డిజిటల్ కష్టాలు: ఇంటర్నెట్ ప్రాథమిక హక్కుతో సమానమా? అది లేకుండా సమాన అవకాశాలు సాధించలేమా?

ఫొటో సోర్స్, Namitha Narayanan
- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్
కేరళలో నమిత అనే విద్యార్థికి ఇంట్లో మొబైల్ సిగ్నల్స్ సరిగా రావు. ఇంటర్నెట్ పనిచెయ్యదు. తను చదువుకోవాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి. ఇంటిపైకప్పు దగ్గర సిగ్నల్ సరిగ్గా వస్తోందని గ్రహించి, రోజూ పైకప్పు ఎక్కి అక్కడ కూర్చుని చదువుకుంటోంది. ఆమెలాగే ప్రపంచం నలుములలా లక్షలమంది అవస్థలు పడుతున్నారు.
ఈరోజుల్లో చదువుకోవాలన్నా, ఉద్యోగానికైనా లేదా బంధువులతో, స్నేహితులతో మాట్లాడాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరి. లాక్‌డౌన్ కారణంగా ఎవరి ఇళ్లల్లో వాళ్లు ఉంటూ, మొహాలు చూసుకునే వీలు కూడా లేనప్పుడు ఇంటర్నెట్ కూడా సరిగ్గా పనిచెయ్యకపోతే కష్టమే. ఇలాంటప్పుడు ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఇంటర్నెట్‌ని నిత్యావసరాల్లో చేర్చాల్సిన సమయమొచ్చిందా?
గత మూడు నెలల్లో మీరు ఎంత ఎక్కువగా ఇంటర్నెట్ వాడారు?
కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో ఇంటర్నెట్ ఎంతోమందికి జీవనాధారం అయ్యిందని చెప్పవచ్చు.
లక్షలమంది ఇంటినుంచి పని చేస్తున్నారు. ఏదైనా వైద్య సహాయం కావాలన్నా, కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా ఇంటర్నెట్టే గతి. లాక్‌డౌన్ సమయంలో బయట ప్రపంచంతో సంబంధాలుండాలంటే ఇంటర్నెట్ తప్ప వేరే మార్గం లేదు.
కానీ చాలామందికి సిగ్నల్స్ సరిగ్గా వస్తూ, ఎలాంటి అంతరాయం లేకుండా ఉండే హై స్పీడ్ ఇంటర్నెట్ లభించడం లేదు. కొంతమందికి హై స్పీడ్ కనక్షన్ పెట్టుకునే స్థోమత లేదు, కొంతమందికి స్థోమత ఉన్నా లభ్యం కాని పరిస్థితి.
దీన్నిబట్టి మన జీవితాల్లో ఇంటర్నెట్ ప్రాముఖ్యత ఎంతగా పెరిగిందో తెలుస్తోంది. దీనివలన ఆర్థిక, సామాజిక అసమానతలు, అవి కొందరి జీవితాలను ప్రభావితం చేసే విధానం కూడా తెరపైకి వచ్చాయి.
ఇవన్నీ కూడా సరైన ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండడం అనేది ఒక ప్రాథమిక హక్కుగా మారిందనే వాదనకు బలం చేకూర్చుతున్నాయి.

ఫొటో సోర్స్, Namitha Narayanan
చదువు కష్టాలు
"మా ఇంటిచుట్టుపక్కలా, ఇరుగుపొరుగులో కూడా ప్రయత్నించాను. ఎక్కడా సరైన సిగ్నల్ దొరకలేదు" అంటూ నమితా నారాయణన్ తను పడ్డ అవస్థను గుర్తుచేసుకున్నారు.
20 యేళ్ల కేరళా అమ్మాయి నమిత, మొబైల్, ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా రాక ఏళ్ల తరబడి చాలా కష్టపడ్డారు.
"మాకెప్పుడైనా ఫోన్ కాల్ వస్తే సిగ్నల్ కోసం బయటకి పరిగెత్తేవాళ్లం" అని నమిత చెప్పారు.
తను నివసించే పల్లెటూరిలో ఎక్కువ స్పీడ్ ఉన్న బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనక్షన్ దొరకదు. మొబైల్ ఇంటర్నెటే గతి. సర్వీస్ ప్రొవైడర్స్‌ని మార్చినాగానీ పెద్దగా లాభం లేదు. దేశంలో ఎంతోమందికి దొరకనట్టే ఆమెకు కూడా సరైన నెట్ కనక్షన్ దొరకలేదు.
లాక్‌డౌన్‌లో నమిత పరిస్థితి ఇంకా దిగజారింది. ఎక్కువమంది మొబైల్ ఇంటర్నెట్ మీదే ఆధారపడడంవల్ల కొద్దో గొప్పో వస్తున్న సిగ్నల్స్ కూడా సరిగ్గా రాక పరిస్థితి మరింత దిగజరిపోయింది.
"నేను అటూ ఇటూ పరిగెత్తి ఎన్ని తిప్పలు పడ్డా సరైన సిగ్నల్స్ దొరికేవికాదు."
జూన్ 1వ తేదీనుంచి నమిత్‌కు కాలేజి మొదలైపోయింది. ఆన్‌లైన్ క్లాసులు మొదలుపెట్టారు. కానీ తను క్లాసులు అటెండ్ అవ్వలేకపోయారు.
"సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వలన నాకేమీ కనిపించేది కాదు, వినిపించేది కాదు. టీచర్ ఏం చెప్తున్నారో ఏమీ అర్థమయ్యేది కాదు. చాలా ఒత్తిడికి లోనయ్యేదాన్ని. ఎప్పుడైనా కనక్షన్ వచ్చినాగానీ స్థిరంగా ఉండేది కాదు."
వీడియో ఆపితే ఆడియో సరిగ్గా వినిపిస్తుందేమోనని అలా కూడా ప్రయత్నించారు. అయినా కూడా ఏమీ లాభం ఉండేది కాదు.
"నాలాగే, నా స్నేహితులు కూడా ఇబ్బందిపడ్డారు. కొత్త ఫోన్లు కొనుక్కున్నారు, సర్వీస్ ప్రొవైడర్స్‌ని మార్చారు."
ఇంటిపైకప్పు మీద చదువు
చదువుకోవాలంటే ఇంటర్నెట్ ఒక్కటే నమితకు ఆధారం. లాక్‌డౌన్ కారణంగా తను ట్యూషన్‌కి వెళ్లడంగానీ, లైబ్రరీకి వెళ్లి చదువుకోవడంగానీ చెయ్యలేరు.
"'ఇంటిపైకప్పు దగ్గర సిగ్నల్ రావొచ్చు, ప్రయత్నించు' అని మా నాన్నగారు చెప్పారు. మా ఇంట్లో మామిడికాయలు కోసుకునేందుకు వాడే నిచ్చెన ఉంది. అది ఎక్కి పైకి వెళ్లాను."
"నిజంగానే ఆయన చెప్పినట్టు అక్కడ సిగ్నల్ బాగా వచ్చేది. నేను పాఠాలన్నీ చక్కగా వినగలిగేదాన్ని. నోట్స్ కూడా రాసుకునేదాన్ని." అన్నారు.
రోజూ నాలుగు గంటలపాటూ పైకప్పు మీదే కూర్చుని నమిత పాఠాలు వినేవారు. ఆ ఇంటి పైకప్పు నేలకి 10 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
"నాతోపాటు ఒక గొడుగు కూడా పైకి తీసుకెళ్లేదాన్ని. అప్పుడప్పుడూ వర్షం పడేది". అని ఆమె చెప్పారు.
సివిల్ సర్వీస్‌లో చేరాలన్నది నమిత ధేయం. దానికోసం ఆమె దేశం మొత్తం మీద నిర్వహించే పరీక్షలు రాయాలి. ఇంటర్నెట్ సిగ్నల్స్ సరిగ్గా లేక పరీక్షల కోసం బాగా చదవలేకపోతున్నానని ఆమె బాధపడారు. అన్ని వసతులు ఉండి నగరాల్లో చదువుతున్న విద్యార్థులతో తను పోటీపడలేకపోతానేమోనని సంశయం వ్యక్తం చేసారు.

ఫొటో సోర్స్, Getty Images
కనెక్టివిటీ లాభాలు
నమిత అనుభవాలు కొంత ప్రత్యేకమైనవి. 400 కోట్ల పైచిలుకు జనాభా ఇంటర్నెట్ వాడుతున్నారు. ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు చవగ్గా అందుబాటులో ఉండడంతో ఇంటర్నెట్ వాడకం రికార్డు స్థాయిలో పెరిగింది. ఆర్థిక, సామాజిక లాభాలనెన్నిట్నో కొనితెచ్చింది.
ఉదాహరణకు రైతులు, చేపలుపట్టేవాళ్లు ఇంటర్నెట్ వల్ల లబ్ధి పొందుతున్నారు. వాతావరణం గురించి సమాచారం, పురుగుల మందులు, తెగులు నియంత్రణా పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, మార్కెట్ పరిస్థితులు ఇలా ఎన్నో విషయాలు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇది వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి దోహదపడుతోంది.
మియన్మార్‌లాంటి దేశాల్లో అతి కొద్ది మందికే బ్యాంక్ ఖాతాలుంటాయి. ఇంటర్నెట్ ద్వారా మొబైల్‌లోనే డబ్బులు బదిలీ చేసుకునే సదుపాయంవలన ఎన్నో కుటుంబాలకు డబ్బు ఇవ్వడం, తీసుకోవడం సులువవుతోంది. 2000లలో ఒక సిమ్ కార్డ్ ఖరీదు ఐదువేలు ఉండేది. ఇది ఒక సెంకడ్ హ్యాండ్ కారు ధరతో సమానం. కానీ ఇప్పుడు అది ఉచితంగా లభ్యమవుతోంది. దీనివలన ఆ దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో గణనీయమైన మార్చు కనిపిస్తోంది.
ఇలాంటి సదుపాయాలు ఆకలి, పేదరికం తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, దేశ ప్రజల ఆరోగ్యం మెరుగుపడడానికి, జండర్ సమానత్వం సాధించడానికి ఉపయోగపడతాయని ఐక్యరాజ్యసమితి భావిస్తున్నది.
2025 నాటికి 75% ప్రపంచ జనాభా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వాడగలిగే పరిస్థితి రావాలని ఐక్యరాజ్యసమితి బ్రాడ్‌బ్యాండ్ కమిషన్ భావిస్తున్నది.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ విభజన
అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్ యూనియన్ ప్రకారం, 2019 నాటికి ధనిక దేశాల్లో సుమారు 87% ప్రజలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కానీ వెనుకబడిన దేశాల్లో 19% మాత్రమే ఉంది. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువశాతం మగవారే ఇంటర్నెట్ వాడుతున్నారు. ప్రపంచంవ్యాప్తంగా 58% పురుషులు ఇంటర్నెట్ వాడుతుంటే, 48% మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వాడుతున్నారు. అదనంగా, వెనకబడిన దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం చాలా తక్కువ. అక్కడి ప్రజలు చిన్న చిన్న బిల్లులు కటడానికి కూడా అవస్థపడుతున్నారు.
"సరైన కనక్షన్ లేని, లేదా తక్కువ స్పీడ్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు దూరంగా ఉండి నేర్చుకోవడం, పనిచెయ్యడం కుదరదు. సాంకేతిక నైపుణ్యం పెంచుకుని, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలు పొందే అవకాశాలు తక్కువే! అలాగే బంధువులతోనూ, స్నేహితులతోనూ తరచూ మాట్లాడుతుండడం కూడా కష్టమే!" అని ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్‌లో సీనియర్ స్ట్రాటజీ అడ్వైజర్ గా ఉన్న అలెక్స్ వాంగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక స్థోమత
పైన చెప్పిన రిపోర్ట్ ప్రకారం దాదాపు 7500 లక్షల జనాభాకు మొబైల్ ఇంటర్నెట్ సదుపాయం లేదు. అందుకు ఆర్థిక స్థోమత ఒక ముఖ్య కారణం.
"కనీసం 130 కోట్ల జనాభా ప్రాథమిక స్థాయి మొబైల్ డాటా ప్లాన్ (నెలకు 1జీబీ) కూడా కొనుక్కొలేని స్థితిలో ఉన్నారు" అని వాంగ్ అన్నారు. ది అలయన్స్ ఫర్ అఫర్డబుల్ ఇంటర్నెట్ - ఇది ఒక ప్రపంచ సంకీర్ణ సంఘం - ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ధరలు తగ్గించే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. దేశ సగటు తలసరి ఆదాయంలో 2% కన్నా తక్కువ ధరకు లభించాలని ఆకాంక్షిస్తోంది.
"ఇది సాధించడానికి ఎన్నో మార్గాలున్నాయి. మౌలిక సదుపాయాలు పంచుకోవడం, మార్కెట్ పోటీకి కావలసిన మద్దతు అందించడం, నెట్వర్క్ ఆపరేషన్ ఫీజు తగ్గించడం, ప్రజలకు ఇంటర్నెట్ సౌలభ్యం ఉండేట్లు చూడడంలాంటి అనేక విధానాలను దేశాలు అవలంబించాలి." అని రిసెర్చ్ మేనేజర్ టెడీ వుడ్‌హౌస్ అన్నారు.
"ఈరోజుల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రతికూల పరిస్థితి. వీలైనంత ఎక్కువ జనాభాకు నెట్ వాడే సౌకర్యం కల్పించకపోతే ఇప్పటికే ఉన్న అసమానతలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది." అని బీబీసీతో అన్నారు.
"ఇంటర్నెట్ సదుపాయాన్ని నిత్యావసర వస్తువుగా, ప్రాథమిక హక్కుగా పరిగణించే సమయం ఆసన్నమైంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాథమిక హక్కు
వరల్డ్ వైడ్ వెబ్ (WWW) ని కనుగొన్న టిమ్ బెర్నర్స్-లీ కూడా ఈ అంశంలో దేశాలు తక్షణమే స్పందించి ఇంటర్నెట్ సౌకర్యాలు పెంపొందించే దిశగా విధానాలు రూపొందించాలని పిలుపునిచ్చారు.
"మొట్టమొదటగా మన దృష్టి డిజిటల్ విభజన పూర్తిగా తగ్గించే మార్గాల మీద పెట్టాలి" అని ఈ నెలలో జరిగిన ఐక్యరాజ్యసమితి మీటింగ్‌లో అన్నారు.
కరోనావైరస్ సమయంలో ఇంటర్నెట్ కొన్ని కోట్లమందికి జీవనాధారం అయ్యింది. చదువు, ఉద్యోగం, కుటుంబం, స్నేహితులతో సంబంధాలు కొనసాగించడంలో ముఖ్య పాత్ర వహించింది. కానీ మరి కొన్ని కోట్లమందికి ఆ అవకాశం దక్కలేదు అని బెర్నర్స్-లీ అన్నారు.
"ఈ డిజిటల్ అసమానత, ఇప్పటికే ఉన్న అసమానతలకి తోడయ్యింది. అట్టడుగు వర్గాలవారిని ఇది మరింత ప్రభావితం చేస్తుంది. వెనుకబడిన దేశాల ప్రజలు, తక్కువ ఆదాయం ఉన్నవారు, స్త్రీలు మరింత నష్టపోతారు " అని ఆయన అన్నారు.
డిజిటల్ అసమానతలు తగ్గించే దిశలో బెర్నర్స్-లీ, తన ఫౌండేషన్ ద్వారా ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తున్నారు.
ఆన్‌లైన్ స్వేచ్ఛ మనిషి హక్కు. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది అని 2016 లో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానంలో నొక్కివక్కాణించింది.
ఇంటర్నెట్ వాడకం పెంచడంలో, అది అందరికీ అందే విధంగా ప్రయత్నాలు చెయ్యడంలో మానవ హక్కుల పరిరక్షణ విధానం అవలంబించవలసిన అవసరం ఉంది అని తీర్మానించింది.

ఫొటో సోర్స్, Namitha Narayanan
సమాన అవకాశాలు
నమిత కేరళలోని వాళ్ల ఇంటినుంచీ మాట్లాడుతూ... "ఇంటర్నెట్ చాలా శక్తివంతమైన సాధనం. ఒకసారి కనక్షన్ పోతే ఇంక చదువుకోవడం అసాధ్యం. అందరికీ మంచి హై స్పీడ్ ఉన్న ఇంటర్నెంట్ లభ్యమవ్వాలి. అప్పుడే అందరూ సమానంగా అన్నిట్లోనూ పోటీపడగలుగుతారు."
ఈమధ్య నమిత పరిస్థితి మెరుగయ్యింది. తను ఇంటి పైకప్పు మీద కూర్చుని చదువుకుంటున్న ఫొటో వాళ్ల సోదరి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసారు. అది వైరల్ అయ్యింది. దాంతో ఒక సర్వీస్ ప్రొవైడర్ వాళ్ల ఇంటికి వెళ్లి సిగ్నల్స్ మెరుగుపరిచి, ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే ఏర్పాటు చేసారు. ఇప్పుడు నమితకు తన గదిలోకే సిగ్నల్స్ వస్తున్నాయి. ఆమె తన గదిలో కూర్చునే కాలేజీ పాఠాలు వింటున్నారు. ఏ ఇబ్బందీ లేకుండా చదువుకోగలుగుతున్నారు. వైఫై పెట్టుకోగలిగేంత గొప్ప సిగ్నల్స్ లేకపోయినా మొబైల్‌లో అంతరాయం లేకుండా ఇంటర్నెట్ వస్తోంది. ఏ ఇబ్బందీ లేకుండా తన టీచర్లతో చర్చిస్తూ, ప్రశ్నలడుగుతూ చదువుకోగలగడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసారు.
"ఇప్పుడు నేను లైవ్‌లో పాఠాలు చక్కగా వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. చర్చల్లో కూడా పాల్గొనగలుగుతున్నాను" అని నమిత అన్నారు.
కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తన స్నేహితులకి ఈ సదుపాయం ఇంకా దక్కలేదు. ఋతుపవనాల వలన వర్షాలు పెరిగిపోవడంతో ఇంటిపైకప్పు ఎక్కడం కూడా అందరికీ సాధ్యం కాదు.
ఇవి కూడా చదవండి:
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- ఇంటర్నెట్‌లో అమ్మభాషనే కోరుకుంటున్న 92 శాతం తెలుగువారు: గూగుల్ అధ్యయనంలో వెల్లడి
- శృంగారం సాంకేతిక అభివృద్ధికి ఎలా దోహదపడింది...
- ప్రాణాలు కాపాడిన వీడియోకాల్
- డార్క్ వెబ్: డ్రగ్స్, గన్స్.. అన్నీ డోర్ డెలివరీ!
- పల్లెపల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: మోదీ ప్రభుత్వం ఏంచెప్పింది? ఏం సాధించింది?
- నెట్ సరే.. న్యూట్రాలిటీ సంగతేంటి?
- పోర్న్ వెబ్సైట్లపై ప్రభుత్వం పట్టు బిగించగలదా?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- తెలంగాణలో నియంత్రిత సాగుపై రైతులు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








