‘దిల్ బేచారా’: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆఖరి సినిమా ఎలా ఉంది... - సినిమా రివ్యూ

సుశాంత్ సింగ్ రా‌జ్‌పుత్

ఫొటో సోర్స్, Twitter/TaranAdarsh

    • రచయిత, అజయ్ బ్రహ్మాత్మజ్
    • హోదా, సినీ విశ్లేషకుడు, బీబీసీ కోసం

జాన్ గ్రీన్ రాసిన ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ’ ఇంగ్లిష్ నవలను చదివినవాళ్లు, దాని ఆధారంగా అదే పేరుతో వచ్చిన హాలీవుడ్‌ చిత్రాన్ని చూసినవాళ్లు భారతీయుల్లో ఇప్పటికే కొంతమంది ఉండొచ్చు.

కానీ, వాళ్లకు కూడా ‘దిల్ బేచారా’ చిత్రం కొత్తగా అనిపిస్తుంది.

కొత్త నేపథ్యం, కొత్త పాత్రలతో హిందీ సినీ ప్రేక్షకులకు పరిచయమున్న ప్రేమ కథలాగా రచయితలు శశాంక్ ఖేతాన్, సుప్రతిమ్ సేన్‌గుప్తా దీన్ని మలిచారు.

మరణం సమీపిస్తున్న పరిస్థితుల్లో ప్రధాన పాత్రలు పడే ఆనందం-బాధ, ప్రేమ-ఒత్తిడి, భయం-ఆందోళన, జీవించాలన్న ఆకాంక్షలను స్పృశిస్తూ కథ సాగుతుంది. వర్తమానంలో ఉంటూ, జీవితాన్ని నిండుగా ఆస్వాదిస్తూ బతకాలన్న సందేశం ఇస్తుంది.

సంజనా సంఘీ

ఫొటో సోర్స్, Twitter/sanjanasanghi96

జంషెద్‌పుర్ ఓ ప్రత్యేకమైన నగరం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్లు, భిన్న మతాలు, జాతులు, సంప్రదాయాలకు చెందిన వాళ్లు ఇక్కడుంటారు.

దిగ్గజ పారిశ్రామికవేత్త జంషెట్జీ టాటా స్థాపించిన నగరం ఇది. ఝార్ఖండ్ స్థానికతను ప్రతిబింబిస్తూనే, ఓ చిన్నపాటి కాస్మోపాలిటన్ నగరంలా ఇది కనిపిస్తుంది.

జంషెద్‌పుర్‌లో ఉండే కిజీ (బెంగాలీ), మైనీ (క్రైస్తవుడు), జేపీ (బిహారీ), డాక్టర్ ఝాతోపాటు చిత్రంలోని ఇతర పాత్రలు స్థానిక యాసలో మాట్లాడుతూ వాస్తవానికి దగ్గరగా అనిపిస్తాయి.

‘దిల్ బేచారా’ కథ కన్నా కథనం కొత్తగా ఉంది.

జాంబియాలో ఓ బెంగాలీ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి కిజీ. ఆమెకు థైరాయిడ్ క్యాన్సర్. చిన్న ఆక్సిజన్ సిలిండర్ ఎప్పుడూ ఆమె వెంట ఉండాల్సిందే. ఆ సిలిండర్‌కు ‘పుష్పేంద్ర’ అనే పేరు.

మరణం దగ్గర్లో ఉందని తెలిసిన కిజీ, మిగతా అందరి అమ్మాయిల్లా ఆలోచించదు. ప్రేమ గురించి, జీవితం గురించి ఆమెకు ఆశలు ఉండవు.

తల్లిదండ్రులు తనను చాలా ప్రత్యేకంగా చూసుకుంటున్నా... తన ఆరోగ్య పరిస్థితి కారణంగా కిజీ నిరాశలో కూరుకుపోయి ఉంటుంది.

మైనీకి ఎముకల క్యాన్సర్. కానీ, అతడు ఏ చింతా లేకుండా, జీవితాన్ని ఆనందంగా గడుపుతుంటాడు. మైనీ రజనీకాంత్‌కు వీరాభిమాని.

ఇద్దరు కలుసుకోవడంతో కథ ముందుకు సాగుతుంది.

సుశాంత్ సింగ్ రా‌జ్‌పుత్

ఫొటో సోర్స్, Facebook/Foxstarhindi

‘‘చావుపుట్టుకలను మనం నిర్ణయించుకోలేం. కానీ, ఎలా బతకాలన్నది మాత్రం మనం చేతుల్లోనే ఉంటుంది’ అని మైనీ ఈ సినిమాలో ఓ డైలాగ్ చెబుతాడు.

ఇలా మరణిస్తామని తెలిసినా... నిర్భయంగా, సంతోషంగా బతికే పాత్రలు ఇదివరకు కొన్ని సినిమాల్లో కనిపించాయి.

అయితే, దిల్ బేచారాలో మైనీని చూస్తున్నప్పుడు, ఆ పాత్రను పోషించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిజ జీవితంపైకి మన దృష్టి మళ్లుతుంది. నిండు జీవితాన్ని చూడకుండానే, ఆయన కన్నుమూసిన వాస్తవం మన మదిని తొలుస్తుంది. సుశాంత్ పలికే సంభాషణలు, ఆ విషాదాన్ని గుర్తు చేస్తాయి.

‘దిల్ బేచారా’లో ఓ కొత్తదనం ఉంది. దర్శకుడు ముకేశ్ ఛాబ్రా, రచయితలు పాత్రలకు సెంటిమెంట్ మరీ ఎక్కువగా జోడించలేదు. అతినాటకీయతకు, మెలోడ్రామాకు నటులు కూడా దూరంగా ఉన్నారు.

కిజీ, మైనీ, జేపీ, కిజీ తల్లిదండ్రులు మనం చుట్టూ చూసే మనుషుల్లాగే ఉంటారు. సినిమాలో ఎక్కువ భాగం కిజీ కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మైనీ కుటుంబాన్ని చాలా కొద్దిగా చూపించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలియదు.

కిజీ గురించి ప్రేక్షకులు ఆందోళనపడటం మొదలుపెడతారు. ఆమె కలలు నెరవేరాలని ఆశపడతారు. మైనీ పారిస్ వెళ్లాలని, తనకు ఇష్టమైన సంగీతకారుడు అభిమన్యు వీర్ (సైఫ్ అలీ ఖాన్)ను అతడు కలవాలని ఆశిస్తాం. ఇష్టమైన పాటను అసంపూర్తిగా ఎందుకు మధ్యలోనే వదిలేశాడని అడగాలని కోరుకుంటాం.

కథ సుఖాంతం వైపు వెళ్తుందని అనుకుంటుండగానే, ఓ విషాదకర మలుపు తీసుకుంటుంది.

తెరపై కిజీ, మైనీ పాత్రలను వాటి సీరియస్‌నెస్, సహజత్వం కోల్పోకుండా... సంజనా సంఘీ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చక్కగా పోషించారు.

కిజీలో మొహమాటం, అమాయకత్వాన్ని సంజనా బాగా చూపించారు. సుశాంత్ తన నటనతో మైనీ పాత్రకు జీవం పోశారు.

కిజీ, మైనీల రొమాన్స్‌కు పారిస్ మరింత అందాన్ని అద్దింది.

సుశాంత్ సింగ్ రా‌జ్‌పుత్

ఫొటో సోర్స్, Getty Images

‘శుద్ధ్ దేసీ రొమాన్స్’, ‘బ్యోమకేశ్ బక్షీ’, ‘కేదార్‌నాథ్’, ‘సోనాచిడియా’, ‘ఛిఛోరే’ల తర్వాత మళ్లీ ‘దిల్ బేచారా’లో తన నటనలో సుశాంత్ కొత్త పార్శ్వాలను, తీవ్రతను చూపించారు.

కిజీ తల్లిదండ్రుల పాత్రలకు స్వస్తికా బెనర్జీ, శాశ్వతా చటర్జీలు బాగా నప్పారు.

క్యాన్సర్ బాధను సుశాంత్ సంభాషణలేవీ లేకుండా, ముఖంలో హావభావాలతోనే ఓ సీన్‌లో అద్భుతంగా పలికించారు. క్యాన్సర్ బాధను అనుభవించినవారికి, అలాంటివారిని దగ్గరగా చూసినవారికి ఇది బాగా అర్థమవుతుంది.

క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల బాధ, వారి ఆత్మీయులు అనుభవించే వేదనను అర్థం చేసుకుంటూ, సినిమాలో క్యాన్సర్ వ్యాధి గురించి బాగా చూపించారు.

కొంత విరామం తర్వాత ఏఆర్ రెహమాన్ మళ్లీ హిందీ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాకు ఆయన అందించిన పాటలు, సంగీతం చాలా బాగున్నాయి.

ఈ సినిమాలో టైటిల్ సాంగ్‌ మొత్తాన్నీ... స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన సుశాంత్ సింగ్, ఒకే టేక్‌లో చేశారు. కెమెరామెన్ సేతు సాయంతో కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ దీన్ని చక్కగా తెరకెక్కించారు.

పారిస్ అందాలను కూడా సేతు బాగా చూపించారు. సినిమాలో ఇవి ప్రత్యేకంగా నిలిచాయి.

కొన్ని లోపాలున్నా, దర్శకుడిగా తొలి చిత్రంతోనే ముకేశ్ ఛాబ్రా ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)