్నారు.
“తాత్కాలికంగా కనీసం 70 వేల కిలోమీటర్లకు అనుమతించాలని కోరుతున్నాం. కానీ, 8 వేల కిలోమీటర్లే తిరుగుతాం..81 బస్సులే తిప్పుతాం...150 బస్సులకు మేము పెంచం అంటున్నారు.
అంతేకాకుండా, 70 వేల కిలోమీటర్లకు కూడా ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని చెబుతున్నారు. అందుకే జాప్యం జరుగుతోంది. ప్రిన్సిపల్ సెక్రటరీ తరఫున ఏపీ ప్రభుత్వం నుంచి లేఖ కూడా రాశాం. 70,408 కిలోమీటర్ల తాత్కాలిక సర్వీసులకు అనుమతి కోరినా స్పందన రాకపోవడంతో సర్వీసులు ప్రారంభించలేకపోతున్నాం. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.
‘అంతర్ రాష్ట్ర ఒప్పందంపై చర్చలు జరగాలి’
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కి బస్సులు నడపడానికి తమ వైపు అభ్యంతరం లేదని బీబీసీతో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అపరేషన్స్) యాదగిరి తెలిపారు.
"మేం చర్చలకు సిద్ధంగా ఉన్నాం. మా మధ్య ఒక విడత చర్చలు జరిగాయి. మా ప్రతిపాదనలు మేం పెట్టాం. దానికి వారు చర్చించుకుని వస్తాం అన్నారు. వాళ్లెప్పుడు వస్తే అప్పుడు మళ్లీ కూర్చుని చర్చించి సర్వీసులు ప్రారంభిస్తాం. మా వైపు నుంచి ఆలస్యం ఏం లేదు. మేం ఎప్పుడూ చర్చలకు సిద్ధం. ఇతర రాష్ట్రాల ఆర్టీసీల మధ్య ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని సర్వీసులు బస్సులు తిప్పాలనే ఒప్పందం ఉంటుంది. కానీ ఆంధ్ర-తెలంగాణ మధ్య అలాంటి ఒప్పందం ఇంకా కుదరలేదు. ఇప్పటి వరకూ (లాక్ డౌన్ ముందు వరకూ) పాత ఉమ్మడి పద్ధతిలోనే తిరిగాయి. ఇప్పుడు కొత్త అగ్రిమెంట్ లేదా అవగాహన కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దాని కోసం చూస్తున్నాం” అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/APSRTC
ప్రైవేటు సర్వీసుల జోరు, ప్రజల అవస్థలు
ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిస్తే విజయవాడ- హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సు టికెట్ ధర రూ. 500 ఉంటుంది. ఏసీ బస్సు అయినప్పటికీ మరో రూ. 300 అదనంగా ఉంటుంది.
కానీ ప్రస్తుతం ప్రభుత్వ సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు పూర్తిగా ప్రైవేటు ఆపరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. దాంతో అదనంగా చెల్లించుకోవాల్సి వస్తోందని పలువురు చెబుతున్నారు.
“నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాను. గతంలో వారంవారం బందరులో ఇంటికి వెళ్లే వాళ్లం. లాక్‌డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోం చేశాను. జూన్ నుంచి మళ్లీ ఆఫీసుకి వెళుతున్నా. కానీ ఇంటికి వెళ్లడానికి అవకాశం ఉండడం లేదు. ఒకసారి వెళ్లి రావాలంటే రూ. 4 వేలకు పైనే ఖర్చవుతుంది. నెలకు ఒకసారి వెళ్లాలన్నా భారమే. దాంతో ఇంటికి కూడా వెళ్లలేకపోతున్నాం. ఆర్టీసీ సర్వీసులు ప్రారంభిస్తే వెయ్యి రూపాయల ఖర్చుతో రాకపోకలు అయిపోయేవి. రెండు రాష్ట్రాలు అంగీకారానికి రావాలని, వాటిని త్వరగా ప్రారంభించాలని కోరుకుంటున్నాం” ఎల్బీ నగర్‌లో ఉండే సీహెచ్ రమేశ్ బీబీసీతో అన్నారు.
లాక్‌డౌన్ తర్వాత ఏపీఎస్ ఆర్టీసీకి రూ.1200 కోట్ల నష్టాలు
లాక్‌డౌన్ సడలింపులతో మే 21 తర్వాత ఏపీలో ఆర్టీసీ సర్వీసులను ప్రారంభించారు. రెండు నెలల పాటు నిలిపివేసిన సర్వీసులు ప్రారంభించిన అనంతరం దాదాపు 4 నెలలుగా నడుపుతున్న ఆర్టీసీ సర్వీసులు తీవ్ర నష్టాల మధ్య సాగుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రస్తుతం 25 శాతం బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ ఈడీ తెలిపారు. లాక్‌డౌన్ అనంతరం రూ.1200 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు.

ఆదాయంలో పదో వంతు కూడా లేదు
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా లాంటి సరిహద్దు రాష్ట్రాలతోపాటూ ఏపీలో కలిపి మొత్తం 1810 ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను తిప్పేవారు.
సిటీ బస్సులు మరో 1100 తిరిగేవి. కానీ ఇప్పుడు వీటిలో పావు వంతు మాత్రమే తిప్పగలుగుతున్నారు. వాటిలో కూడా ఎక్కువ బస్సులు ఖాళీగా తిరుగుతుండడంతో నష్టాలు వస్తున్నాయి.
లాక్‌డౌన్ ముందు రోజుకి 42 లక్షల కిలోమీటర్ల మేర తిరిగిన బస్సులను సెప్టెంబర్ వరకూ 12 లక్షల కిలోమీటర్లే తిప్పగలుగుతున్నామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
దాంతో, నెలకు రూ.500 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, ప్రస్తుతం అందులో పదో వంతు కూడా రావడం లేదంటున్నారు.
అంతర్ రాష్ట్ర సర్వీసులకు ఆటంకాలు తొలగితే నష్టాలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. ముఖ్యంగా దూర ప్రాంత సర్వీసుల ద్వారానే ఆర్టీసీకి అధిక ఆదాయం వస్తుంది.
కానీ ప్రస్తుతం ఏపీ సర్వీసులు, దూర ప్రాంత సర్వీసులు కూడా పునఃప్రారంభానికి నోచుకోకపోవడంతో నష్టాలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. దాంతో, ఏపీ అధికారులు హైదరాబాద్ సర్వీసులపైనే ఆశలు పెట్టుకున్నారు.
ఇటు, అంతర్ రాష్ట్ర సర్వీసులపై మొదట ఒప్పందం జరగాలని టీఎస్ ఆర్టీసీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
సామాన్యుల సమస్యలు తీర్చేందుకు తాత్కాలిక ఒప్పందంతో రంగంలో దిగాలని సూచిస్తున్నాయి.
ప్రైవేట్ ఆపరేటర్లు సర్వీసులు ప్రారంభిస్తుంటే, ఆర్టీసీ యాజమాన్యాల మధ్య ఇప్పటికీ అవగాహన కుదరక పోవడం సరికాదని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- నిజాం పాలనలో 1932లో ప్రారంభమైన ఘన చరిత్ర ఉన్న ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి?
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
- మీడియా జడ్జి పాత్ర పోషించొచ్చా.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అలాంటి కేసులివే
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- అన్నం తింటే డయాబెటిస్ వస్తుందా
- ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








