సౌదీ అరేబియాను పాకిస్తాన్ నుంచి భారత్ తనవైపు లాగేసుకుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గురువారం ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఒక చారిత్రక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్‌లో ఒక పెద్ద భాగాన్ని తమలో కలుపుకోవాలనుకున్న ఇజ్రాయెల్ ఆ ప్రణాళికలను ఆపివేస్తుంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు కూడా ప్రారంభమవుతాయి.
ఇప్పటివరకూ గల్ఫ్ అరబ్ దేశాలతో ఇజ్రాయెల్‌కు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు. అందుకే, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్వయంగా ఈ ఒప్పందం గురించి ప్రకటించారు.
ఈ ఒప్పందంతో పాలస్తీనా నేతలు ఆందోళనకు గురవుతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ ఒప్పందం తర్వాత అరబ్ లీగ్ సమావేశం ఏర్పాటు చేయాలని పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ కోరినట్లు అరబ్ న్యూస్ చెప్పింది.
ఈ ఒప్పందం తర్వాత మిగతా గల్ఫ్ దేశాలతో కూడా ఇజ్రాయెల్‌తో బంధం బలోపేతం అవుతుందని, దాని ప్రభావం 'అరబ్ శాంతి' ఒప్పందంపై పడుతుందని ఆయన భయపడుతున్నారు.
ఇస్లామిక్ దేశాల పోలరైజేషన్
మరోవైపు ఆయన ఆందోళన సమంజసమే అనిపిస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాజా నిర్ణయంపై మిగతా ఇస్లామిక్ దేశాల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. ఈజిఫ్ట్, జోర్డాన్ మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి.
ఈ ఒప్పందం ప్రభావం గల్ఫ్ దేశాల పరస్పర సంబంధాలపై, మధ్యప్రాచ్యం రాజకీయాలు, వాటితో సంబంధాలు పెట్టుకునే మిగతా ప్రపంచ దేశాలపై కూడా ఉంటుంది. దీనికి భారత్ కూడా అతీతం కాదు.
కొత్త ఒప్పందంతో ఇస్లామిక్ ప్రపంచం పోలరైజేషన్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచంలోని ముస్లి దేశాలన్నీ మూడు గ్రూపులగా విడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని ఇజ్రాయెల్‌లో ఉంటున్న సీనియర్ జర్నలిస్ట్ హరేంద్ర మిశ్రా చెప్పారు.
"వీటిలో ఇరాన్ ఏకాకిగా ఉన్నట్లు కనిపిస్తోంది. రెండో సమూహానికి సౌదీ అరేబియా, యుఏఈ నేతృత్వం వహిస్తున్నున్నాయి. ఇక మూడో గ్రూపులో టర్కీ, మలేషియా, పాకిస్తాన్ ఉన్నాయి. ఈ నిర్ణయం తర్వాత మొత్తం ఇస్లామిక్ ప్రపంచంలో వర్గపోరు మరింత ముదురుతుంది" అన్నారు.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
భారత్‌పై ప్రభావం
అలాంటప్పుడు, ఈ నిర్ణయంతో భారత్‌పై ఎలాంటి ప్రభావం ఉంటుందనే ప్రశ్నకూడా వస్తుంది.
దీనికి సమాధానంగా "ఇజ్రాయెల్, యుఏఈ రెండు దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయ"ని టైమ్స్ ఆఫ్ ఇండియా డిప్లమాటిక్ ఎడిటర్ ఇంద్రాణీ బాగ్చీ చెప్పారు.
మధ్యప్రాచ్యం ప్రాంతీయ భద్రత విషయానికి వస్తే, ఇజ్రాయెల్, భారత్ ఆలోచన కూడా ఒకేలా ఉంది. అక్కడ యుఏఈ ఒక అభివృద్ధి చెందుతున్న శక్తి. అందుకే ఇజ్రాయెల్, యూఏఈ కలిస్తే, దానిని భారత్ కూడా స్వాగతిస్తుంది" అన్నారు.
కానీ ఈ రెండు దేశాలు కలిసి రావడం వల్ల పాకిస్తాన్‌ను వేరు చేయడంపై ఏదైనా చూపుతుందా.
"అయినా, చైనాతో కలిసిన పాకిస్తాన్ తనకు తానుగా వేరైపోయింది. కానీ, ఇస్లామిక్ దేశాలపై పాకిస్తాన్ ఆధిపత్యం ఎప్పుడూ ఉంటుంది. దానిని కూడా మనం తోసిపుచ్చలేం. ఇస్లామిక్ దేశాల్లో అణుశక్తి ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్. అందుకే, ఇస్లామిక్ దేశాల్లో దానికి ఒక ప్రత్యేక హోదా ఉంటుంది" అంటారు ఇంద్రాణి
పాకిస్తాన్ ప్రస్తుతం ఆ దేశాలకు కాస్త దూరంగా ఉంది అంటే, ఆ దేశం, దాని విధానాలే దానికి కారణం అని ఆమె చెబుతున్నారు.
"సౌదీ అరేబియా, యుఏఈ మొదట్లో పాకిస్తాన్‌ను తమ తోడుగా అనుకునేవి. కానీ గత కొంతకాలంగా పాకిస్తాన్ బదులు భారత్‌తో వాటి సంబంధాలు చాలా మెరుగుపడ్డాయి" అంటారు హరేంద్ర మిశ్రా.
"దానికి ఉదాహరణలు చూస్తే, గత ఏడాది ఆర్గనైజేషనల్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) సమావేశం గురించి చెప్పుకోవచ్చు. పాకిస్తాన్‌కు ఇష్టం లేకపోయినా, భారత్‌ను స్పెషల్ అబ్జర్వర్ హోదాలో దానికి ఆహ్వానించారు. పాకిస్తాన్ ఆ ఆహ్వానాన్ని వ్యతిరేకించింది. కానీ యుఏఈ ఎవరి మాటా వినలేదు" అని వివరించారు.

ఫొటో సోర్స్, EPA/GETTY IMAGES
పాకిస్తాన్ ఫ్యాక్టర్
ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత్‌కు ఆ సమావేశం ఆహ్వానం అందింది. అంతేకాదు, ఈ ఏడాది ఓఐసీ వార్షిక సమావేశంలో కూడా భారత్ ఇస్లామాఫోబియాను భారత్ చురుకుగా ప్రోత్సహిస్తోందని పాక్ ఆరోపణలు చేసింది. వాటిని తోసిపుచ్చారు. ఈసారీ భారత్‌కు మాల్దీవులు కూడా మద్దతుగా నిలిచింది.
"యుఏఈ, సౌదీ అరేబియాతో భారత్ సాన్నిహిత్యం పెరిగిందనే ఒక సంకేతం బాలాకోట్ దాడుల తర్వాత కూడా కనిపించింది. భారత పైలెట్ అభినందన్‌ను విడిపించడానికి సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించిందని కూడా అప్పుడు వార్తలు వచ్చాయి. ఈ విషయంలో అమెరికాతోపాటూ యూఏఈ, సౌదీ అరేబియా నుంచి కూడా పాకిస్తాన్‌పై చాలా ఒత్తిడి వచ్చింది" అంటారు హరేంద్ర మిశ్రా
జమ్ము-కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై కూడా పాకిస్తాన్ ఓఐసీలో ప్రశ్నలు లేవనెత్తింది. దాంతో అది భారత అంతర్గత అంశమని సౌదీ అరేబియా స్పష్టం చేసింది.
ఆ తర్వాత పాకిస్తాన్ వైఖరి గమనించిన సౌదీ అరేబియా 2018లో తమ నుంచి తీసుకున్న ఒక బిలియన్ డాలర్ల రుణం చెల్లించాలని పాకిస్తాన్‌ను కోరింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019లో ప్రధాని మోదీని తమ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది.
ఇవన్నీ యూఏఈ, సౌదీ అరేబియాతో భారత్ సంబంధాలు చాలా బాగున్నాయనే విషయం చెబుతున్నాయి. ఒకవేళ ఇజ్రాయెల్‌తో ఏదైనా ఒప్పందం జరిగినా, భారత్ ఈ ఇస్లామిక్ దేశాల సమూహం వెంట కచ్చితంగా నిలబడుతుందని సూచిస్తున్నాయి.
ఈ ఒప్పందాన్ని సమర్థించే మిగతా గల్ఫ్ దేశాలతో కూడా భారత్ సంబంధాలు బాగుంటాయి. దానివల్ల పాకిస్తాన్‌ను ఏకాకిని చేయడానికి భారత్‌కు కూడా ఒక విధంగా సాయం లభిస్తుంది. అంతే కాదు, ప్రపంచమంతా ఇప్పుడు మల్టీ పోలార్ వరల్డ్ వైపు వెళ్తుంటే, అందులో ఒక పెద్ద గ్రూపులో భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా ఒక్కటై కనిపిస్తున్నాయి.
ఈ నిర్ణయం వల్ల మరో పెద్ద ప్రభావం భారత్‌పై కనిపిస్తోందని హరేంద్ర మిశ్రా అన్నారు.
"భారత్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల చాలా రకాల రక్షణ పరికరాల ఉత్పత్తి ఒప్పందాలు కూడా జరిగాయి. గల్ఫ్ దేశాలను రక్షణ పరికరాలకు ఒక పెద్ద మార్కెట్‌గా భావిస్తారు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ సాయంతో ఏ సైనిక పరికరాలు తయారుచేసినా, వాటిని విక్రయించడానికి భారత్‌కు ముందు ముందు ఎలాంటి సమస్యలు కూడా ఉండవు" చెబుతున్నారు.
భారత్ రక్షణ మంత్రి కొన్ని రోజుల క్రితం రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర భారత్' నినాదం కూడా ఇచ్చారు.

ఫొటో సోర్స్, ANADOLU AGENCY
యుఏఈ తర్వాత సౌదీ అరేబియా వంతు
యూఏఈ, సౌదీ అరేబియాల స్నేహం కూడా ప్రపంచానికి తెలిసిందే. అలాంటప్పుడు సౌదీ అరేబియా కూడా యూఏఈ దారిలోనే నడుస్తుందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.
కానీ ఇంద్రాణీ అభిప్రాయం మాత్రం దీనికి భిన్నంగా ఉంది. సౌదీ అరేబియా దీనిపై బహుశా పూర్తిగా బయపడదేమో అని ఆమె భావిస్తున్నారు. దాని వెనుక ఒక కారణం కూడా చెప్పారు.
"మధ్యప్రాచ్యంలో సౌదీ అరేబియాను మతపరమైన అంశాల్లో అత్యంత రక్షణాత్మక భావాజాలం ఉన్న దేశంగా భావిస్తారు. అందుకే ఇజ్రాయెల్‌తో గత చరిత్ర చూస్తూనే యూదులతో ఓపెన్‌గా ఉండడం సౌదీ అరేబియాకు కష్టం కావచ్చు. అయితే, రాజకీయ పరంగా సౌదీ చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తోంది" అన్నారు.
"భారత్, ఇజ్రాయెల్ మధ్య మొదలయ్యే విమాన సేవల కోసం తమ గగనతలం ఉపయోగించుకోడానికి సౌదీ అరేబియా భారత్‌ను అనుమతించింది. గత కొంత కాలంగా ఇజ్రాయెల్ పట్ల సౌదీ వైఖరి మారుతోంది అనడానికి ఇది ఒక ఉదాహరణ" అంటారు ఇంద్రాణి.
కానీ, హరేంద్ర మిశ్రా మరోలా వాదిస్తున్నారు.
"మిత్రుడికి మిత్రుడు మిత్రుడే... మిత్రుడి శత్రువు శత్రువే అని ఒక పాత నానుడి ఉంది. ప్రస్తుతానికి సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ రెండింటికీ శత్రువు ఇరాన్. అలాంటప్పుడు భవిష్యత్తులో ఆ రెండూ కలిసి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి" అన్నారు.
గురువారం అమెరికా అధ్యక్షుడు మీడియా సమావేశం నుంచి కూడా ఆ సంకేతాలు అందుతున్నాయని ఆయన చెప్పారు.
ఈ ఒఫ్పందం తర్వాత మీడియాతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ "ఇక మంచు కరిగిపోయింది.. మరికొన్ని అరబ్ ముస్లిం దేశాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను అనుసరిస్తాయని నాకు నమ్మకం ఉంది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్-సౌదీ అరేబియా స్నేహం
నిజానికి, సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో కలిసి రావాలని, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెతన్యాహుపై లంచం, మోసం, నమ్మకద్రోహం ఆరోపణలతోపాటూ కరోనా మహమ్మారిని సరిగా హ్యాండిల్ చేయలేకపోయారనే ఆరోపణలు ఉన్నాయి.
అలాంటి పరిస్థితుల్లో, ఎన్ని ఎక్కువ దేశాలతో మెరుగైన సంబంధాలు ఉంటే, పాలస్తీనియన్లను దూరంగా ఉంచడంలో అంత సఫలం కావచ్చని, తనపట్ల సానుకూల వాతావరణం ఏర్పడేలా చేయవచ్చని బెంజమిన్ నెతన్యాహు భావిస్తున్నారు.
దీనితోపాటూ ఇజ్రాయెల్, సౌదీ అరేబియా రెండూ ఇరాన్‌ను తమ శత్రువుగా భావిస్తున్నాయి. ఈ విషయంలో కూడా గత కొన్నేళ్లుగా ఈ రెండు దేశాలూ సహకరించుకుంటున్నాయి.
ప్రస్తుతం అరబ్ ప్రపంచంలోని మిగతా దేశాలతో ఇరాన్ శత్రుత్వం మతపరమైనది. ఇరాన్ షియా మైనారిటీలకు నేతృత్వం వహిస్తుంటే. సౌదీ అరేబియా సున్నీ మెజారిటీల దేశం. అమెరికా మిత్రదేశం అయిన ఇజ్రాయెల్ ఇరాన్ ఎప్పుడూ టార్గెట్ చేస్తూ వస్తోంది. అమెరికా వల్ల ఇజ్రాయెల్-యుఏఈ మధ్య ఒప్పందం జరగడంతో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు మరింత పెరుగుతాయి.
"రెండు దేశాలకు ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఇరాన్ మాకు ఆందోళన కలిగించే అంశం. అందుకే, మేం కలిసి పోరాడ్డానికి సిద్ధంగా ఉన్నాం" అని వివిధ సందర్భాల్లో ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్, మిగతా నేతలు చెప్పారు.
ఇరాన్‌కు వ్యతిరేకంగా రెండు దేశాలు కొంతకాలంగా నిఘా సమాచారాన్ని కూడా పంచుకుంటున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ స్వయంగా అంగీకరించింది.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- లాక్డౌన్లో భారత పురుషులు ఇంట్లో ఒళ్లు వంచి పనిచేశారా?
- గాంధీ బ్రహ్మచర్య ప్రయోగాల గురించి మనూ గాంధీ డైరీల్లో ఏముంది
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- చనిపోయిన భార్య 'సజీవ' ప్రతిరూపంతో గృహప్రవేశం... జీవిత భాగస్వామిపై ప్రేమను చాటుకున్న తెలుగు పారిశ్రామికవేత్త
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








