కర్ణాటక: కరోనా సాకుతో ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చరిత్రను తొలగిస్తోందా

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్ మహమ్మారి పాఠ్య పుస్తకాల నుంచి చరిత్రను మాయం చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలో ఇలా జరుగుతోంది.

ఆ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక విద్యా విభాగం పాఠ్య పాఠ్యపుస్తకాల నుంచి టిప్పు సుల్తాన్‌ పాఠాన్ని తొలగించింది. దాంతో పాటు శివాజీ, విజయనగర సామ్రాజ్యం, బహమనీ సుల్తానులు, రాజ్యాంగంలోని కొన్ని భాగాలు, ఇస్లాం, క్రైస్తవ మతాలకు సంబంధించిన కొన్ని భాగాలను తొలగించింది.

దీనికి కరోనావైరస్‌ను కారణంగా చూపిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. సాధారణంగా ఆరో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు చదువు పూర్తి చేయడానికి 220 రోజులు పడుతుంది. అది ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల 120 రోజులకు తగ్గిపోయింది.

దీనికి అనుగుణంగా సిలబస్‌ కూడా తగ్గించడం అవసరమైంది.

ఈ చాప్టర్లను ఇప్పుడు ప్రాజెక్ట్ వర్కుకే పరిమితం చేశారు. వీటిని విద్యార్థులు ఇంటి నుంచే చార్టులు లేదా ప్రెజెంటేషన్ ద్వారా పూర్తి చేయవచ్చు.

కర్ణాటక టెక్ట్స్ బుక్ సొసైటీ

ఫొటో సోర్స్, IMRAN QUERESHI/BBC

ఫొటో క్యాప్షన్, కర్ణాటక టెక్ట్స్ బుక్ సొసైటీ

సిలబస్ నుంచి ఏమేం తొలగించారు

9వ తరగతి సాంఘిక శాస్త్రంలో రాజపుత్ర రాజవంశాలు, రాజపుత్రుల భాగస్వామ్యం, తుర్కుల రాక, దిల్లీ సుల్తానుల చాప్టర్లు చెప్పడానికి సాధారణంగా ఆరు క్లాసులు ఉంటాయి. వాటిని ఇప్పుడు రెండుకు తగ్గించారు.

రాజపుత్రులు, దిల్లీ సుల్తానుల గురించి ఆరో తరగతిలోనే చెప్పాం కాబట్టి ఇప్పుడు వాటిని మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అంటోంది.

అలాగే, మొఘలులు, మరాఠాల గురించి బోధించడానికి ఉన్న ఐదు క్లాసులను ఇప్పుడు రెండుకు తగ్గించారు.

వాటిలో మరాఠా రాజ్య ఆవిర్భావం, శివాజీ పాలన, శివాజీ వారసుల పాఠాలను సిలబస్ నుంచి తొలగించారు. ఈ పాఠాలను ఏడో తరగతిలోనే చెప్పామంటున్నారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, PA

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

టిప్పు సుల్తాన్ ఎక్స్‌పర్ట్ టెక్ట్స్ బుక్ కమిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ టీఆర్ చంద్రశేఖర్ బీబీసీతో దీనిపై మాట్లాడారు.

“కరోనా మహమ్మారి వల్ల చాప్టర్లను కుదించి సిలబస్‌ను 30 శాతం తగ్గించడం సబబే. కానీ దాని ప్రభావం ఏ చాప్టర్ మూలాలపైనా పడకూడదు. కానీ, సిలబస్ నుంచి ఒక చాప్టర్‌ను పూర్తిగా తొలగించడం సరికాదు” అన్నారు.

స్కూల్ సిలబస్‌ నుంచి టిప్పు సుల్తాన్‌కు సంబంధించిన చాప్టర్ తొలగించాలని గత ఏఢాది బీజేపీ ఎమ్మెల్యే అపాచ్చు రంజన్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత దీనిపై ఒక కమిటీ వేశారు. ప్రొఫెసర్ టీఆర్ చంద్రశేఖర్ అదే కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు.

స్కూల్ సిలబస్‌లో మైసూర్ చరిత్ర, టిప్పు సుల్తాన్ భాగాన్ని తొలగించలేమని అప్పట్లో ప్రొఫెసర్ చంద్రశేఖర్, కమిటీలోని మిగతా సభ్యులు ప్రభుత్వానికి స్పష్టం చేశారు.

“విద్యార్థులకు చెప్పే సబ్జెక్ట్, వారు క్లాసు మారేకొద్దీ క్రమంగా పెరుగుతుంటుంది. అంటే టిప్పు సుల్తాన్‌ విషయానికే వస్తే, ఆరో తరగతిలో ప్రాథమిక సమాచారమే ఉంటే, ఏడో తరగతిలో ఆ విషయం మరింత వివరంగా చెబుతారు. అలా ఒక్కో తరగతికీ ఆయన యుద్ధాలు, ఏం చేశాడు, పాలన గురించి వివరంగా చెబుతారు” అని చంద్రశేఖర్ చెప్పారు.

"ఆ సమయంలో రాజతంత్రం ఉండేది. ఒక రాజు మరో రాజుతో యుద్ధం చేసేవాడు. ఆ యుద్ధానికి మతానికీ ఎలాంటి సంబంధం ఉండేది కాదు" అన్నారు.

దీనిపై బెంగళూరు ఆర్చ్ బిషప్ పీటర్ మాచాడో కూడాబీబీసీతో మాట్లాడారు.

“ఇస్లాం, క్రైస్తవ మతాల గురించి ఆరో తరగతి పుస్తకాల్లోని చాప్టర్లు తొలగించారని మాకు తెలిసింది. తొమ్మిదో తరగతిలో వాటి గురించి చెప్పామనే తొలగించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు తొమ్మిదో తరగతి సిలబస్‌లో వాటిని తొలగిస్తూ, వీటిని ఆరో తరగతిలోనే చెప్పామంటున్నారు. చూస్తుంటే ఏదో అజెండాతో పనిచేస్తూ మోసం చేస్తున్నట్టు అనిపిస్తోంద”న్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దీనిని ప్రశ్నించడంతో, ప్రభుత్వం ఈ విషయంలో సబ్జెక్టులకు సంబంధించిన కమిటీ అభిప్రాయం తీసుకోవాల్సి వచ్చింది.

“మేం దీని గురించి బుధవారం ఫోన్లో సమాచారం ఇచ్చాం. ఈ విషయంపై ఆగస్టు 3న సమావేశం జరగబోతోంది” అని ప్రొఫెసర్ చంద్రశేఖర్ చెప్పారు.

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

సర్కారు వైఖరి ఎలా ఉంది?

దీనిపై కర్ణాటక టెక్ట్స్ బుక్స్ సొసైటీ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ మాదే గౌడ బీబీసీతో మాట్లాడారు.

“మేం సబ్జెక్టులకు సంబంధించిన కమిటీలతో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పాం. ఏవి తొలగించాలి అని మేం వారిని అడగలేదు. ఇప్పుడు ప్రాథమిక, మాధ్యమిక విద్యా విషయంలో మా మంత్రి సురేష్ కుమార్ దీనిపై నిర్ణయాలను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి దానిని ఆపాలని చెప్పారు”

ఇదే సమాచారాన్ని తాము కర్ణాటక టెక్ట్స్ బుక్ సొసైటీ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించామని వారు తెలిపారు.

“పాఠ్య పుస్తకాల నుంచి ఏ చాప్టర్‌నూ తొలగించడం లేదు. పుస్తకాలు ఇప్పటికే విద్యార్థుల దగ్గరకు చేరుకున్నాయి. వారికి ఇప్పుడు వాటిని ఇంట్లో చదవడమా లేక ప్రాజెక్టులు తయారు చేయాలా అనేదే విషయం” అని గౌడ తెలిపారు.

మరోవైపు, వచ్చే ఏడాది సిలబస్‌లో ఈ చాప్టర్లను చదివించడంలో ఏ లోటూ రానీయమని అధికారులు చెబుతున్నారు.

చరిత్ర చదవడం ఎంత అవసరం?

దీనికి మైసూర్ విశ్వవిద్యాలయంలో చరిత్ర మాజీ ప్రొఫెసర్, టిప్పు సుల్తాన్ అంశాల్లో నిపుణులు, ప్రొఫెసర్ సెబాస్టియన్ జోసెఫ్ బీబీసీతో మాట్లాడారు.

“గతం మన భవిష్యత్తుకు ప్రతిబింబం లాంటిది. అందుకే గతం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మనం మన సమాజాన్ని, మనల్ని దానికి అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. రాజకీయ చరిత్రలు, సైన్స్ మాత్రమే కాకుండా చరిత్ర గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే, అది చాలా విషయాలను మనకు చెబుతుంది” అన్నారు.

“చరిత్రలోని అన్ని విషయాలనూ మనం తెలుసుకునేవరకూ, మనం ఈరోజు ఎక్కడున్నాం, ఇక్కడివరకూ ఎలా చేరుకున్నాం, ఇక ముందు ఏ దిశలో వెళ్లాల్సిన అవసరం ఉంది అనేది మనకు అర్థం కాదు” అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)