కరోనావైరస్ - భారత్: 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...' - ప్రధానికి ఓ మహిళ విన్నపం

సుబర్ణ ఘోష్
ఫొటో క్యాప్షన్, సుబర్ణ ఘోష్
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లాక్‌డౌన్‌ కాలంలో ఇంటి పని ఎవరు చేయాలనే విషయంలో వాదోపవాదాలు ఇండియాలో లింగ వివక్షపై చర్చకు దారి తీశాయంటున్నారు బీబీసీ దిల్లీ ప్రతినిధి గీతాపాండే

ఇండియాలో ఇంటి పనంటే కష్టమైనదే. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఇండియాలో వాషింగ్‌ మెషిన్లు, డిష్‌వాషర్లు, వాక్యూమ్‌ క్లీనర్ల వాడకం చాలా తక్కువ.

తిన్నప్లేట్లను విడివిడిగా కడగాలి. అలాగే దుస్తులను చేతులతో ఉతికి ఆరేయాలి. ఇల్లంతా తుడవాలి. బెడ్‌రూమ్‌లో దుప్పట్లను మడతపెట్టాలి. ఇక పెద్దవాళ్ల, పిల్లల ఆలనాపాలనా చూసుకోవాలి.

భారతదేశంలోని కోట్లకొద్దీ మధ్యతరగతి కుటుంబాల్లో పని మనుషులు, వంట మనుషులు, క్లీనర్లు, పిల్లలను చూసుకునే ఆయాలు కనిపిస్తారు.

కానీ, లాక్‌డౌన్‌ కారణంగా వీరంతా రావడం మానేయడంతో ఆ పనంతా ఎవరు చేయాలి?

దీనికి సమాధానం గొడవలు, కొట్లాటలు. ఈ వ్యవహారంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల్పించుకోవాలంటూ సుబర్ణా ఘోష్‌ అనే మహిళ ఒక పిటిషన్‌ పెట్టారు.

"మహిళలు మాత్రమే ఉపయోగించాలని చీపురు కట్ట మీద రాసి ఉందా'' అని change.org అనే వెబ్‌సైట్‌లో ఆమె ప్రశ్నించారు.

"వాషింగ్‌ మెషిన్లు, గ్యాస్‌స్టవ్‌ల మ్యాన్యువల్స్‌ పైనా ఇలాగే రాసి ఉందా? మగవాళ్లు ఇంటి పనిలో ఎందుకు భాగం పంచుకోరు'' అని ఆమె నిలదీస్తున్నారు.

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూనే ఇంట్లో వంట, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడంలాంటి పనులన్నీ చేస్తూ విసిగిపోయిన సుబర్ణా ఘోష్‌ నేరుగా ప్రధానమంత్రికి ఓ విజ్జప్తి చేశారు.

ఇంటి పనిలో సమానమైన భాగస్వామ్యం తీసుకునేలా మీ తదుపరి ప్రసంగంలో మగవాళ్లకు ఉద్బోధించాలని ఆమె ప్రధాని మోదీని కోరారు.

"ఇది చాలా ముఖ్యమైన సమస్య. చాలామంది దీనిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్ధం కాదు'' అని ఆమె అన్నారు.

వంట

ఘోష్‌ చేసిన విజ్జప్తికి మద్దతుగా 70,000మంది సంతకాలు పెట్టారు.

ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ 2018లో విడుదల చేసిన ఒక రిపోర్ట్‌లో, భారతదేశంలో పట్టణ ప్రాంతాలలో మహిళలు రోజుకు 312 నిమిషాలు వేతనంలేని శ్రమ చేస్తున్నారని, అదే మగవాళ్లు కేవలం 29 నిమిషాలు మాత్రమే చేస్తారని వెల్లడించింది.

అదే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు 291 నిమిషాలు వేతనంలేని పని చేస్తుండగా, మగవాళ్లు 32నిమిషాలు పని చేస్తున్నారని ఈ నివేదికలో ఉంది.

ముంబయిలో ఉంటున్న ఘోష్‌ ఇల్లు ఇందుకు భిన్నంగా ఏమీలేదు. "ఇది నా అనుభవాల ఆధారంగా చేసిన విజ్జప్తి'' అని ఘోష్‌ బీబీసీతో అన్నారు.

ఇంటి పని మొత్తం ఆమే చేస్తున్నారు. "వంట వండుతాను, ఇల్లు ఊడవడం, బెడ్స్‌ సర్దడం, బట్టలు మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం ఇలా అన్నీ నేనే చేస్తున్నాను'' అన్నారామె.

ఆమె భర్త బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్నారు. "ఆయన ఇంటి పనిలో సహాయం చేసే రకం కాదు'' అని ఆమె అన్నారు.

కొడుకు,కూతురు అప్పుడప్పుడు ఆమెకు సాయపడుతుంటారు.

గిన్నెలు శుభ్రం చేస్తున్న సుబర్ణ ఘోష్ పిల్లలు
ఫొటో క్యాప్షన్, గిన్నెలు శుభ్రం చేస్తున్న సుబర్ణ ఘోష్ పిల్లలు

ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను నిర్వహిస్తున్న ఘోష్‌, లాక్‌డౌన్‌ కారణంగా తన వృత్తిలో కొంత రాజీ పడాల్సి వస్తుందని ఊహించారు.

"నా పని చాలా వరకు దెబ్బతింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ ప్రారంభమైన మొదటి నెలలో ఇది ఎక్కువగా ఉంది. నేను అలసిపోయేదాన్ని. నా కుటుంబ అవసరాలు మారిపోయాయి. చాలా ఫిర్యాదులు చేయగలను. కానీ నేను ఎవరికైనా చెప్పుకుంటే సింపుల్‌గా "అవన్నీ నువ్వు చేయకు'' అంటున్నారు'' అని చెప్పారామె.

"కొందరి సలహా ప్రకారం నిజంగానే ఇంట్లో పని మానేశాను. అంట్లు తోమడం ఆపేశాను. దీంతో ఇళ్లంతా ఎంగిలి గిన్నెలు, మాసిన బట్టలతో నిండిపోయింది'' అన్నారామె.

ఆమె పడుతున్న శ్రమను గమనించిన ఆమె భర్త, పిల్లలు సాయం చేయడంతో ఆ తర్వాత అదంతా శుభ్రమైంది.

"మా వారు నాకిప్పుడు సాయం చేస్తున్నారు. నా శ్రమను ఆయన అర్థం చేసుకున్నారు.'' అని ఆమె తెలిపారు.

"ఇంకా చెప్పాలంటే మన మగవాళ్లు ఈ సంస్కృతి, సంప్రదాయాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో పని ఎలా చేయాలో వాళ్లకు ఎవరూ నేర్పరు'' అన్నారామె.

భారత్‌ లాంటి పితృస్వామ్య వ్యవస్థల్లో అమ్మాయిలు ఇంటి పని చేయడంలో నేర్పరులుగా మారుతున్నారు. ఈ పని వారిదే అన్నముద్ర పడుతోంది. వారు ఉద్యోగం చేస్తున్నా సరే. ఇంటికొచ్చి ఆ పనంతా వారే చేయాలి. అంటే డబుల్‌ డ్యూటీ అన్నమాట.

"నేను నా చిన్నతనంలో ఇంట్లో పని చేసేదాన్ని. వంటింట్లో మా అమ్మకు సాయపడేదాన్ని'' అని మీ కథ చెప్పమని ఫేస్‌బుక్‌లో అడిగినప్పుడు పల్లవి శరీన్‌ అనే మహిళ వెల్లడించారు.

"నా సోదరుడు వాడి సొంతంగా అన్నం కూడా పెట్టుకోడు'' అని ఆమె వెల్లడించారు.

కానీ చాలామంది తమ ఇళ్లలో ఈ తరహా లింగ వివక్ష సమస్య లేదని చెప్పారు. అయితే వారిలో చాలామంది విదేశాలలో ఉంటున్నవారు ఉన్నారు. ఇంకొందరి భర్తలు చాలాకాలం పాశ్చాత్య దేశాలలో ఉండి వచ్చిన వారున్నారు.

"ఇంటి పని కేవలం మహిళలదే అన్న భావన ఉంది'' అని ఉపాసన భట్‌ అన్నారు. "ఒకవేళ మగవాళ్లు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అత్త ఇంట్లో ఉన్నప్పుడు ఎంతమంది వారి సహాయం తీసుకోడానికి సిద్ధంగా ఉంటారు ? భార్యకు సాయం చేసే భర్తలున్నా, తల్లిదండ్రులు వస్తే, వంటింట్లో ఇటు పుల్లను తీసి అటు పెట్టరు'' అని ఆమె అన్నారు.

ఆక్స్‌ఫర్డ్ నివేదిక ప్రకారం రోజుకు భారతీయ మహిళలు 300 కోట్ల గంటలపాటు ఉచితంగా పని చేస్తున్నారు.

వారి శ్రమకు విలువ కడితే ఇండియా జీడీపికి అదనంగా కొన్ని ట్రిలియన్ల ధనం తోడవుతుంది.

కానీ ఇంటి పనికి విలువ కట్టడం అనేమాటే ఉండదు. ఆడవాళ్లు ఎంతో ఇష్టంగా చేసే పనిలాగా దీనిని జమకడతారు.

దుస్తులు ఉతుకుతున్న మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

పెరుగుతున్నకొద్దీ సుబర్ణా ఘోష్‌ ఆలోచనలలో మార్పు వచ్చింది. తన చిన్నతనంలో తల్లి, పిన్నివాళ్లు ఇంట్లో పని చేయడం ఆమె చూశారు. " నేను అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండను'' అనుకున్నారామె.

పెళ్లయ్యాక ఇంట్లో పని ఎవరు చేయాలని అనేది పెద్ద సమస్యగా మారలేదు. వాళ్లకు ఇంట్లో పని మనుషులు ఉన్నారు. "పని మనుషుల కారణంగా మా ఇంట్లో శాంతి నెలకొంది'' అన్నారామె. " ఇంటి పని వాళ్లు చూసుకుంటారు. కాబట్టి అన్నీ సవ్యంగా నడుస్తున్నాయి'' అని ఘోష్‌ వెల్లడించారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇంటి పని విషయంలో వివాదం మొదలైంది. ఇన్నాళ్లు చాపకింద నీరులా ఉన్న లింగవివక్ష లాక్‌డౌన్‌తో బయటపడింది.

"ఇలాంటి సమస్యలను లాక్‌డౌన్‌ బయటపెట్టింది'' అని ఘోష్‌ అన్నారు. ''దీన్ని దగ్గర్నుంచి చూడటానికి, అనుభవించడానికి అవకాశం కలిగింది'' అని ఆమె వెల్లడించారు.

అందుకే ఆమె ప్రధానమంత్రికి ఈ రకంగా విన్నపం చేయాలనుకున్నారు.

అయితే తాము కూడా ఈ ఇంటి పనితో విసిగి వేసారి ఉన్నామని ఆమె ఇంటి పక్క మహిళలు ఆమెతో అన్నారు. కానీ భర్తలతో పని చేయించడం అనే మాట విని వాళ్లు నవ్వుకున్నారు.

"వాళ్లు ఏం చేస్తారు.. అని నన్ను చాలామంది అడిగారు. పైగా భర్తలను వారు పొగిడారు. చాలామంచి వాళ్లని, వంటలు ఎలా ఉన్నా మాట్లాడకుండా తింటారని నాకు చెప్పారు" అని సుబర్ణా వెల్లడించారు.

మన ఇంటికొచ్చేసరికి ఈ సమస్యను పరిష్కరించడం కష్టం అన్నారు ఘోష్‌.

భారతీయ మహిళలు రోజుకు 300కోట్ల పని గంటలను ఉచితంగా చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతీయ మహిళలు రోజుకు 300కోట్ల పని గంటలను ఉచితంగా చేస్తున్నారు.

"నేను ఈ విజ్జప్తి చేయబోతున్నానని మా వారికి చెప్పినప్పుడు ఆయన నన్ను ప్రోత్సహించారు'' అని ఘోష్‌ చెప్పారు.

"మా వారి స్నేహితులు ఆయన్ను చూసి నవ్వారట. నువ్వు ఇంట్లో కొంచె సాయం చేయాల్సింది. ఇప్పుడు చూడు మీ ఆవిడ నీ మీద మోదీకి ఫిర్యాదు చేయబోతోంది'' అని అన్నారట.

"ఆయన దాన్ని సరదాగా తీసుకున్నారు. మగాళ్లంతా వాళ్ల భార్యల మాట కన్నా మోదీ మాట బాగా వింటారు కాబట్టి ఆయనతో చెబుతోంది అన్నారట'' అని ఘోష్ చెప్పారు.

అయితే ఘోష్‌ పిటిషన్‌ను చూసి సోషల్‌ మీడియాలో చాలామంది ఆమెను విమర్శించారు. ఇంత చిన్న విషయాన్ని మోదీ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు.

"మగవాళ్లు సాయం చేయాలని మీరంటున్నారు. బాగానే ఉంది. చేస్తాం. కానీ అసలు మగవాళ్లు ఎక్కడున్నారు'' అని కొందరు ప్రశ్నించారట.

మోదీ దీని గురించి మాట్లాడతారని మీరు అనుకుంటున్నారని కొందరు ఆమెను అడిగారు.

"నేను ఆశావహంగా ఉన్నాను. మోదీకి మహిళల నుంచి బాగా మద్దతు ఉంది. కాబట్టి ఆడవాళ్లకు ముఖ్యమైన ఈ సమస్య గురించి ఆయన మాట్లాడతారు. వర్షాకాలం వచ్చినప్పుడు జలుబు గురించి కూడా మాట్లాడారు. అలాంటప్పుడు ఆయన లింగ సమానత్వం గురించి ఎందుకు మాట్లాడరు'' అని సుబర్ణా ఘోష్‌ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)