కరోనావైరస్: మోదీ పీఎం-కేర్స్ ఫండ్ చుట్టూ అనుమానాలు

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్-19పై పోరాడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన పీఎం-కేర్స్ ఫండ్‌పై అనుమానపు మేఘాలు ముసురుకుంటున్నాయి. ఈ ఫండ్ నిర్వహణలో పారదర్శకత లేదంటూ వెల్లువెత్తున్న విమర్శలు, వివాదాలపై బీబీసీ దిల్లీ ప్రతినిధి గీతాపాండే అందిస్తున్న ప్రత్యేక కథనం.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన మరుసటి రోజు అంటే మార్చి 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రైమ్ మినిస్టర్ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్- దీన్నేసంక్షిప్తంగా ది పీఎం-కేర్స్ ఫండ్ అని పిలుస్తారు.
భారతీయులంతా దీనికి విరాళాలు ఇవ్వొచ్చని ప్రధాని ప్రకటించారు. "దేశవాసులందరికీ నా విజ్జప్తి. పీఎం-కేర్స్ ఫండ్‌కు మీవంతు విరాళాలు ఇవ్వండి'' అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మీరు ఇచ్చే ప్రతి పైసా కరోనాకు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి, కష్ట సమయాలలో ఉపయోగపడుతుంది'' అని ప్రధాని అన్నారు. "ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించడానికి ఇది ఉపకరిస్తుంది'' అని ప్రధాని తన ట్వీట్‌లో రాశారు.
దేశవ్యాప్తంగా సామాన్యుల నుంచి ఉద్యోగులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలు,స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడంతో ఈ ఫండ్‌కు నిధుల వర్షం కురిసింది. వారం తిరక్కుండానే 6,500 కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. ఇప్పుడు రూ. 10,000 కోట్లు దాటి ఉంటుందని అంచనా.
కానీ పీఎం-కేర్స్ ఫండ్ మీద వివాదం మొదలైంది. ఇప్పటికే పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ పేరుతో పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ ఉండగా, కొత్తగా మళ్లీ పీఎం-కేర్స్ ఫండ్ ఎందుకు అన్న ప్రశ్న వినిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
పీఎం-కేర్స్ ఫండ్‌కు వచ్చిన మొత్తాన్ని పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్‌కు బదిలీ చేయాలని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ డిమాండ్ చేశారు. వలస కూలీల సంక్షేమానికి ఈ నిధులను ఖర్చు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
సరిగ్గా పీఎం-కేర్స్ ఫండ్ ఏర్పాటు చేసిన రోజే దేశంలో కనీవినీ ఎరుగని మానవసంక్షోభం ఒకటి మొదలైంది. ఒక్కసారిగా లాక్‌డౌన్ విధించడంతో ఉపాధిలేని వేలమంది వలసకూలీలు తమ స్వస్థలాలకు బయలుదేరారు. వందల, వేల కిలోమీటర్ల దూరాన్ని వారాలపాటు కాలినడకన చేరుకునేందుకు ప్రయత్నించారు. ఆకలి దాహాలతోనే వారు అలా నడచుకుంటూ వెళ్లారు. దేశవ్యాప్తంగా ఇలా వెళ్లిన వారిలో దాదాపు 100మంది మరణించారు.
ఈ నిధుల్లో కొంత మొత్తాన్నైనా నడిచి వెళ్తున్న కూలీలకు రవాణా సదుపాయాన్ని కల్పించడానికి ఉపయోగిస్తే బాగుంటుందని చాలామంది భావించినా అది జరగలేదు. అందుకే ఓ ప్రతిపక్ష ఎంపీ ఈ పీఎం-కేర్స్ ఫండ్ పేరును "ది పీఎం డజ్ నాట్ రియల్లీ కేర్''గా మార్చాలని డిమాండ్ చేశారు.
ఈ ఫండ్‌ను ఏర్పాటు చేసిన కొద్దివారాలకే అందులోని నిధుల గురించి ఆరా తీయడం మొదలైంది. ఈ మొత్తాన్ని ఏం చేస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఎంత జమ అయ్యింది, ఎవరెవరి నుంచి ఫండ్ వచ్చింది అంటూ ప్రశ్నలు వినిపించడం మొదలు పెట్టాయి.
అయితే ఈ ప్రశ్నలకు పీఎం-కేర్స్ ఫండ్ వెబ్‌సైట్‌లో ఎక్కడా సమాధానం దొరకలేదు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా దీనిపై సమాచారం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ప్రభుత్వం ఏదైనా దాస్తోందా అని ప్రతిపక్ష నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు.
ఈ ఫండ్‌పై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించగా, ఈనిధుల విషయంలో పారదర్శక లేదంటూ మరికొందరు కోర్టులలో కేసులు దాఖలు చేశారు. అయితే ప్రజల నుంచి వస్తున్న ఇలాంటి ప్రశ్నలకు ఫండ్ అథారిటీ నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. ఇది పబ్లిక్ అథారిటీ కానందున ఆర్టీఐ చట్టం పరిధిలోకి రాదని, ఆ చట్టం కింద దీనిపై సమాచారం ఇవ్వాల్సిన అవసరంలేదని ఫండ్ నిర్వాహకులు తేల్చి చెప్పారు. అంటే దీనిని ప్రభుత్వ ఆడిటర్లు కూడా తనిఖీలు చేసే వీలులేదన్నమాట.
"ఇది పబ్లిక్ అథారిటీ పరిధిలోకి రాదని చెప్పడం దారుణం'' అని న్యాయవిద్యను అభ్యసిస్తున్న కందుకూరి శ్రీహర్ష్ బీబీసీతో అన్నారు. "ఇది ప్రైవేటు ట్రస్ట్‌గా భావించి ప్రజలు డబ్బులు ఇవ్వలేదు. భారత ప్రధాని తన పేరుతో ఈ విరాళాలను సేకరించారు'' అని ఆయన అన్నారు.
ఈ ట్రస్ట్‌ను ఎలా ఏర్పాటు చేశారు, దాన్ని ఎలా నడుపుతున్నారో వివరాలు కావాలంటూ కందుకూరి శ్రీహర్ష్ ఏప్రిల్ 1న సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు సమర్పించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇది ప్రజలకు సంబంధిన విషయం ఎలా అవుతుందో ఆయన తన వాదనలో వివరించారు.
•దీన్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఈ ఫండ్‌కు ప్రధానమంత్రి చైర్‌పర్సన్. ఆయన క్యాబినెట్‌లోని ముగ్గురు మంత్రులు దీనికి ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురిని ప్రధానమంత్రే స్వయంగా నియమించారు.
•ది పీఎం-కేర్స్ ఫండ్ వెబ్‌సైట్ gov.in అనే ప్రభుత్వ అధికారి డొమైన్‌తో కొనసాగుతోంది.
•ఈ నిధి వెబ్‌సైట్‌లో జాతీయచిహ్నం ఉంటుంది. దీన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలకే వాడతారు.
•ఈ నిధిలోకి ప్రభుత్వం తరఫు నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. బీజేపీ ఎంపీలంతా తమ నియోజకవర్గానికి కేటాయించిన నిధుల నుంచి రూ. కోటి రూపాయలను ఈ నిధికి బదిలీ చేశారు.
"ఇన్ని ఆధారాలుండగా ప్రభుత్వం ఎందుకు దాన్ని దాచాలని ప్రయత్నిస్తోంది'' అని శ్రీహర్ష్ ప్రశ్నిస్తున్నారు. "ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏదో బలహీనత కనిపిస్తోంది. ఇదో పెద్ద స్కామ్'' అని మాజీ జర్నలిస్ట సాకేత్ గోఖలే ఆరోపించారు.
అయితే ప్రభుత్వంలోని మోదీ సహచరులు మాత్రం ఇందులో ఎలాంటి కుంభకోణానికి అవకాశం లేదని తేల్చిచెబుతున్నారు. కొన్నివారాలపాటు ఇలా ప్రశ్నలు వినిపించిన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ఈ నిధిలో రూ.2,000 కోట్ల రూపాయలను 50,000 వెంటిలేటర్లు కొనడానికి ఉపయోగించామని, రూ.1000 కోట్ల రూపాయలను వలస కూలీల సంక్షేమానికి ఉపయోగించామని, వ్యాక్సిన్ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించామని వెల్లడించింది.
అయితే వలస కూలీలకు నిధుల కేటాయింపు చాలా తక్కువని, అది కూడా చాలా ఆలస్యంగా జరిగిందన్న విమర్శలు వినిపించాయి. అంతేకాదు వెంటలేటర్ల ఎంపికపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. " వెంటిలేటర్ల కొనుగోలుకు టెండర్లు పిలవలేదు. అంతా మధ్యవర్తుల ద్వారా నడిపించారు'' అని గోఖలే ఆరోపించారు.
అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటు రెండు ప్యానళ్లు పీఎం-కేర్స్ ఫండ్స్‌తో కొనుగోలు చేసిన సుమారు 10,000 వెంటిలేటర్ల పనితీరు,నాణ్యతలపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు గతవారం విడుదలైన ఒక నివేదిక పేర్కొంది.
మరోవైపు సార్క్ అండ్ అసోసియేట్స్ అనే ప్రైవేటు కంపెనీతో ఈ నిధులకు సంబంధించిన ఆడిటింగ్ నిర్వహించారని, ఆ కంపెనీకి ఉన్న అర్హత ఏంటని మాజీ జర్నలిస్టు గోఖలే ప్రశ్నించారు. 2018లో పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నిధుల ఆడిటింగ్ కోసం ఎలాంటి బిడ్డింగ్ లేకుండానే మోదీ ప్రభుత్వం సార్క్ అండ్ అసోసియేట్స్‌కు ఆడిటింగ్ బాధ్యతలు అప్పజెప్పిందని గోఖలే విమర్శించారు. "ఈ కంపెనీకి బీజేపీకి దగ్గరి సంబంధాలున్నాయి'' అని గోఖలే ఆరోపించారు. ఈ సంస్థ అధినేత ఎస్.కె. గుప్తా బీజేపీ మద్దతుదారని, మోడీ కలల ప్రాజెక్ట్ మేకిన్ ఇండియాపై ఆయన పుస్తకం కూడా రాశారని, విదేశాలలో ఆయన ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారని గోఖలే అన్నారు. పీఎం-కేర్స్ ఫండ్‌కు ఆయన కూడా రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చారు. అందుకే ఆడిటింగ్ మీద అనుమానాలు పుట్టుకొస్తున్నాయి'' అన్నారు గోఖలే.
తాను రూ.2 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు గుప్తా ట్విటర్‌లో ప్రకటించారు. బీజేపీతో సంబంధాల కారణంగానే సార్క్ అండ్ అసోసియేట్స్ సంస్థకు ఆడిటింగ్ బాధ్యతలు దక్కాయని వస్తున్న విమర్శలకు స్పందించాల్సిందిగా బీబీసీ గుప్తాను కోరగా ఆయన అందుకు నిరాకరించారు.
బీజేపీకి ప్రతినిధి నళిన్ కోహ్లి ఫండ్ వ్యవహారాలపై వస్తున్న విమర్శలకు స్పందించారు. సాధారణంగా పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ను ప్రకృతి వైపరీత్యాలకు నిధుల సేకరణ కోసం ఉపయోగిస్తామని, కానీ పీఎం-కేర్స్ ఫండ్ కేవలం కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని నళిన్ కోహ్లీ వెల్లడించారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ను మొట్టమొదటి ప్రధాని జవహరల్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ పార్టీ అధినేతను ఇందులో ట్రస్టీగా నియమించారాని కోహ్లి గుర్తు చేశారు. "దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి. అలాంటిది ప్రజలకు సంబంధించిన నిధుల కోసం ఏర్పాటు చేసిన ఫండ్‌లో కేవలం ఒక పార్టీని ట్రస్టీగా ఎందుకు చేర్చాలి'' అని కోహ్లీ ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీగానీ, ట్రస్ట్ సభ్యులైన మంత్రులుగానీ ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తప్ప పార్టీ నుంచి కాదని నళిన్ కోహ్లీ స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫండ్ నిర్వహణలో పారదర్శకత లేదన్న వాదనను కోహ్లీ కొట్టిపారేశారు. " పనితీరులో నాణ్యత ఆధారంగానే సార్క్ అండ్ అసోసియేట్స్‌కు ఆడిటింగ్ బాధ్యతలు అప్పజెప్పాం'' అని కోహ్లీ అన్నారు. ఈ ఫండ్ అన్ని చట్టపరమైన పరిమితులకు లోబడి పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు, ఇతర వ్యక్తుల నుంచి వస్తున్న విమర్శలను ప్రస్తావించగా "ఇది కొత్తగా ఏర్పాటు చేసిన నిధి. ఓపక్క మహమ్మారితో పోరాడుతున్నాం. ఈ సమయంలోనే పారదర్శకత, జవాబుదారీతనం అంటూ నిలదీయాల్సిన అవసరం ఉందా?'' అని కోహ్లి ప్రశ్నించారు.
నిధి నిర్వహణలో పారదర్శకత గురించి కేవలం ప్రతిపక్షాలే ప్రశ్నించడం లేదు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న సురేందర్ సింగ్ హూదా దిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. " నిధి నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంలో యంత్రాంగం ఎందుకు నిరాసక్తంగా ఉన్నారో అర్ధం చేసుకోలేకపోతున్నాం'' అని హూదా వ్యాఖ్యానించారు.
చట్ట ప్రకారం ప్రధానమంత్రి కార్యాలయాన్ని ముందుగా సంప్రదించనందున హూదా తన పిటిషన్‌ను వాపసు తీసుకున్నారు. సమాచారం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి మెయిల్ పంపిన హూదా కోర్టులో మళ్లీ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
"వాళ్లు ఫండ్‌కు సంబంధించిన సమాచారం వెబ్‌సైట్‌లో పెట్టాలని కోరాను. ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు చేశారు, దేనికోసం ఖర్చు పెట్టారు అన్న సమాచారం వారు ఇవ్వాలి'' అని హూదా అన్నారు. "సూర్యరశ్మి అన్నింటికంటె ఉత్తమమైన క్రిమిసంహారకం అని అందరికీ తెలుసు. చెడు కార్యక్రమాలన్నీ చీకటిలోనే జరుగుతాయి. పారదర్శకత అనేది పాలనకు గీటురాయి. దానిలో దాగుడుమూతలు ఆడుతున్నారంటే అక్కడేవరికో చెడు ఉద్దేశాలున్నాయన్నమాట.'' అన్నారు హూదా.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








