ఒక ఏకే-47కు రెండు ఆవులు... బందిపోట్లకు నైజీరియా ప్రభుత్వం బంపర్ ఆఫర్

నైజీరియా

ఫొటో సోర్స్, REUTERS/Agustin Marcarian

నైజీరియా నైరుతి ప్రాంతంలోని జంఫారాలో లొంగిపోయిన బందిపోట్లు ఒక ఏకే-47 రైఫిల్‌ అప్పగిస్తే, బదులుగా అధికారులు వారికి రెండు ఆవులు ఇస్తున్నారు.

వారంతా నేర జీవితం వదిలి బాధ్యతాయుతమైన పౌరుల్లా సాధారణ జీవితం గడిపడానికి ప్రోత్సహించేలా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తోందని జంఫారా గవర్నర్ బోలో మటావాల్లే చెప్పారు.

మోటార్ సైకిళ్లపై దూసుకెళ్లే ఈ దోపిడి దొంగలు ఆ ప్రాంతంలో కల్లోలం సృష్టిస్తున్నారు.

రాష్ట్రంలోని ఫులానీ పశువల కాపరుల సమాజం ఆవులను చాలా విలువైనవిగా భావిస్తుంది. ఈ దోపిడీల వెనుక వారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను వారు కొట్టిపారేస్తున్నారు. దోపిడీలకు మేమే బాధితులం అవుతున్నామని చెబుతున్నారు.

ఉత్తర నైజీరియాలో సగటున ఒక ఆవు ధర లక్ష నాయరా(19,330 రూపాయలు) ఉంటుంది. బ్లాక్ మార్కెట్‌లో ఒక ఏకే-47 రైఫిల్ 5 లక్షల నాయరా(96 వేల రూపాయలు) పలుకుతుందని బీబీసీ ప్రతినిధి మన్సూర్ బకర్ చెప్పారు.

పశువుల మార్కెట్లో నైజీరియన్లు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, పశువుల మార్కెట్లో నైజీరియన్లు

ఈ బందిపోట్లు ఏం చేస్తున్నారు

బందిపోట్లు లొంగిపోవాలని గవర్నర్ మటావాల్లే ఒక ప్రకటన విడుదల చేశారు.

“ప్రస్తుతం పశ్చాత్తాపంతో ఉన్న ఈ బందిపోట్లు మొదట తమ ఆవులకు బదులు తుపాకులు కొన్నారు. కానీ, ఇప్పుడు వారు ఆ నేరాల నుంచి విముక్తి కావాలనుకుంటున్నారు. ఏకే-47 రైఫిల్ తీసుకొచ్చి మాకు అప్పగించండి, దానికి బదులు రెండు ఆవులు తీసుకెళ్లండి అని మేం వారికి అపీల్ చేశాం. ఈ పథకం వారిని ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.

ఈ దోపిడి దొంగలు దట్టమైన అడవుల్లోనుంచి తమ నెట్‌వర్క్ నడిపిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో దోపిడీలు చేస్తుంటారు. వీళ్లు తరచూ షాపులు, పశువులు, ధాన్యం దోచుకుంటుంటారు. డబ్బు కోసం కిడ్నాప్‌లు కూడా చేస్తుంటారు.

జంఫారాలో ఇటీవల జరిగిన ఒక దాడిలో సాయుధ బందిపోట్లు టలాటా మఫారాలో 21 మందిని కాల్చి చంపారు.

వీరి దాడుల్లో గత పదేళ్లలో కెబ్బీ, సోకోట్, జంఫారా, పొరుగు దేశమైన నీజేర్‌లో 8 వేల మందికి పైగా చనిపోయారని ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ గణాంకాలు చెబుతున్నాయి.

ఇక్కడి వనరుల కోసం ఫులానీ పశువుల కాపరులు, రైతుల మధ్య దశాబ్దాల నుంచీ ఉన్న శత్రుత్వమే ఈ దాడులకు కారణం అని చెబుతున్నారు.

జంఫారాలో ఎక్కువ మంది వ్యవసాయం చేస్తుంటారు. ఈ రాష్ట్రానికి ‘వ్యవసాయం మన గౌరవం’ అనే నినాదం కూడా ఉంది.

అడవుల్లో బందిపోట్ల స్థావరాలను కూడా తొలగిస్తామని గవర్నర్ చెబుతున్నారు.

నైజీరియాలో బందిపోట్ల దోపిడీలు
ఫొటో క్యాప్షన్, నైజీరియాలో బందిపోట్ల దోపిడీలు

జంఫారా గురించి మరింత సమాచారం

  • 2016 గణాంకాల ప్రకారం జంఫారా జనాభా సుమారు 45 లక్షలు
  • ఇక్కడ 67.5 శాతం మంది పేదరికంలో ఉన్నారు.
  • రాష్ట్రంలో అక్షరాస్యత 54.7 శాతం ఉంది.
  • రాష్ట్ర నినాదం ‘వ్యవసాయం మన గౌరవం’
  • ఇక్కడ ఎక్కువగా హౌజా, ఫులానీ సమాజాల వారే నివసిస్తున్నారు.
  • ఇక్కడ ఎక్కువ మంది ఇస్లాం మతాన్ని విశ్వసిస్తారు.
  • 2000 సంవత్సరంలో షరియా చట్టాన్ని మళ్లీ అమలు చేసిన నైజీరియా తొలి రాష్ట్రం ఇదే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)