ఆస్ట్రేలియా: పదేళ్లలోపు పిల్లలు నేరాలు చేస్తే జైల్లో పెట్టాలా? వద్దా?

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

నేరస్థులుగా పరగణించడానికి వయసు పరిమితిని 10 నుంచీ 14 కు పెంచాలంటూ ఆస్ట్రేలియాలో లాయర్లు, డాక్టర్లు, మానవ హక్కుల కార్యకర్తలతో కూడిన బృందం ఉద్యమాన్ని చేపడుతోంది.

వయసు పరిమితి పెంచడంపై నిర్ణయాన్ని గత నెలలో దేశ అత్యున్నత్త న్యాయస్థానం 2021 వరకూ వాయిదా వేసింది. జైలు శిక్షకు ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి మరింత ఎక్కువ సమయం అవసరమని తెలిపింది.

కానీ గురువారం ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (ఏసీటీ) నేర ప్రవృత్తి వయసు పరిమితిని 14 కు పెంచడానికి ఓటు వేసింది. ఇది చట్టాన్ని మార్చడానికి చేసిన మొట్టమొదటి అధికారిక ప్రయత్నం. మిగతా దేశమంతా కూడా దీన్ని అనుసరిస్తుందని ఉద్యమ ప్రచారకులు ఆశిస్తున్నారు.

అసలు అస్ట్రేలియాలో ఇది ఎందుకంత పెద్ద విషయమైంది?

ఈ పరిమితి చాలా తక్కువ

ఆస్ట్రేలియాలో పదేళ్ల పిల్లలను కూడా అరెస్ట్ చేసి, కేసు వేసి జైలుకి పంపొచ్చు.

అరెస్ట్ చేసి జైలుకు పంపే కనీస వయసు పరిమితి ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాలుగా ఉన్నప్పటికీ మిగతా ఐరోపా దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో తక్కువగా ఉంది. ఉదాహరణకు ఈ వయసు జర్మనీలో 14, పోర్చుగల్లో 16, లక్సెంబర్గ్లో 18.

అయితే, ఇంగ్లండ్, వేల్స్ లో నేరస్థుల కనీస వయసు 10 గానే ఉంది. కానీ ఆస్ట్రేలియాలాగే ఈ అంశంలో ఆ దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి సూచించిన ప్రమాణాలకు దిగువన ఉన్నాయి.

2019లో ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల మండలి, అన్ని దేశాల్లోనూ నేర ప్రవృత్తి వయసు పరిమితి 14 కు పెంచాలని సిఫార్సు చేసింది.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

ఆస్టేలియా ఆదివాసులపై ఎక్కువ ప్రభావం

ఆస్ట్రేలియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ సమాచారం ప్రకారం 2018-19 లో దాదాపు 600 మంది 10 నుంచీ 13 వయసులోపు పిల్లలు నిర్బంధంలో ఉన్నారని తేలింది.

వీరిలో 65% కన్నా ఎక్కువ మంది ఆదివాసుల పిల్లలు లేదా టోరెస్ స్ట్రైట్ ద్వీపానికి చెందిన పిల్లలు ఉన్నారు.

సెంటెన్సింగ్ అడ్వైజరీ కౌన్సిల్ ఆఫ్ విక్టోరియా చేసిన మరో విశ్లేషణ ప్రకారం.. ఆదివాసుల పిల్లలు మిగతావారికన్నా 17 రెట్లు ఎక్కువగా జైలుకు వెళ్తున్నారని తేలింది.

ఆ దేశ ఉత్తర భూభాగంలో 43 రెట్లు ఎక్కువగా ఆదివాసుల పిల్లలు జైలుకి వెళ్తున్నారు.

బ్లాక్ లైవ్స్ మేటర్ నిరసనలతో..

చాలా సంవత్సరాలుగా ఈ అంశంలో చట్టపరమైన సవరణలు జరగాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కౌన్సిల్ ఆఫ్ అటార్నీస్-జనరల్ మీటింగ్ జరగడానికి ముందే జూన్లో ఈ అంశానికి మద్దతిస్తున్న అన్ని గొంతులను ఒక్క తాటిపై తేవడానికి #RaiseTheAge (రెయిజ్ ది ఏజ్) కూటమిని ఏర్పాటు చేశారు.

యూఎస్లో బ్లాక్ లైవ్స్ మేటర్ నినాదం హోరెత్తడంతో ఆస్ట్రేలియాలో నేర ప్రవృత్తి వయో పరిమితిని పెంచాలనే డిమాండ్కు ప్రజల మద్దతు పెరిగింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా జైళ్లల్లో నల్లజాతీయుల మరణాలకు, జాత్యహంకార ధోరణులకు ముగింపు పలకాలని ప్రజలు పిలుపునిచ్చారు.

జూలైలో ఆస్ట్రేలియా ఇన్‌స్టిట్యూట్, ఛేంజ్ ద రికార్డ్ (ఆదివాసుల హక్కుల కోసం పోరాడే కూటమి) చేపట్టిన అధ్యయనాల్లో అధిక శాతం ఆస్ట్రేలియా ప్రజలు నేర ప్రవృత్తి వయసు పరిమితిని 14 లేదా అంతకన్నా ఎక్కువ వయసుకు పెంచాలనే అంశానికి మద్దతునిచ్చారని తేలింది.

గత ఏడాది 12 ఏళ్ల ఆదివాసీ బాలుడు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిని ఉద్దేశిస్తూ చేసిన ప్రసంగాన్ని ప్రపంచమంతా శ్రద్ధగా వింది.

డుజువాన్ హూసన్ జెనీవాలో మాట్లాడుతూ.. ''ఆస్ట్రేలియా విద్యా వ్యవస్థలో రాణించడానికి తనెంత ఇబ్బందులు పడ్డాడో వివరించారు. ఆదివాసులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే వాళ్ల పిల్లలు జైళ్లకు వెళ్లడం తగ్గుతుంది''అని అన్నారు.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

నిపుణులు ఏమంటున్నారు?

పిల్లలను బంధించడంతో నేరాలను తగ్గవని లాయర్లు అభిప్రాయపడుతున్నారు. చిన్న వయసులోనే వారిని జైలుకు పంపిస్తే పెద్దయ్యాక కూడా వాళ్లు జైళ్లల్లోనే మగ్గే అవకాశాలు ఎక్కువ అని అంటున్నారు.

ఆరోగ్య కారణాల దృష్ట్యా కూడా నేర ప్రవృత్తి వయో పరిమితిని పెంచాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. పిల్లలకు ఇవ్వాల్సింది సంరక్షణ, శిక్ష కాదు అని వారు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు

ఆస్ట్రేలియా కౌన్సిల్ ఆఫ్ అటార్నీస్-జనరల్ జూలైలో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, తీర్పుని వాయిదా వేశారు. దీనితో అనేకమంది నిరాశ చెందారు.

"నేర ప్రవృత్తి వయో పరిమితిని పెంచాలంటే జైలు శిక్షకు ప్రత్యామ్నాయం ఏమిటో కూడా ఆలోచించాలి" అని న్యూ సౌత్ వేల్స్ అటార్నీ-జనరల్ మార్క్ స్పీక్మ్యాన్ రిపోర్టర్లతో అన్నారు.

''పదేళ్ల వయసు పిల్లలు నేరాలకు పాల్పడితే అరెస్ట్ చేసి జైల్లో పెట్టకుండా వారిని బాగు చేసే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి చాలా పరిశోధించాల్సి ఉంటుంది''

"ప్రజలకు ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు తడితే మాకు సూచించవచ్చు" అని ఆయన తెలిపారు.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి

నేర ప్రవృత్తిలోకి దిగకుండా బలహీన వర్గాలకు ముందునుంచే తోడ్పాటు అందించాలని ఆదివాసీ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

నేర ప్రవర్తనకి కారణాలను పరిశీలించి పరిష్కారాలను సూచించాలని లా కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా పిలుపునిచ్చింది.

ఆదివాసులకు సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని, వారికి విద్య, ఆరోగ్యం తదితర వసతులను మెరుగుపరుస్తూ మత్తు పదార్థాలకు బానిసలవ్వకుండా ఉండే తోడ్పాటు అందించాలని రాయల్ ఆస్ట్రేలాసియన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, Getty Images

మార్పుకు అవకాశం

ఈ అంశానికి ఏసీటీ మద్దనివ్వడం మంచి పరిణామం కానీ చట్టపరమైన మార్పులు చాలా ముఖ్యమని ప్రచారకులు భావిస్తున్నారు.

"న్యాయ వ్యవస్థలో జాత్యహంకార ధోరణులకు ముగింపు పలకాలని పిలుపునిస్తున్న సమయంలో నేర ప్రవృత్తి వయసు పరిమితిని పెంచడం అనేది ఇంతకుముందు కన్నా నేడు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది" అని సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో క్రిమినాలజీ ప్రొఫెసర్ క్రిస్ కన్నీన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)