కరోనావైరస్: ఆరోగ్యసేతు యాప్ వివాదాస్పదం కావడానికి కారణాలేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆండ్రూ క్లారెన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గోప్యత గురించి ఆందోళనలు ఉన్నప్పటికీ, కోవిడ్-19 కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ ఆరోగ్య సేతును 10 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు భారత ఐటీ శాఖ తెలిపింది.
ఆరోగ్య సేతు యాప్‌ను ప్రభుత్వం ఆరు వారాల కిందటే విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులు దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని భారత్‌లో తప్పనిసరి చేశారు.
కానీ, ఈ యాప్ వల్ల డేటా భద్రత సమస్య తీవ్రం కావచ్చని తలెత్తవచ్చని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు యూజర్లు, నిపుణులు చెబుతున్నారు.
ఇది ఎలా పనిచేస్తుంది?
స్మార్ట్ ఫోన్ బ్లూటూత్, లొకేషన్ డేటాను ఉపయోగించుకోవడం ద్వారా ఆరోగ్య సేతు యాప్ దగ్గరగా కోవిడ్-19 ఉన్న వ్యక్తి ఎవరైనా సమీపంలో ఉన్నారా అన్నది ఈ యాప్ తన యూజర్‌కు తెలిసేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్ కేసుల డేటాబేస్‌ను స్కాన్ చేయడం ద్వారా ఆ సమాచారం అందిస్తుంది.
ఆ తరువాత ఆ సమాచారం అంతా ప్రభుత్వానికి వెళ్తుంది.
“మీరు గత రెండు వారాల్లో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఎవరినైనా కలిసినట్లయితే, ఆ కేసు ఎప్పుడు వచ్చింది, అది మీకు ఎంత దగ్గరగా ఉందనే అంశాల ఆధారంగా మీకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాన్ని యాప్ లెక్కిస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతుంది” అని ఈ యాప్ రూపొందించిన భారత ఐటీ మంత్రిత్వ శాఖ మైగవ్ సీఈఓ అభిషేక్ సింగ్ బీబీసీకి చెప్పారు.
మీ పేరు, మీ నంబర్ వంటి వివరాలను ఈ యాప్ ఎవరికీ వెల్లడించదు. కానీ, అది మీ సమాచారం, మీ లింగం, మీ ప్రయాణ చరిత్ర, మీరు పొగతాగుతారా వంటి వివరాలన్నీ సేకరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ యాప్ డౌన్‌లోడ్ తప్పనిసరా?
ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ఈ యాప్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరూ దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. కంటైన్‌మెంట్ జోన్లలో నివసిస్తున్న వారికి, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ఉద్యోగులకు దీనిని తప్పనిసరి చేశారు.
దిల్లీ రాజధాని శివార్లలో ఉన్న నోయిడాలో నివసించే వారందరికీ ఈ యాప్ వేసుకోవడం తప్పనిసరి చేశారు. లేదంటే వారు ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లు కూడా తమ సిబ్బంది అందరికీ దీనిని తప్పనిసరి చేశాయి.
కానీ, ప్రభుత్వ ఆదేశాలను కొందరు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ బీఎన్ శ్రీకృష్ణ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “ప్రజలతో ఈ యాప్ ఉపయోగించేలా చేయడమనేది పూర్తిగా చట్టవిరుద్ధం” అన్నారు.
“ఏ చట్టం కింద మీరు దీన్ని తప్పనిసరి చేశారు. ఇప్పటివరకూ దీనిని సమర్థించే చట్టం ఏదీ లేదు” అని ఆయన చెప్పారు.
ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ కోవిడ్ ట్రేసింగ్ ట్రాకర్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉపయోగిస్తున్న 25 కోవిడ్ ట్రేసింగ్ యాప్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని యాప్స్ గురించి కూడా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
చైనాలోని హెల్త్ కోడ్ సిస్టమ్ లాంటి యాప్, యూజర్లు క్వారంటీన్‌ను ఉల్లంఘించకుండా, వారి ఖర్చు చరిత్రను కూడా నమోదు చేస్తుందని, అది దురాక్రమణే అవుతుందని విమర్శకులు అంటున్నారు.
“ఒక యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్రజలను బవలవంతం చేసినంత మాత్రాన విజయం సాధించినట్లు కాదు, అక్కడ అణచివేత పనిచేసిందని అర్థం చేసుకోవాలి” అని ఫ్రెంచ్ ఎథికల్ హ్యాకర్ రాబర్ట్ బాప్టిస్టే అన్నారు. ఆయన్ను ఎలియట్ ఆల్డర్సన్ అని కూడా పిలుస్తారు.

ఆరోగ్య సేతు గురించి ఆందోళన
ఆరోగ్య సేతు లొకేషన్ డేటాను స్టోర్ చేస్తుంది. దానికి ఫోన్ బ్లూటూత్ ఎప్పుడూ ఆన్ చేసి ఉండాలి. భద్రత, గోప్యత విషయానికి వస్తే ఆ రెండూ యాప్ దురాక్రమణకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఉదాహరణకు సింగపూర్‌లో ట్రేస్ టుగెదర్ యాప్ ఉంది. ఆ దేశ ఆరోగ్య శాఖ దానిని డేటా యాక్సెస్ చేయడానికి మాత్రమే ఉపయోగించాలి. ఆ డేటాను వ్యాధి నియంత్రణకు మాత్రమే ఉపయోగిస్తామని, లాక్‌డౌన్లు, క్వారంటీన్లు అమలు చేసే సంస్థలతో పంచుకోబోమని అది తమ పౌరులకు భరోసా ఇచ్చింది.
అలా చేయడానికి లేదా చట్టపరమైన ఆదేశాలను అంగీకరించేలా చూసుకోడానికి ఆరోగ్యసేతుకు ఆ సౌలభ్యం ఉంది. అని దిల్లీలో డిజిటల్ హక్కులు, స్వేచ్ఛకు సంబంధించిన న్యాయవాద బృందం ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ చెప్పింది.
యాప్ తయారీదారులు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో యూజర్ల గుర్తింపు బయటపెట్టదని గట్టిగా వాదిస్తున్నారు.
“మీ డేటాను వేరే ఏ ప్రయోజనాలకూ ఉపయోగించడం జరగదు. దానిని ఏ థర్డ్ పార్టీ యాక్సెస్ చేయదు” అని మైగవ్‌కు చెందిన సింగ్ చెప్పారు.
“యాప్‌తో వచ్చే పెద్ద సమస్య ఏంటంటే, అది లొకేషన్ ట్రాక్ చేస్తుంది. అది అనవసరం అని ప్రపంచవ్యాప్తంగా చాలామంది భావిస్తున్నారు” అని ఇంటర్నెట్ వాచ్‌డాగ్, మెడియానామా ఎడిటర్ నిఖిల్ పాహ్వా చెప్పారు.
“ఏదైనా ఒక యాప్‌తో మీ లొకేషన్‌ను. మీరు ఎవరితో కాంటాక్టులో ఉన్నారు అనే దానిని నిరంతరం ట్రాక్ చేయడం అంటే అది స్పష్యంగా గోప్యతా ఉల్లంఘనే” అన్నారు.
ఆరోగ్య సేతు యాప్ వేసుకుంటే బ్లూటూత్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి అనేదానిపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
“నేను మూడో అంతస్తులో ఉండి, మీరు నాలుగో అంతస్తులో ఉంటే. బ్లూటూత్ గోడల్లోంచి కూడా ప్రయాణిస్తుంది కాబట్టి, మనం వేరు వేరు అంతస్తుల్లో ఉన్నా యాప్ కలిశామనే భావిస్తుంది. అలా అది తప్పుడు పాజిటివ్ కేసులను, తప్పుడు డేటాను చూపిస్తుంది” అన్నారు.

- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా

గోప్యత గురించి ఆందోళనలు
ఈ యాప్ అధికారులు తాము సేకరించిన సమాచారాన్ని ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సర్వర్‌లోకి అప్‌లోడ్ అయ్యేలా చేస్తుంది. ఆ సమాచారాన్ని కోవిడ్-19కు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టే వైద్య, పాలనాపరమైన సిబ్బందికి అందిస్తారు.
అంటే ప్రభుత్వం ఈ డేటాను “తను ఎవరికి ఇవ్వాలనుకుంటే వారితో” షేర్ చేసుకోవచ్చు అనేది సమస్యాత్మకంగా మారవచ్చని లాయర్లు, సాంకేతిక నిపుణులు, విద్యార్థుల కన్సార్టియం సాఫ్ట్ వేర్ ఫ్రీడం లా సెంటర్ చెబుతోంది.
గోప్యత ప్రధానంగా ఈ యాప్ రూపొందించామని మైగవ్ చెబుతోంది. కాంటాక్ట్ ట్రేసింగ్, రిస్క్ అసెస్‌మెంట్ అనేవి గుర్తించలేని పద్ధతిలో జరుగుతుందని చెప్పింది.
“మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు, యాప్ మీకు ఒక ప్రత్యేక గుర్తుతెలియని డివైస్ ఐడీని కేటాయిస్తుంది. మీ డివైస్ నుంచి ప్రభుత్వ సర్వర్‌తో జరిగే అన్ని పరస్పర చర్యలు ఆ ఐడీ ద్వారానే జరుగుతాయి. రిజిస్ట్రేషన్ తర్వాత ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్నీ మార్పిడి చేయడం ఉండదు” అని సింగ్ చెప్పారు.
కానీ ప్రభుత్వ వాదనపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
యాప్‌లో లోపాలు ఉన్నాయని, వాటి సాయంతో అనారోగ్యానికి గురైనవారు భారత్‌లో ఏ ప్రాంతంలో ఉన్నా తాను తెలుసుకోగలనని ఆల్డెర్సన్ చెప్పారు.
“నేను పీఎంఓ కార్యాలయంలో లేదా భారత పార్లమెంటులో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారేమో చూడగలను. నే నేను కావాలనుకుంటే ఎంచుకున్న ఒక ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారేమో తెలుసుకోగలను” అని ఆయన తన బ్లాగ్‌లో చెప్పారు.
అలాంటి గోప్యతా ఉల్లంఘన ఏదీ జరగడం లేదని ఆరోగ్య సేతు ఒక ప్రకటనలో ఖండించింది.
కానీ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వివాదాస్పద బయోమెట్రిక్ ఆధారిత గుర్తింపు డేటాబేస్ ఆదార్ గురించి చెప్పిన పాహ్వా గోప్యతను కాపాడే విషయంలో భారత్‌కు ‘భయానక చరిత్ర’ ఉందన్నారు.
ఆధార్ డేటాబేస్ వల్ల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడుతుందని విమర్శకులు పదే పదే హెచ్చరించారు. దానిని బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ ఫోన్ నంబర్లకు లింక్ చేయడం తప్పనిసరి అంటూ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను విమర్శించారు.
“గోప్యత ప్రాథమిక హక్కు కాదని ఈ ప్రభుత్వం కోర్టులో వాదించింది. మనం ఆధార్‌ను నమ్మలేం” అని పాహ్వా చెప్పారు.
వివాదాస్పద ఆధార్ పథకం రాజ్యాంగబద్ధమైనది అని, అది గోప్యతా హక్కును ఉల్లంఘించదని భారత సుప్రీంకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది.
పారదర్శకతపై ప్రశ్నలు
బ్రిటన్ కోవిడ్-19 ట్రేసింగ్ యాప్‌లా ఆరోగ్య సేతు ఓపెన్ సోర్స్ కాదు. అంటే స్వతంత్రంగా పనిచేసే కోడర్లు, పరిశోధకులు దానిలోని భద్రతా లోపాలను తనిఖీ చేయడం కుదరదు.
ప్రభుత్వం ఆరోగ్య సేతు సోర్స్ కోడ్‌ను బహిరంగపరచలేదని ఐటీ శాఖలోని ఒక సీనియర్ అధికారి ఒక పత్రికతో చెప్పారు. “ఎందుకంటే చాలామంది దాని లోపాలను ఎత్తిచూపుతారనే భయం ఉంది. యాప్ డెవలప్‌మెంట్ చూసుకునే సిబ్బందికి అది భారం అవుతుంది” అన్నారు.
“అన్ని అప్లికేషన్లకు చివరకు ఓపెన్ సోర్స్ రూపొందిస్తారు. అది ఆరోగ్య సేతుకు కూడా వర్తిస్తుంది” అని సింగ్ చెప్పారు.
మీరు వ్యవస్థను ఓడించగలరా?
ఆరోగ్యసేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోడానికి యూజర్ తన పేరు, లింగం, ట్రావెల్ హిస్టరీ, టెలిఫోన్ నంబర్, లొకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
“అక్కడ ఎవరైనా తప్పుడు వివరాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం వాటిని తనిఖీ చేయలేదు. అందుకే ఇక్కడ డేటా సమర్థత ప్రశ్నార్థకంగా ఉంది” అని పాహ్వా బీబీసీతో చెప్పారు.
బజ్‌ఫీడ్ నివేదిక ప్రకారం ఒక భారత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆరోగ్యసేతు యాప్ రిజిస్ట్రేషన్ పేజ్‌ను బైపాస్ చేయాలని దాన్ని హ్యాక్ చేశాడు. జీపీఎస్, బ్లూటూత్ ద్వారా డేటా సేకరించకుండా ఆ యాప్‌ను ఆపగలిగాడు.
పరిష్కారాలు వెతికేవారు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోకుండా దానిని స్క్రీన్ వాల్ పేపర్‌లా పెట్టుకుంటే చాలని రెడిట్‌లో కొందరు సలహాలు కూడా పెట్టారని ఇదే నివేదికలో చెప్పారు.
“గోప్యత స్పృహ ఉన్నవారు అలా చేయవచ్చు. తమ డేటా బలవంతంగా ప్రభుత్వానికి ఇవ్వడం ఇష్టం లేని వారు, అలాంటి పరిష్కారం వెతకవచ్చు. మోడిఫైడ్ యాప్ లేదా స్క్రీన్ షాట్ ఉపయోగించి జనం అలాంటి పని చేయవచ్చు” అని పాహ్వా చెప్పారు.
కానీ “ఎవరైనా ఇంట్లోనే ఉంటూ, వేరే ఎవరినీ కలవకుండా ఉంటే, మీకు యాప్ ఉన్నా లేకపోయినా, లేదా బ్లూటూత్ ఆఫ్ చేసినా లేదంటే సెల్ఫ్ అసెస్‌మెంట్‌లో అబద్ధాలు చెప్పినా ఏం ఫర్వాలేదు” అని సింగ్ వాదిస్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: అమెరికా ఎన్నడూ లేనంతగా భయపడుతోందా?
- ఎయిర్ ఇండియా పైలట్లు కరోనావైరస్ బారిన పడే ముప్పు ఎక్కువ ఉందా?
- ఈ దేశాల్లో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదు, ఎందుకు?
- కరోనావైరస్: రోజూ పేపర్ తెప్పించుకోవచ్చా? కూరలు పళ్లు కొనే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
- తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి ‘లాక్డౌన్’.. పంటను కోయలేరు, అమ్మలేరు..
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో లాక్ డౌన్: మీరు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- కరోనావైరస్ ప్రభావంతో భారత్‌లో ఎన్ని ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది?
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








