Elyments: ఫేస్‌బుక్‌తో పోటీకి సిద్ధమైన ఈ స్వదేశీ యాప్ కథేంటి? దీని వెనుక ఎవరున్నారు

వెంకయ్యనాయుడు

ఫొటో సోర్స్, Twitter/vicepresident of india

ఫొటో క్యాప్షన్, ఎలిమెంట్స్ యాప్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు
    • రచయిత, అబినాష్ కంది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్వదేశీ నినాదంతో భారత్‌లో ఎలిమెంట్స్ అనే మరో కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది.

దీన్నొక సోషల్ మీడియా ‘సూపర్ యాప్’గా రూపకర్తలు వర్ణిస్తున్నారు.

చైనాతో భారత్‌కు సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తడం, 59 చైనీస్ యాప్‌లపై భారత ప్రభుత్వ నిషేధం విధించిన నేపథ్యంలో భారత్‌లో ప్రస్తుతం ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్స్‌కు డిమాండ్ పెరిగింది.

‘ఎలిమెంట్స్’ కూడా సరిగ్గా ఈ సమయంలోనే మార్కెట్‌లోకి వచ్చింది.

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఈ యాప్‌ను ప్రారంభించారు.

‘‘ఐటీ రంగంలో భారత్‌ శక్తిమంతమైన పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో పేరు సంపాదించుకున్నవాళ్లలో మనవాళ్లూ ఉన్నారు. మనకు నిపుణుల కొదువ లేదు. ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు భవిష్యత్తులో మరిన్ని రావాలి’’ అని ఆయన అన్నారు.

శ్రీశ్రీ రవిశంకర్

ఫొటో సోర్స్, artofliving.org

ఫొటో క్యాప్షన్, శ్రీశ్రీ రవిశంకర్

ఎవరు తెచ్చారు

సుమేరు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అనే సంస్థ పేరిట ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ మార్గనిర్దేనంలో దీన్ని రూపొందించినట్లు ఈ యాప్ రూపకర్తలు తెలిపారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థలో కార్యకర్తలుగా ఉన్న వెయ్యికిపైగా మంది ఐటీ నిపుణులు ఈ యాప్ కోసం పనిచేశారని ఎలిమెంట్స్ డెవెలపర్ల బృందానికి నేతృత్వం వహించినవారిలో ఒకరైన కారుణ్య లాంచింగ్ కార్యక్రమంలో చెప్పారు.

భారతీయుల కోసమంటూ ఓ యాప్ తీసుకురావాలని తమ సంస్థలోని నిపుణులకు తాను సూచించానని, వారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని శ్రీశ్రీ రవిశంకర్ అన్నారు.

‘‘యాప్ తేవడానికి ఎంత సమయం పడుతుందని వారిని అడిగా. ఏడాదిన్నర నుంచి రెండేళ్లు పట్టొచ్చని వారు చెప్పారు. గురుపూర్ణిమ (జులై 5) వరకు చేయగలరా అని నేను వారిని ప్రశ్నించా. సాధ్యం కాదని చెప్పారు. కానీ, భారత యువత అసాధ్యమనుకున్నదాన్ని కూడా సుసాధ్యం చేయగలదు. అదే వారు చేసి చూపారు’’ అని లాంచింగ్ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు.

సోషల్ మీడియా మంచిదో, చెడ్డదో దాన్ని వినియోగించుకునేవారి తీరును బట్టి ఉంటుందని రవిశంకర్ అన్నారు.

‘‘ఆత్మ నిర్భర భారత్ గొప్ప పిలుపు. దేశంలోని ప్రతీ రంగంలో మనం స్వయం సమృద్ధిని సాధించాలి’’ అని వ్యాఖ్యానించారు.

భారత్‌లో 50 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగదారులు ఉన్నా, భారత్‌కు చెందిన యాప్‌లు ప్రధాన వేదికలుగా లేకపోవడం ఆలోచించాల్సిన విషయమని కారుణ్య అన్నారు.

‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కార్యకర్తలైన ఐటీ నిపుణులు ఈ యాప్ కోసం పనిచేశారు’

ఫొటో సోర్స్, PLAY STORE

ఫొటో క్యాప్షన్, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ కార్యకర్తలైన ఐటీ నిపుణులు ఈ యాప్ కోసం పనిచేశారు’

సూపర్ యాప్ అంటే...

‘సోషల్ మీడియా సింప్లిఫైడ్’ అన్న ట్యాగ్‌‌లైన్‌తో ఎలిమెంట్స్ యాప్ వచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి వివిధ యాప్స్‌లో ఉండే ప్రత్యేకమైన ఫీచర్లను ఈ యాప్ ద్వారా ఒకే వేదికపై అందిస్తున్నారు. అందుకే దీన్ని సూపర్ యాప్ అంటున్నారు.

సాధారణ సోషల్ మీడియా యాప్‌ల్లా స్నేహితులతో, కొత్తవారితో ఎలిమెంట్స్ ద్వారా అనుసంధానం అవ్వొచ్చు. పోస్టులు, కామెంట్లు పెట్టొచ్చు.

వాట్సాప్ తరహాలో చాట్ కూడా చేసుకోవచ్చు.

నాణ్యతతో కూడిన ఆడియా కాలింగ్, వీడియో కాలింగ్ సదుపాయం కూడా కల్పించబోతున్నామని యాప్ రూపకర్తలు తెలిపారు.

నగదు చెల్లింపుల కోసమూ ఎలిమెంట్స్ పే పేరుతో ఓ ఫీచర్‌ను తెస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్ షాపింగ్ కూడా చేసుకునేలా మరో ఫీచర్ తీసుకువస్తున్నట్లు వివరించారు.

వినియోగదారులకు భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించేందుకు తాము కట్టుబడి ఉంటామని, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని ఎలిమెంట్స్ చెబుతోంది.

వినియోగదారుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని, తమ యాప్ సర్వర్లు భారత్‌లోనే ఉంటాయని వివరించింది.

ఇంగ్లిష్‌, స్పానిష్‌లతో పాటుగా ఎనిమిది భారతీయ భాషల్లో ఈ ఎలిమెంట్స్ యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా దీన్ని వాడొచ్చు.

జుకర్ బర్గ్

ఫొటో సోర్స్, Getty Images

పోటీ ఇవ్వగలదా?

టిక్‌టాక్ సహా చైనీస్ యాప్స్‌పై నిషేధం అమల్లోకి రావడంతో టిక్‌టాక్ తరహాలో భారత్‌లో ఉన్న ఇతర యాప్స్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. చింగారీ, రోపోసో లాంటి యాప్‌లు విపరీతంగా డౌన్‌లోడ్ అయ్యాయి.

ఇదే ట్రెండ్ ఎలిమెంట్స్ విషయంలోనూ కనిపిస్తోందా అంటే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లతో ఎలిమెంట్స్‌కు ప్రధాన పోటీ ఉంది.

ఈ మూడూ అమెరికన్ యాప్‌లే. మూడూ ఫేస్‌బుక్‌కు చెందినవే. వీటిపై భారత్‌లో ఏ నిషేధమూ లేదు. అమెరికాపైనా, ఆ యాప్‌లపైనా జనాల్లో వ్యతిరేకత కూడా లేదు.

కానీ, స్వదేశీ యాప్ కాబట్టి ఎలిమెంట్స్‌ను ప్రయత్నించి చూద్దామని అనుకునే జనాలు ఉంటారని, ఆరంభంలోనే పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఎలిమెంట్స్ సంపాదించుకోగలగాలని టెక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ అన్నారు.

ఇప్పటికే గూగుల్ ప్లేస్టోర్‌లో ఎలిమెంట్స్ పది లక్షలకుపైగా సార్లు డౌన్‌లోడ్ అయ్యింది.

విదేశీ సోషల్ మీడియా యాప్‌లకు ఎలిమెంట్స్ మంచి ప్రత్యామ్నాయం కాగలదని, తొలి రోజుల్లో ఈ యాప్ అందించే సేవల నాణ్యతపైనా దాని విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని శ్రీధర్ అన్నారు.

‘‘స్వదేశీ యాప్‌ కాబట్టి ప్రయత్నించి చూద్దామని కొందరు యాప్‌ను వాడొచ్చు. కానీ, ఎలిమెంట్స్‌లో సైన్ అప్ అయ్యేందుకు వన్ టైమ్ పాస్‌వర్డ్ కూడా రావడం లేదు. యాప్‌ను ఉపయోగించే వీలే లేకపోతే, వినియోగదారులు నిరాశ చెందుతారు’’ అని చెప్పారు.

ఇదివరకు కూడా భారతీయ సోషల్ మీడియా యాప్‌లు కొన్ని వచ్చి, కనుమరుగయ్యాయని శ్రీధర్ అన్నారు.

‘‘వినియోగదారుడికి వాడుతున్నప్పుడు అది నాణ్యమైన యాప్ అని అనిపించాలి. అప్పుడే ఇంకొకరికి దాని గురించి చెబుతారు. వినియోగదారుల ఫోన్‌లో స్థానం సంపాదించడం, దాన్ని నిలుపుకోవడం అంత సులభం కాదు. చాలా పోటీ ఉంటుంది. యాప్‌ను ప్రయత్నించిన తర్వాత సరిగ్గా పనిచేయకపోతే, వినియోగదారులు వేచిచూడరు’’ అని వివరించారు.

‘సోషల్ మీడియా సింప్లిఫైడ్’ అన్న ట్యాగ్‌‌లైన్‌తో ఎలిమెంట్స్ యాప్ వచ్చింది

ఫొటో సోర్స్, OATAWA

ఫొటో క్యాప్షన్, ‘సోషల్ మీడియా సింప్లిఫైడ్’ అన్న ట్యాగ్‌‌లైన్‌తో ఎలిమెంట్స్ యాప్ వచ్చింది

జూమ్‌‌కూ ప్రత్యామ్నాయాలు

మరోవైపు చైనీస్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్‌కు ప్రత్యామ్నాయాలు సిద్ధమవుతున్నాయి.

స్వదేశీ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ కోసం భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ ఓ పోటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఏప్రిల్ 13న ఈ కార్యక్రమం మొదలైంది.

దీనికి రెండు వేలకుపైగా దరఖాస్తులు రాగా, టాప్-5లో హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలు స్థానం దక్కించుకున్నట్లు సమాచారం. వీటిలో ఒక సంస్థ టాప్-3లోకి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.

వీటిని ప్రభుత్వం నగదు బహుమతితో ప్రోత్సహించనుంది.

చైనీస్ జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ పోటీని ప్రభుత్వం నిర్వహిస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు రిలయన్స్ జియో సంస్థ కూడా జియో మీట్ పేరుతో ఓ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్‌కు, జూమ్‌కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.

ఇక జియో తెచ్చిన మరో యాప్ జియో చాట్ డిజైన్ కూడా వాట్సాప్ తరహాలో ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)