పీఎం కేర్స్ ఫండ్: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా దీనిపై ప్రశ్నలు ఎందుకు

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, ప్రవీణ్ శర్మ
- హోదా, బీబీసీ కోసం
పీఎం కేర్స్ ఫండ్ గురించి విపక్షాలు, యాక్టివిస్టులు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న సమయంలో సుప్రీంకోర్టు మంగళవారం ఒక కీలక తీర్పు వెలువరించింది.
ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్(పీఎం కేర్స్) ఫండ్‌ను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్(ఎన్‌డీఆర్ఎఫ్)లోకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పింది.
సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఒక ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. పీఎం కేర్స్ ఫండ్ డబ్బును ఎన్టీఆర్ఎఫ్‌లోకి బదిలీ చేయాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది.
కరోనా సమయంలో పీఎం కేర్స్ ఫండ్ నిధులను బదిలీ చేయాలని ప్రభుత్వానికి సూచించాలని ఎన్జీవో న్యాయస్థానాన్ని కోరింది. తమ పిటిషన్‌లో ఫండ్‌పై ప్రశ్నలు లేవనెత్తిన సంస్థ, పీఎం కేర్స్ ఫండ్‌కు ఇప్పటివరకూ ఎన్ని నిధులు వచ్చాయనే సమాచారం ఇవ్వకుండా కేంద్రం తప్పించుకుంటోందని ఆరోపించింది.
తీర్పుపై కాంగ్రెస్ స్పందన
సుప్రీంకోర్టు నిర్ణయంపై స్పందించిన కాంగ్రెస్ దీనిని పారదర్శకతకు, జవాబుదారీతనానికి తీవ్ర విఘాతం కలిగించేదిగా చెప్పింది.
“అస్పష్ట, అనుమానాస్పద విధానాలున్న ఈ ఫండ్‌లో పారదర్శకత తీసుకురావడానికి అత్యున్నత న్యాయస్థానానికి అవకాశం వచ్చింది” అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు,.
“విపత్తు నిర్వహణ చట్టంపై ఎలాంటి రాజ్యాంగ నిషేధం లేకపోవడం వల్ల, ఎన్డీఆర్ఎఫ్‌కు ఎప్పుడూ స్వచ్చందంగా విరాళాలు ఇవ్వవచ్చు” అని సుప్రీంకోర్టు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం తన తీర్పులో చెప్పింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బీజేపీ స్పందన
మరోవైపు, బీజేపీ ఈ తీర్పు వచ్చాక కాంగ్రెస్‌పై ఎదురుదాడి ప్రారంభించింది.
“రాహుల్ గాంధీ, సామాజిక సమస్యలను లేవనెత్తే ఆయన కిరాయి యాక్టివిస్టుల బృందం తప్పుడు ఉద్దేశాలకు పీఎం కేర్స్ ఫండ్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టు” అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
“చట్టపరమైన అవసరాలు, నిధుల నిర్వహణ పరంగా పీఎం కేర్స్ ఫండ్‌లో పారదర్శకత చాలా స్పష్టంగా ఉంది. హైకోర్ట్, సుప్రీంకోర్టుల్లో ఈ ఫండ్‌ను అకారణంగా లక్ష్యంగా చేసుకుంటున్నార”ని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
తన సలహాదారుల అభిప్రాయాల ప్రకారమే రాహుల్ గాంధీ ఇలా చేస్తున్నారు. వివిధ వేదికలపై ఆయన తన వరుస వ్యాఖ్యలతో దేశాన్ని బలహీనం చేశారని ఆయన ఆరోపించారు.
పీఎం కేర్స్ ఫండ్‌ను నడిపించేందుకు చట్టాన్ని అనుసరిస్తున్నామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
“కరోనాపై పోరాటం కోసం ఫండ్ నుంచి 3,100 కోట్ల రూపాయలు అందించాం. ఈ మొత్తంలో 2,000 కోట్లు వెంటిలేటర్లకు, వెయ్యి కోట్లు వలస కూలీల కోసం, వంద కోట్లు వాక్సిన్ తయారీ కోసం ఇచ్చామని” తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టే ఏం చేయనప్పుడు, సామాన్యుడు ఏం చేయగలడు
పీఎం కేర్స్ ఫండ్‌కు పునాది పడినప్పటి నుంచే దానిపై వివాదాలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలు, యాక్టివిస్టులు ఈ నిధుల ఉద్దేశాన్ని పదే పదే ప్రశ్నిస్తూ వచ్చారు.
“డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 46లో విపత్తుల సమయంలో ఏ నిధులు వచ్చినా, అవి ఎన్డీఆర్ఎఫ్‌లోకే వస్తాయి అని స్పష్టంగా చెప్పారు. అందుకే ఎలాంటి కొత్త ఫండ్ ఏర్పాటుచేయాల్సిన అవసరం లేద”ని సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ బీబీసీతో అన్నారు.
ఎన్డీఆర్ఎఫ్‌లో కాగ్ ఆడిట్ చేయవచ్చు. దీనిపై ఆర్టీఐ ప్రభావం కూడా ఉంటుంది. కానీ, పీఎం కేర్ ఫండ్‌ను కాగ్ ఆడిట్ చేయలేదు, ఆర్టీఐ ద్వారా దాని వివరాలు కూడా కోరలేం” అన్నారు.
“ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్‌కు సంబంధించిన ట్రస్ట్ డీడ్ కూడా చూపించడం లేదు. ఎందుకు. ఈ ఫండ్ వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు. ఈ మొత్తాన్ని ఎలా ఉపయోగిస్తారో కూడా తెలీడం లేదు” అంటారు ప్రశాంత్ భూషణ్.
“ఇప్పుడు సుప్రీంకోర్టే ఏం చేయలేకపోయినప్పుడు, సామాన్యుడు ఏం చేయగలడు. సుప్రీంకోర్టు పని ప్రభుత్వ జవాబుదారీ తనాన్ని నిర్ణయించడమే కదా” అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇంతకు ముందే ప్రజా ప్రయోజన వ్యాజ్యం
పీఎం కేర్స్ ఫండ్‌పై ఇంతకు ముందు కూడా పిల్ దాఖలైంది. ఒక పిటిషన్ అలహాబాద్ హైకోర్టులో ఇప్పటికీ పెండింగులో ఉంది.
సుప్రీంకోర్టు అడ్వకేట్ శాశ్వత్ ఆనంద్ ఏప్రిల్లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. పీఎం కేర్స్ ఫండ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 27న విత్‌డ్రా చేయించింది.
“ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఈ ఫండ్‌ను ఎన్డీఆర్ఎఫ్‌కు బదిలీ చేయాలనే డిమాండ్‌కు సంబంధించినది మాత్రమే. ఆ పిటిషన్‌లో ఈ ఫండ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరలేదు. బదులుగా అందులో ప్రభుత్వ ఉద్దేశాన్ని మాత్రమే ప్రశ్నించారు. పీఎం కేర్స్ ఫండ్ మొత్తం సమాచారం వెబ్‌సైట్‌లో పెట్టాలి. ప్రభుత్వం దాని ట్రస్ట్ డీడ్ కూడా బయటపెట్టాలి” అని శాశ్వత్ ఆనంద్ అన్నారు..
కాగ్‌తో పీఎం కేర్స్ ఫండ్ ఆడిట్ కూడా చేయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
“మేం అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్‌లో, పీఎం కేర్స్ ఫండ్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరడంతోపాటూ, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(పీఎంఎన్ఆర్ఎఫ్)ని కూడా రాజ్యాగవిరుద్ధంగా ప్రకటించాలని డిమాండ్ చేశామ”ని శాశ్వత్ చెప్పారు.
“పీఎం కేర్స్ ఫండ్ మొత్తం గణాంకాలు బయటపెట్టాలి. పీఎం కేర్స్ ట్రస్ట్ ఒక ప్రభుత్వ ట్రస్ట్. పీఎం మోదీ ప్రధానమంత్రి హోదాలో ఆ ఫండ్ ఏర్పాటుచేశారు” అంటున్నారు.
“ఇలాంటి ట్రస్టులు ఏర్పాటుచేయకూడదు. ఇలాంటి ఫండ్ చట్టాలు చేశాక మాత్రమే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం దీనిని ఏ చట్టం లేకుండానే చేసింది. అందుకే పీఎం కేర్స్ ఫండ్ చట్టవిరుద్ధం. చట్టం చేశాక ఈ ఫండ్ ఏర్పాటుచేసుంటే, ఇది కూడా కాగ్ ఆడిట్ పరిధిలోకి వచ్చేది. అందుకే చట్టాన్ని బైపాస్ చేసి ఈ ఫండ్ ఏర్పాటుచేశారు” అంటారు శాశ్వత్.
కానీ పీఎం కేర్స్ ఫండ్ నిధులను ఎన్డీఆర్ఎఫ్‌కు బదిలీ చేయాలనే డిమాండ్లు ఎందుకు వస్తున్నాయి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది?
సమాధానంగా “ఎన్డీఆర్ఎఫ్‌కు ఆర్టీఐ వర్తిస్తుంది. కాగ్ కూడా దానిని ఆడిట్ చేయవచ్చు. వీటితోపాటూ అందులో వార్షిక నివేదిక నియమం కూడా ఉంది. ఇది ప్రభుత్వ జవాబుదారీ, సామాన్యుల డబ్బుకు సంబంధించిన అంశం. ప్రజాధనానికి జవాబుదారీ తనం ఉండాల"ని శాశ్వత్ చెప్పారు..
ఈ ఫండ్ దుర్వినియోగం కావచ్చు, అధికారులు నిధులు దుర్వినియోగం చేయవచ్చు. అందులో ఎలాంటి తనిఖీలు ఉండవు. కానీ, ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో అలా జరగడం ఉండదు”
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లో గల్లంతవుతున్న కోవిడ్ మరణాలు ఎన్ని?
- ఉత్తరప్రదేశ్: రేప్‌లు, మహిళలపై నేరాలు పెరుగుతోంటే.. రామరాజ్యం అంటున్న యోగి
- సముద్రంలో ఆపదలో ఇద్దరు మహిళలు.. ఈదుతూ వెళ్లి రక్షించిన దేశాధ్యక్షుడు
- భారత్‌లో కోవిడ్-19 వ్యాక్సీన్ హ్యూమన్ ట్రయల్స్ రెండు, మూడు దశలకు డీసీజీఐ అనుమతి
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- అమిత్ షాకు కరోనా పాజిటివ్.. అమితాబ్ బచ్చన్‌కు నెగటివ్
- శకుంతలా దేవిని హ్యూమన్ కంప్యూటర్ అని ఎందుకు పిలుస్తారంటే..
- సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- కెప్టెన్‌గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- కేరళ విమాన ప్రమాదంలో రియల్ హీరోలు వీళ్లే.. సెల్యూట్ చేసిన పోలీసు అధికారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








