ఆంధ్రప్రదేశ్‌: ‘నాడు-నేడు’తో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల
    • రచయిత, వి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ విద్యారంగంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే నగదు బదిలీ రూపంలో 'అమ్మ ఒడి' పథకం అమలు చేస్తున్నారు.

'జగనన్న విద్యా కానుక' అంటూ పిల్లలకు అవసరమైన సామాగ్రి అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి తోడుగా ప్రస్తుతం 'నాడు- నేడు' పేరుతో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దే పని ప్రారంభమైంది. రాష్ట్రంలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి డెమో పాఠశాలలుగా అభివృద్ధి చేస్తుండగా, మొత్తం స్కూళ్లలో మూడోవంతు బడులు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నారు.

ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల మీద దాని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే కొత్త పథకాల కారణంగా కొందరు విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు నిధులతో ఆధునిక హంగులు సమకూరితే మరింత మంది అటు వైపు మళ్లుతారనే అంచనాలు పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల

అమ్మ ఒడితో మొదలు

ఎన్నికల హామీలో భాగంగా జగన్ ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తోంది. ఈ పథకంలో తమ పిల్లలను బడికి పంపించే ప్రతీ తల్లి ఖాతాలో రూ. 15 వేల చొప్పున జమ చేశారు.

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే కాకుండా ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వారందరికీ లబ్ది చేకూర్చారు.

మొత్తం 82 లక్షల మంది విద్యార్థులకు గానూ 42,33,098 మంది తల్లుల ఖాతాలకు నగదు బదిలీ జరిగింది. ఈ పథకం కోసం రూ. 6,349 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది..

2019-20 విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే అమలు చేస్తామని తొలుత ప్రకటించడంతో కొందరు తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ బడులకు మార్పించారు.

దాంతో, గత ఏడాది ప్రభుత్వ పాఠశాల్లో కొత్త విద్యార్థుల చేరిక పెరిగింది. 2018-19 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో 70,41,988 విద్యార్థులుండగా 2019-20లో ఆ సంఖ్య భారీగా పెరిగింది.

2,47,151 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చి చేరడం విశేషం. దాంతో మొత్తం పాఠశాల విద్యార్థుల సంఖ్య 72,30,293కి చేరింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల

జగనన్న విద్యా కానుకతో మరో అడుగు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం మరింత పగడ్బందీగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 'జగనన్న గోరుముద్ద' పథకానికి శ్రీకారం చుట్టింది. మధ్యాహ్న భోజనం పథకం ఆయాల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

అదనంగా రూ. 465 కోట్లను వెచ్చించి 36,34,861 మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా మెనూ రూపొందించారు. అందులో బలవర్థకమైన ఆహారం పిల్లలకు అందించే ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.

'జగనన్న విద్యాకానుక' పేరుతో ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం చేపట్టింది. గతం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం వంటివి ఉచితంగా అందిస్తుండగా ఈసారి వాటిని సకాలంలో అందించడంతో పాటుగా అదనంగా మరిన్ని సామాగ్రిని జోడించారు.

స్కూల్ బ్యాగు, మూడు జతల యూనిఫాం క్లాత్, బెల్టు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్‌లు కలిపి ఒకే కిట్‌గా అందించాలని నిర్ణయించారు. కరోనా కారణంగా బడులు తెరవడం వాయిదా పడుతోంది.

ఎప్పుడు తెరిచినా తొలిరోజే ఆ కిట్లను పిల్లలకు అందించేలా ఏర్పాట్లు చేసినట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు బీబీసీతో చెప్పారు.

ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 655 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెబుతున్నారు. 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది.

తల్లిదండ్రులతో సమావేశం అయిన అధికారులు

నాడు- నేడు

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 44,512 ప్రభుత్వ బడులున్నాయి. వాటిని మూడు దశలుగా విభజించారు. తొలి ఏడాది 15,715 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందులో 15.024 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు.

అదే క్రమంలో రాబోయే రెండేళ్లలో రెండు దశలుగా మిగిలిన పాఠశాలలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా తొలి దశ పాఠశాలల కోసం ఇప్పటి వరకూ 1,412 కోట్ల రూపాయలు వ్యయం చేసినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ పథకానికి రూ.15 వేల కోట్లు కేటాయించినట్టు సీఎం జగన్ ప్రకటించారు.

గత ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొన్నటి వేసవి సెలవుల్లో తరగతి గదుల ఆధునీకీకరణ చేపట్టాలని నిర్ణయించారు.

అయితే లాక్‌డౌన్ కారణంగా కొంత ఆటంకం ఏర్పడింది. పాఠశాల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం... జూన్ నుంచి పనులు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా పలుమార్పులు చేస్తున్నారు. తరగతి గదుల నిర్మాణం, పాఠశాలలకు గోడలు నిర్మించడం, నల్లబల్లలు, బెంచీలు సహా మౌలిక వసతులన్నీ ఆధునీకరిస్తున్నారు.

ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య పిల్లలకు అందించే ప్రయత్నంలో భాగంగా కొన్ని బడుల రూపురేఖలు మారుతున్నట్లు కనిపిస్తోంది.

నాడు నేడు

‘కార్పొరేట్ బడులను మించి...’

ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో కొన్ని ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లను మించి కనిపిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అంగీకరిస్తున్నారు. తమ పిల్లలను ఇలాంటి బడుల్లో చదివించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని కూడా చెబుతున్నారు.

ప్రతీ జిల్లాలో కొన్ని స్కూళ్ళను అలా ఎంపిక చేశారు. తమ బడిలో చేస్తున్న ఏర్పాట్లు ఆశ్చర్యపరిచేలా ఉన్నాయని తూర్పు గోదావరి జిల్లా ఇంద్రపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థి తల్లి చెక్కా వేణు అన్నారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ... "మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయిని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నాం. మా అబ్బాయి ఎంపీపీ స్కూల్లో చదువుతున్నాడు. నిరుడితో పోలిస్తే స్కూల్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. చక్కగా రంగులు వేశారు. క్రీడా ప్రాంగణం, ఇతర సదుపాయాలు చాలా బాగున్నాయి. కార్పోరేట్ స్కూల్లో కూడా ఇలాంటి సదుపాయాలు చాలా తక్కువ చోట్ల ఉంటాయి. ఈ బడిలో మా అమ్మాయిని కూడా చదివించాలని అనుకుంటున్నాం. ప్రభుత్వ ప్రయత్నం బాగుంది. మాలాంటి సామాన్యులకు ఎంతో ఉపయోగపడుతుంది" అని అన్నారు.

నాడు నేడు

‘సమూల మార్పులే లక్ష్యం’

ఇన్నాళ్లూ ప్రైవేటు పాఠశాలల హవా పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వ పాఠశాలల వాతావరణమేనని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు అభిప్రాయపడ్డారు.

అరకొర వసతులు, కూలిపోయే భవనాలు, నల్ల బల్లలు, ఫ్యాన్లు, లైట్లు కూడా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారని ఆయన అన్నారు.

అలాంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వ పాఠశాలలను బయటకు తీసుకొచ్చి, సమూల మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో 'మనబడి నాడు నేడు' కూడా ఒకటని ఆయన చెప్పారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "ముందుగా రాష్ట్రంలో ఉన్న పాఠశాలల స్థితిగతులన్నింటినీ 'నాడు 'కింద రికార్డు చేశాం. గత ఆగస్టులో మొత్తం 45,000 పాఠశాలల పరిస్థితుల్నీ చూపే విధంగా దాదాపు ముప్పై లక్షల ఫొటోలు తీసి ఆన్‌లైన్‌లో పొందుపరిచాం. ఇప్పుడు ఆ పాఠశాలల రూపురేఖలు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మొత్తం పాఠశాలల్ని మూడేళ్ళలో అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు వేశాం. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికచేసిన ప్రతి పాఠశాలలోనూ తొమ్మిది రకాల కనీస సౌకర్యాలు కల్పించడానికి అంచనాలు రూపొందించాం. మంచినీటి సరఫరా, బాలబాలికలకు టాయిలెట్లు, ప్రహరీ గోడ, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నీచర్, ఇంగ్లీషు ల్యాబ్, పెయింటింగులు, ఫినిషింగులు. వీటితో పాటు పదవ అంశంగా కిచెన్ షెడ్డు కూడా నిర్మించాలని ఈ మధ్యే నిర్ణయించాం" అని వివరించారు.

కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనులు కొంత నాసిరకంగా ఉంటాయనే అభిప్రాయం నేపథ్యంలో ఈ పనులను కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా తల్లిదండ్రుల ద్వారానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పేరిట దళారులు లేకుండా నేరుగా తల్లిదండ్రులే ఇలా పాఠశాల పనులు చేపట్టడం అనేది దేశంలోనే ఇది మొదటిసారి అని ఆయన తెలిపారు.

‘‘అంచనా వ్యయంలో ముందే ఏడున్నర శాతం నిధులు అడ్వాన్సుగా విడుదల చేశాం. ఆ పనులకి కావలసిన సామగ్రి తల్లిదండ్రుల కమిటీయే కొనుగోలు చేసింది. కూలీలను, మేస్త్రీలనీ, ప్లంబర్లనీ, ఎలక్ట్రీషియన్లనీ కమిటీయే మాట్లాడుకుని పనిలో పెట్టుకుంటుంది. ఏ పనికి ఎటువంటి సామగ్రి వాడాలో, ఎటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ కొనాలో స్పష్టంగా సూచనలు ఇచ్చాం. పనులు జరుగుతుంటే ఎప్పటికప్పుడు అవసరమైన నిధుల్ని వారం వారం ప్రభుత్వం తల్లిదండ్రుల కమిటీలకి విడుదల చేస్తోంది. ఫ్యాన్లు, గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నిచరూ, పెయింటింగులూ మొత్తం రాష్ట్రస్థాయిలోనే టెండర్లు పిలిచి అత్యంత నాణ్యమైన సామగ్రిని రివర్స్ టెండరింగ్ పద్ధతిలో వీలైనంత సరసమైన ధరలకు నిర్ణయించాం. కరోనా కాలంలో కూడా సంతృప్తిగా పనులు జరిగాయి. పనుల్ని దగ్గర్నుంచి చూశాక ప్రస్తుతం దేశవ్యాప్తంగా దిల్లీలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల గురించి మాట్లాడుతున్నారు, కాని రేపటి నుంచీ ఆంధ్రప్రదేశ్ చేపట్టిన సంస్కరణల గురించి దేశం మాట్లాడబోతోంది" అంటూ ధీమా వ్యక్తం చేశారు.

నాడు నేడు

‘చాలా ఒత్తిళ్ళు వచ్చాయి’

'నాడు- నేడు' పనుల విషయంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించారు. కరోనా నేపథ్యంలో అనేక సమస్యలు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ వాటిని పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమించామని చెబుతున్నారు.

మార్కెట్లో అన్ని షాపులు మూతపడడం, రవాణా సదుపాయాలు లేకపోవడం, కూలీలు లభించకపోవడం వంటి అనేక ఆటంకాల మధ్య ఈ పనుల బాధ్యతను తీసుకున్న ఉపాధ్యాయులు సక్రమంగా పూర్తిచేశారని యూటీఎఫ్ నేత కే. కామేశ్వర రావు చెబుతున్నారు.

"నాడు- నేడు పనుల విషయంలో ప్రభుత్వం నుంచి చాలా ఒత్తిడి వచ్చింది. అధికారుల ఒత్తిడి భరించలేక కొందరు ఉపాధ్యాయులకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అయినా ప్రస్తుతం పనులు పూర్తయిన పాఠశాలల్లో పరిస్థితులు బాగా మెరుగుపడ్డాయి. అన్ని స్కూళ్లను అదే స్థాయిలో మారిస్తే ప్రభుత్వ విద్య పూర్తిగా మెరుగుపడుతుంది. మౌలిక సదుపాయాలతో పాటుగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయాలి. గడిచిన రెండేళ్లలో డీఎస్సీ నియామకాలు జరగలేదు. తక్షణం వాటిపై కూడా దృష్టి పెడితే ప్రభుత్వ విద్యారంగం కొత్త పుంతలు తొక్కుతుంది" ఆయన అన్నారు.

‘ప్రైవేటు స్కూళ్ల నుంచి వెళ్లే వారు పెరుగుతున్నారు’

రెండేళ్ళ క్రితం వరకూ ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్లు ఆశాజనకంగా ఉండేవని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని పిఠాపురంలోని హార్వెస్ట్ స్కూల్ కరస్పాండెంట్ వి. సత్యానందరెడ్డి అంటున్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "మేము పదేళ్లుగా స్కూల్ నడుపుతున్నాం. ఏటా మా స్కూల్లో కొత్త అడ్మిషన్లు 200 వరకూ ఉండేవి. గత ఏడాది కొంత తగ్గింది. ఈసారి మరింతగా తగ్గారు. మేము కొత్త విద్యార్థుల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చదువుతున్న వారి పిల్లలను కూడా కొందరు ప్రభుత్వ బడులకు తీసుకెళ్తున్నారు. దీనివల్ల సాధారణ ప్రైవేటు స్కూళ్లకు కష్టం అవుతుంది. కార్పోరేట్ స్కూళ్లకే అడ్మిషన్లు పడిపోతుంటే ఇతర ప్రైవేటు స్కూళ్లు నడపడమే సమస్యగా మారుతుంది. ప్రభుత్వ బడులు బలోపేతం చేయడం మంచిదే గానీ ప్రైవేటు స్కూళ్లపై ఆధారపడిన వారి విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆశిస్తున్నాం" అని అంటున్నారు.

‘ఇంగ్లీష్ మీడియం అమలైతే ఇంకా పెరగవచ్చు’

ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ న్యాయపరమైన సమస్యలతో అది అమలవుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి.

న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోయి, అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి వస్తే ప్రైవేటు స్కూళ్లకు బదులుగా ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపేవారి సంఖ్య ఇంకా పెరుగుతుందని విద్యావేత్త పీవీ రమేష్ అంటున్నారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ.. "ఇంగ్లీష్‌ చదువుల కోసమే చాలామంది సామాన్యులు సైతం అప్పులు చేసి మరీ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. ఓవైపు ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు కల్పించి, ఉపాధ్యాయులను నియమించి, ఇంగ్లీష్‌ బోధన మొదలు పెడితే ఇక అందరూ ప్రభుత్వ బడులకే వస్తారు. ఏపీలో విద్యారంగం మరోసారి మంచి మార్పుల దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పిన రీతిలో అమలు సాగితే పేదలకు మేలు జరుగుతుంది. విద్యారంగం చాలా మెరుగుపడుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)