కమలాదేవి చటోపాధ్యాయ: ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి భారతీయ మహిళ

- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1930వ సంవత్సరం. అప్పటికి కమలాదేవి చటోపాధ్యాయకు 27 ఏళ్లు.
మహాత్మాగాంధీ దండి యాత్ర చేపట్టి ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించబోతున్నారని ఆమెకు తెలిసింది. దీని తరువాత దేశవ్యాప్తంగా సముద్రపు ఒడ్డున ఉప్పు తయారుచేయనున్నారు.
కానీ ఈ ఉద్యమంలో మహిళలకు ప్రవేశం లేదు. స్వాతంత్రోద్యమంలో మహిళలు రాట్నం తిప్పుతూ, మద్యం దుకాణాలను ముట్టడి చేసి మూయించే పనిలో ఉండాలని గాంధీ నిర్ణయించారు.
ఇది కమలాదేవికి నచ్చలేదు. ఉప్పు సత్యాగ్రహంలో మహిళల భాగస్వామ్యం ఉండాలని, ఈ విషయమై గాంధీతోనే నేరుగా మాట్లాడాలని ఆమె నిశ్చయించుకున్నారు.
ఈ వివరాలన్నీ ఆమె తన పుస్తకం "ఇన్నర్ రేసెస్ అవుటర్ స్పేసెస్" లో రాసారు.
ఆ సమయంలో గాంధీ రైలు ప్రయాణంలో ఉన్నారు. కమాలాదేవి రైల్లో వారిని కలుసుకున్నారు.
రైల్లో గాంధీతో జరిగిన సమావేశం కొద్దిసేపే అయినా చరిత్ర సృషించడానికి అది చాలు.
మొదట గాంధీ, కమలాదేవిని ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఆమె వాదనలు విన్న తరువాత ఉప్పు సత్యాగ్రహంలో స్త్రీ, పురుషులిద్దరూ భాగస్వాములు కావడానికి గాంధీ అంగీకరించారు. ఇది ఒక చారిత్రక నిర్ణయం.
ఈ నిర్ణయం తరువాత ముంబయి నుంచీ ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించడానికి ఏడుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసారు. అందులో కమలాదేవి, అవంతికాబాయి గోఖలే కూడా ఉన్నారు.

స్వాతంత్రోద్యమంలో మహిళా భాగస్వామ్యానికి ప్రాధాన్యత
న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉంటూ, మహిళలకోసం ప్రభుత్వేతర సంస్థ నడుపుతున్న రుచిరా గుప్తా మాటల్లో... "ఈ అడుగుతో స్వాతంత్రోద్యమంలో మహిళల భాగస్వామ్యం పెరిగింది. ప్రపంచం మొత్తం చూస్తుండగా మహిళలందరూ చేయి చేయి కలిపి ఉప్పు సత్యాగ్రహాన్ని భుజాన వేసుకుని ఉప్పు చట్టాన్ని వ్యతిరేకించారు. ఇది కాంగ్రెస్ పార్టీలోనూ, స్వతంత్ర్యం వచ్చిన తరువాత రాజకీయాల్లోనూ మహిళల పాత్రను మలుపు తిప్పింది."
ఉప్పు సత్యాగ్రహంలో కమాలాదేవి ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసులను ఎదురించి, తన సహచరులతో కలిసి ఉప్పును తయారుచేసి పొట్లాలలో కట్టి అమ్మడం ప్రారంభించారు. ఒకసారి ముంబయి స్టాక్ ఎక్స్చేంజ్‌లో కూడా ప్రవేశించి ఉప్పు పొట్లాలను వేలం వేసారు. స్టాక్ ఎక్స్చేంజ్‌లో కూడా ప్రజలు ఉత్సాహంగా 'మహాత్మాగాంధీకి జై' అని నినాదాలు చేసారు.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- రుకేయా షకావత్: వేల మంది అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన రచయిత్రి
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
- సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ


శకుంతల నరసింహన్ తన పుస్తకం 'కమలాదేవి చటోపాధ్యాయ: ది రొమాంటిక్ రెబెల్'లో ఈ సంఘటనల గురించి చెప్తూ...
"స్టాక్ ఎక్స్చేంజ్ సంఘటన తరువాత కమలాదేవికి మరో ఆలోచన వచ్చింది. ఆమె నేరుగా హైకోర్టు న్యాయమూర్తివద్దకు వెళ్లి మీరు 'ఫ్రీడం సాల్ట్' కొనాలనుకుంటున్నారా? అని అడిగారు. దీనికి ఆయన ఏం జవాబు చెప్పారో తెలీదుగానీ ఈ సంఘటనతో కమలాదేవి ధైర్యసాహసాలు దేశం నలుమూలలా పాకాయి."
కమాలాదేవి ధైర్యం వెనుక తన తల్లి, అమ్మమ్మల పాత్ర ఎంతైనా ఉంది. కమలాదేవి మంగళూరులో గౌడ సారస్వత బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లి గిరిజాబాయి. తండ్రి అనంతయ్య ధరేశ్వర్ జిల్లా కలెక్టర్‌గా ఉండేవారు. ఆయన ప్రగతిశీల భావాలున్న వ్యక్తి. కానీ కమలాదేవి చిన్నతనంలోనే ఆయన మరణించారు. తరువాత కుటుంబ బాధ్యత అంతా ఆమె తల్లి మీద పడింది.
19వ శతాబ్దంలో బాలికలకు పాఠశాలలు లేనప్పటికీ ఇంటి దగ్గరే కమలాదేవికి చదువు చెప్పించే ఏర్పాటు చేసారు. కానీ సాంఘిక ఒత్తిడికి తలవొగ్గి 11 వ యేటనే కమలాదేవి వివాహం జరిపించారు.
తరువాత ఏడాదిన్నరకే కమలాదేవి భర్త మరణించారు. అయితే కమలాదేవికి వితంతు ఆచారాలను జరపడానికి ఆమె తల్లి నిరాకరించారు. అంతేకాకుండా కమలాదేవిని స్కూలుకు పంపి, జీవితంలో ముందుకు వెళ్లడానికి దారి చూపించారు.
పండిత రమాదేవి, రమాదేవి రానడేల సిద్ధాంతాలను గిరిజాబాయి అమితంగా విశ్వసించేవారు. అనిబిసెంట్‌ను ఒక రోల్ మోడల్‌గా కమలాబాయి ముందు నిలిపారు. వీరందరినుంచీ కమలాదేవి స్ఫూర్తిని పొందారు.
చెన్నై క్వీన్స్ మేరీ కాళాశాలలో చదువుకుంటున్నప్పుడు సరోజినీ నాయుడి సోదరుడు హరింద్రనాథ చటోపాధ్యాయతో పరిచయం అయ్యింది. హరింద్రనాథ్ ఒక ప్రసిద్ధ కవి, నాటక రచయిత కూడా.
20 యేళ్ల వయసులో కమలాదేవి హరింద్రనాథ్ చటోపాధ్యాయను వివాహమాడారు. వితంతు వివాహం చేసుకున్నందుకు ఆమెపై అనేకులు విమర్శలు గుప్పించారు. తరువాతి కాలంలో హరింద్రనాథ్‌కు విడాకులు ఇచ్చినప్పుడు కూడా ఆమెపై విమర్శల వర్షం కురిసింది. కానీ ఆమె వాటన్నిటినీ తోసిపుచ్చి ముందుకు నడిచారు. మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచారు.
స్త్రీలు సినిమాల్లో నటిస్తే హర్షించని సమాజాన్ని తోసి రాజని కన్నడలోని మొట్టమొదటి మూకీ చిత్రం "మృచ్ఛకటిక" లో హీరోయిన్‌గా నటించారు. 1943లో వచ్చిన తాన్‌సేన్, శంకర్ పార్వతి, 1945లో ధన్నా భగత్ మొదలైన హిందీ చిత్రాల్లో కూడా ఆమె ముఖ్య పాత్రలు పోషించారు.
కానీ వీటన్నిటికన్నా ముందునుంచే ఆమె మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితం అయ్యారు. 1923లో గాంధీ సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించినప్పుడు కమలాదేవి తన భర్తతో పాటూ లండన్‌లో ఉన్నారు. ఆమె వెంటనే భారతదేశానికి తిరిగి వచ్చి కాంగ్రెస్ సేవా దళంలో చేరారు.
1926లో ఐర్లండ్‌కు చెందిన ప్రముఖ స్త్రీవాద నాయకురాలు మార్గరెట్ కజిన్స్‌ను కలిసారు. 1927లో మార్గరెట్, 'అఖిల భారత మహిళా సదస్సు' (ఆల్ ఇండియా విమెన్స్ కాంఫరెన్స్) ప్రారంభించారు. దానికి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా కమలాదేవి బాధ్యతలు స్వీకరించారు.

అదే సమయంలో మార్గరెట్ ప్రోత్సాహంతో కమలాదేవి మరో ముందడుగు వేసారు.
అప్పుడే మొట్టమొదటిసారిగా మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలలో మహిళలకు ఓటు వేసే హక్కును ఇచ్చారు. దీని వెనుక మార్గరెట్ కజిన్స్ చేసిన కృషి ఎంతో ఉంది.
అలాగే 1926లో మద్రాస్ ప్రావిన్షియల్ లెజిస్లేచర్ (ఇప్పటి విధానసభకు సమానమైనది) ఎన్నికల్లో మహిళలకు పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మార్గరెట్ ప్రోత్సాహంతో ఈ ఎన్నికల్లో కమలాదేవి పోటీ చేసారు.
కానీ ఎన్నికల ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది. వెంటనే మార్గరెట్ మహిళా కార్యకర్తలందరినీ బృందాలుగా ఏర్పరచి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసారు. కమలాదేవి భర్త హరింద్రనాథ్ కూడా నాటకాలు, దేశ భక్తి గీతాలు ప్రచారం చేస్తూ కమలాదేవి ఎన్నికల ప్రచారం కూడా చేసారు.
రీనా నందా తన పుస్తకం 'కమలాదేవి చటోపాధ్యాయ: ఏ బయోగ్రఫీ' లో ఈ విషయాలన్నిటి గురించీ విపులంగా రాసారు.
అయితే, ఈ ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్ల తేడాతో కమలాదేవి ఓడిపోయారు.
కానీ ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యానికి తలుపులు తెరిచారు.

రాజకీయ ప్రయాణం
ఈ ఎన్నికలతో కమలాదేవి రాజకీయ ప్రయాణం ప్రారంభమయ్యింది. అయితే ఆమె లక్ష్యం పదవులు కాదు. సమాజంలో మార్పు తీసుకురావడమే ఆమె లక్ష్యం.
1927-28లో అఖిల భారత కాంగ్రెస్ సభ్యురాలిగా చేరారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగానూ, సమ్మతి చట్టాన్ని తీసుకురావడంలోనూ, రాచరికం ఉన్న రాష్ట్రాల్లో ఉద్యమాల విషయంలోనూ కాంగ్రెస్ నిర్ణయాలను ప్రభావితం చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషించారు.
అయితే స్వతంత్ర్యం వచ్చిన తరువాత కమలాదేవి రాజకీయ పదవులను చేపట్టడానికి నిరాకరించారు.
అప్పటి మద్రాస్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి కే కామరాజ్, కమలాదేవిని గవర్నర్ చెయ్యాలని ప్రతిపాదించారు. ఈ విషయాన్ని జవ్‌హర్ లాల్ నెహ్రూతో ప్రస్తావించగా, స్వయంగా కమలాదేవినే సంప్రదించమని ఆయన సలహా ఇచ్చారు. ఆవిడ అంగీకరిస్తే గవర్నర్‌గా నియమించడానికి ఏ అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఆవిడ ఎలాంటి రాజకీయ పదవినీ స్వీకరించడానికి సుముఖంగా లేరని కామరాజ్‌కు అర్థం అయ్యింది.
అయితే, స్వతంత్ర్యం వచ్చిన తరువాత...విభజన సమయంలో శరణార్థుల పునరావాసంపై ఆమె దృష్టి కేంద్రీకరించారు. సహకారోద్యమంపై ఆమెకు అచంచల విశ్వాసం ఉండేది. దాంతో ఆమె 'భారత సహకార సంఘం' (ఇండియన్ కోఆపరేటివ్ యూనియన్) స్థాపించారు.
ప్రజల సహకారంతో శరణార్థుల కోసం ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికను నెహ్రూ ముందుంచారు. అయితే దీనికోసం ప్రభుత్వ సహాయాన్ని ఆశించకూడదనే షరతుతో నెహ్రూ ఈ ప్లాన్‌కు అంగీకరించారు.
భారత సహకార సంఘం సహాయంతో ఈశాన్య సరిహద్దునుంచీ వస్తున్న శరణార్థులకోసం దిల్లీకి దగ్గర్లో ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసారు. దాన్నే నేడు ఫరీదాబాద్ అని పిలిస్తున్నారు.


1950 నుంచీ కమలాదేవి భారతీయ హస్తకళలు, చేనేత వస్త్రాల పునరుద్ధరణపై దృష్టి పెట్టారు.
సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం మరియు క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసారు.
భారతీయ నాటక సంప్రదాయాలను ప్రోత్సహించడానికి 'ఇండియన్ నేషనల్ థియేటర్' స్థాపించారు. ఇదే తరువాతి కాలంలో 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'గా ప్రసిద్ధికెక్కింది.
కమలాదేవి కృషితో ప్రసిద్ధ 'సంగీత నాటక అకాడమీ' స్థాపించబడింది.
1955లో పద్మ భూషణ్, 1987లో పద్మ విభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది.
అంతేకాకుండా 1966లో కమలాదేవికి రామన్ మెగసేసే పురస్కారం కూడా లభించింది.
1988 అక్టోబర్ 29న 85 సంవత్సరాల వయసులో కమలాదేవి చటోపాధ్యాయ కన్నుమూసారు.
మహిళల స్వేచ్ఛకు, సాధికారతకు కమాలాదేవి వేసిన బాటలు నిరంతరం స్ఫుర్తిదాయకమైనవి.
(చిత్రాలు: గోపాల్ శూన్య)
ఇవి కూడా చదవండి:
- కొబ్బరి చరిత్ర ఏమిటి? హిందూ ధార్మిక కార్యక్రమాలలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- మహిళలు గర్భం దాల్చినప్పుడు రకరకాల ఆహార పదార్ధాలు తినాలని ఎందుకనిపిస్తుంది?
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు WHO చెప్పిన అయిదు ఆహార చిట్కాలు
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాలు నిల్వ ఉండే ఆహార పదార్థాలు ఉన్నాయా?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









