ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణలతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు.
ఇటీవలి వరకు మంత్రివర్గంలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణా రావు రాజ్యసభకు ఎన్నిక కావడంతో, వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణలకు మంత్రులుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు.
గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, సీఎం జగన్‌మోహన్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, కొత్తగా నియమితులైన మంత్రుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
కోవిడ్-19 కారణంగా తక్కువమంది అతిథులను ఆహ్వానించారు.
ఉప ముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్
పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా నేపథ్యంలో ఆయన స్థానంలో ధర్మాన కృష్ణదాస్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు.
ఆయనకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖను అప్పగించారు. ఇప్పటి వరకూ ఆయన నిర్వర్తించిన రోడ్లు, భవనాల శాఖను మంత్రి మలగుండ్ల శంకర నారాయణకు అప్పగించారు.
కొత్త మంత్రుల్లో.. సీదిరి అప్పల రాజుకు పశుసంవర్థక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖలను, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖను అప్పగించారు.

ఫొటో సోర్స్, Getty Images
సీదిరి అప్పలరాజు: తొలిసారి ఎమ్మెల్యే-మంత్రి
ఎమ్మెల్యే అయిన తొలిసారే మంత్రివర్గంలో స్థానం సంపాదించారు సీదిరి అప్పలరాజు.
శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యుడైన అప్పల రాజు మత్స్యకార కుటుంబం నుంచి వచ్చారు.
పదో తరగతిలో స్టేట్ ర్యాంకరయిన ఆయన, వైద్యవిద్య చదివి గత 12 ఏళ్లుగా డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు.
రాజకీయాలపై ఆసక్తితో 2017లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరిన ఆయన, తొలి ప్రయత్నంలోనే పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

వేణుగోపాలకృష్ణ - రాజోలు జడ్పీటీసీ నుంచి రాష్ట్ర మంత్రి వరకు
రాష్ట్రమంత్రి వర్గంలో కొత్తగా చేరిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది.
శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఆయన, ఆ సామాజిక వర్గానికి బాగా పట్టున్న తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయంగా ఎదిగారు.
2001లో రాజోలు జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు గోపాలకృష్ణ. ఆ తర్వాత జడ్పీటీసీ అధ్యక్షుడిగా, డీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.
2013లో వైసీపీలో చేరిన ఆయన, 2014 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తోట త్రిమూర్తులుపై విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- సెక్స్ వర్కర్లు ఆ దేశంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకుంటున్నారు?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ హాట్ స్పాట్‌గా మారిన తూర్పు గోదావరి
- భారత జనాభా ఈ శతాబ్దం చివరికి ఎందుకు తగ్గుతుంది... తగ్గితే ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








