విన్‌స్టన్ చర్చిల్ హీరోనా? విలనా? బెంగాల్‌లో లక్షలాది మంది ఆకలి చావులకు ఈయనే కారణమా?

పార్లమెంట్ స్క్వేర్‌లో చర్చిల్ విగ్రహం

ఫొటో సోర్స్, EPA

    • రచయిత, యోగితా లిమాయే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సర్‌ విన్‌స్టన్‌ చర్చిల్ గురించి నేను చిన్నతనంలోనే విన్నాను. ఎనిడ్‌ బ్లైటన్‌ రాసిన ఓ పుస్తకంలో ఓ పాత్ర చర్చిల్‌పట్ల తనుకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆయన విగ్రహాన్ని తన ఇంట్లో పెట్టుకుంటుంది.

నేను పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇండియాలో వలస పాలన గురించి కూడా వింటూ వచ్చాను. కానీ నా దేశీయుల్లో చాలామంది బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ గురించి భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం కూడా గమనించాను. బ్రిటీష్‌వారి పాలన మీద కూడా భిన్నమైన అభిప్రాయాలు వినిపించేవి.

బ్రిటీష్‌ పాలన వల్ల దేశం బాగా లాభం పొందిందని, రైల్వేలు, పోస్టల్ వ్యవస్థ వారివల్లే వచ్చాయని కొంతమంది వాదిస్తే, అవి వారి అవసరాల కోసం మాత్రమే ఏర్పాటు చేశారని, దేశాన్ని నిరుపేద దేశంగా మార్చారని కొందరు వాదిస్తారు. "బ్రిటీష్‌ వారి క్రూరపాలన''కు వ్యతిరేకంగా తాము ఎలా ఉద్యమాలు చేశామో మా నాయనమ్మ చెబుతుండేది.

ఇంత వ్యతిరేకత, ఆగ్రహం ఉన్నా నేను పుట్టిన దేశంలో తెల్లశరీరం ఉన్నవారు ఏది చెప్పినా, ఏం చేసినా గొప్పేనని నమ్మేవాళ్లు కనిపిస్తారు. వలస పాలకుల శతాబ్దాల పాలనలో భారతీయులలో ఆత్మవిశ్వాసం చచ్చిపోయింది.

స్వాతంత్ర్యం వచ్చి 73 సంత్సరాలు గడిచాయి. ఇప్పటికి దేశంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ ప్రపంచంలో మన స్థానం ఏంటో నిరూపించి చూపాలనే కొత్త తరం పుట్టుకొచ్చింది. చరిత్రలో బెంగాల్‌ క్షామం లాంటి చీకటి అధ్యాయాలను ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు అందరికీ తెలియజెప్పకూడదు అనే తరం మన మధ్య ఉంది.

పోషకాహార లోపంతో బట్టలు లేకుండా రోడ్డుపై కూర్చున్న చిన్నారులు

ఫొటో సోర్స్, Getty Images

బెంగాల్‌ క్షామానికి రెండో ప్రపంచయుద్ధంలో మరణించిన బ్రిటీష్‌ సైనికులకన్నా ఆరు రెట్లు అధికంగా భారతీయులు మరణించారు. ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులకు ఇప్పటికి కూడా సంస్మరణ సభలు నిర్వహిస్తున్నారు. కానీ బ్రిటీష్‌ పాలనా కాలంనాటి బెంగాల్‌ క్షామంలో మరణించిన వారి గురించి ఎవరూ పట్టించుకోరు.

అంత్యక్రియలకు నోచుకోక నదుల పక్కన శవాలు కనిపించేవని చెబుతారు. వాటిని కుక్కలు, గద్దలు పీక్కుతినడం గురించి ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. వీళ్లంతా తిండి కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి మరణించి వాళ్లే.

సౌమిత్ర ఛటర్జీ
ఫొటో క్యాప్షన్, బెంగాల్ క్షామం జ్జాపకాలు తనను వెంటాడుతున్నాయని అన్నారు నటుడు సౌమిత్ర ఛటర్జీ

"ఎవరిని చూసినా అస్థిపంజరంలా కనిపించేవారు. వారి ఎముకలకు శరీరాన్ని అతికించినట్లు ఉండేది'' అని బెంగాలీ నటుడు సౌమిత్ర ఛటర్జీ చెప్పారు. ఈ క్షామం సమయానికి ఆయన వయసు ఎనిమిదేళ్లు.

"కాస్తంత గంజి పోయమంటూ కొందరు ఏడుస్తూ అడుక్కునేవారు. వారికి బియ్యం ఇవ్వడానికి ఎవరి దగ్గరా ఏమీలేదని వారికి తెలుసు. ఆ ఏడుపును చూసిన వారెవరు దాన్ని జీవితాంతం మర్చిపోలేరు. దాని గురించి చెబుతుంటేనే నాకళ్ల వెంట నీళ్లు వస్తాయి. ఉద్వేగాన్ని ఆపుకోలేను'' అని ఛటర్జీ అన్నారు.

1942లో వచ్చిన తుపాను, వరదల తర్వాత ఈ క్షామం వచ్చిపడింది. కానీ అప్పటి బ్రిటన్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌, ఆయన క్యాబినెట్‌ తీసుకున్న విధాన నిర్ణయాలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయని విమర్శించేవాళ్లు ఉన్నారు.

బర్మా మీదుగా జపాన్‌ దాడి చేస్తుందన్న భయంతో అప్పటి ప్రభుత్వం తిరస్కరణ విధానాన్ని అనుసరించిందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చరిత్రకారిణిగా పని చేస్తున్న యాస్మిన్‌ ఖాన్‌ అన్నారు.

"అక్కడ ఏమీ లేకుండా చేయాలి. పంటలను, వాటిని మోసుకెళ్లే పడవలు కూడా కనిపించకుండా చేయాలి. అప్పుడు జపాన్‌ దాడి చేసినా, వారికి సరైన వనరులు దొరకవు. వారు ఆక్రమణను కొనసాగించ లేరు అన్నది బ్రిటీష్‌వారి అంచనా. ఈ తిరస్కరణ విధానమే తర్వాత క్షామానికి దారి తీసింది'' అని ఆమె అన్నారు.

భారతదేశానికి ఆహార ధాన్యాలను అత్యవసరంగా సరఫరా చేయాలన్న ప్రతిపాదనలను చర్చిల్ ప్రభుత్వం పక్కనబెట్టడమే ఈ ఉపద్రవానికి కారణమని అప్పటి బ్రిటీష్‌ పాలనలో పనిచేసిన అధికారుల డైరీలనుబట్టి తెలుస్తోంది. బ్రిటన్‌లో ఆహార ధాన్యాలు కొరత ఏర్పడుతుందని, అన్ని నౌకలను భారత్‌కు పంపిస్తే యుద్ధ సమయంలో ఇబ్బంది అవుతున్న కారణంతో చర్చిల్ ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను పక్కనబెట్టింది. స్థానిక ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చూసుకుంటుందని చర్చిల్‌ భావించారు.

చర్చిల్ విగ్రహం ఎదుట పోలీసు అధికారులు

ఫొటో సోర్స్, EPA

ఇదే సందర్భంలో భారత్‌పట్ల చర్చిల్ వైఖరి కూడా బైటపడింది. బెంగాల్ క్షామం సాయం మీద జరిగిన సమావేశంలో చర్చిల్ చేసిన కామెంట్లను అప్పటి హోంశాఖ కార్యదర్శి లీపోల్డ్ ఆమెరి రికార్డు చేశారు. "వారికెంత సాయం చేసినా సరిపోదు, కుందేళ్లలాగా సంతానాన్ని కంటూనే ఉంటారు'' అని చర్చిల్ వ్యాఖ్యానించారు.

"క్షామానికి ఆయనే కారణమని చెప్పడానికి ఎలాంటి సంశయం అక్కర్లేదు'' అని యాస్మిన్‌ ఖాన్‌ అన్నారు. "క్షామం విషయంలో తాను చేయగలి కూడా ఏమీ చేయలేకపోయారు. ఒకపక్క లక్షలమంది ఏషియన్లు రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటీషర్ల తరఫున పోరాడు తున్నారు. కానీ ఆయన తెల్లవాళ్లకు, యూరోపియన్లకు ఇచ్చిన ప్రాధాన్యత ఏషియన్లకు ఇవ్వలేదు'' అని ఆమె అన్నారు.

అయితే చర్చిల్ విషయంలో కొందరు అర్దంలేని ఆరోపణలు చేస్తున్నారని, వాస్తవానికి చర్చిల్ తగినంత సాయం చేసినా, ఆలస్యం కారణంగా పరిస్థితులు దారుణంగా పరిణమించాయని బ్రిటన్‌లో చర్చిల్‌ను సమర్ధించేవారు అంటారు.

కానీ ఆయన ఆధ్వర్యంలో, ఆయన పాలనలో కొన్ని మిలియన్లమంది ప్రజలు ఆకలితో చనిపోయారు. బ్రిటీష్ పాలనలో ఎదురైన అత్యంత దారుణమైన విపత్తుగా బెంగాల్‌ క్షామాన్ని అప్పటి వైస్రాయ్‌ ఆర్చిబాల్డ్ వేవెల్‌ వర్ణించారు. ఈ క్షామం బ్రిటీష్‌ సామ్రాజ్యపు ప్రతిష్టను కూడా దెబ్బతీసిందని ఆయన అన్నారు.

ఆ క్షామం నుంచి బతికిబయటపడ్డవారు మాత్రం బ్రిటీష్‌ ప్రభుత్వ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు."ఆనాడు జరిగిన ఘోరకలికి కారణమైనందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి'' అని సౌమిత్ర ఛటర్జీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)