కరోనావైరస్: భారత్‌లో డిజిటల్ అసమానతలను బయటపెట్టిన ఆన్‌లైన్ చదువులు

ఫొటో సోర్స్, Getty Images
పంజాబ్‌కు చెందిన అనన్య, మహిమా ఒకే స్కూల్లో, ఒకే క్లాసు చదువుతున్నారు. వాళ్లిద్దరు చాలా తెలివైన పిల్లలని టీచర్లు అంటుంటారు. కానీ ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాక వారిద్దరు ఇండియా డిజిటల్ విభజనలో చెరొక వర్గంలో మిగిలిపోయారు.
అనన్య పట్టణ ప్రాంతంలో ఉంటుంది. ఆమె ఇంట్లో వైఫై సౌకర్యం ఉంది. ఆన్‌లైన్ పాఠాలను చక్కగా అర్ధం చేసుకోగలుగుతుంది. "ఈ అనుభవం బాగుంది. పాఠాలు బాగా అర్ధమవుతున్నాయి. అచ్చం స్కూల్‌లాగే ఉంది'' అని అనన్య బీబీసీకి చెప్పారు.
కానీ గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మహిమ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చాలా ఇబ్బందిగా కూడా ఉంది.
ఆమె ఇంట్లో వైఫై లేదు. చిన్నపట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉండే 4జి మొబైల్ ఇంటర్నెట్ సిగ్నలే ఆమెకు ఆధారం.
ఇంటర్నెట్ సిగ్నల్ అందుకోవాలంటే ఆమె తన ఇంటిపై ఎక్కి కూర్చోవాలి. ఎండలో కూర్చుని వేడిని భరిస్తూ పాఠాలు నేర్చుకోవాలి. అంతా కష్టపడినా ఆమె ఆన్‌లైన్ క్లాసులో జాయిన్ కావడం ఒక్కోసారి ఇబ్బందే అవుతుంది. " కొన్నిసార్లు నేను పాఠాలు వినలేకపోతున్నాను. టీచర్ పంపిన వీడియోలు చూడలేకపోతున్నాను. డౌన్‌లోడ్ చేసుకోవడం పెద్ద సమస్య. కరెంటు కొద్ది గంటలే ఉంటుంది. ఫోన్ ఛార్జింగ్ చేయడం కూడా కుదరడం లేదు.'' అని మహిమ చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
"గత నెల రోజుల్లో నేను మహా అయితే 10-12 క్లాసులను వినగలిగాను. ఇవన్నీ తలచుకుంటే నేను సిలబస్‌లో వెనకబడతానేమోనని అనిపించి ఏడుపొస్తుంది'' అని మహిమ వాపోయింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్‌లైన్ క్లాసులే శరణ్యమని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం, కనెక్టివిటీ ఒక్కోప్రాంతంలో ఒక్కోరకంగా ఉండటం పెద్ద సమస్యగా మారింది.
సుమారు 63 కోట్లమంది సబ్‌స్క్రైబర్లతో ఇంటర్నెట్ కనెక్టివిటీలో ఇండియా ప్రపంచంలోనే రెండో స్థానాన్ని ఆక్రమించింది. అయితే చాలామంది మొబైల్ కనెక్షన్ లేదా వైఫైతోనే ఇంటర్నెట్‌ను పొందగలుగుతున్నారు.
సిగ్నల్ ప్రసారంలో అవాంతరాల కారణంగా వీడియోలను సరిగ్గా చూడలేని పరిస్థితి ఉంది. ఇక విద్యుత్ సౌకర్యంలో లోటుపాట్లను గురించి చెప్పాల్సిన పనిలేదు. చాలాసార్లు ఫోన్‌లో ఛార్జింగ్ లేక క్లాసులు మిస్సయ్యే పరిస్థితి ఉంది.
ఇటీవలే ఈ అంశాలన్నింటినీ వివిధ రాష్ట్రాల అధికారులు కేంద్ర మానవ వనరుల శాఖ దృష్టికి తీసుకెళ్లారు.
జార్ఖండ్‌లో 30%మందికి ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేదని, అలాగే అరుణాచల్ ప్రదేశ్‌తోపాటు కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉందని అధికారులను ఉటంకిస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక వెల్లడించింది.
ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. ఇండియాలో ఆన్‌లైన్ క్లాసుల కోసం కంప్యూటర్‌కు బదులుగా చవకైన మొబైల్ స్మార్ట్ ఫోన్‌లు వాడుతున్నారు. చాలామంది పేదల ఇళ్లలో ఒక్కటే ఫోన్ ఉండటంతో వారి పిల్లలకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అసలు ఇంట్లో ఎలాంటి డివైస్ లేని వారు కూడా చాలామందే ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆన్‌లైన్ క్లాసులు వినడానికి తన ఇంట్లో టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఏవీ లేవన్న బాధతో కేరళకు చెందని ఒక టీనేజ్ అమ్మాయి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడింది. (కేరళలో టీవీల ద్వారా కూడా పాఠాలు బోధిస్తున్నారు)
తాను రోజువారీ కూలి పని చేసుకుంటూ బతుకుతున్నానని, వాటిని ఎలా కొనగలనని ఆ అమ్మాయి తండ్రి ఓ విలేకరి ముందు వాపోయారు. " మా అమ్మాయి ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేనందుకు నిత్యం బాధపడుతుండేది. టీచర్లు ఏదో ఒక మార్గం చూపిస్తారని నేను ఆమెను సముదాయించాను. కానీ నా కూతురు ఆ బాధ నుంచి బైటపడలేదు'' అని తండ్రి వెల్లడించారు.
"అందరూ ఒకేసారి ఈ ఆన్‌లైన్ వాతావరణంలోకి మారాల్సి రావడంతో, ఒక విద్యార్ధి సామర్ధ్యాన్ని తెలుసుకోవడానికి ఆ ఇంట్లో వాడే డివైస్ ఏంటి అన్నది కూడా కీలమైన అంశంగా మారింది'' అని న్యాయవాదిగా, టెక్నాలజీ పాలసీలో పరిశోధకురాలిగా పని చేస్తున్న స్మృతి పర్షీరా బీబీసీతో అన్నారు."ఇంట్లో ఎలాంటి డివైస్‌లు లేని వాళ్లు పూర్తిగా పాఠాలకు దూరమయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు ఎక్కువగా బాధితులయ్యారు'' అని ఆమె అన్నారు.
ఇంటర్నెట్ అందుబాటులో ఉందా లేదా అని కాదు, దాన్ని ఎలా వాడుకోగలుగుతున్నావు అన్నది కూడా సమస్యే అన్నారామె. "ఆన్‌లైన్ క్లాసులను వినడంలో, చూడటంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల మధ్య స్పష్టమైన తేడాలున్నాయి'' అని పర్షీరా అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాయి.
ఆన్‌లైన్ క్లాసులకు వెళ్లలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధిని వ్యవహారంలో, ప్రత్యర్ధులైన రెండు విద్యార్ధి సంఘాలు ఏకమై, స్టూడెంట్స్ అందరికీ టెలీవిజన్ సెట్లు కొనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
"ఇప్పుడు గిరిజన ప్రాంతాలలో కూడా ప్రతి ఇంటికీ కరెంటు ఉంటోంది'' అని ఒక నేత బీబీసీతో అన్నారు. అయితే ఇంటర్నెట్ సౌకర్యం విషయంలో ఉన్న ఇబ్బందులు, వ్యత్యాసాలను ఈ సౌకర్యం పూడ్చలేదు. అందుకే చాలామంది ఆన్‌లైన్ విద్యను వ్యతిరేకిస్తున్నారు. " ఆన్‌లైన్ ద్వారా సరైన విద్య అందదు'' అని అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సీఈవో అనురాగ్ బెహార్ అన్నారు. "సరైన విద్య లేకపోవడం వల్ల అసమానతలు బాగా పెరుగుతాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.
కొందరికి పూటగడవడమే కష్టమని, అలాంటి వారు పిల్లల చదువులు మీద దృష్టి పెట్టలేరని, ఆన్‌లైన్ ద్వారా పాఠాలు చెప్పించడం వృథా అన్నారాయన. "ఇలాంటివేమీ పట్టించుకోకుండా పిల్లలకు చదువులు చెప్పించడం కష్టం'' అని అనురాగ్ బెహార్ స్పష్టం చేశారు.
రిపోర్టింగ్: సాత్ సింగ్, ఇమ్రాన్ ఖురేషీ, అయేషా ఫెరీరా
ఇవి కూడా చదవండి:
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్‌ను అమెరికా ఓ అజేయ శక్తిగా ఎందుకు చూస్తోంది?
- వికాస్ దుబే ఎన్కౌంటర్, దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్.. రెండిటి మధ్య తేడా ఏమిటి?
- వికాస్ దుబే ఎవరు? ఒక రైతు కొడుకు 'గ్యాంగ్‌స్టర్' ఎలా అయ్యాడు?
- వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై ఎన్నెన్నో ప్రశ్నలు... అంతా సినిమా స్క్రిప్టులా ఎలా జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








