‘పెట్టుబడుల వేటగాడు ముఖేశ్ అంబానీ’ 5జీ నిర్ణయం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

ముఖేశ్ అంబానీ

ఫొటో సోర్స్, EPA

రిలయన్స్‌ సంస్థల డిజిటల్‌ వ్యాపారంలో అడుగుపెట్టిన మరో విదేశీ సంస్థగా అమెరికా టెక్‌ దిగ్గజం గూగుల్‌ నిలిచింది.

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ 4.5 బిలియన్‌ డాలర్లను (3.6 బిలియన్‌ యూరోలు) వెచ్చించి రిలయన్స్‌ జియోలో 7.7శాతం వాటాను కొనబోతున్నట్లు ప్రకటించింది.

రాబోయే రోజుల్లో రెండుసంస్థలు కలిసి 4జి, 5జి నెట్‌వర్క్‌లకు అవసరమైన ఫోన్‌లను అభివృద్ధి చేస్తామని రిలయన్స్‌ సంస్థల అధిపతి ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.

ఫేస్‌బుక్‌, ఇంటెల్‌, క్వాల్కామ్ తర్వాత రిలయన్స్‌లో పెట్టుబడులు పెడుతున్న కంపెనీల జాబితాలో గూగుల్‌ కూడా చేరింది.

"సమాచారం కోసం కోట్లాది భారతీయులు గూగుల్ మీద ఆధార పడుతున్నారు. గూగుల్‌ జియోతో జత కలవడంతో భవిష్యత్తులో మరిన్నిఆవిష్కరణలుంటాయి '' అని ఒక ప్రకటనలో ఇన్వెస్టర్లకు వివరించారు ముకేశ్‌ అంబానీ.

"ఇండియాలో డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ వేగంగా కొనసాగుతోంది. ఇందుకు అవసరమైన డిజిటల్‌ ఉత్పత్తుల తయారీకి ఈ ట్రెండ్ మమ్మల్ని ప్రోత్సహిస్తోంది'' అని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ వ్యాఖ్యానించారు.

రాబోయే ఐదు నుంచి ఏడేళ్ల కాలంలో ఇండియాలో 10బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టబోతున్నామని గూగుల్ ఈ మధ్యనే ప్రకటించింది.

ఫేస్‌బుక్‌ ఈ ఏడాది ఏప్రిల్‌లో 5.7 బిలియన్‌ డాలర్లు వెచ్చించి రిలయన్స్‌ జియోలో 9.99శాతం వాటాను కొనుగోలు చేసింది.

అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు ఇంటెల్, క్వాల్కామ్‌లు ఇప్పటికే రిలయన్స్‌లో పెట్టుబడులు పెట్టాయి.

రిలయన్స్ జియో

ఫొటో సోర్స్, Getty Images

Presentational grey line

‘పెట్టుబడుల వేటగాడు ముఖేశ్ అంబానీ’

అరుణోదయ్‌ ముఖర్జీ, బీబీసీ న్యూస్‌, దిల్లీ

ముకేశ్ అంబానీ పెట్టుబడుల వేటగాడు. గత మూడు నెలల కాలంలో ఆయన 11మంది భారీ ఇన్వెస్టర్లను ఆకర్షించి తన సంస్థలోకి 20బిలియన్‌ డాలర్ల సొమ్మును రాబట్టగలిగారు.

ఈ మొత్తం ద్వారా ఆయన 21బిలియన్‌ డాలర్ల సంస్థ అప్పులను తీర్చడమే కాకుండా ఈ-కామర్స్‌ రంగంలో దిగ్గజాలైన అమెజాన్‌లాంటి సంస్థలకు దీటుగా ఇండియాలో విస్తరించాలని భావిస్తున్నారు.

ఫేస్‌బుక్‌, వాట్సప్‌లకున్న 40 కోట్లమంది కస్టమర్లను దేశంలోని చిల్లర దుకాణాలకు అనుసంధానం చేయడం ద్వారా తన రిలయన్స్‌ మార్ట్‌ను మరింత విస్తరించాలని అంబానీ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఏప్రిల్‌ నెలలో ఫేస్‌బుక్‌ సంస్థ 6బిలియన్‌ డాలర్ల పెట్టుబడిని రిలయన్స్‌లో పెట్టడనికి ముందుకు రావడం చర్చనీయాంశంగా మారింది.

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్జానంతో తమ కంపెనీ 5జి నెట్‌వర్క్‌ను సిద్ధం చేసిందని ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. దీనిని రెండు కోణాల్లో చూడొచ్చు.

  • మొదటిది- ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదిక ఆత్మనిర్భర భారత్‌ ఆలోచనకు దగ్గరగా ఉంది.
  • రెండోది- చైనా దిగ్గజ కంపెనీ హువావే సంస్థ భారత్‌లో 5జి విస్తరణ ప్రయత్నాలకు ఇది గండికొడుతుంది.

ఇటీవల సరిహద్దుల్లో జరిగిన ఘర్షణ కారణంగా చైనాతో వ్యాపార సంబంధాలను సమీక్షించాలని భారత్‌ భావిస్తోంది.

ఇండియాలో అత్యంత వేగంగా విస్తరించిన మొబైల్‌ నెట్‌వర్క్‌గా మారిన రిలయన్స్‌ జియో గత సంవత్సరమే నంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది.

Presentational grey line

2016 సెప్టెంబర్‌లో కార్యక్రమాలు ప్రారంభించిన రిలయన్స్‌ జియో, సుమారు 40 కోట్లమంది సబ్‌స్క్రైబర్లను సాధించి రికార్డు సృష్టించింది. రాబోయే మూడేళ్లలో 50 కోట్ల కస్టమర్లకు చేరువ కావాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

దేశంలో కిరాణ సరుకులను ఇంటింటికి చేర్చే మార్కెటింగ్‌ వ్యవస్థను సిద్ధం చేస్తామని జనవరిలో రిలయన్స్‌ ప్రకటించింది. ఇది ఇండియాలో అమెజాన్‌కు పోటీ సంస్థ కానుంది.

మార్కెట్‌ విస్తరణకు ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయని అమెరికా టెక్నాలజీ కంపెనీలు భావిస్తున్నాయి. 2022నాటికి ఇంటర్నెట్ యూజర్లు 85కోట్లు దాటే అవకాశం ఉందని ప్రైస్‌వాటర్‌హౌస్‌ కూపర్‌ సంస్థ అంచనా వేసింది.

జియో మాతృసంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అధిపతి అయిన ముకేశ్‌ అంబాని ప్రస్తుతం ప్రపంచ కోటీశ్వరులలో 9వ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ మేగజైన్‌ అంచనాల ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ 68.7 బిలియన్‌ డాలర్లు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)