కరోనావైరస్ బారిన పడకుండా బస్సులు, రైళ్లు, మెట్రోల్లో సురక్షితంగా ప్రయాణించడం ఎలా?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, రిచర్డ్ ఫిషర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తలకు అదనంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే కోవిడ్ వైరస్ బారిన పడకుండా మన ప్రయాణాలు సురక్షితంగా సాగుతాయి?
లండన్ అండర్‌గ్రౌండ్ రైల్వేలైన్‌లో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లడానికి తెలివైన ప్రయాణికులు కొందరు అడ్డదారుల(షార్ట్‌కట్స్)ను ఆశ్రయిస్తారు.
ప్లాట్‌ఫామ్‌ల మధ్య ప్రయాణించేందుకు వాడే వాకింగ్ టన్నెల్స్‌లో మార్గసూచికలు లేని ప్రాంతాలు షార్ట్‌కట్ కోసం ప్రయాణికులకు బాగా ఉపయోగపడుతుంటాయి.
అలాంటి దారుల లోపలి నుంచి వెళితే మీరు నేరుగా ఫ్లాట్‌ఫాం ఎగ్జిట్‌కు చేరుకుని, జనాన్ని తప్పించుకుని మీ గమ్యస్థానానికి సులభంగా చేరుకోవచ్చు.
తరచూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ద్వారా ఆఫీసులకు, పనులకు వెళ్లేవారు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కాలంలో పడిన ఇబ్బందులు గతంలో ఎప్పుడూ చూసి ఉండరు.
ఈ రోజుల్లో త్వరగా ఆఫీసుకు, ఇంటికీ చేరుకోవడంకన్నా, సురక్షితంగా చేరుకోవడం ముఖ్యమన్న విషయాన్ని అంతా గమనించారు.
కరోనా మహహ్మారి కారణంగా ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థపై ఆధారపడటం చాలా వరకు తగ్గించారు. ఆగస్టు చివరివారం నుంచి లండన్‌లో బస్సులు కేవలం సగంమంది ప్రయాణికులతో నడుస్తున్నాయి. ఇక మెట్రో సర్వీసులు మూడింట ఒకవంతుమంది ప్రయాణికులతోనే కొనసాగుతున్నాయి.
చాలా దేశాలలో లాక్‌డౌన్‌లు ఎత్తేయడం, ఆఫీసులు తెరుస్తుండటంతో మళ్లీ జనం ప్రజారవాణా సాధనాలలో, మెట్రో రైళ్ల కనిపించడం మొదలు పెట్టారు.
మరి ఈ ప్రయాణ సాధానాలను వాడుకునే వారు రిస్కును ఎలా తగ్గించుకుంటున్నారు? రద్దీ సమయాలలో ప్రయాణించుకుండా ఉండటం, మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం అనేవి సర్వసాధారణంగా తీసుకునే జాగ్రత్తలు.
వాటితోపాటు స్థానికంగా వైద్యులు సూచించే ఆరోగ్య సూత్రాలను, జాగ్రత్తలను పాటించడం వల్ల కరోనా వైరస్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
ఇవి కాకుండా మరికొన్ని జాగ్రత్తలు కూడా ఉన్నాయి. వాటిని అందరూ తప్పకుండా తెలుసుకోవాలి. ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చ్, పాసింజర్ సైకాలజీలపై రూపొందిన నివేదికలు రాబోయే రోజుల్లో ప్రయాణికులు ఎంత జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిస్తాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వెంటిలేషన్ చాలా ముఖ్యం
కోవిడ్-19 అనేది ముఖ్యంగా శ్వాసకోశ అవయవాలకు సంబంధించిన వైరస్. ఒకే ప్రాంతంలో ఎక్కువమంది పీల్చి వదిలిన వాయువులను పీల్చడం వల్లా, దగ్గులు, తుమ్ముల వల్ల గాల్లో చేరిన వైరస్‌లు మన శరీరంలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
సైకిల్, మోటార్ బైక్, ఇతర వ్యక్తిగత వాహనాల మీద ప్రయాణించి ఆఫీసులకు చేరుకోవడం మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇతరులు వదిలిన గాలిని పీల్చుకోవాల్సిన అవసరం ఉండదు. మనిషికి మనిషిని దూరంగా ఉంచడం వీటివల్ల సాధ్యమవుతుంది.
కార్లు వాడటం చాలా వరకు సురక్షితం. కుటుంబ సభ్యులంతా కారులో వెళ్లడం వల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. అయితే అందరూ ఇలా కార్లు బైటికి తీస్తే అది వాతావరణ కాలుష్యానికి, ట్రాఫిక్ సమస్యలకు దారి తీసి మరిన్ని ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ కొంత వరకు మంచిదే కానీ అన్నివేళలా సరైంది కాదు.
“పట్టణ ప్రాంతాలలో అధికంగా కార్ల వాడకం మంచిది కాదు. మనం కదిలితే మిగిలినవాళ్లంతా ఆగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి” అని మసాచుసెట్స్‌లోని సెన్సిబుల్ సిటీ ల్యాబ్ డైరక్టర్‌గా పని చేస్తున్న కార్లో ర్యాటీ అన్నారు.
“ట్రైన్‌లోగానీ, బస్సులోగానీ ప్రయాణించాలనుకుంటే ఆ రూట్ ఎంత రద్దీ ఉంటుందో, మీ ప్రయాణ సాధానాలలో ఎంత వెంటిలేషన్ ఉంటుందో అంచనా వేసుకోవాల్సి ఉంటుంది” అని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చర్‌గా పని చేస్తున్న నిక్ టేలర్ అన్నారు. బస్సుల ద్వారా వైరస్ ఎలా వ్యాపిస్తుందో ప్రయోగాల ద్వారా ఆయన నిరూపించి చూపారు.
“తుమ్ములు, దగ్గుల వల్ల వెలువడే బిందువులు సులభంగా గాల్లో కలిసిపోతాయి. కానీ ఒక్కసారి లోపలికి వచ్చాయంటే త్వరగా కదలవు’’ అని టేలర్ చెప్పారు.
డిజైన్లు భిన్నంగా ఉన్నా వాహనాలకు మరిన్ని కిటికీలు ఉండటం మంచిది. రైళ్లు, బస్సులతో పోలిస్తే డీప్ సబ్‌వేలలో ప్రయాణించే క్యారేజ్‌ల వల్ల వైరస్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
లండన్ భూగర్భ రవాణా సాధానలలో ప్రయాణించేవారిలో ఫ్లూ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయని 2018లో ప్రచురించిన ఒక పరిశోధనలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ సంస్థకు చెందిన డాక్టర్ లారా గోస్కే వెల్లడించారు.
రైలు, బస్సులతో పోల్చితే విమానాల్లో కచ్చితంగా శుభ్రమైన గాలి లభిస్తుంది. చాలా విమానాలలో ‘హెపా’ (High Efficiency Particulate Air ) అని పిలిచే అధిక నాణ్యత గల ఎయిర్ ఫిల్టర్ వ్యవస్థ ఉంటుంది. ఇది చాలావరకు వైరస్‌లను అంతమొందిస్తుంది.
“విమానాల్లో ఉండే గాలి మంచిదికాదని చాలామంది అనుకుంటారు. కానీ దానంత మంచి గాలి ఎక్కడా ఉండదు’’ అని టేలర్ అన్నారు. బస్సులు, రైళ్లకు భిన్నంగా విమానాలలో గాలి పై నుంచి కింది ప్రసరిస్తుంది. దీనివల్ల నీటి బిందువులు ఫ్లోర్ మీదకు చేరతాయి. చేతులకు, ముఖానికి వైరస్ కణాలు అంటుకునే ప్రమాదం తగ్గుతుంది.
న్యూయార్క్ సబ్‌వేలో తిరిగే రైళ్లు విమానానికి విరుద్ధంగా గాలిని అడ్డంగా వెనక్కి తోస్తాయి. ఇందులో విమానాలలో ఉండే ఎయిర్ ఫిల్టర్ల కంటే తక్కువ నాణ్యత ఉన్న ఫిల్టర్లను వాడతారు.
వైరస్ స్క్రీనింగ్‌పరంగా చూసినట్లయితే 20 పాయింట్లలో న్యూయార్క్ సబ్‌వే కార్ కేవలం 7 మార్కులను మాత్రమే పొందగలిగింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మేలు చేసే నిశ్శబ్దం
ఎంచుకోవాల్సిన రవాణా మార్గాలను పరిశీలించేటప్పుడు, ఎందులో ఎక్కువ శబ్దాలకు అవకాశం ఉంటుంది, ఎంత పెద్దగా మాట్లాడాల్సి వస్తుందన్నదాన్ని కూడా అంచనా వేసుకోవాల్సి ఉంటుంది.
శబ్దాలు ఎక్కువగా ఉండే సాధానాలకన్నా తక్కువ సౌండ్‌ను ఉపయోగించే వ్యవస్థలను ఎంచుకోవడం మంచిది. ఎక్కువ శబ్దాలు ఉన్నచోట పెద్దగా మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడు వైరస్ కణాలు తుంపరల రూపంలో బైటికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
నైట్‌క్లబ్‌లు, మాంసం ప్యాకింగ్ ప్లాంట్లలో వైరస్ ఎక్కువ సోకడానికి కారణం ఇదేనని అంటున్నారు.
గడబిడ ఎక్కువగా ఉండే ట్రైన్లు, ఆటపాటలు, అధికధ్వనులు ఉత్పత్తి చేసే ప్రదేశాలకన్నా నిశ్శబ్దంగా ఉండే ప్రదేశాలలో వైరస్ సోకే ప్రమాదం తక్కువని పరిశీలనలో తేలింది.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఎక్కడ కూర్చోవాలి ?
ఖాళీగా ఉన్న మెట్రో కోచ్‌ల్లో వెళ్లవద్దని న్యూయార్క్‌లో ఒక హెచ్చరిక తరచూ వినిపిస్తుంటుంది. అలా ఎందుంటారలో చాలామందికి అర్ధంకాకపోయినా, దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి అందులో దుర్వాసన వస్తుంది. రెండోది దాడులు జరిగే అవకాశం ఉంటుంది.
ఇప్పటికీ చాలామంది ఈ హెచ్చరికను పాటిస్తుంటారు. ముఖ్యంగా రాత్రిపూట మహిళలు ఈ క్యారేజ్‌లలో ప్రయాణించడానికి ఇష్టపడరు. కానీ ఈ మహమ్మారి కాలంలో జనం తక్కువగా ఉన్న క్యారేజ్‌లలోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
మాస్కులు తొడుక్కోవాల్సిందిగా సూచించడంతోపాటు, దూరంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ ఈ రైళ్లలో సీట్ల దగ్గర సూచికలు ఏర్పాటు చేస్తున్నారు.
రైళ్లలో సీటింగ్ విధానం వైరస్‌ను ఎంత వరకు వ్యాపింపజేస్తుంది అన్నదానిపై చైనాలో ఒక పరిశోధన జరిగింది. డిసెంబర్ 2019 నుంచి మార్చి 2020 మధ్య కాలంలో సుమారు 2,000మందికి పైగా ప్రయాణికులను ట్రేస్ చేయడం ద్వారా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందో గుర్తించే ప్రయత్నం చేశారు.
ఒకే వరసలో పక్కపక్కన కూర్చున్న వారిలో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ పరిశీలనలో తేలింది. చైనాలోని ఇంటర్ సిటీ రైళ్లలో వీపు వెనక ఉండే అడ్డుగోడలు కొంత వరకు వైరస్ వ్యాప్తి నుంచి రక్షణనిస్తున్నట్లు కనిపిస్తాయి. కానీ ఈ ఇంటర్ సిటీ రైళ్లలో టాయిలెట్‌లకు వెళ్లే వారు అనేకమందిని దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
దూర దూరంగా కూర్చున్నప్పటికీ దూర ప్రయాణాలు ప్రమాదకరమేనని ఒక పరిశీలనలో తేలింది. రెండున్నర మీటర్ల కంటే తక్కువ దూరంలో కూర్చుని, రెండుగంటలపాటు మాస్క్ లేకుండా ప్రయాణం చేసినప్పుడు, వారికి రిస్క్ ఎక్కువగానే ఉంటుందని పరిశోధకులు తేల్చారు.
కాస్త ఊరటనిచ్చే మాట ఏంటంటే, కరోనా వైరస్ క్యారియర్ కూర్చున్న సీటులో మరొకరు కూర్చోవడం వల్ల రిస్కు మరీ ఎక్కువగా ఉండదని పరిశోధకుల పరిశీలనలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎక్కడ నిలబడాలి?
న్యూయార్క్ సబ్‌వే పాసింజర్ బిహేవియర్ మీద చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే నిలబడి ప్రయాణించేవారు వేలాడుతున్న రబ్బర్ స్ట్రాప్స్‌కన్నా మధ్యలో నిలువుగా ఉన్న పోల్‌ను పట్టుకుని నిలబడటానికి ప్రాధాన్యతనిస్తారు.
వైరస్ రిస్క్‌ను తగ్గించడానికి ఇతరులు చేతితో తాకే అవకాశం ఉన్న వేటినీ టచ్ చేయకుండా ఉండటం మంచిది. తుంపరల రూపంలోనే ఎక్కువ వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది నిజమే అయినా, మనం ఉపరితలాలను తాకినప్పుడు కూడా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.
మనం చేతులను నోటి దగ్గరా, ముక్కు దగ్గరా పెట్టుకున్నప్పుడు వైరస్ శరీరంలోకి వెళ్లిపోతుంది.
న్యూయార్క్ సబ్‌వేలలో ప్రయాణించేవారిలో చాలామంది నిలబడాల్సిన అవసరమే వస్తే తమ గమ్యస్థానం రాగానే దిగిపోవడానికి వీలుగా డోర్ దగ్గరే నిలబడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీనివల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.
అటూ ఇటూ జరగడానికి అవకాశం ఉండటం, సీట్లలో కూర్చున్న వారికి దగ్గరగా ఉండక పోవడం వల్ల ఇది కొంత వరకు సురక్షితం. గాలి కూడా బాగానే వీస్తుంది. అయితే ఇది చాలాసార్లు బిజీగా ఉంటుంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సబ్‌వే క్యారియర్లలో మహిళలకన్నా పురుషులే ఎక్కువగా నిలబడి ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తారట. దీనికి కారణం బహుశా పాతకాలం నుంచి వస్తున్న సంప్రదాయం కావచ్చు, లేదంటే మగవాళ్లు నిలబడటానికే ప్రాధానివ్వడం కావచ్చని భావిస్తున్నారు.
చేతులు కడుక్కునే విషయంలో మగవారు ఆడవారికన్నా వెనకబడి ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి
క్రమం తప్పకుండా ప్రజా రవాణాలో ప్రయాణించే వారికి ప్రమాదం తీవ్రత తరచూ మారుతూ ఉంటుందని ఒక అంచనా. అయితే అది ఏ స్థాయిలో ఉంటుందనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు.
జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రియాలలో జరిగిన కాంటాక్ట్ ట్రేసింగ్‌ను గమనిస్తే ఈ మహమ్మారికి, ప్రజారవాణాకు మధ్య లింక్ అసలే లేనట్లు న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన కథనంలో క్రిస్టీనా గ్లాడ్‌బామ్ పేర్కొన్నారు. ఇది కొంచెం ఊరటకలిగించే అంశం.
బిజీగా ఉండే బార్లు, రెస్టారెంట్లతో పోలిస్తే, మాస్కులు తగిలించుకుని, కాస్త వెంటిలేషన్ ఉన్న ప్రజారవాణా వ్యవస్థలే సురక్షితమని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
తక్కువ దూరం ప్రయాణం, సహ ప్రయాణికులతో తక్కువగా మాట్లాడటంలాంటివి రిస్కును మరింత తగ్గిస్తాయి. అయితే ఈ పరిశోధనను మరిన్ని ఆధారాలు ధృవపరచాల్సి ఉంది.
రాబోయే కొద్దినెలలు లేదా సంవత్సరాలలో మహమ్మారికి ముందునాటి పరిస్థితులకు చేరుకోవడం దాదాపు అసాధ్యం. లండన్‌లో ఒక్కో బస్సులో 30శాతం సీటింగ్ కెపాసిటీకే అనుమతిస్తున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రద్దీని తట్టుకోడానికి లండన్‌లో రెండు నుంచి మూడింతలు అధికంగా బస్సు సర్వీసులు పెంచాల్సి ఉంటుంది. లేదంటే ఆఫీసులకు వెళ్లడం ఆలస్యమవుతుంది.
ఒకవేళ ఆఫీసుకు టైమ్ ఆఫీసుకు చేరుకున్నా, భౌతిక దూరం పాటించాల్సినందున ఆ ఆకాశహర్మ్యాల లిఫ్టుల దగ్గర చాలా సేపు ఎదురు చూడాల్సి ఉంటుందని టేలర్ అంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రజారవాణాకు సంబంధించి కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి ఇది మంచి అవకాశంగా భావించాలంటున్నారు ర్యాటీ. “ఈ మార్పు సమయంలోనే ప్రయోగాలు చేయడం మంచిది’’ అని ఆయన అన్నారు. “ మనం చేసిన ప్రయోగాలు సక్సెస్ అయితే, దాన్ని కోవిడ్-19 తర్వాతి కాలంలో కూడా అనుసరించవచ్చు’’ అన్నారాయన.
ఇప్పటికైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ప్రయాణం సందర్భంగా వైరస్ బారిన పడకుండా కొన్ని తాత్కాలిక మార్గాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో నగరాలలోని ప్రజారవాణ వ్యవస్థ ప్రయాణ సామర్ధ్యం, వేగం కాకుండా ఇంకా సేఫ్టీ విషయంలో ఏ విధమైన మార్పులకు లోనవుతుంది అన్న దానిని ఇప్పుడే అంచనా వేయలేం.
ఇప్పటి వరకైతే అందరూ జాగ్రత్తగా ప్రయణిస్తూ, క్షేమంగానే తమ గమ్యాలకు చేరుకుంటున్నారని ఆశిద్దాం.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- కరోనావైరస్: విద్యార్థుల చదువుల్ని సంక్షోభంలో పడేస్తోందా? ఆన్లైన్ తరగతుల ప్రభావం వారిపై ఎలా ఉంటోంది?
- కరోనావైరస్ లాక్‌డౌన్‌తో భారత్‌లో ఒక్కనెలలోనే నిరుద్యోగులుగా మారిన 12.2 కోట్ల మంది
- సోనూ సూద్: ఈ ‘విలన్’ వలస కార్మికులకు ‘దేవుడు’ ఎలా అయ్యారు?
- కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు
- ఇద్దరమ్మాయిలు ఒక్కటయ్యారు.. పరువు కోసం చంపేస్తామంటున్న కుటుంబం
- స్విమ్మింగ్ పూల్‌ను చేపల చెరువుగా మార్చిన కేరళ రిసార్ట్
- ఇందిరా గాంధీపై రిచర్డ్ నిక్సన్ అనుచిత వ్యాఖ్యలు.. బయటపెట్టిన ఆడియో టేపులు
- ఏడు నెలల గర్భంతో ఉన్న భార్యను తీసుకుని 1200 కిలోమీటర్లు స్కూటీపై ప్రయాణం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








