సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు: రియా చక్రవర్తిని మీడియానే దోషిగా ప్రకటించొచ్చా

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, Facebook/SushantSinghRajput

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నిందితులు ఎవరైనా ఉన్నారా?

ఇంకా తేలాల్సిన ఈ వ్యవహారంలో చాలా మీడియా సంస్థలు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తివైపు వేళ్లు చూపిస్తున్నాయి.

కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ట్రోల్స్.. ఎలాంటి విచారణ లేకుండానే రియాను దోషిగా ప్రకటిస్తున్నాయి.

అసలు ఏం జరుగుతుందో చెప్పడానికి బదులు కొన్ని మీడియా సంస్థలు జడ్జి పాత్రను తామే పోషిస్తూ రియాను బాధ్యురాలిని చేస్తున్నాయి.

సోషల్ మీడియాతోపాటు కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నాయి.

రియా

ఫొటో సోర్స్, RheaChakrabortyOfficial/Facebook

''సుశాంత్ హత్య కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలకు రియా కేంద్ర బిందువుగా ఉన్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకూ నిందితులు ఎవరూ లేరు. కానీ మీడియా ఏకంగా ఆమెను దోషిగా ప్రకటిస్తోంది. మీడియా నియంతృత్వాన్ని ఆపాలి. రియాతోపాటు ఆమె కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్న మాట వాస్తవమే. అయితే ఇప్పటివరకూ వారిని నిందితులుగా ఏ దర్యాప్తు సంస్థా పేర్కొనలేదు''అని నాలుగు దశాబ్దాలు భిన్న హైకోర్టుల్లో వందల హైప్రొఫైల్ కేసులపై వార్తలు రాసిన ప్రముఖ పాత్రికేయుడు రాకేశ్ భట్నాగర్ వ్యాఖ్యానించారు.

భారత్‌లో నేడు మీడియా సంస్థలు అనుసరిస్తున్న తీరును రాకేశ్ విమర్శించారు. ఇక్కడ మీడియా ట్రయల్స్ సర్వ సాధారణం అయిపోయాయని ఆయన వివరించారు. నేడు ఇది ప్రపంచ సమస్యగా మారుతోందని అన్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఫొటో సోర్స్, Facebook

ఆత్మహత్య కేసులపై వార్తలు రాస్తున్నప్పుడు కాస్త జాగరూకతతో వ్యవహరించాలని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని రాయిటర్స్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ జర్నలిజం విభాగం అసోసియేట్ డైరెక్టర్ క్యాథ్లీన్ మెర్సెన్ సూచించారు. ''నాకు ఈ కేసు గురించి పెద్దగా తెలియదు. కానీ ఆత్మహత్యలపై వార్తలు రాసేటప్పుడు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బాధ్యతాయుతంగా రాయాల్సి ఉంటుంది. మనకు మనంగా ఎలాంటి నిర్ధరణలు చేయకూడదు''

''ఇలాంటి వార్తలు రాసేటప్పుడు మూడు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. బాధితుల కుటుంబ సభ్యుల గురించి ఆలోచించాలి. ప్రజల వైపు నుంచి బాధ్యతగా ఉండాలి. అదే సమయంలో ఆత్మహత్యలపై ఎక్కువ వార్తలు రాయకూడదు. ఎందుకంటే ఇవి మరింత మందిని ఆత్మహత్యలవైపు ప్రేరేపిస్తాయి''అని ఆమె అన్నారు.

''దురదృష్టవశాత్తు, ఆత్మహత్యల వార్తలను ఎక్కువ మంది చదువుతుంటారు. ప్రతి అంశాన్నీ తెలుసుకోవాలని అనుకుంటారు. రిపోర్టర్లు కూడా అన్ని కోణాల్లో నుంచి వార్తలు రాయాలని అనుకుంటారు. కానీ దీని వల్ల బాధితుల కుటుంబాలకు, ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది''

నెట్‌ఫ్లిక్స్

ఫొటో సోర్స్, Netflix

ట్రయల్ బై మీడియా పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో ఆరు పార్ట్‌ల సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఆరుగురు ప్రముఖ అమెరికా నటులు దీనిలో నటించారు.

కేసుల్ని మీడియా ఎలా సంచలనంగా మారుస్తోంది? చాలా మంది దీనికి ఎలా బలవుతున్నారు? వారి జీవితాలు ఎలా నాశనం అవుతాయి? లాంటి అంశాలను ఈ సిరీస్‌లో చూపించారు. నేడు మీడియా ట్రయల్స్ రెండు వైపులా పదునున్న కత్తిలా మారాయి. ఒకవైపు సంప్రదాయ న్యూస్ మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ ట్రయల్ జరుగుతున్నాయి. దీనికి ఉదాహరణగా నేడు రియా కేసును చెప్పుకోవచ్చు.

సంచలనంగా మరిన ఐదు ప్రముఖ మీడియా ట్రయల్స్ ఇవీ..

ఓజే సింప్సన్

ఫొటో సోర్స్, Bobby Bank/WireImage

ఓజే సింప్సన్ మీడియా ట్రయల్

అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ ప్లేయర్ ఓజే సింప్సన్ మీడియా ట్రయల్‌ను ''ట్రయల్ ఆఫ్ ద సెంచరీ''గా పిలుస్తుంటారు.

1995, అక్టోబరు 3న అమెరికాలోని ఓ కోర్టులో జరిగిన ఆయన కేసు విచారణను టీవీలో లైవ్ ఇచ్చారు. దీన్ని కోటి కంటే ఎక్కువ మందే వీక్షించారు. మాజీ భార్య బ్రౌన్ సింప్సన్, ఆమె స్నేహితుడు రోనాల్డ్ గోల్డ్‌మన్‌లను హత్య చేసినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే కోర్టు ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.

మీడియాలో ఫేక్‌న్యూస్ వల్ల విచారణ సమయంలో జ్యూరీలో సభ్యుల్ని చాలా సార్లు మార్చాల్సి వచ్చింది. కొన్నిసార్లు అయితే విచారణను వాయిదా వేయాల్సి వచ్చింది. జడ్జిల్లో కొంత మంది మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగిందని, మరోవైపు ఇది విచారణపై ప్రభావం చూపిందని ఓ జడ్జి వ్యాఖ్యానించారు. కొంత మంది సాక్షులు కూడా మీడియాలో వార్తలకు తీవ్రంగా ప్రభావితం అయినట్లు విచారణలో తేలింది.

డాక్టర్ డేవిడ్ కెల్లీ కేసు

డేవిడ్ కెల్లీ

ఫొటో సోర్స్, Ian Waldie/Getty Images

45 నిమిషాల్లో విధ్వంసం సృష్టించగల ఆయుధాలు ఇరాక్ దగ్గరున్నాయని 2003లో బ్రిటన్ ప్రభుత్వం చెప్పిన అంశాలతో విభేదిస్తూ బీబీసీ ఒక వార్త ప్రచురించింది.

అయితే, ఆయుధాల నిపుణుడు డాక్టర్ డేవిడ్ కెల్లీ చెప్పడంతోనే ఈ వార్త రాశారని, అన్ని మీడియా సంస్థల్లోనూ వార్తలు వచ్చాయి. బీబీసీ పేరు వెల్లడించకపోయినప్పటికీ.. డేవిడ్ పేరు పతాక శీర్షికల్లో నిలిచింది.

మరోవైపు బీబీసీకి తను సమాచారాన్ని లీక్ చేశారంటూ వచ్చిన వార్తలను ఎంపీల కమిటీ ముందు ఇచ్చిన వాంగ్మూలంలో కెల్లీ కూడా తోసిపుచ్చారు.

వాంగ్మూలం ఇచ్చిన రెండు రోజుల తర్వాత ఆయన ఓ నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహమై కనిపించారు. విచారణలో కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆయన మరణం తర్వాత ఆయన ఆధారంగానే వార్త రాసినట్లు బీబీసీ వెల్లడించింది. అయితే, కొందరు అవహేళన చేయడంతో తట్టుకోలేక ఆయన మరణించినట్లు ఆయన భార్య తెలిపారు.

లొరేనా బాబిట్

ఫొటో సోర్స్, Jeffrey Markowitz/Sygma via Getty Images

లొరేనా బాబిట్ కేసు

ఇదొక ప్రత్యేకమైన మీడియా కేసు. దీనికి విశేష ప్రజాదరణ లభించింది.

అమెరికాలో గృహహింస బాధితురాలు లొరేనా బాబిట్ భర్త జాన్ వేన్ బాబిట్ పురుషాంగాన్ని కోసి కారు కిటికీ లోనుంచి బయటకు విసిరేశారు. ఈ కేసుపై మీడియాలో చాలా కథనాలు వచ్చాయి.

ఆమెను భర్త శారీరకంగా, లైంగికంగా, మానసికంగా హింసించారని కోర్టులో ఆమె తరఫున న్యాయవాదులు వాదించారు. కోర్టు కూడా ఆమెను విడిచిట్టింది. ఓ వీధిలో పడిన భర్త పురుషాంగాన్ని వైద్యులు మళ్లీ శరీరానికి అతికించగలిగారు.

రోడ్నీ కింగ్ కేసు

1991లో అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో నల్లజాతీయుడు రోడ్నీ కింగ్‌ను ఓ శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి కొడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి.

రోడ్నీ దంతాలతోపాటు ఎముకలు కూడా విరిగాయి. ఆయన మానసికంగా దెబ్బతిన్నారు.

ఆయనపై జీవితాంతం మానసికంగా ఆ ప్రభావం పడిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే మాదకద్రవ్యాల అలవాటుతో 2012లో అతడు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. అమెరికా మీడియాలో ఈ కేసుకు సంబంధించిన వీడియోలు, వార్తలు చాలా ప్రచురితం అయ్యాయి. అయితే ఆ పోలీసు అధికారిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

మీడియా మాత్రం ఆ పోలీసు అధికారిని దోషిగా నిర్ధారించింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఐదు రోజులపాటు దేశ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణల్లో 54 మంది మరణించారు.

స్కాట్ పీటర్సన్ కేసు

గర్భంతోవున్న తన భార్య లక్కీను హత్య చేసినట్లు అమెరికన్ పౌరుడు స్కాట్ పీటర్సన్‌పై ఆరోపణలు వచ్చాయి. భార్య ప్రతిసారి తన పుట్టింటివారికి డబ్బులు ఇవ్వాలని అడుగుతోందని, అందుకే ఆమెను ఆయన చంపేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే, తాను నిర్దోషినని కోర్టులో ఆయన చెప్పుకొచ్చారు. అయినప్పటికీ మీడియాలో ఆయన దోషి అని వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు అయితే ఆయన నిర్దోషి అని ప్రకటించాయి.

కోర్టు ఆయన్ను చివరగా దోషిగా ప్రకటించింది. మీడియాలో వచ్చిన వార్తలకు జ్యూరీ సభ్యులు ప్రభావితమై ఆయన్ను దోషిగా నిర్ధారించారని ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Nasir Kachroo/NurPhoto via Getty Images

స్వేచ్ఛగా దర్యాప్తు జరిపించే హక్కు..

''మీడియా ట్రయల్స్‌తో వ్యక్తుల హక్కులకు భంగం కలిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇవి కోర్టు ధిక్కరణలుగా మారకూడదు''అని 2011లో ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు.

''విచారణకు ముందు మీడియాలో వచ్చే వార్తలు నిష్పాక్షిక విచారణపై ప్రభావం చూపిస్తాయి. నిందితుల అరెస్టు, విచారణకు ముందే వారిని దోషులుగా మీడియా ప్రకటిస్తోంది. పనికిరాని, పొంతనలేని సాక్షాలను నిజాలుగా మీడియా చూపిస్తోంది. ప్రజలు కూడా అది నిజమని భావిస్తున్నారు''

ఇలాంటి మీడియా ట్రయల్స్‌తో స్పల్పకాలంలో మీడియా సంస్థలకు ప్రయోజనం చేకూరినా, ప్రజాస్వామ్యానికి ఇవి ముప్పని క్యాథ్లీన్ వ్యాఖ్యానించారు.

''ప్రేక్షకుల కోసం మీడియా సంస్థలు పడే ఆరాటమే ఇలాంటి అవాస్తవిక వార్తలకు ఆధారం''అని ఓ ప్రముఖ ఇంగ్లిష్ టీవీ ఛానెల్‌లో సీనియర్ జర్నలిస్టు అన్నారు. ''మన ప్రేక్షకుల కోసం మనం స్వతంత్రంగా పనిచేస్తున్నాం. అయితే కవరేజీ విషయంలో చాలా ఒత్తిళ్లు ఉంటాయి. సుశాంత్ సింగ్ కేసే దీనికి ఉదాహరణ''

''జర్నలిస్టులేమీ దేవుళ్లు కాదు. వారు కూడా తప్పులు చేస్తారు. ప్రేక్షకులను తప్పుపట్టలేం''.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి

ఫొటో సోర్స్, INSTAGRAM

ఫొటో క్యాప్షన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రియా చక్రవర్తి

మీడియా ట్రయల్స్‌ను అడ్డుకోగలమా?

వార్తలను సంచలనాలుగా చేయడంపై జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఇప్పటికే భారత సుప్రీం కోర్టు చాలాసార్లు హెచ్చరించింది.

కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో తబ్లిగీ జమాత్ కేసే దీనికి చక్కని ఉదాహరణ.

ఏప్రిల్ జమాత్‌లో పాల్గొన్న వారిలో చాలా మందికి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. కొన్ని మీడియా సంస్థలు దీనిపై విస్తృతంగా కవరేజీ ఇచ్చాయి. కోర్టు బాధ్యతలను కూడా తలకెత్తుకున్నాయి. కొందరైతే తబ్లీగీలను ఆత్మాహుతి దళాలుగా కూడా పేర్కొన్నారు. కావాలనే వైరస్‌ను వారు వ్యాపింపజేశారని అన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడాన్ని కోర్టు తిరస్కరించింది.

వాస్తవాలను వార్తలుగా రాసే హక్కు రిపోర్టర్లకు ఎప్పుడూ ఉంటుందని రాకేశ్ భట్నాగర్ అన్నారు. అయితే వదంతులు, ఫేక్ న్యూస్‌లను ఎప్పుడూ వ్యాపింపజేయకూడదని వివరించారు.

ప్రమాణాలు మెరుగుపడేందుకు మీడియా సంస్థలు నియంత్రణలు విధించుకోవాలని ఆయన అన్నారు. మీడియా ట్రయల్స్‌ను అడ్డుకొనేందుకు కోర్టులు సత్వర విచారణలు జరిపితే మేలని ఆయన అభిప్రాయపడ్డారు.

''ఓ హత్య కేసు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ విచారణ పూర్తవ్వడానికి 20ఏళ్లు పడుతుంది. ఈ కేసుల విచారణ త్వరగా పూర్తయితే.. మీడియా ట్రయల్స్‌ను తగ్గించొచ్చు''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)