అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?

అక్షరాస్యత.. బ్లాక్ బోర్డుపై తెలుగు అక్షరాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2015 సెప్టెంబరు: ''2019 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధిస్తాం'' - అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

2018 జనవరి: ''2019 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో 100 శాతం అక్షరాస్యత సాధిస్తాం.'' - అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

2019 సెప్టెంబరు: ''వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో వంద శాతం అక్షరాస్యత సాధిస్తాం.'' - ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి.

ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత గత సీఎంలు ఇచ్చిన, ప్రస్తుత సీఎం ఇస్తోన్న హామీలు ఇవి.

కానీ, ఆంధ్ర రాష్ట్రం అక్షరాస్యత విషయంలో దేశంలోనే చిట్టచివర స్థానంలో ఉందన్నది తాజా సర్వే సారాంశం.

అవును. నిజమే. భారతదేశంలోని అత్యంత వెనుకబడ్డ రాష్ట్రంగా పేరున్న బిహార్ కంటే, ఆంధ్రా జనమే తక్కువ చదువుకున్నారని చెబుతోంది తాజా కేంద్ర ప్రభుత్వ సర్వే ఒకటి. అందుకే తరచూ ఆంధ్రా ముఖ్యమంత్రులు చదువుల్లో రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతాం అని ప్రకటిస్తుంటారు. కానీ వాస్తవం అందనంత దూరంలో ఉంది.

నేషనల్ శాంపిల్ సర్వే 2017-18 సంవత్సరానికి గానూ విద్యారంగంపై చేసిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎప్పటిలానే కేరళ అక్షరాస్యతలో దేశంలో ముందుండగా, ఆంధ్ర రాష్ట్రం చిట్ట చివర స్థానంలో ఉంది. ఈ సర్వే ప్రకారం ఆంధ్రలో 66.4 శాతం మంది అక్షరాస్యులు ఉండగా, బిహార్లో 70.9 శాతం ఉన్నారు. తెలంగాణలో 72.8 శాతం ఉన్నారు.

ఆర్థికంగా బాగా వెనకబడ్డవిగా చెప్పుకునే ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్.. ఈ నాలుగు రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యతలో వెనుకబడే ఉంది. ఈ సర్వే ప్రకారం జాతీయ అక్షరాస్యత శాతం 77.7 శాతం. దాని కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడే ఉంది.

పాఠశాల విద్యార్థులతో చంద్రబాబు నాయుడు

ఫొటో సోర్స్, facebook/tdp.ncbn.official

జాతీయ శాంపిల్ సర్వే 75వ విడతలో భాగంగా 2017 జూలై నుంచి 2018 జూన్ మధ్య జరిగిందీ సర్వే. దేశం మొత్తం కలిపి 8 వేల 97 గ్రామాలు, 6 వేల 188 పట్ణణ, నగర ప్రాంతాల్లో ఈ సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న మొత్తం జనాభా 5 లక్షల 13 వేలు. ఆంధ్రప్రదేశ్‌లో 4206 కుటుంబాలపై, తెలంగాణలో 3642 కుటుంబాలపై సర్వే చేశారు. హౌజ్ హోల్డ్ సోషల్ కన్జంప్షన్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా పేరుతో చేసిన ఈ సర్వేపై 1500 పేజీల నివేదకను విడుదల చేసింది ప్రభుత్వం.

ఈ సర్వే ప్రకారం 15 ఏళ్లు దాటి అసలు చదువుకోని వారి శాతం కూడా ఏపీలో 38.7, తెలంగాణలో 31.7 ఉంది. ఈ విషయంలో ఆంధ్ర తెలంగాణలు, బిహార్, రాజస్థాన్, రాష్ట్రాలకు దగ్గరగా, వాటి కంటే కింది స్థానంలో ఉన్నాయి. అసలు చదువుకోని గ్రామీణ పురుషుల విషయంలో అయితే దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనంత ఎక్కువ మంది ఆంధ్ర, తెలంగాణలో ఉన్నారు. ఈ విషయంలో బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కంటే పది శాతం ఎక్కువ ఆంధ్ర, తెలంగాణలో ఉన్నారు. స్త్రీ-పురుషలను కలిపి చూసినా లెక్కల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలే దారుణంగా ఉన్నాయి. ఆంధ్రలో ఏకంగా 45 శాతం మంది అసలు ఎప్పుడూ చదువుకోలేదని ఈ సర్వే చెబుతోంది.

విద్యార్థితో జగన్

ఫొటో సోర్స్, facebook/ysrcpofficial

సెన్సస్ వర్సెస్ సర్వే:

అయితే ఈ గణాంకాలు విషయంలో ఒక సమస్య ఉంది. సాధారణంగా అక్షరాస్యతను జనాభా లెక్కల సమయంలోనే లెక్కిస్తారు. జనాభా లెక్కల్లో భాగంగా ప్రతి ఇంటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తారు. తప్పులు జరిగే అవకాశం తక్కువ. కానీ తాజా గణాంకాలు అలా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ తిరిగి సేకరించినవి కావు. ఇది సర్వే మాత్రమే.

అంటే 130 కోట్ల జనాభాలో కేవలం 5 లక్షల మందిపై చేసిన సర్వే ఆధారంగా ఈ గణాంకాలు వచ్చాయి. వీటితో పోలిస్తే జనాభా లెక్కల సమయంలో వచ్చే గణాంకాలకు కచ్చితత్త్వం ఎక్కువ.

అలాగని వీటిని పూర్తిగా తీసిపారేయలేం. ఎందుకంటే, అక్షరాస్యత విషయంలో 2011 జనాభా లెక్కలతో పోల్చినప్పుడు తాజా సర్వే లెక్కల్లో పెద్ద తేడా ఏమీ రాలేదు.

ఎందుకంటే, 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా అక్షరాస్యతలో ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే ఉంది. ఆ జనాభా లెక్కల్లో కొన్ని చిన్న చిన్న తేడాలు ఉన్నప్పటికీ స్థూలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.02 శాతం. అంతకు ముందు అంటే 2001లో 60.47 శాతం అక్షరాస్యత ఉండేది. అదే ఏడాది జాతీయ అక్షరాస్యత 74 శాతం ఉంది. నిజానికి అప్పుడు బిహార్ ఆంధ్ర ప్రదేశ్ కంటే వెనుకబడే ఉంది.

సర్వే శాంపిల్ చిన్నదే అయినప్పటికీ ఫలితాలు వాస్తవ దూరంగా లేవంటున్నారు విద్యా రంగంలో కృషి చేస్తోన్న నిపుణులు.

''ఈ లెక్కల్లో రాష్ట్రాలేవో తప్పు చెప్పాయి అనుకోవడానికి లేదు. ఇది శాంపిల్ సర్వే కాబట్టి సమాచారాన్ని ఎవరూ వక్రీకరించే ప్రసక్తి ఉండకపోవచ్చు'' అన్నారు విద్యావేత్త రమేశ్ పట్నాయక్.

పాఠశాల బాలిక

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, ఎన్ఎస్ఎస్ నిర్వచనం ప్రకారం ఏదైనా భాషలో ఒక సరళమైన సందేశాన్ని చదవి, రాయగలిగితే అక్షరాస్యుల కింద లెక్క. దీనికి డిగ్రీలు, సర్టిఫికేట్లతో పనిలేదు

ఆంధ్రా ఎందుకు వెనుకబడింది?

ప్రధానంగా పిల్లలను బడిలో చదువుకునేలా చేయడం, పెద్దలకు వయోజన విద్య కార్యక్రమాలు లేకపోవడం, ఈ రెండూ అక్షరాస్యత పెరగకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు నిపుణులు.

''మన రాష్ట్రాల్లో ముందు నుంచీ పాఠశాల విద్య నిర్లక్ష్యం చేశారు. ఈ సర్వేలో వచ్చిన నిరక్షరాస్యులంతా స్కూల్ డ్రాపౌట్స్ కాదు, పుష్ అవుట్స్ అనాలి. అంటే వాళ్లకై వాళ్లు మానేసిన వారు కాదు. పరిస్థితుల ప్రభావం, ప్రభుత్వ నిర్లక్ష్యాలతో బడి నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిన వారే. మన దగ్గర పేరుకే తప్పనిసరి విద్య ఉంది. వాస్తవానికి అది అమలు కాదు. విదేశాల్లో చేపట్టినంత శ్రద్ధగా మనం ఇక్కడ విద్యా రంగంలో కార్యక్రమాలు చేయం. అంత ఖర్చూ పెట్టం. ఇలా స్కూల్ నుంచి మధ్యలో బయటకు వచ్చిన వారి నుంచి ఈ నిరక్షరాస్యత మొదలవుతుంది'' అన్నారు ఎంవి ఫౌండేషన్ కన్వీనర్ వెంకట రెడ్డి.

''అక్షరాస్యత పెంచడం కోసం గత దశాబ్దంలో ప్రత్యేక కృషి జరగలేదు. పదిహేను, ఇరవై ఏళ్ళ క్రితం ప్రత్యేక కార్యక్రమాలు ఉండేవి. ఇప్పుడవన్నీ ఏమీ లేవు. పార్టీలతో సంబంధం లేకుండా వయోజన విద్యా కార్యక్రమాలు నడిచేవి. ఇప్పుడు రద్దయ్యాయి'' అన్నారు విద్యావేత్త రమేశ్ పట్నాయక్.

ప్రపంచ తెలుగు మహాసభలు

ఫొటో సోర్స్, facebook

వయోజన విద్య:

పిల్లలు బడి మానకుండా వచ్చేలా చూడడం ఒకటి అయితే, పెద్దలకు చదువు చెప్పడం రెండో సమస్య. పూర్వం జాతీయ వయోజనుల అక్షరాస్యత పథకం ఉండేది. రెండు దశాబ్దాల క్రితం కూడా అక్షర జ్యోతి, అక్షర గోదావరి, అక్షర క్రాంతి వంటి పేర్లతో వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పుడా పరిస్థితిలేదు.

''బడి వయసు దాటిన వారి కోసం వయోజన విద్య పథకాలు ఉండాలి. ఇప్పుడు అసలు ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడమే లేదు. స్వతంత్ర్యం వచ్చిన తరువాత నుంచీ ఈ పథకం ఉంది. అప్పట్లో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో వీటిని అమలు చేసేవారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు అంతర్జాతీయంగా అప్పులిచ్చే సంస్థల ఒత్తిడితో అక్షరాస్యత కార్యక్రమంపై శ్రద్ధ పెట్టారు. రాను రాను వాటి ప్రాధాన్యత తగ్గించారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు మొత్తానికి వదిలేశారు'' అన్నారు వెంకట రెడ్డి.

ఉదాహరణకు బ్రెజిల్ వంటి దేశాలు వయోజన విద్య కోసం పెద్ద వారికి జీతాలు, కూలీ ఇచ్చి మరీ పాఠాలు చెప్పాయి. కేరళలో పార్టీలకతీతంగా ప్రభుత్వాలు సంస్థాగత విద్యపై శ్రద్ధ పెట్టారు.

''అక్షరాస్యత పెరగాలంటే దానికి ఒకే పరిష్కారం, ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాలు నిర్వహించాలి. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు కాకుండా, ధృడ నిశ్చయంతో ప్రయత్నం చేయాలి. చదవడం, రాయడం రాకపోతే ఇబ్బందే, అది మనకు అవసరం అన్న భావన అందరిలో కలిగించాలి. అప్పుడే సాధ్యపడుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న సామాజకి రాజకీయ పరిస్థితుల్లో చదువు తప్పనిసరి అవసరం అన్న భావన చాలా మందిలో లేదు. అదే సందర్భంలో కొన్ని రాష్ట్రాలు ఈ విషయంపై శ్రద్ధ పెట్టాయి'' అన్నారు రమేశ్ పట్నాయక్.

2017-18 నాటి యునెస్కో లెక్కల ప్రకారం ప్రపంచంలో చదువడం రాయడం రాని వారిలో 35 శాతం ఒక్క భారతదేశంలోనే ఉన్నారు.

ఎన్ఎస్ఎస్ నిర్వచనం ప్రకారం ఏదైనా భాషలో ఒక సరళమైన సందేశాన్ని చదవి, రాయగలిగితే అక్షరాస్యుల కింద లెక్క. దీనికి డిగ్రీలు, సర్టిఫికేట్లతో పనిలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)