స్విమ్మింగ్ పూల్‌ను చేపల చెరువుగా మార్చిన కేరళ రిసార్ట్

వీడియో క్యాప్షన్, స్విమ్మింగ్‌పూల్‌లో చేపల పెంపకం.. ‘రూ.5 లక్షల పెట్టుబడి, రూ.15 లక్షల ఆదాయం’
    • రచయిత, వరికూటి రామకృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కరోనాతో మనిషి జీవితమే మారిపోయింది. మనుగడ కోసం కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి. కూలీలుగా మారిన టీచర్లను కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను చూశాం. హోటళ్లు క్వారంటైన్ సెంటర్లుగా మారుతున్న తీరును విన్నాం. ఇప్పుడు కేరళలోని ఒక రిసార్ట్ స్విమ్మింగ్ పూల్‌లో చేపలు పెంచుతోంది. దేశీ, విదేశీ అతిథులు జలకాలాడే ఈ స్విమ్మింగ్ పూల్‌లో నేడు చేపలు పెరుగుతున్నాయి.

కేరళ అనగానే అందమైన ప్రకృతి కళ్ల ముందు కదులుతుంది. ప్రతి ఏడాది ఇక్కడకు లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. కేరళ ప్రభుత్వానికి ఆదాయం తీసుకురావడంలోనూ ప్రజలకు ఉపాధి కల్పించడంలోనూ టూరిజం సెక్టార్‌ది కీలక పాత్ర. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంపై కోటి మందికిపైగా ప్రజలు ఆధారపడి ఉన్నారు.

ఖాళీగా ఉన్న రిసార్ట్

ఫొటో సోర్స్, Aveda Resorts

ఫొటో క్యాప్షన్, లాక్‌డౌన్‌తో పర్యాటకులు లేక హోటళ్లు, రిసార్టులు ఖాళీగా ఉంటున్నాయి

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి

టూరిజంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. హోటళ్లు, రిసార్టులు మూతపడ్డాయి.

కరోనా సంక్షోభంతో దాదాపు రూ.25,000 కోట్లు నష్టపోయినట్లు కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొందరి ఉద్యోగాలు పోతే మరికొందరికి జీతాలు అందడం లేదు.

ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు కాస్త కొత్తగా ఆలోచించింది కేరళలోని అవేదా రిసార్ట్స్. ఇటు నిర్వహణ ఖర్చులతోపాటు అటు ఉద్యోగులకు ఎంతోకొంత పని చూపించాలనే ఉద్దేశంతో స్విమ్మింగ్ పూల్‌లో చేపలు పెంచాలని నిర్ణయించింది యాజమాన్యం.

కేరళ టూరిజం బోటు హౌస్
ఫొటో క్యాప్షన్, కేరళ ప్రజలకు ఉపాధి కల్పించడంలో టూరిజం కీలక పాత్ర పోషిస్తోంది

'లాక్‌డౌన్‌తో కొద్ది నెలలుగా పని లేకుండా పోయింది. హోటళ్లు, రిసార్టులు మూతపడే ఉన్నాయి. ఆదాయం లేక ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితి. రిసార్ట్ మెయింటనెన్స్ ఖర్చులు కూడా భారంగా మారాయి.' అని అవేదా రిసార్ట్స్ అండ్ స్పా జనరల్ మేనేజర్ జ్యోతీశ్ సురేంద్రన్ బీబీసీతో అన్నారు. ఉన్న స్థలాన్ని, వనరులను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో చేపలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కరిమీన్ జాతి చేప

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కరిమీన్ జాతి చేప

‘రూ.5-6 లక్షల పెట్టుబడి’

అవేదా రిసార్ట్స్‌లో పని చేసే ఉద్యోగుల్లో కొందరు ఇళ్లకు వెళ్లిపోగా మెయింటనెన్స్ కోసం కొందరు అక్కడే ఉన్నారు. వీళ్లకు ఏదో ఒక పని చూపించడంతోపాటు తమకు కొంత ఆదాయం వచ్చే పని ఏదో ఒకటి చేయాలని రిసార్ట్ యాజమాన్యం భావించింది.

తమ వద్ద ఉన్న 150 మీటర్ల పొడవైన స్విమ్మింగ్ పూల్‌ను అందుకు ఉపయోగించాలని నిర్ణయించినట్లు అవేదా రిసార్ట్స్ అండ్ స్పా మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ చావ్లా అన్నారు. ఆక్వాకల్చర్ నిపుణులతో మాట్లాడి వారి సలహా మేరకు 16 వేల కరిమీను జాతి చేప పిల్లలను స్విమ్మింగ్ పూల్‌లో వేశారు. ఇందుకు రూ.5-6 లక్షలు పెట్టుబడి అవుతుందని ఆయన తెలిపారు.

చేపల చెరువుగా మారిన స్విమ్మింగ్ పూల్

ఫొటో సోర్స్, Aveda Resorts

ఫొటో క్యాప్షన్, చేపల చెరువుగా మారిన స్విమ్మింగ్ పూల్

‘రూ.15 లక్షల ఆదాయం’

డిసెంబర్ నాటికి పంట చేతికి వస్తుందని వారు భావిస్తున్నారు. ఆ సమయంలో మంచి డిమాండ్ ఉంటుంది కనుక గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేయాలని ఆలోచిస్తున్నారు.

మొత్తం మీద 2-2.5 టన్నుల దిగుబడి రావొచ్చని, తద్వారా సుమారు రూ.15 లక్షలు ఆదాయం రావొచ్చని ప్రశాంత్ అంచనా వేస్తున్నారు.

కరోనా సంక్షోభంతో ఈ రిసార్ట్ కొత్త పనిని నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ నైపుణ్యంతో భవిష్యత్తులో మరింత భారీ స్థాయిలో చేపల పెంపకాన్ని చేపడతామని ప్రశాంత్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)