చైనా ఆహార సంక్షోభం ఎదుర్కొంటోందా? ఆహారం వృథా చేయద్దని జిన్‌పింగ్ ఎందుకు పిలుపునిచ్చారు?

చైనా ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సురభి కౌల్
    • హోదా, బీబీసీ మానిటరింగ్

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2013 నాటి ''క్లీన్ యువర్ ప్లేట్'' కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించారు. ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన సూచించారు.

''ఆహార వృథా విపరీతంగా ఉంది. ఈ గణాంకాలు విస్మయానికి గురిచేసేలా ఉన్నాయి. వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలి''అని అధికారులకు జిన్‌పింగ్ సూచించినట్లు చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఆహార వృథాను సిగ్గుచేటుగా ప్రజలు భావించేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

''కొన్ని ఏళ్లకు సరిపడా ఆహార ధాన్యాలను చైనా ఇప్పటికే ఉత్పత్తి చేసింది. అయితే ఆహార భద్రతపై ప్రజలకు అవగాహన ఉండాలి''అని జిన్‌పింగ్ చెప్పినట్లు ద చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్‌వర్క్ (సీజీటీఎన్) పేర్కొంది.

జిన్‌పింగ్ ప్రకటన విడుదలైన వెంటనే.. ఆహారాన్ని ఎవరూ వృథా చేయకూడదంటూ అన్ని మీడియాల్లోనూ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి.

2015లో చైనాలోని మహా నగరాల్లో 17 నుంచి 18 టన్నుల ఆహారాన్ని వృథా చేసినట్లు గణాంకాలను మీడియాలో చూపిస్తున్నారు.

అభిమానుల కోసం ఆహారం విపరీతంగా తింటూ లైవ్‌లు ఇచ్చేవారిని సీసీటీవీ తీవ్రంగా విమర్శిస్తోంది.

మీడియాలో ఆహార వృథా, బాధ్యతారాహిత్య ప్రవర్తనల ప్రచారం నడుమ ఆహార సంక్షోభాన్ని ప్రభుత్వం దాచి పెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

చైనా

ఫొటో సోర్స్, NICOLAS ASFOURI

అదే అత్యంత ప్రమాదకరం..

కొన్ని ప్రావిన్స్‌లలో కరోనావైరస్, ప్రకృతి విపత్తుల నడుమ పంట నష్టంతో సంభవించిన ఆహార సంక్షోభంపై ప్రభుత్వ మీడియా ఎలాంటి వార్తలూ ప్రచురించడం లేదు.

ఆహార ఉత్పత్తిపై కరోనా మహమ్మరితోపాటు మిడతల దాడి చూపిన ప్రభావాన్ని సమర్థంగా ప్రభుత్వం నియంత్రించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాల నడుమ పంటలు నష్టపోతున్నప్పటికీ.. పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ మీడియా చెబుతోంది.

త్రీ గార్జి రిజర్వాయర్‌లో వరదలు, మిడతల దాడి ఉన్నప్పటికీ బంపర్ క్రాప్ వస్తుందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ షిన్‌హువా వివరిస్తోంది.

దేశంలో ధాన్యం, గోధుమ, వరి సరిపడా ఉన్నాయని ప్రభుత్వ మీడియా నొక్కి చెబుతోంది. అంతేకాదు ఈ ఏడాది ధాన్యాల ఉత్పత్తి మునుపటి కంటే ఎక్కువగా ఉండబోతోందని వివరిస్తోంది.

2019లో 664 మిలియన్ టన్నుల ధాన్యాలను చైనా ఉత్పత్తి చేసిందని చైనా వ్యవసాయ శాఖ గణాంకాలనూ ఉటంకించింది.

చైనా టీవీ ఛానెల్ సీజీటీఎన్ లెక్కల ప్రకారం.. 210 మిలియన్ టన్నుల వరి, 134 మిలియన్ టన్నుల గోధుమ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఏడాదికి దేశానికి 143 మిలియన్ టన్నుల వరి, 125 మిలియన్ టన్నుల గోధుమ మాత్రమే అవసరం అవుతాయి.

మరోవైపు వరదలు లేదా కోవిడ్-19తో వచ్చే ఆహార సంక్షోభం కంటే ఆహార వృథానే ఎక్కువ ప్రమాదకరమని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Pool

అది ఫేక్ న్యూస్

ఆహార ధాన్యాలను ఎవరూ అధికంగా నిల్వ చేయొద్దని చైనా మీడియా, సోషల్ మీడియా వేదికల్లో సూచిస్తున్నారు. అంతేకాదు ఆహార సంక్షోభం వార్తల్లో ఎలాంటి నిజమూలేదని, వాటిని నమ్మొద్దని చెబుతున్నారు.

దేశీయ ఆహార భద్రతను పశ్చిమ దేశాల వార్తా సంస్థలు తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని, ఆహార వృథాపై తాము చేపడుతున్న ప్రచారాన్ని సంక్షోభంగా భావిస్తున్నాని ప్రభుత్వ మీడియా వార్తలు ప్రచురిస్తోంది.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఈ ఏడాది మొదట్లోనూ ఇలాంటి వార్తలు వచ్చాయి.

చైనాలో 2025నాటికి 130 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల కొరత ఉందని ఓ ప్రభుత్వ మేధోమథన సంస్థ విడుదలచేసిన నివేదికపై ప్రజల్లో ఆందోళన మీద చైనా మీడియా దృష్టిపెట్టింది. పట్టణీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వయసు పెరగడం, తలసరి ఆహార ధాన్యాల వినియోగంలో పెరుగుదలే ఆహార ధాన్యాల పెరుగుదలకు కారణమని నివేదికలో పేర్కొన్నారు.

ద రూరల్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2020 పేరుతో రూరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ (సీఏఎస్‌ఎస్), ద చైనా సోషల్ సైన్సెస్ ప్రెస్ సంయుక్తంగా ఆగస్టు 17న ఈ నివేదికను విడుదల చేశాయి. 2025నాటికి గోధుమ, వరి, మొక్కజొన్న డిమాండ్ కంటే 25 మిలియన్ టన్నులు తక్కువగా అందుబాటులో ఉండబోతున్నాయని పేర్కొన్నాయి.

అయితే, కొన్ని మీడియా సంస్థలు ఈ నివేదికను తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని నివేదికనుతయారుచేసిన వారిలో ఒకరైన పరిశోధకులు లీ గూసియాంగ్ వ్యాఖ్యానించారు.

''దేశీయ సరఫరాలో వ్యత్సాసాన్ని దిగుమతులతో పూరించొచ్చు. అప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు''అని ఆయన చెప్పినట్లు ఆగస్టు 19న గ్లోబల్ టైమ్స్‌లో ఓ కథనం ప్రచురితమైంది.

చైనా ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే సీఏఎస్‌ఎస్ చెప్పిన వ్యత్యాసం అసలేమీ ఉండదని షాంఘైలో ఓ ప్రైవేటు వార్తా సంస్థ ఇసాయ్‌కు చెందిన రిపోర్టర్లు చెన్ హుయ్, హు జున్‌హువా పేర్కొన్నారు. మరోవైపు దిగుమతులపై ఆధారపడటం జాతీయ భద్రతకు మంచిది కాదని వారు వివరించారు.

''జీవనాధారమైన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడకూడదు. 140 కోట్ల మంది ప్రజల అవసరాల కోసం వేరే దేశాలపై ఆధారపడటం సరికాదు''అని వారు వ్యాఖ్యానించారు.

చైనా

ఫొటో సోర్స్, FREDERIC J. BROWN

పశ్చిమ మీడియా వల్లే

ఆహార భద్రతపై వస్తున్న వార్తల విషయంలో పశ్చిమ దేశాల వార్తా సంస్థలపై చైనా ప్రభుత్వ మీడియా, ముఖ్యంగా గ్లోబల్ టైమ్స్ విమర్శలు గుప్పిస్తోంది.

''దక్షిణ చైనాలో భారీ వరదలు, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల నడుమ దేశంలో ఆహార భద్రత ముప్పు పొంచివుందని కొన్ని పశ్చిమ దేశాల వార్తా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచురిస్తున్నాయి''అని ఆగస్టు 17న గ్లోబల్ టైమ్స్‌లో ఓ వార్త ప్రచురించారు.

ఈ విషయంలో విదేశీ మీడియాను విమర్శించే కంటే దేశంలోని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై స్థానిక మీడియా ఎక్కువ దృష్టిపెట్టింది.

సోషల్ మీడియా ఛానెల్ నడిపే ఓ వ్యక్తి పెట్టిన పోస్టే ఆహార సంక్షోభం వార్తలకు మూలమని ఆగస్టు 4న స్థానిక ప్రభుత్వ మీడియా సంస్థ ఎకనమిక్ డైలీ పేర్కొంది.

ఆహారాన్ని వృథా చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి చాలా మంది చైనా సోషల్ మీడియా వినియోగదారులు మద్దతుపలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేయొద్దని రెస్టారెంట్లు సూచిస్తున్నాయి. కొందరైతే మిగిలిన ఆహారాన్ని ఇంటికి తీసుకువెళ్లాలని చెబుతున్నారు.

కొందరైతే మరింత కఠినమైన చర్యలు సూచిస్తున్నారు. ఆహార ధాన్యాలతో ఆల్కహాల్ తయారీని నిలిపివేయాలని చెబుతున్నారు.

నెటిజన్ల కోసం భారీగా ఆహారం తింటూ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చే ప్రముఖులకు వ్యతిరేకంగా చేపట్టే ప్రచారానికి మంచి ఆదరణ వస్తోంది. బిగ్ బెల్లి స్టార్‌లను ప్రస్తుతం వృథా స్టార్‌లుగా అభివర్ణిస్తున్నారు.

అయితే, ఈ ప్రచారాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు కూడా.

''కావాల్సినంత తినే స్వేచ్ఛ ప్రజలకు ఉంది. దాన్ని చూసే స్వేచ్ఛ కూడా ఉంది. అన్నింటిపైనా ఆంక్షలు విధించడం సరికాదు''అని ఆగస్టు 13న ఒక వీబో వినియోగదారుడు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)