నూతన విద్యా విధానం: కొత్తగా వచ్చే మార్పులేంటి?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘ఈ విధానం నిరంతర అభ్యాసంలో భాగంగా విజ్ఞాన సృష్టి, ప్రసారం, ఉపయోగం, అవిచ్ఛిన్న జ్ఞాన వ్యాప్తిల గురించి తెలియజేస్తుంది’’ ఎంతో తాత్త్వికంగా ఉన్న ఈ మాటలు తాజాగా కేంద్రం ఆమోదించిన విద్యా విధాన ప్రతిలో చిట్టచివరి వాక్యాలు.
ఆ వాక్యాలకు తగ్గట్టే ఈ పత్రం విద్యా విధానంలో రావాల్సిన ఎన్నో ఆదర్శాల గురించి చెప్పింది. 2015 నుంచి మొదలైన అధ్యయనం ఇన్నాళ్లకు ఆమోదం పొందింది.
ఆశయాలు, ఆదర్శాలు వినడానికి బావుంటాయి. కానీ అమల్లో, అందులోనూ భారతీయ విద్యా వ్యవస్థలో ఇలాంటి ఆదర్శాల అమలు అంత తేలిక కాదని గత అనుభవాలు చెబుతున్నాయి.
ఇంతకీ అసలు కొత్త పాలసీలో ఏముంది? మీ పిల్లల తలరాత మార్చే చదువుల తీరును కేంద్రం ఎలా మార్చాలనుకుంటోంది?
చదువు అంటే ఇలా ఉండాలి అంటూ మేధావులు తరచూ చెప్పే పరీక్షా విధానం, బోధన పద్ధతులు, సిలబస్ గురించి ఈ పత్రంలో చాలా చెప్పారు. అంతర్జాతీయ స్థాయి విద్య, భారతీయ విలువలు అంటూ సాగిందీ పత్రం. పరీక్షలు, సిలబస్, కోర్సు నిబంధనలు సులభం చేస్తామని చెబుతోంది.
అయితే, కోర్సు నిబంధనలు సులభతరం చేసినంతగా, పరీక్షలను సులభతరం చేస్తే, మార్కులు వేసే వారు చేసే దుర్వినియోగాలను అరికట్టడం ఎలానో ఈ పత్రం చర్చించలేదు.
విద్యలో రెండు ముఖ్యాంశాలు: ఒకటి అకడమిక్. అంటే చెప్పే పాఠాలు, పరీక్షలు విధానం వంటివి. రెండోది అడ్మినిస్ట్రేటివ్ లేదా సిస్టమ్. అంటే కోర్సు కాలం, మధ్యలో మానేస్తే ఎలా, స్కూల్ పెత్తనం ఎవరిది వంటి అంశాలన్నీ వస్తాయి.
తాజా పాలసీ అకడమిక్ అంశాలను టచ్ చేసినా, సిస్టమేటిక్ మార్పులపై ఎక్కువ దృష్టి పెట్టింది.
ఒకప్పుడు కేంద్రానికి సంబంధం లేని, రాష్ట్రాల బాధ్యతగా ఉన్న విద్యను ఇందిరా గాంధీ.. రాష్ట్రం-కేంద్రం ఉమ్మడి వ్యవహారంగా మార్చారు. ఇప్పుడు మోదీ పూర్తిగా కేంద్రం చేతుల్లో ఉంచేలా కొత్త పాలసీ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషణ వినిపిస్తోంది.
రాజీవ్ గాంధీ ఈ శాఖకు మానవ వనరుల శాఖ అని పేరు పెడితే.. మోదీ మళ్లీ విద్యా శాఖగా పేరు మారుస్తున్నారు. ఇంతకీ ఇన్ని మార్పులు సూచించిన, ఇస్రో పూర్వ అధ్యక్షులు కస్తూరి రంగన్ బృందం ఐదేళ్లపాటూ అధ్యయనం చేసి, 2 లక్షల సూచనలు చదవి ఇచ్చిన 484 పేజీల పత్రాల్లో ఏముంది?

పిల్లల చదువుల్లో వచ్చే మార్పులు
- ప్రస్తుతం ఒకటి నుంచి పదో తరగతి, ఆ తరువాత రెండేళ్ల కోర్సు స్థానంలో కింద పద్ధతి వస్తుంది.
- ఫౌండేషన్: 3-8 ఏళ్ల వారు ఒక గ్రూపు - ఐదేళ్ల చదువు - ఎల్‌కేజీ నుంచి 2వ తరగతి
- ప్రిపరేటరీ: 8-11 ఏళ్ల వారు ఒక గ్రూపు - మూడేళ్ల చదువు - 3 నుంచి 5 తరగతులు
- మిడిల్: 11-14 ఏళ్ల వారు ఒక గ్రూపు - మూడేళ్ల చదువు - 6 నుంచి 8 తరగతులు
- సెకండరీ: 14-18 ఏళ్ల వారు ఒక గ్రూపు - నాలుగేళ్ల చదువు - 9 నుంచి 12వ తరగతి
- 10వ తరగతి, 12వ తరగతికి బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి. కానీ ఎస్ఎస్‌సీ బోర్డు, ఇంటర్ బోర్డూ కలసిపోతాయి. ఇవికాక 3, 5, 8వ తరగతి పరీక్షలు వస్తాయి.
- విద్యా హక్కు చట్టంలో 8వ తరగతి వరకూ మాతృభాష విద్య తప్పనిసరికాగా, ఇందులో 5వ తరగతి వరకే చేశారు.
- ఇప్పటి వరకూ 6 నుంచి14 ఏళ్ల లోపు పిల్లలకే తప్పనిసరి విద్య ఉండేది. ఇప్పుడు 3 నుంచి 18 ఏళ్లకు పెంచారు. దీనివల్ల కొత్తగా 3 నుంచి 6ఏళ్ల మధ్య వయసున్న పిల్లలూ, 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉన్న పిల్లల విద్యకు ఏర్పాట్లు చేయాలి.
- దేశమంతా ఉత్తరాది తరహాలో ఇంటర్‌ను 11,12 తరగతులుగా వ్యవహరిస్తారు.
- ఆరో తరగతి నుంచే వృత్తి విద్య (వొకేషనల్ శిక్షణ)
- 2025 నాటికి 5వ తరగతి దాటిన అందరికీ అక్షరాస్యత (ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు 7-8 తరగతుల తరువాత కూడా చదవడం, రాయడం, కూడికలు వంటివి కూడా రావడం లేదు. దీంతో దీనిపై శ్రద్ధ పెట్టాలని)
- 2030 నాటికి 3-18ఏళ్ల వయసులో ఉన్న అందరికీ చదువు
- 2035 నాటికి ఉన్నత విద్య చదివే వయసు ఉన్న వారిలో కనీసం సగం మంది అయినా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరేలా చూడడం.
- ఉపాధ్యాయ శిక్షణ, వారి అర్హతలు జాతీయ స్థాయిలో నిర్ణయించడం, 2030 నాటికి నాలుగేళ్ల బీఈడీ
- ప్రధాని అధ్యక్షతన రాష్ట్రీయ శిక్షా ఆయోగ్
- ఇన్ని విభాగాలుగా ఉన్నంత మాత్రాన ఇన్ని స్కూళ్లు రావు. ఉన్న స్కూళ్లే తరగతులను పెంచుకుంటాయి. జూనియర్ కాలేజీలు కావాలంటే 9వ తరగతి నుంచే మొదలుపెడతాయి. హైస్కూళ్లు 12వ తరగతి వరకూ పెంచుకుంటాయి.
చూడ్డానికి ఈ మార్పులన్నీ చాలా గొప్పగా కనపడుతున్నాయి. వాటి సాధ్యాసాధ్యాలు, వాటి పర్యవసానాల విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

పెద్ద చదువుల్లో వచ్చే మార్పేమిటి
- క్రెడిట్ సిస్టం వస్తుంది. అంటే ఇన్ని పాఠాలు చదివి, పరీక్ష రాస్తే ఇన్ని క్రెడిట్స్ అని ఇస్తారు. మొత్తం నిర్ణీత క్రెడిట్స్ పూర్తి చేస్తే సర్టిఫికెట్ వస్తుంది. ఇది ప్రస్తుతం ఇందిరా గాంధీ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)లో ఉంది.
- కోర్సు మధ్యలో కొంత కాలం మాని తరువాత కొనసాగించడం సులువు అవుతుంది.
- డిగ్రీ నాలుగేళ్లు ఉంటుంది. డిగ్రీ పీజీ కలిపిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు వస్తాయి. ఎంఫిల్ రద్దు.
- లా, మెడిసిన్ తప్పా అన్ని చదువులూ ఒకే బోర్డు కిందకు
- గ్రూపులు కాలేజీ చెప్పినట్టు కాకుండా, విద్యార్థికి నచ్చినట్టు తీసుకోవచ్చు. ఉదాహరణకు ఫిజిక్స్, హిస్టరీ, బోటనీ కూడా కలిపి తీసుకోవచ్చు
- హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వస్తుంది. యూజీసీ ఇక ఉండదు. దీని కింద.. నేషనల్ హయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్నేషనల్ ఎక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్ స్థానంలో), హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్ (నిధులకు), జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, దీని కింద మళ్లీ నేషనల్ హయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫ్రేం వర్క్ కార్యక్రమం ఉంటుంది.
- ప్రస్తుతం ఉన్న వివిధ సంస్థలు (ఐసీఎంఆర్) వంటివి ఆయా సబ్జెక్టుల్లో విద్యకు నాణ్యతా ప్రమాణాలు నిర్దేశించే సంస్థలుగా ఉంటాయి. (స్టాండర్డ్ సెట్టింగ్ బోర్డ్)
- వీసీలకు అధికారాలు పెరుగుతాయి. యూనివర్సిటీల పాలన బోర్డు ఆఫ్ గవర్నర్స్‌కు వెళుతుంది.
- పరిశోధనలు చేసే వారితో వాటికి డబ్బులు ఇచ్చే వారిని నేరుగా కనెక్ట్ చేస్తారు. దీంతో పీహెచ్‌డీల బాధ్యత పెరుగుతుంది.
- మామూలు డిగ్రీకి కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. (నీట్ తరహాలో)

చాలా ప్రమాదకరం
రాజ్యాంగ విలువలు సోషలిజం, సెక్యులరిజం అనే భావాల బయట రూపొందించిన డాక్యుమెంటుగా, విద్యా వ్యాపారం గురించి మాట్లాడని డాక్యుమెంటుగా ఈ పాలసీని వర్ణించారు రమేశ్ పట్నాయక్. ఆయన ఆంధ్ర ప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌గా, ఆల్ ఇండియా ఫోరమ్ ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ సెక్రటేరియట్ మెంబర్‌గా ఉన్నారు.
‘‘విద్యకు నిధులు పెంచుతామన్నారు. కానీ వాటిని ధార్మిక సంస్థలకు ఇస్తామంటున్నారు. ఇక్కడ సేవ చేసే సంస్థల జాబితా కాంగ్రెస్ వారికి వేరుగా, బీజేపీకి వేరుగా, కమ్యూనిస్టులకు వేరుగా ఉంటుంది. అంటే ఆ నిధులు తమకు అనుకూలమైన వారికి మలచుకునే అవకాశం ఉంది. ఇక యూనివర్సిటీల్లో వీసీలకు అసాధారణ అధికారాలు దక్కుతున్నాయి. గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేస్తామంటున్నారు. అందులో అధికార పార్టీ మనుషులుంటారు. వారు తమ భావజాలాలను రుద్దుతారు.’’ అన్నారు రమేశ్ పట్నాయక్.
‘‘డిగ్రీ స్థాయికి కూడా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష అనేది చాలా ప్రమాదకరం. కాలేజీలకు ఎవరు రావాలన్నది కూడా సెంట్రల్ గవర్నమెంటే నిర్ణయిస్తుంది. అన్ని రాష్ట్రాలకూ కలపి ఒకటే పరీక్ష అంటున్నారు. ఇక పరిశోధనలకు డబ్బులిచ్చే వారిని నేరుగా పరిశోధలకు కనెక్ట్ చేయడం, అంటే యూనివర్సిటీని బైపాస్ చేయడం ద్వారా పరిశోధనలపై తమ సొంత భావజాలం ప్రభావం చూపే ప్రమాదం ఉంది.’’ అని రమేశ్ వ్యాఖ్యానించారు.
స్థూలంగా ప్రభుత్వం తనకు అనుకున్న వారిని యూనివర్సిటీ పాలనలో నియమించడం, తన భావజాలానికి తగ్గట్టు యూనివర్సిటీలు, పరిశోధనలూ నడచుకునేలా చేయడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు.
అదే సదర్భంలో ఉన్నత విద్యలో విద్యార్థులు, ఉపాధ్యాయుల పాత్ర గురించి ఈ పత్రం చర్చించలేదంటారు రమేశ్.

ఫొటో సోర్స్, Getty Images
ప్రాథమికంలో అస్పష్టత
ఇక ప్రాథమిక విద్య విషయంలో చాలా ఆదర్శాలు చెప్పింది ఈ పత్రం. ముఖ్యంగా చదువు తప్పనసరి వయసును బాగా పెంచారు.
‘‘ఆరేళ్ల లోపు వారినీ, 14 ఏళ్ల పైన వారినీ కూడా (3-18ఏళ్లు) పిల్లలుగా గుర్తించి వారికీ చదువు తప్పనిసరి చేశారు. అది చాలా మంచి విషయం. కానీ దాన్నెలా అమలు చేస్తారన్న విషయం స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే దేశంవ్యాప్తంగా ఉన్న 15 లక్షల అంగన్‌వాడీలే ఇప్పటి వరకూ 6ఏళ్ల లోపు పిల్లల బాధ్యత చూస్తున్నాయి. ఇప్పుడు 3 నుంచి 6ఏళ్ల మధ్య వయసు పిల్లల బాధ్యత అంగన్‌వాడీల నుంచి బడులకు మారుతుంది. చదువుకు దూరమైన వర్గాలు అంటే అనాథలు, బాల కార్మికులు ఇలాంటి వారి విషయంలో వారేం చేస్తారో చెప్పలేదు. ఈ చట్టంలో దాని గురించి ప్రస్తావనలు ఉన్నాయి కానీ ఎలా చేస్తారన్న స్పష్టత లేదు. అదే సందర్భంలో 3-8 వయసు వారిని ఒక గ్రూపుగా గుర్తించడం ప్రపంచం అంతా ఉన్న విషయం. అది చాలా మంచిది.’’ అన్నారు ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ ఆర్ వెంకట రెడ్డి. పిల్లల చదువులకు సంబంధించిన ఆ సంస్థ తరపున ఆయన పనిచేస్తున్నారు.
తాజా పాలసీలో బడికి వెళ్లీ అక్షరాలు రాయడం కూడా రాని పిల్లల సంగతి గురించి స్పష్టమైన పరిష్కారం చూపలేదని ఆయన అంటున్నారు.
‘‘కోట్ల మంది పిల్లలు పైతరగతులకు వెళుతున్నా కనీసం చదవడం, రాయడం రాదు. వారికి పాఠాలు చెప్పే బాధ్యత స్కూళ్లు, టీచర్లపై కాకుండా, స్వచ్ఛంద కార్యకర్తలపై పెట్టారు. అది సరైంది కాదు’’ అని ఆయన అన్నారు.
‘‘అంతేకాదు, మొత్తంగా కొత్త పాలసీ రాష్ట్రాల నుంచి కేంద్రం వైపు విద్యా వ్యవస్థను నడిపిస్తోంది. దీని వల్ల విద్యపై కేంద్రం పెత్తనం పెరుగుతుంది. వికేంద్రీకరణ కాకుండా కేంద్రీకరణ జరుగుతోంది. స్థానిక ప్రభుత్వాల పాత్ర చెప్పలేదు.’’ అని విమర్శించారు రమేశ్ పట్నాయక్, వెంకటరెడ్డి.
కానీ వీరితో విభేధించారు రాకా సుధాకర్. ఆర్ఎస్ఎస్ సమాచార విభాగానికి చెందిన సీనియర్ కార్యకర్త అయిన రాక సుధాకర్, దేశమంతా ఒకే విధానం - వ్యవస్థ - నాణ్యతా ప్రమాణాలు ఉండడం మంచిదేననే అభిప్రాయం వ్యక్తం చేశారు.
''ఈ విద్యావిధానం సిస్టంలో తెచ్చే మార్పులు చాలా బాగున్నాయి. కానీ కర్రిక్యులమ్ మీద శ్రద్ధ పెట్టలేదని అనిపిస్తోంది అన్నారు'' ప్రస్తుతం భారతదేశంలో 10+2లో చదువుతున్న వారు బయటి దేశాల్లో ఇబ్బంది పడుతున్నారనీ, 5+3+3+4 విధానం ప్రపంచమంతా అనుసరిస్తున్నారు కాబట్టి, అది ఎంతో మేలనీ సుధాకర్ అభిప్రాయపడ్డారు.
''విద్యార్థి ఏ దశలో చదువు మానేసినా అతని చేతికి ఏదో ఒక స్థాయి సర్టిఫికేట్ వచ్చేలా రావడం, పరిస్థితులు బాలేక చదువు మధ్యలో ఆపేసిన వారు, ఆపేసిన దగ్గర నుంచే కొనసాగించేలా ఏర్పాటు చేయడం అభినందనీయం. ఈ పాలసీ ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానాన్ని తీసుకెళుతంది. ప్రాక్టికల్ లెర్నింగ్ కి అవకాశం కల్పిస్తోంది.'' అన్నారు సుధాకర్.
మీడియం విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. మూడు భాషల సూత్రాన్ని అమలు చేస్తూ, నచ్చిన మీడియం ఎంపిక చేసుకోవచ్చు. ఈ పాలసీ ఉపాధ్యాయ శిక్షణ మీద మాట్లాడింది. నిజానికి అది చాలా ముఖ్యమైన విషయం. ఉపాధ్యాయుల్లో నాణ్యత తగ్గింది. అయితే దేశ భక్తిని పెంపొందించేలా, నిజమైన చరిత్రను బోధించేలా కర్రిక్యులమ్ మారిస్తే బావుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరో తరగతి నుంచే వృత్తి విద్య పెట్టడాన్ని తప్పు పడుతున్నారు రమేశ్, వెంకటరెడ్డి. దాన్ని కొంచెం వయసు పెరిగిన తరువాత అందిచాల్సిన కోర్సుగా వారు చెబుతున్నారు. అంతే కాదు, ప్రభుత్వ, కార్పొరేట్ పాఠశాలల్లో ఈ ఒకేషనల్ కోర్సు అమలులో తేడాలు కనుక ఉంటే, అది తల్లితండ్రులు ఆర్థిక పరిస్థితిని బట్టి పిల్లల తలరాత రాసే మరో దుర్మార్గపు విధానంగా మారిపోతుందదని అభిప్రాయపడ్డారు రమేశ్ పట్నాయక్, వెంకటరెడ్డిలు.
అంటే ప్రభుత్వ బడిలో ఆరో తరగతి పిల్లాడికి వడ్రంగి, కుమ్మరి పని గురించి చెబుతారు. మరి అదే విషయం కార్పొరేట్ బడిలో కూడా చెప్తారా? లేదా? అన్నదే సమస్య.
ఆరవ తరగతి నుంచే ఒకేషనల్ కోర్సులు పెట్టడాన్ని సమర్థించారు సుధాకర్. పూర్వం మేం చదువుకున్నప్పుడు ఇది ఉండేది. ఈ పద్ధతి విదేశాల్లో కూడా ఉంది. వారు ప్లంబింగ్ తో సహా అన్నీ నేర్పుతారు.. దానివల్ల విద్యార్థులు రకరకాల వృత్తుల గురించి తెలుసుకుంటారనీ, ఒక వృత్తి గురించి తెలుసుకున్నంత మాత్రాన, అందులోనే పనిచేయాలని లేదనీ ఆయన అన్నారు.
కామన్ స్కూల్ అంటే, ఒక ప్రాంతంలో ఒకే బడి ఉంటుంది, అందరూ అదే బడికి వెళ్లే విధానం గురించి ఇందులో చర్చించకపోవడం దురదృష్టకరం అని అభిప్రాయపడ్డారు వెంకటరెడ్డి.
"విద్యలో ప్రైవేటును మనం ఆపలేకపోయాం. విదేశీ యూనివర్సిటీలు ఆపితే ఇక్కడి వారు విదేశాలకు వెళ్లి చదువుతున్నారు. అంతే తేడా. అదే వాటిని ఇక్కడకు స్వాగతిస్తే ఇక్కడే అభివృద్ధి చెందుతుంది కదా" అని అభిప్రాయపడ్డారు సుధాకర్.
‘‘పరీక్షలను లిబరల్ చేయాలని చూస్తున్నారు. అది మంచిది. కానీ అమలు అంత తేలిక కాదు. ఎందుకంటే, ఇంటర్నల్ మార్కులకు ప్రాధాన్యత ఇస్తే నూటికి నూరు మార్కులూ వేసేస్తున్నారు ప్రైవేటు వారు. దీంతో ఫలితం లేదు.’’ అన్నారు రమేశ్.
పరీక్షలు పద్ధతి ఇప్పుడు బాలేదు. ఏడాది మొత్తం చదివింది ఒక్కరోజులో పరీక్షించడం తప్పు. సెమిస్టర్ విధానం, ఇంటర్నల్ ఎసెస్మెంట్స్ వంటివి జోడించి కొత్త పరీక్షా విధానం మేలు చేస్తుందన్నారు సుధాకర్. కానీ మరింత పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పాలసీ సరే! అమలు చేయాల్సిందేనా?
గతంలో వచ్చిన రెండు విద్యా విధానాలూ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ పార్లమెంటుతో సంబంధం లేకుండా ఆమోదించిన మొదటి విద్యా విధానం ఇదే. ఈ పాలసీ ఆధారంగా చాలా చట్టాలు వస్తాయి. కాబట్టి కచ్చితంగా వాటిని రాష్ట్రాలు పాటించి తీరాలి. దీంతో కేంద్ర నియంత్రణ పెరుగుతుంది.
అయితే ఉన్నత విద్య విషయంలో యూజీసీ వంటి వాటిని రిప్లేస్ చేసే చట్టాలు ఉంటాయి. కానీ ప్రాథమిక విద్యలో మీడియం వంటి అంశాలపై ఈ పాలసీ అమలు విషయంలో కోర్టుల జోక్యం తప్పనిసరి అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
ఉదాహరణకు 2005లో వచ్చిన విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతిలోపు అందరికీ మాతృభాషలోనే చదువు చెప్పాలి. కానీ ఇప్పుడు అది ఎక్కడా అమలు కావడం లేదు. ఆ మాటకొస్తే విద్యా హక్కు చట్టంలోని చాలా అంశాలు అమలు కావడం లేదు.
ప్రభుత్వం వివిధ రంగాల్లో ఇప్పటి వరకూ చేసిన మార్పుల దృష్ట్యా, సంస్థలను రద్దు చేసి, కొత్త వాటిని తేవడం, అకడమిక్ పద్ధతులు మార్చడం వంటివి పక్కాగా జరుగుతాయి. అంటే సిలబస్, కోర్సు సమయం, తరగతుల కొలమానం వంటివి.
కానీ విద్యలో నాణ్యత - ప్రమాణాలు పెంచడం, అంతర్గత పరీక్షల్లో పారదర్శకత పెంచడం, వ్యాపార కోణాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. అన్నిటికీ మించి బడి బయట ఉన్న వారిని బడిలోకి తేవడం, ఆ విద్యార్థులకు ఉపాధ్యాయులు అంకితభావంతో పాఠాలు చెప్పేలా, తీర్చిదిద్దేలా చూడడం అనేదే పెద్ద సవాల్. వీటన్నిటినీ ఎలా సాధిస్తారన్నదానిపైనే విద్యా రంగ విజయం ఆధారపడి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








