పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవటం ఎలా

ఫొటో సోర్స్, Getty Images
దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
పంజాబ్, హర్యానా, చండీగఢ్, దిల్లీలలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది. భారత వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో మే 26 వ తేదీన 42. 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ లలో కూడా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకి పెరిగే అవకాశం ఉందని, పెరిగిన ఉష్ణోగ్రతలు మరో ఐదు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని ఐ ఎం డి శాస్త్రవేత్త డాక్టర్ ఎం కుమార్ హెచ్చరించారు.
మే 25 వ తేదీ నాడు పశ్చిమ రాజస్థాన్‌లోని చురు లో 47. 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో 47. 1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో వివిధ వయస్సుల ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ కవిత రమేష్, క్రిటికల్ కేర్ నిపుణురాలు, పల్మనాలజిస్ట్ బీబీసీ న్యూస్ తెలుగు కి వివరించారు.

వేసవిలో సాధారణంగా వడ దెబ్బ తగలడం, డీహైడ్రేషన్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
మండే ఎండల నుంచి కాపాడుకోవడానికి వీలైనంతవరకు ఎండలో బయటకి వెళ్ళకపోవడం మంచిది.
ఇంకా ముఖ్యమైన పనులు ఉంటే ఎండ తీవ్రత పెరగకముందే పొద్దున్న 10 గంటల లోపు, లేదా సాయంత్రం ఆరు గంటల తర్వాత వెళితే కొంత వరకు మేలు.
ఎండలోంచి వచ్చిన తర్వాత ఏ మాత్రం తల తిరుగుతున్నట్లు ఉన్నా, కళ్ళు మసకబారినా అది వడదెబ్బ లక్షణమని, అలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని సూచించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వేసవి నుంచి రక్షించుకోవడానికి సూచనలు
మిట్ట మధ్యాహ్నం ఎండలో బయటకి వెళ్లకుండా ఉండటంతో పాటు నీటిని ఎక్కువ మోతాదులో తాగాలి. పురుషులు అయితే కనీసం 3.5 లీటర్లు, మహిళలు కనీసం 3 లీటర్లు, పిల్లలు 2 లీటర్ల నీరు కనీసం తీసుకోవాలి.
ఒక వేళ తప్పని సరి పరిస్థితుల్లో బయటకి వెళ్ళవలసి వస్తే గొడుగు పట్టుకుని వెళ్లడం, టోపీ పెట్టుకోవడం, సన్ స్క్రీన్ వాడటం తప్పని సరి.
వృద్ధులు, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు బయటకి వెళ్లడం పూర్తిగా తగ్గించి ఇంట్లోనే ఉండటం మంచిది. డాక్టర్ దగ్గరకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ముందుగానే డాక్టర్ అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్లడం ద్వారా ఎక్కువ సమయం వేచి ఉండే పని తగ్గుతుందని చెప్పారు.
వ్యాయామం చేసేవారు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నప్పుడు శరీరం పూర్తిగా అలిసిపోయేలాంటి వ్యాయామాలు చేయకుండా తేలిక పాటి వ్యాయామాలు చేయాలి. అలాగే ఆటలు ఆడేవారు ఆడిన తర్వాత మాత్రమే కాకుండా ముందుగానే శరీరానికి కావల్సిన నీటిని తాగడం వలన శరీరానికి కావల్సిన హైడ్రేషన్ లభిస్తుంది. దీంతో తొందరగా అలిసిపోకుండా ఉంటారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వేసవిలో పిల్లలకి స్కూళ్ళు సెలవులు కావడంతో పిల్లలు ఎక్కువగా బయటకి వెళ్లి స్నేహితులతో ఆడుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. వీరు క్రికెట్ అవీ ఆడి అలిసిపోతూ ఉంటారు.
ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకి ఆటలకి పంపకపోవడం మంచిది. అంతే కాకుండా ఫ్రిడ్జ్ లో ఉండే రెడీ మేడ్ ఫ్రూట్ జ్యూస్ లు, కోలాలు లాంటివి శరీరానికి హైడ్రేషన్ అందించకపోగా అవి మరింత హాని చేస్తాయని చెప్పారు.
పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక వాటర్ బాటిల్ పెట్టి వారు కచ్చితంగా అవసరమైన మోతాదులో నీరు తాగేలా చేయాలి. కొబ్బరి నీరు, ఫ్రూట్ జ్యూస్ లాంటివి ఇవ్వడం ద్వారా శరీరానికి కావాల్సిన లవణాలు,పోషకాలు అందుతాయని చెప్పారు.
అయితే అన్ని వర్గాల వారికి ఇంటిలోనే ఉండటం సాధ్యం కాదు. ఉద్యోగంలో భాగంగా కొంత మంది ఎండలోనే రోజంతా ఉండి పని చేయవలసిన పరిస్థితి ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
అటువంటి వారు కచ్చితంగా తమతో పాటు మంచి నీరు, మజ్జిగ లాంటివి తీసుకుని వెళ్లి ప్రతి గంటకి తాగుతూ ఉండాలి. తలని కప్పుకునేందుకు స్కార్ఫ్ కానీ, టోపీ కానీ, గొడుగు కానీ వాడాలి.
పూర్తిగా ఎండలోనే ఉండకుండా మధ్య మధ్యలో నీడలోకి వెళ్లడం లాంటివి చేయాలి.
ఐస్ ప్యాక్ లాంటివి వాడాలి. మజ్జిగ, బార్లీ, కొబ్బరి నీరు తీసుకోవడం మేలని సూచించారు.
అధిక ఉష్ణోగ్రతలు గర్భిణీలని మరింత ఇబ్బందులకు గురి చేస్తాయి.
వీరు శరీరానికి తగిన హైడ్రేషన్ ఉండేటట్లు చూసుకోవాలి. అధిక మొత్తంలో మంచి నీరు, ద్రవ పదార్ధాలు తీసుకుంటూనే వీలయితే చాలా తేలికపాటి వ్యాయామం చెయ్యాలి. ఇది ఎండ తగ్గాక సాయంత్రం పూట చేస్తే మంచిది. పోషకాలు పోకుండా కొబ్బరి నీరు, రాగి మాల్ట్ లాంటివి తీసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
వేసవిలో ఎలాంటి ఆహారం మంచిది?
వేసవిలో లభించే మామిడి పళ్ళు, ముంజులూ, పుచ్చకాయ, కర్బూజ లాంటి పళ్ళు దోసకాయ లాంటి కూరలు శరీరానికి మంచిదని కవిత చెప్పారు.
వేసవిలోచెమటని పీల్చుకుని గాలిని అందించే తేలికపాటి కాటన్ వస్త్రాలు వాడాలి. నలుపు రంగు, సిల్క్ వస్త్రాలు వాడటం మానేయాలి.
ఇలాంటి చిన్నపాటి చర్యలు పాటించడం ద్వారా మనల్ని మనం అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షించుకోవచ్చని కవిత వివరించారు.
ఇవి కూడా చదవండి
- సుబ్బయ్య హోటల్: "34 రకాల పదార్థాలు.. కొసరి కొసరి వడ్డించి, తినే వరకూ వదిలిపెట్టరు"
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?
- చాక్లెట్ అంతం: ప్రపంచ ఉత్పత్తిలో సగం తినేస్తున్న యూరప్, అమెరికా ప్రజలు
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
- ప్రపంచ ఆకలి తీర్చే గోదుమ ‘జన్యుపటం‘
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- ఎక్కడ ఉంటే ఎక్కువ ఆరోగ్యం? పల్లెల్లోనా, పట్టణాల్లోనా?
- పీరియడ్స్ సమయంలో సెక్స్ తప్పా? ఒప్పా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








