డ్రీమ్ 11: ఐపీఎల్ కొత్త స్పాన్సర్‌కు చైనాతో లింకులున్నాయా?

ఫొటో సోర్స్, Dream11 Twitter
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు కొత్త స్పాన్సర్ దొరికింది. ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్ 11 ఈ ఏడాది ఐపీఎల్‌కు వీవో స్థానంలో కొత్త టైటిల్ స్పాన్సర్‌గా మారింది.
గల్వాన్ లోయలో ఇండో-చైనా సైన్యాల మధ్య ఘర్షణ తరువాత భారతదేశంలో చైనా కంపెనీలపై వ్యతిరేకత పెరిగింది. తీవ్ర నిరసనల కారణంగా చైనా మొబైల్ బ్రాండ్ వివోతో కుదుర్చుకున్న రూ.440 కోట్ల ఒప్పందాన్ని ఐపీఎల్ రద్దు చేసుకుంది. ఆ తర్వాత కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం వెతికింది. డ్రీమ్ 11 ఆ స్థానాన్ని భర్తీ చేసింది.
యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరగబోయే ఐపీఎల్-13 కోసం డ్రీమ్ 11 నాలుగున్నర నెలల ఒప్పందాన్ని వేలం ద్వారా దక్కించుకుంది. "రూ. 222 కోట్లకు డ్రీమ్ 11 సంస్థ బిడ్‌ను సొంతం చేసుకుంది’’ అని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ వెల్లడించారు.
అంతకు ముందు భారతీయ పారిశ్రామిక దిగ్గజం టాటా కూడా ఈ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరకు ఆ సంస్థ బిడ్ వేయలేదు. బైజుస్, అన్‌అకాడమీ అనే రెండు ఆన్‌లైన్ విద్యాసంస్థలు వరసగా రూ.201 కోట్లు, రూ.170 కోట్లతో వేలంలో పోటీపడ్డాయి. చివరకు డ్రీమ్ 11 ముందు వరసలో నిలబడింది.
డ్రీమ్ 11తో ఒప్పందం డిసెంబర్ 31 వరకు ఉంటుంది. యూఏఈలో సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు సాగే ఈ టోర్నమెంట్ ఏ కారణం వల్ల ఆగిపోయినా లేదా డ్రా అయినా, అదే సంస్థ ఈ సంవత్సరం చివరి వరకు టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగుతుంది.

ఫొటో సోర్స్, Dream11 Twitter
వీవోతో ఒప్పందాన్ని రద్దు చేయడానికి ప్రధాన కారణం చైనాతో ఆ సంస్థకు ఉన్న లింకులే. అయితే డ్రీమ్11కు కూడా చైనాతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చెప్పిన దాని ప్రకారం డ్రీమ్ 11కు చైనా ఇంటర్నెట్ దిగ్గజం టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి ఆర్థిక సాయం లభించింది.
2019 సంవత్సరంలో 1 బిలియన్ డాలర్లకు పైగా విలువను సాధించిన భారతదేశపు మొదటి గేమింగ్ స్టార్టప్‌గా డ్రీమ్ 11 అవతరించింది. డ్రీమ్ 11 పక్కా భారతీయ సంస్థ అని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) స్పష్టం చేసింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం చైనా సంస్థ టెన్సెంట్‌కు డ్రీమ్ 11లో 20-25శాతం వాటా ఉంది. కానీ ఈ వాటాను చాలా 'మైనర్' అని అంటారు. పూర్తి భారతీయ బ్రాండ్‌గా ఇది తనను తాను ప్రచారం చేసుకుంటుంది. టైటిల్ స్పాన్సర్‌గా రంగంలోకి దిగడానికి కారణం కూడా అదే.
కార్పొరేట్ సర్కిల్ ట్రాకింగ్ వెబ్‌సైట్ విసి సర్కిల్ 2018 సెప్టెంబర్‌లో చైనా కంపెనీ టెన్సెంట్స్ డ్రీమ్ 11లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపింది. ఈ సంస్థలో 100మిలియన్ డాలర్లను చైనా కంపెనీ పెట్టుబడిగా పెట్టింది. దాని విలువ రూ.720 కోట్లుగా చెబుతున్నారు.
కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం డ్రీమ్‌స్పోర్ట్స్ అనేది స్పోర్ట్స్ టెక్నాలజీ సంస్థ. డ్రీమ్‌స్పోర్ట్స్‌లో డ్రీమ్ 11, ఫ్యాన్‌కోడ్, డ్రీమ్ ఎక్స్, డ్రీమ్ సెట్ గో, డ్రీమ్‌పే వంటివి ఉన్నాయి. సంస్థ సీఈఓ హర్ష్ జైన్‌కాగా, సీఓఓ, సహ వ్యవస్థాపకుడిగా బాభిత్ సేఠ్‌ను పేర్కొంది.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఈ సంస్థ 2008లో ఏర్పడింది. 2012లో ప్రీమియం ఫాంటసీ క్రికెట్‌ను ప్రారంభించింది. 2014లో లక్ష మంది వినియోగదారులను సంపాదించిన ఈ సంస్థకు 2015లో సిరీస్-ఎ ఫండింగ్, 2017లో సిరీస్-సి ఫండింగ్ లభించాయి.
2018లో దీని వినియోగదారుల సంఖ్య 17 మిలియన్లకు చేరుకుంది. అదే సంవత్సరం కంపెనీ ICC, PKL, FIH, BBLలతో భాగస్వామ్యాన్నిసాధించింది. ఎమ్మెస్ ధోనీ కొత్త బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు.
2019 వచ్చేసరికి డ్రీమ్ 11 యూజర్ల సంఖ్య ఏడు కోట్ల మార్కును దాటింది. 2020 సంవత్సరంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా అవతరించింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం డ్రీమ్ 11 సంస్థ రూ.712 కోట్లకు మూడేళ్ల బిడ్‌ను గెలుచుకుంది. వివో వచ్చే సంవత్సరం కూడా రాకపోతే ఇదే సంస్థ స్పాన్సర్‌గా కొనసాగుతుంది. ఈ సంవత్సరం రూ.222 కోట్లు, రాబోయే రెండేళ్లకు ఒక్కో ఏడాదికి రూ.240కోట్లు చెల్లిస్తుంది.
ఇంత మొత్తం వచ్చినప్పటికీ బీసీసీఐ ఇంకా నష్టాలను చవి చూస్తోంది. 2018లో వివో రూ.1199 కోట్లతో ఐదేళ్లకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇప్పుడు డ్రీమ్ 11 రూ.222 కోట్లు చెల్లిస్తుంది. అంటే బీసీసీఐకి మొత్తం మీద 217.80 నష్టం వాటిల్లింది.
ఇవి కూడా చదవండి
- బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రీడా సంస్థా?
- చైనాలో 80 ఏళ్ల తరువాత తొలిసారి భారీ బుద్ధ విగ్రహం పాదాలను తాకిన వరద నీరు
- ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడి భార్యను ఎందుకు కలిశారు...
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- రియా చక్రవర్తిపై బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వ్యాఖ్యలపై దుమారం
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








