ఆఫ్రికాలో కరోనావైరస్ తక్కువగా ఉండటానికి కారణమేంటి? పేదరికమే కాపాడుతోందా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, ఆండ్రూ హార్డింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆఫ్రికా ఖండంలో కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు, మరణాల రేట్లు తక్కువగా ఉండటానికి... అక్కడి పేదరికం, జనం కిక్కిరిసి ఉండే ఆవాసాలు కారణమయ్యాయా? పరిశోధకులు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య బాగా పడిపోయింది. మిగతా ప్రాంతాలతో పోల్చితే ఆఫ్రికా ఖండవ్యాప్తంగా పరిస్థితి తీవ్రత తక్కువగానే ఉంది.
రద్దీ ఉండే జనావాసాలు, అపరిశుభ్రత ఈ పరిస్థితికి ఏమైనా కారణమా అనే విషయంపై పరిశోధకులు దృష్టిసారించారు.
ఆఫ్రికాలోని చాలా పట్టణాల్లోని దుర్భరమైన జీవన పరిస్థితుల కారణంగా కరోనావైరస్ వ్యాప్తి వేగం బాగా పెరగొచ్చని కొన్ని నెలలుగా ఆరోగ్య నిపుణులు అంచనాలు వేస్తూ వచ్చారు.
‘‘జనాభా సాంద్రత చాలా ప్రధానమైన అంశం. సామాజిక దూరం పాటించే అవకాశమే లేకపోతే, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది’’ అని దక్షిణాఫ్రికా కోవిడ్-19 మార్గదర్శక బృందం హెడ్ ప్రొఫెసర్ సలీం అబ్దుల్ కరీం అన్నారు.
కానీ, వాస్తవ పరిస్థితి ఈ వాదనకు పూర్తి విరుద్ధంగా ఉంది.
జన సాంద్రత ఎక్కువగా ఉండటమే ఆఫ్రికాకు సానుకూలమైన విషయమైందా? పేదరికమే రక్షణ కవచంలా మారిందా? అన్న ఆలోచన ఇప్పుడు నిపుణులకు ఆసక్తి కలిగిస్తోంది.

‘అంతు చిక్కట్లేదు’
ఇప్పటివరకూ ఆఫ్రికా ఖండవ్యాప్తంగా 12లక్షలకుపైగా మందికి కరోనావైరస్ సోకింది. వీరిలో దాదాపు 30 వేల మంది చనిపోయారు.
కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి ఆరంభ దశల్లో ఆఫ్రికాకు పెను ముప్పు పొంచి ఉందని అందరూ అంచనాలు వేశారు.
‘‘మాకు వినాశనం తప్పదనే అనుకున్నా. పూర్తిగా కకావికలమైపోతామనుకున్నా’’ అని దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ షబీర్ మదీ అన్నారు.
ఆఫ్రికా ఖండంలో మెరుగైన వైద్య వ్యవస్థ ఉన్న దక్షిణాఫ్రికాలోనూ ఆసుపత్రులు త్వరగానే నిండిపోతాయని అందరూ అంచనా వేశారు.
కానీ, ఇప్పటికీ దక్షిణాఫ్రికాలో కేసుల సంఖ్య బ్రిటన్ కన్నా ఏడు రెట్లు తక్కువగా ఉంది.
ఒకవేళ మరణాలు అసలు సంఖ్య కన్నా తక్కువగా నమోదు అవుతున్నాయనుకున్నా, దక్షిణాఫ్రికాలో పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది. ఖండంలోని మిగతా ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి.
మిగతా దేశాల్లోలా కేసులు సంఖ్యల ఒకేసారి వేగంగా పెరిగే ధోరణి ఇక్కడ కనిపించడం లేదు. చాలావరకూ ఆసుపత్రుల్లో పడకలు ఖాళీగా ఉంటున్నాయి.
‘‘ఆఫ్రికాలోని చాలా దేశాల్లో కరోనావైరస్ పీక్ అనేది రాలేదు. ఈ పరిస్థితి ఎందుకు ఉందో అసలు అర్థం కావడం లేదు’’ అని అని ప్రొఫెసర్ కరీం అన్నారు.
‘‘ఇది అంతుచిక్కకుండా ఉంది. అస్సలు నమ్మశక్యంగా లేదు’’ అని ప్రొఫెసర్ మదీ ఆయనతో ఏకీభవిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP
ఆఫ్రికాలో జనాభాలో ఎక్కువ భాగం యువత ఉండటం దీనికి ఓ కారణమై ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్రికా ఖండంలో ఉంటున్నవారి సగటు వయసు, యూరప్‌లో ఉంటున్నవారి సగటు వయసులో దాదాపు సగం ఉంటుంది.
80ల వయసు దాటి జీవించి ఆఫ్రికన్ల సంఖ్య చాలా తక్కువ. అందుకే, కరోనావైరస్ బారినపడి మృతి చెందేవారు కూడా తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
అయితే, రోజులు గడిచినకొద్దీ, కరోనా మహమ్మారి కొనసాగుతున్నకొద్దీ గణాంకాలకు సంబంధించిన సమాచారం చాలా వస్తోంది. దీంతో కేవలం జనాభాపరమైన సమీకరణాలు ఆఫ్రికాలో పరిస్థితులు మెరుగ్గా ఉండటానికి కారణం కాకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
వయసు మరీ ముఖ్యమైన అంశమేమీ కాదని ప్రొఫెసర్ కరీం అన్నారు.
దక్షిణాఫ్రికాలో, మిగతా ప్రాంతాల్లో త్వరగానే కఠినమైన లాక్‌డౌన్‌లు విధించడం బాగా ఉపకరించింది. మాస్క్‌ల ప్రాధాన్యత గురించి బాగా ప్రచారం చేయడం, ఆక్సీజన్ లభ్యత ఉండేలా చూసుకోవడం కూడా దోహదపడింది.
మిగతా ప్రాంతాలతో పోల్చితే, ఆఫ్రికాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం కూడా కరోనావైరస్ కట్టడికి తోడ్పడిందన్న వాదనలు కూడా ఉన్నాయి.
అయితే, ఆఫ్రికాలో కరోనావైరస్ వ్యాప్తి సమయం తీసుకుంటోందని, రాబోయే నెలల్లో పరిస్థితి తీవ్రమవ్వచ్చని చెబుతున్నవారు కూడా ఉన్నారు.
‘‘ఆఫ్రికాలో పెనుముప్పును దాటేశామని నేనైతే చెప్పలేను. రాబోయే రోజుల్లో కరోనావైరస్ విజృంభించే అవకాశాలు కూడా లేకపోలేదు’’ అని ప్రొఫెసర్ కరీం అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వేరే కరోనావైరస్‌ల వల్లా?
దక్షిణాఫ్రికాలోని వ్యాక్సిన్స్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీస్ అనలిటిక్స్ యూనిట్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఐదేళ్ల క్రితం తీసుకున్న మనుషుల రక్తపు నమూనాలపై పరిశోధనలు చేస్తున్నారు.
జలుబు, ఫ్లూ, జ్వరం లాంటివాటికి కారణమయ్యే ఇతర కరోనావైరస్‌లు ఇదివరకే సోకిన కారణంగా, కోవిడ్-19 పట్ల జనాల్లో ఎంతో కొంత నిరోధకత వచ్చిందా అన్న విషయం తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారు.
జలుబు, ఫ్లూలు ప్రపంచమంతటా ఉండేవే.
అయితే, ఆఫ్రికాలో జనం కిక్కిరిసి ఉండే ఆవాసాలు, పేదల కాలనీలు, అపరిశుభ్ర వాతావరణం వల్ల అవి స్థానిక జనాభాకు ఎక్కువగా సోకి ఉండే అవకాశాలున్నాయని... ఫలితంగా కోవిడ్-19 నుంచి వారికి కొంత నిరోధకత రావొచ్చని దక్షిణాఫ్రికా పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదే నిజమైతే, భారత్ లాంటి దేశాలకు కూడా ఇవే పరిస్థితులు వర్తించాలి.
‘‘ఆఫ్రికాలోని పరిస్థితుల్లో జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉండేవారికి నిరోధకత ఎక్కువగా వచ్చి ఉండొచ్చు. ఇది కాకుండా, ఈ పరిస్థితికి వేరే ఎలాంటి వివరణా నేను ఇవ్వలేకపోతున్నా. చాలా మంది లక్షణాలు లేనివారే ఉంటున్నారు’’ అని ప్రొఫెసర్ మదీ అన్నారు.
పేదరికం ఆఫ్రికాకు ఈ ఒక్కసారి మాత్రం వరమై ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
బ్రెజిల్ లాంటి దేశాల్లో జనం కిక్కిరిసి ఉండే ప్రాంతాల్లో మాత్రం ఇన్ఫెక్షన్ల రేటు ఎక్కువగానే ఉంది.
మరోవైపు వ్యాక్సిన్స్ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీస్ అనలిటిక్స్ యూనిట్ చేస్తున్న ప్రయోగాలకు ఓ సమస్య ఎదురైంది.
వారు తీసుకున్న శాంపిల్స్‌ని ఉంచుతున్న క్రియో కంటెయినర్లను చాలా చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచాల్సి ఉంటుంది. అయితే, కొన్ని కారణాలతో ఆ ఉష్ణోగ్రతలో మార్పులు వచ్చాయి. దీంతో శాంపిల్స్ పాడైపోయాయి.
కొత్త శాంపిల్స్ సేకరించేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, దీనికి కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








