బెలారస్: ప్రతిపక్ష నేత మరియా కొలెస్నికోవాను నిర్బంధించిన దుండగులు - BBC Newsreel

మరియా కొలెస్నికోవా

ఫొటో సోర్స్, Reuters

బెలారస్ విపక్ష నేత మరియా కొలెస్నికోవాను గుర్తు తెలియని ముసుగు మనుషులు నిర్బంధించినట్లు స్థానిక మీడియా చెబుతోంది.

బెలారస్ రాజధాని నగరం మింస్క్‌లో కొందరు దుండగులు కొలెస్నికోవాను ఒక మినీ బస్సులో ఎక్కించుకుని తీసుకెళ్లారని సాక్షులు చెబుతున్నట్లు ఆ కథనాలు తెలిపాయి.

ప్రస్తుతం అధికారంలో ఉన్న అలెగ్జాండర్ లుకషెంకోను ఆగస్టు అధ్యక్ష ఎన్నికల్లో గద్దె దించడానికి చేతులు కలిపిన ముగ్గురు మహిళా నేతల్లో కొలస్నికోవా ఒకరు.

ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణల మధ్య ఆయన మళ్లీ ఎన్నికయినట్లు ప్రకటించడంతో దేశంలో పెద్ద ఎత్తున ప్రజాందోళనలు జరుగుతున్నాయి.

వరుసగా నాలుగో వారాంతంలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆదివారం 633 మందిని అదుపులోకి తీసుకున్నామని అంతర్గత వ్యవహారాల శాఖ చెప్పింది.

ఆందోళనకారుల్లో నలుగురు చనిపోయారని, వందల మంది గాయపడ్డారని, దేశంలో అసమ్మతిని అణచివేశామని తెలిపింది.

మరియా కొలెస్నికోవాకు ఏం జరిగింది?

సోమవారం ఉదయం కొలెస్నికోవా దగ్గరున్న మొబైల్ ఫోన్ తీసుకున్న కొందరు ముసుగు మనుషులు ఆమెను ఒక మినీ బస్సులోకి ఎక్కించి, తీసుకువెళ్లారని ఒక ప్రత్యక్ష సాక్షి బెలారస్ వార్తా సంస్థ టుట్‌.బైకి చెప్పాడు.

మింస్క్ పోలీసులు ఈ వార్తలపై ఇప్పటివరకూ స్పందించలేదు.

దేశంలో అధికార బదిలీ జరిగేలా ప్రతిపక్షం ఏర్పాటు చేసిన కో-ఆర్డినేషన్ కౌన్సిల్‌లో కొలెస్నికోవా సభ్యులుగా ఉన్నారు.

ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దేశంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని, జాతీయ భద్రతను ప్రమాదంలో పెట్టాలనే లక్ష్యంతోనే కోఆర్డినేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది.

హాంకాంగ్ నిరసనలు

ఫొటో సోర్స్, HKUST RADIO NEWS REPORTING TEAM VIA REUTERS

ఫొటో క్యాప్షన్, 12 ఏళ్ల బాలికను కాళ్లతో తొక్కిపెట్టి అదుపులోకి తీసుకుంటున్న ఈ దృశ్యం, వీడియో వైరల్ అయింది

హాంకాంగ్‌: 12 ఏళ్ల బాలికను నేల మీద తొక్కిపెట్టి అదుపులోకి తీసుకున్న పోలీసులు

హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా చేస్తున్న ర్యాలీలో 12 యేళ్ల బాలికను పోలీసు అధికారులు కిందకు నెట్టి బలవంతంగా చేతులు కట్టి అదుపులోకి తీసుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది.

ఈ చర్యలకు పాల్పడిన పోలీసులను ఉద్యోగం నుంచీ తొలగించారు. ఆ బాలిక చట్ట విరుద్ధమైన నిరసనల్లో పాల్గొన్నదనీ, అధికారులు విచారించబోతే అనుమానాస్పద రీతిలో పారిపోవడానికి ప్రయత్నించిందనీ, అందుకే ఆ అమ్మాయిని అలా బంధించవలసి వచ్చిందనీ పోలీసులు అంటున్నారు.

అయితే, ఆ అమ్మాయి తన స్కూలుకు కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి బయటకు వచ్చిందనీ, పోలీసులు దగ్గరకు రాగానే భయపడి పారిపోవడానికి ప్రయత్నించిందనీ ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

ఆదివారం జరిగిన ఈ నిరసనలో దాదాపు 300 మందిని అరస్ట్ చేసారు.

హాంకాంగ్ పార్లిమెంట్ ఎన్నికలను వచ్చే ఏడాదికి వాయిదా వేయనున్నట్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు.

2019 నుంచీ హాంకాంగ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. దోషుల అప్పగింతపై చైనాకు, ఇతర దేశాలకు మధ్య ఒప్పందాన్ని కుదిర్చే చట్ట ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిరసనలు మొదలైనప్పటికీ, నిరసనకారులపై పోలీసులు జులుం చూపిస్తున్నారంటూ, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి.

ఈ నిరసనల్లో పాల్గొన్న వేలమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విద్యార్థులు, 12 నుంచీ 15 వయసు గల బాలబాలికలు కూడా అనేకమంది ఉన్నారు.

జమాల్ ఖషోగ్జీ

ఫొటో సోర్స్, Getty Images

జమాల్ ఖషోగ్జీ హత్య కేసు: నిందితులకు మరణశిక్షలను జైలు శిక్షగా మార్చిన సౌదీ కోర్టు

సౌదీ అరేబియాలోని ఒక కోర్టు 2018లో జరిగిన జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో ఐదుగురు నిందితులకు విధించిన మరణశిక్షను జైలు శిక్షగా మార్చినట్లు స్థానిక మీడియా చెప్పింది.

జర్నలిస్ట్ ఖషోగ్జీ కుటుంబం నిందితులను క్షమించడంతో కోర్టు వారి మరణ శిక్షను 20 ఏళ్ల జైలు శిక్షగా మార్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పారు. మరో ముగ్గురు నిందితులకు ఏడు నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించారు.

సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని విమర్శించే ఖషోగ్జీ టర్కీ, ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో సౌదీ ఏజెంట్ల చేతిలో హత్యకు గురయ్యారు.

ఖషోగ్జీ ఒక 'రోగ్ ఆపరేషన్‌'లో హత్యకు గురయ్యారని సౌదీ ప్రభుత్వం చెప్పింది. తర్వాత ఏడాది 11 మంది గుర్తు తెలియని వ్యక్తులను సౌదీ అరేబియా కోర్టులో విచారించారు.

నిందితుల్లోని ఐదుగురికి నేరుగా ఈ హత్యలో ప్రమేయం ఉన్నందుకు మరణశిక్ష విధించారు, నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన మరో ముగ్గురికి జైలు శిక్ష విధించారు. మిగతా ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించారు.

ఐక్యరాజ్యసమితి ప్రత్యేక దూత ఈ విచారణను 'న్యాయ విరుద్ధమైనది'గా కొట్టిపారేశారు. "పక్కా ప్రణాళిక ప్రకారం ఉద్దేశపూర్వకంగా అమలు చేసిన దానిలో ఖషోగ్జీ బాధితుడని, దానికి సౌదీ అరేబియానే కారణమ"ని ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.

ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, SPBALU/FB

ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం: 'కోవిడ్ 19 నెగటివ్ వచ్చింది.. ఇంకా ఐసీయూలోనే ఉన్నారు'

ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యానికి తాజాగా చేసిన కరోనావైరస్ పరీక్షల్లో 'నెగటివ్' అని వచ్చిందని ఆయన కుమారుడు ఎస్‌పీ చరణ్ తెలిపారు.

అయితే ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని చెప్పారు. సోమవారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోలో చరణ్ ఈ వివరాలు తెలిపారు.

బాలు నెలకు పైగా చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ నుంచి బాలు ఇంకా కోలుకోవాల్సి ఉందని చరణ్ తెలిపారు. ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నాయని, అయితే దీనికి కొంత సమయం పడుతోందని చెప్పారు.

పోస్ట్‌ Instagram స్కిప్ చేయండి
Instagram ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of Instagram ముగిసింది

వారాంతంలో అమ్మానాన్నల వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నామని చరణ్ తెలిపారు.

తమ తండ్రి ఐపాడ్‌లో క్రికెట్, టెన్నిస్ చూస్తున్నారని తెలిపారు. ఐపీఎల్ మ్యాచుల కోసం ఆయన ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆయనకు ఫిజియోథెరపీ జరుగుతోందని వివరించారు.

ఆయనకు క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ జరుగుతోందనీ, ధైర్యంగా ఉన్నారని చెప్తూ ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నవారందరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రుడు

ఫొటో సోర్స్, NASA/JPL/Northwestern University

చంద్రుడికి తుప్పు పడుతోంది: నాసా పరిశోధనలో వెల్లడి

చంద్రుడి మీద హెమటైట్ అనే రకం తుప్పు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది.

సాధారణంగా ఇలాంటి తుప్పు ఏర్పడటానికి ఆక్సీజన్, నీరు అవసరం. కానీ, చంద్రుడిపై గాలి, నీరు లేవు. అయినా చంద్రుడిపై తుప్పు కనిపించడం పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-1 ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలంపై మంచు, ఇతర ఖనిజ లవణాలు ఉన్నట్లు 2008లో గుర్తించింది.

చంద్రయాన్-1లోని మూన్ మినరాలజీ మ్యాపర్ (ఎమ్3) పరికరం పంపిన సమాచారాన్ని హవాయి యూనివర్సిటీ పరిశోధకులు లోతుగా విశ్లేషించారు. వారి అధ్యయనంలోనే చంద్రుడి తుప్పు విషయం వెలుగుచూసింది. ఎమ్3 పరికరాన్ని నాసా తయారుచేసింది.

చంద్రుడిపై వాతావరణం లేనప్పటికీ, భూ అయాస్కాంత క్షేత్రం కారణంగా దానిపై చిన్న మొత్తాల్లో ఆక్సిజన్ ఉంది. ఈ అయస్కాంత క్షేత్రం ద్వారా భూమి నుంచి ఆక్సిజన్ చంద్రుడి పైకి చేరుకుంటోంది.

చంద్రుడిపై తుప్పు కనిపించడానికి ఇదో కారణమై ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు. వందల కోట్ల ఏళ్లుగా ఇలా భూమి మీద నుంచి వెళ్లిన ఆక్సిజన్ చంద్రుడిని తుప్పు పట్టిస్తూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

నిత్యం చంద్రుడిపై పడే దుమ్ము కణాలు దానిపైనున్న మంచు నుంచి నీటు అణువులు వెడువలేలా చేస్తుండొచ్చని, అది ఇనుముతో చేరి తుప్పు ఏర్పడుతుండవచ్చని కూడా భావిస్తున్నారు.

అంగారక గ్రహానికి ఎరుపు రంగు కూడా ఆ గ్రహం ఉపరితంలపైనున్న తప్పు వల్లే వచ్చింది. ఒకప్పుడు ఆ గ్రహంపై నీరు, ఆక్సిజన్ ఉండేవన్నదానికి అది సంకేతమని పరిశోధకులు చెబుతుంటారు.

జపాన్ ఒలంపిక్స్

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్‌ ఉన్నా, లేకున్నా ఒలింపిక్‌ క్రీడలు జరుగుతాయి: ఐఓసీ

కోవిడ్‌ ఉన్నా, లేకున్నా వచ్చే ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్‌ క్రీడలు మొదలవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) ప్రకటించింది. ఈ విషయాన్ని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు ధృవీకరించిన ఐఓసీ ఉపాధ్యక్షుడు జాన్‌కోట్స్‌ " ఈ క్రీడలు కోవిడ్‌ను ఓడిస్తాయి'' అని వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది జులైలో జరగాల్సిన ఒలింపిక్‌ క్రీడలు కోవిడ్‌-19 కారణంగా వాయిదాపడ్డాయి. ఈ వాయిదా 2021 తర్వాతి వరకు కొనసాగదని ఐఓసీ అధికారులు వ్యాఖ్యానించారు.

పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించడం ద్వారా ఒలింపిక్‌ క్రీడలను నిర్వహించాలని మొదట నిర్వాహకులు భావించారు. కానీ అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోకూడదన్న ఉద్దేశంతో వాయిదా వేశారు.

ఈ ఒలింపిక్‌ క్రీడల్లో 200 దేశాల నుంచి సుమారు 11,000మంది క్రీడాకారులు పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం దేశంలోకి విదేశీయులనెవరినీ అనుమతించకుండా కఠిన నిబంధనలను జపాన్‌ అమలు చేస్తోంది.

వచ్చే ఏడాదికల్లా వ్యాక్సిన్‌ వస్తే మంచిదేనని, అయితే వ్యాక్సిన్‌ వేసుకోని వారిని క్రీడల్లో పాల్గొననీయబోమన్న నిబంధన ఏదీ లేదని టోక్యో 2020 చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ తొషిరో ముటో అన్నారు.

కరోనా మహమ్మారికి ముందు యుద్ధం కారణంగా ఒలింపిక్‌ క్రీడలు ఒకేఒకసారి రద్దయ్యాయి.

ఈగ ఇబ్బంది పెడుతుండటంతో ఆ వృద్ధుడు దాన్ని చంపాలనుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈగ ఇబ్బంది పెడుతుండటంతో ఆ వృద్ధుడు దాన్ని చంపాలనుకున్నారు.

సినిమా కాదు, నిజంగానే.. ఈగను చంపాలనుకుంటే ఇల్లు తగలబడింది

ఫ్రాన్స్‌కు చెందిన ఎనభైయేళ్ల వృద్ధుడు ఈగను చంపడానికి ప్రయత్నించి, తన ఇంటిలో కొంతభాగాన్ని తగలబెట్టుకున్నారు.

తన చుట్టూ తిరుగుతూ విసిగిస్తున్న ఈగను ఎలాగైనా చంపాలనుకున్న ఆయన, దోమలు, పురుగుల్ని చంపే ఎలక్ట్రిక్‌ బ్యాట్‌ను పట్టుకుని వెంబడించారు.

అయితే అప్పటికే ఇంట్లో గ్యాస్‌ లీకవుతున్న విషయాన్ని ఆయన గమనించలేదు. ఎలక్ట్రిక్‌ బ్యాట్ నుంచి వచ్చిన నిప్పురవ్వలతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

కిచెన్‌తోపాటు, ఇంటి పైకప్పు కూడా ధ్వంసమైంది.

ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు.

అయితే చివరకు ఆ ఈగ చచ్చిందా, బతికిందా అన్నది మాత్రం తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)