ప్రశాంత్ భూషణ్‌కు కోర్టు ధిక్కరణ కేసులో తన వాదన మార్చుకునేందుకు గడువు ఇచ్చిన సుప్రీం కోర్టు

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, Getty Images

కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేలిన ప్రసిద్ధ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన ప్రకటనను మార్చుకోవడానికి సుప్రీం కోర్టు 2-3 రోజుల గడువు ఇచ్చింది.

జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ, "ఈ భూమిపై తప్పులు చేయలేని మనిషి లేడు. మీరు వంద మంచి పనులు చేసి ఉండవచు. అలాగని, పది తప్పులు చేయడానికి మిమ్మల్ని అనుమతించరు. జరిగిందేదో జరిగిపోయింది. కానీ, అందుకు ఆ వ్యక్తి (ప్రశాంత్ భూషణ్) పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని మేం కోరుకుంటున్నాం" అని అన్నారు.

ప్రశాంత భూషణ్ మాత్రం తాను సమర్పించిన వాదనలో ఎలాంటి మార్పు ఉండదని, దాని వల్ల కోర్టు సమయం అకారణంగా వృథా అవుతుందని అన్నారు.

"కోర్టు కోరుకుంటే దీని మీద మళ్లీ విచారణకు సిద్ధమే. కానీ, నా ప్రకటనలో పెద్దగా తేడా ఉండదు. నాకు కోర్టు సమయాన్ని వృథా చేయడం ఇష్టం లేదు" అని ప్రశాంత్ భూషణ్ అన్నారు.

జస్టిస్ మిశ్రా దీనిపై స్పందిస్తూ, "మీరు మళ్లీ ఆలోచించుకుంటే బాగుంటుంది... ఈ విషయంలో మీరు కేవలం చట్టపరమైన ప్రజ్ఞను ఉపయోగించవద్దు" అని అన్నారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

ధిక్కరణ కేసులో దోషి

2020 ఆగస్టు 14 న కోర్టు ధిక్కరణ కేసులో సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను.. జస్టిస్ అరుణ్ మిశ్రా ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం దోషిగా ప్రకటించింది.

ఈ కేసులో విచారణ వాయిదా వెయ్యాలని ప్రశాంత్ భూషణ్ బుధవారం సుప్రీం కోర్టుకు అర్జీ పెట్టుకున్నారు. "శిక్షపై విచారణను వాయిదా వేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. సమీక్ష పిటిషన్‌పై విచారణ తేలనంతవరకూ శిక్షపై విచారణ తారీఖుని వాయిదా వెయ్యాలని" ఆయన పిటిషన్‌లో వెల్లడించారు.

గురువారం సుప్రీంకోర్టులో ప్రశాంత్ భూషణ్ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే.. శిక్షపై విచారణ గురించి తమ వాదనను వినిపించారు.

"పునర్విచారణ పిటిషన్ వేసేవరకూ, శిక్ష పడదని కోర్టు హామీ ఇస్తోంది" అని జస్టిస్ అరుణ్ మిశ్రా తెలిపారు.

"ముప్పై రోజుల్లో సమీక్ష పిటిషన్ దాఖలు చేసే హక్కు మాకు ఉంది" అని దుష్యంత్ దవే కోర్టుకు తెలిపారు. "నేరాన్ని రుజువు చేయడం, శిక్షించడం రెండు వేర్వేరు విషయాలు. నా అప్పీల్ న్యాయబద్ధమైనది. శిక్షను వాయిదా చేయవచ్చు. అంతమాత్రాన ఆకాశం ఊడిపడిపోదు" అని దవే అన్నారు.

ప్రశాంత్ భూషణ్

ఫొటో సోర్స్, Getty Images

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రశాంత్ భూషణ్ తన వాదనను వినిపించారు. "కోర్టు ధిక్కరణ కేసులో దోషిగా తేల్చినందుకు చాలా బాధగా ఉంది" అని అన్నారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే భిన్న ఆలోచనలకు ఆస్కారం ఉండాలి అని ఆయన అన్నారు.

భూషణ్ మాట్లాడుతూ.."కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్టు భావించిన నా ట్వీట్లు... నా బాధ్యత. ఇంకేం కాదు. వాటిని వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా చూడాలి. నేను రాసినది నా వ్యక్తిగత అభిప్రాయం. నా విశ్వాసాలు, అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు నాకు ఉంది" అన్నారు.

మహాత్మాగాంధీని ఉటంకిస్తూ "నాకు దయ అవసరం లేదు, నేను డిమాండ్ చేయను. నేను ఔదార్యాన్ని కూడా కోరుకోను. కోర్టు ఏ శిక్ష విధించినా దాన్ని సంతోషంగా అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని భూషణ్ అన్నారు.

గురువారం నాడు ప్రశాంత్ భూషణ్ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలను విన్న జస్టిస్ మిశ్ర, "పునర్నివచారణ అభ్యర్థనను దఖలు పరిచేంతవరకు ఎలాంటి శిక్షఉండదు" అని హామీ ఇచ్చారు.

సుప్రీంకోర్టు సీజేఐలు

ఫొటో సోర్స్, Getty Images

వివాదం ఏంటి?

ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు వివాదాస్పద ట్వీట్లు న్యాయ వ్యవస్థను అగౌరవపర్చేలా ఉన్నాయని జులై 22వ తేదీన సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు ఆయనకు నోటీసు జారీ చేసింది.

ఆలోచించే హక్కు (ఫ్రీడమ్ ఆఫ్ థాట్) కోర్టు ధిక్కరణ పరిధిలోకి రాదని ప్రశాంత్ భూషణ్ సమాధానం ఇచ్చారు.

దీనిపై విచారణ కొనసాగింది. ఆ ట్వీట్లు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయని, వాటిని పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్ దోషి అని ఈరోజు సుప్రీంకోర్టు తేల్చింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే ఒక మోటారు సైకిల్‌పై ఉన్న ఫొటోను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ భూషణ్ తన అఫిడవిట్‌లో స్పందిస్తూ.. మూడు నెలలకు పైగా సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో పనిచేయటం లేదని, ఈ నేపథ్యంలో విచారంలో తాను అలా స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యం వృధా అనే వ్యాఖ్యకు వివరణ ఇస్తూ.. ‘అలాంటి ఆలోచనలను బహిరంగంగా వ్యక్తీకరించడం ఇబ్బందిరకంగా అనిపించొచ్చు కానీ అదే వాస్తవం, దీనిని కోర్టు ధిక్కరణగా పరిగణించకూడదు’ అని తెలిపారు.

‘ధిక్కరణ’పై భిన్నాభిప్రాయాలు

ఈ విషయంపై రెండు రకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి

ప్రశాంత భూషణ్ కోర్టు ధిక్కరణ కేసుపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి.

"రెండు ట్వీట్లలో న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చలేము. సమాజం పెద్ద పెద్ద సవాళ్లను ఎదుర్కుంటున్న ఈ సమయంలో చిన్న చిన్న విమర్శలకు కోపం తెచ్చుకోకుండా భిన్నమైన ఆలోచనలకు కూడా భాగం కల్పిస్తే న్యాయవ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుంది" అని బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఎఐ) అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రశాంత్ భూషణ్‌కు మద్దతుగా బిఎఐ మరో ప్రకటన కూడా జారీ చేసింది.

అయితే, 15 మంది న్యాయమూర్తులతో సహా వందకు పైగా మేధావులు సుప్రీం కోర్టుకు మద్దతిస్తూ లేఖను జారీ చేసారు. కోర్టు నిర్ణయానికి అభ్యతరం తెలియజేయడం సబబు కాదని వీరు తెలిపారు.

మరో పక్క భూషణ్‌కు మద్దతుగా నిల్చినవారు న్యాయవ్యవస్థలో భాగమైన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలను అవమానంగా భావిస్తూ ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన తీర్పు నిరాశపరిచిందని, ఆందోళన కలిగిస్తోందని తెలిపారు.

పంజాబ్, తమిళనాడుకు చెందిన న్యాయవాదులు ఈ నిర్ణయం సరి కాదంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసారు. కోర్టు తీర్పును విమర్శించారు.

వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 21 మంది నాయకులు తనకు మద్దతు ప్రకటించారని ప్రశాంత్ భూషణ్ బుధవారం ఒక ట్వీట్లో పేర్కొన్నారు.

రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ కురియన్ జోసెఫ్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ 'ఐదుగురు లేదా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాలి' అని అన్నారు.

"ఇలాంటి కేసుల విషయంలో ఇంట్రా-కోర్టులో అప్పీల్ చేసుకునే వీలు కల్పించాలి. న్యాయవ్యవస్థ విఫలం అవ్వకుండా కాపాడుకోవడం కోసమైనా ఇంట్రా-కోర్టు అప్పీలు మంజూరు చెయ్యాలి" అని ఆయన అన్నారు.

జస్టిస్ సీఎస్ కెర్నాన్‌పై వచ్చిన ధిక్కరణ కేసులో ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెప్పినట్టు జస్టిస్ కురియన్ తెలిపారు.

‘ఇలాంటి కేసుల్లో తీర్పు చెప్పే ముందు వివరంగా వాదనలు జరగాలి. విస్తృతంగా అభిప్రాయాలు వినాలి. ఎక్కువమందిని భాగస్వాములను చెయ్యాలి’ అని జస్టిస్ కురియన్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)