కరోనావైరస్-రష్యా: ‘మా వ్యాక్సిన్ పనిచేస్తోంది.. సైడ్ ఎఫెక్టులు పెద్దగా లేవు’

ఫొటో సోర్స్, Reuters
శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ తమ వ్యాక్సిన్‌కు స్పందిస్తున్నట్లు ప్రాథమికంగా జరిపిన పరీక్షల్లో తేలిందని రష్యన్ సైంటిస్టులు ప్రకటించారు. దీనికి సంబంధించి వారు తొలి నివేదికను విడుదల చేశారు.
‘ది లాన్సెట్’ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ నివేదికలో వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి వ్యక్తిలో యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నట్లు గుర్తించామని, దీనివల్ల పెద్దగా సైడ్‌ఎఫెక్ట్‌లు లేవని శాస్త్రవేత్తలు ఈ రిపోర్టులో పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్‌ను స్థానికంగా ఉపయోగించడానికి రష్యా ఆగస్టులోనే లైసెన్సును పొందింది. దీంతో కరోనా వ్యాక్సిన్‌కు లైసెన్స్ పొందిన తొలిదేశంగా ఆ దేశం నిలిచింది.
అయితే ఈ ట్రయల్స్ చాలా తక్కువ సంఖ్యలో జరిగాయని, దీని ప్రభావం, సైడ్‌ఎఫెక్ట్స్ గురించి ఇప్పుడే అంచనా వేయడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.
రష్యా మాత్రం ఈ ఫలితాలు విమర్శకులకు సమాధానమని వాదిస్తోంది. కొన్ని పాశ్చాత్య దేశాల ఆరోగ్య నిపుణులు మాత్రం ఇది హడావుడిగా తయారు చేసిన వ్యాక్సిన్ అంటున్నారు. తాము వ్యాక్సిన్‌ను సిద్ధం చేశామని, ఇది అన్ని టెస్టుల్లోనూ విజయవంతమైందని, తన కూతుళ్లకే తొలి వ్యాక్సిన్ ఇచ్చామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంతకు ముందు ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
నివేదికలో ఏముంది?
స్పుత్నిక్-V పేరుతో జూన్, జూలై నెలల్లో రష్యా రెండు ట్రయల్స్‌ను నిర్వహించింది. ఇందులో ప్రతి టెస్టుకు 38మంది వాలంటీర్లను ఎంచుకున్నారు. ముందు ఒక వ్యాక్సిన్ డోస్, ఆ తర్వాత మూడు వారాలకు మరో బూస్టర్ వ్యాక్సిన్ డోస్‌ను ఇచ్చారు.
ఈ ట్రయల్స్‌లో పాల్గొన్న వారందరూ 18 నుంచి 60 సంవత్సరాలలోపు వారే. వీరిని 42 రోజులపాటు పరిశీలించారు. మూడు వారాలలోపే వీరందరిలో యాంటీబాడీస్‌ను గుర్తించారు. వీరిలో చాలామందికి అతి సాధారణంగా వచ్చే తలనొప్పి, ఒళ్లునొప్పులులాంటి స్వల్పమైన సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయి.
ఈ ట్రయల్స్ అన్నింటిని పారదర్శకంగా నిర్వహించారు. ఇందులో పాల్గొంటున్నవారందరికీ తాము వ్యాక్సిన్ తీసుకుంటున్న విషయం తెలుసు. “ప్లాసిబో కంపారిజన్‌తోపాటు పెద్ద ఎత్తున టెస్టులు నిర్వహించి, దీర్ఘకాల ప్రభావాలను ఇంకా పరిశీలించాల్సి ఉంది. సుదీర్ఘ కాలంలో ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎంత, అది కోవిడ్-19ఇన్‌ఫెక్షన్‌ను ఎంతమాత్రం అదుపు చేయగలుగుతుంది అన్నది తెలుసుకోవాల్సి ఉంది’’ అని ఆ నివేదిక పేర్కొంది.
రాబోయే కాలంలో వివిధ వయోవర్గాలకు చెందిన 40,000మంది వాలంటీర్లపై మూడో దశ ట్రయల్స్ జరపనున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
సాధారణ జలుబుకు కారణమయ్యే ఎడినోవైరస్ అనే బ్యాక్టీరియా కణాలను రష్యా వ్యాక్సిన్‌లో ఉపయోగించారు.


ఫొటో సోర్స్, Reuters
సాధించాల్సింది చాలా ఉంది
బీబీసీ హెల్త్ రిపోర్టర్ ఫిలిప్పా రాక్స్‌బీ విశ్లేషణ
ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఇప్పటి వరకు ఇదే మేలని యూకేకు చెందిన అనేక మంది సైంటిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నది స్పష్టం. రెండో దశ ట్రయల్స్‌లో అందరి నుంచి సానుకూల ఫలితాలు వచ్చినంత మాత్రాన అది వారిని వైరస్ నుంచి రక్షిస్తుందని చెప్పడం కష్టం. అది ఇంకా నిరూపణ కాలేదు.
ఈ పరీక్షల ద్వారా కేవలం 42 రోజుల పరిశీలనలో ఆరోగ్యవంతులైన 18 నుంచి 60 సంవత్సరాల వయోవర్గం వారికి మాత్రమే ఇది సరైనది అని మాత్రమే చెప్పగలుగుతున్నారు. కానీ వృద్ధులు, ఇతర వ్యాధులు ఉన్నవారికి ఇది ఎంత సురక్షితమో చెప్పలేదు.
పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారికి డమ్మీ ఇంజెక్షన్‌లు, వ్యాక్సిన్‌లు ఇచ్చి పరిశీలన జరిపిన తర్వాతనే ఇది దీర్ఘకాలంలో ఎంత ప్రయోజనకరమైందో చెప్పగలం. అప్పుడే ఎక్కువమందిపై ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని భావించాల్సి ఉంటుంది.
అంతేకాదు ఇది ప్రపంచంలోని అన్ని వర్గాల వారికి పని చేస్తుందని చెప్పడానికి కూడా వీలులేదు. ఎందుకంటే పరీక్షలు ఎవరి మీద జరిపారు, ఏ పరిస్థితుల్లో జరిపారు అన్నది కూడా ముఖ్యమే. కొన్నిచోట్ల పని చేసిన వ్యాక్సిన్‌లు మరికొన్నిచోట్ల, మరికొన్ని వర్గాల మీద పని చేయక పోవచ్చు. అందువల్ల ఇది అందరి మీద ఎంత వరకు పని చేస్తుందన్నది కీలకం. కాబట్టి అందరికీ ఒకటే వ్యాక్సిన్ పనికొస్తుందని చెప్పలేం.


ఫొటో సోర్స్, PA MEDIA
ఎవరు ఏమంటున్నారు?
“ఇది మా పరిశోధనల మీద నిరాధార ఆరోపణలు చేసేవారికి సరైన సమాధానం” అని ఈ రిపోర్ట్ విడుదల సందర్భంగా వ్యాక్సిన్‌కు ఆర్దిక సహకారం అందిస్తున్న సంస్థకు చెందిన కిరిల్ దిమిత్రివ్ అన్నారు.
మరో దశ ట్రయల్స్ కోసం ఇప్పటికే 3,000మందిని ఎంపిక చేశామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నవంబర్ లేదా డిసెంబర్‌లలో తమ దేశంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తామని రష్యా ఆరోగ్య శాఖమంత్రి మిఖాయిల్ మురాష్కో వెల్లడించారు. కరోనా వైరస్‌కు ఎక్కువగా ఇబ్బంది పడే వర్గాలకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యమిస్తామని ఆయన అన్నారు.
అయితే వ్యాక్సిన్ మార్కెట్లోకి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. “ఇప్పటి వరకైతే ఈ వ్యాక్సిన్ మీద రిపోర్టులు సానుకూలంగా ఉన్నాయి’’ అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న బ్రెండాన్ వెన్ రాయిటర్స్ తో అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 176 వ్యాక్సిన్‌లు వివిధ లేబరేటరీలో తయారవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఇందులో 34 వ్యాక్సిన్లకు మనుషులపై ప్రయోగాలు జరిగాయని, 8 వ్యాక్సిన్‌లు కీలకమైన మూడో దశ పరీక్షల్లో ఉన్నాయని తెలిపింది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- వ్యాక్సిన్లు పనిచేస్తాయా.. టీకాలపై భారతీయులకు నమ్మకముందా
- కరోనావైరస్: రష్యా గూఢచారులు 'కోవిడ్-19 వ్యాక్సీన్ పరిశోధనలను హ్యాక్ చేస్తున్నారు'
- కృష్ణ బిలం: ఒకేసారి ఎనిమిది సూర్యుళ్ల శక్తితో వెలువడిన గురుత్వాకర్షణ తరంగం
- ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుతున్నాయా?
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- చేతులు శుభ్రం చేసుకోవడానికి సబ్బు మంచిదా.. హ్యాండ్‌వాష్ మంచిదా.. శానిటైజర్ మంచిదా?
- ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









