నైజీరియా సీరియల్ రేపిస్ట్: పదేళ్ల పిల్లల నుంచి 80 ఏళ్ల బామ్మల వరకు.. 40 అత్యాచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్

నైజీరియా మహిళ
ఫొటో క్యాప్షన్, నైజీరియాలో మహిళలపై అఘాయిత్యాలు గత కొద్ది కాలంగా పెరిగాయి

నైజీరియాలోని డన్గోరా పట్టణంలో గత సంవత్సర కాలంగా 40 అత్యాచారాలు చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

తన పిల్లల బెడ్‌రూమ్‌లో ఉన్న ఆ వ్యక్తిని పిల్లల తల్లి పట్టుకుని, తమకు సమాచారం ఇచ్చారని అబ్దుల్లాహి హరున అనే పోలీస్ అధికారి తెలిపారు. అయితే, అతను తప్పించుకుని పారిపోతుండగా.. స్థానికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మానభంగాలకు గురైన వారిలో 80 ఏళ్ల వృద్ధుల నుంచి 10 ఏళ్ల లోపు పసిపిల్లల వరకు ఉన్నారు.

ఇటీవల కాలంలో నైజీరియాలో మానభంగాలు, మహిళల హత్యలు పెరగడంతో కొన్ని వేల మంది వీటికి వ్యతిరేకంగా "వి ఆర్ టైర్డ్" (మేము అలసిపోయాము) అనే హాష్ ట్యాగ్‌తో కూడిన ఒక పిటిషన్‌పై సంతకం చేశారు.

కనో రాష్ట్రంలో కనో నగరానికి 85 కిలోమీటర్ల దూరంలో డన్గోరా పట్టణం ఉంది. ఈ ప్రాంతంలో పోలీస్ నిఘా తక్కువ ఉంటుందని బీబీసీ ప్రతినిధి మన్సూర్ అబూబకర్ తెలిపారు.

నగర ప్రధాన అధికారి అహ్మదు యౌ ఈ అరెస్ట్‌ని స్వాగతించారు.

"డన్గోరా ప్రజలు ఈ అరెస్ట్ వార్త విని చాలా ఆనందించారు. త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం” అని ఆయన చెప్పారు.

"వరుస మానభంగాలు చేసే రేపిస్ట్ ఇళ్ల గోడలు దూకి ఇంటి లోపల ఉన్న అమ్మాయిలు, మహిళలను అత్యాచారం చేయడంతో గత సంవత్సరం అంతా ప్రజలు ఇళ్లల్లో కూడా ఎప్పుడూ భయంతోనే బ్రతికేవారు” అని కొంత మంది స్థానికులు బీబీసీకి చెప్పారు.

"ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాం’’ అని ఒక మహిళ బీబీసీతో అన్నారు.

కనో నగరానికి 85 కిలోమీటర్ల దూరంలో డన్గోరా పట్టణం నెలకొని ఉంది
ఫొటో క్యాప్షన్, కనో నగరానికి 85 కిలోమీటర్ల దూరంలో డన్గోరా పట్టణం ఉంది

ఇటీవల కాలంలో నైజీరియాలో ప్రజలను భయపెట్టిన ఘటనలు

  • ఒక యూనివర్సిటీ విద్యార్థిని రేప్ చేసి, ఒక చర్చిలో ఆమె తల పగలగొట్టి హతమార్చారనే ఆరోపణతో ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
  • రెండు నెలల పాటు ఒక 12 సంవత్సరాల మైనర్ బాలికను మానభంగం చేసిన కేసులో 11 మందిని అరెస్ట్ చేశారు.
  • టీనా ఎజికివి అనే అమ్మాయిని హతమార్చిన కేసులో ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు.
  • బారాకత్ బెల్లో అనే మహిళను గ్యాంగ్ రేప్ చేసి హతమార్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.
  • ఎకిటి రాష్ట్రంలో 17 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేసిన కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు.
  • నైజీరియాలో నివసిస్తున్న ప్రతి ముగ్గురు అమ్మాయిలలో కనీసం ఒక అమ్మాయి 25 సంవత్సరాలు వచ్చే లోపు ఏదో ఒక లైంగిక హింసకి గురై ఉంటుందని జులై 2019 లో ఎన్ఓఐపీ నిర్వహించిన సర్వే పేర్కొంది.

చాలా మంది సాంఘిక భయంతో, చట్టంపై నమ్మకం లేక, పోలీసుల పట్ల భయంతో చాలా సార్లు నేరాలను రిపోర్ట్ చేయకపోవడం కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)