సుగ్రా హుమాయూన్ మీర్జా: బురఖా లేకుండా బయటకు వచ్చిన తొలి మహిళ.. దక్కన్ మహిళల గొంతుక
- రచయిత, నాసిరుద్దీన్
- హోదా, బీబీసీ కోసం
సుగ్రా హుమాయూన్ మీర్జా బురఖాకు అంతం పలికే ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతోపాటూ దక్కన్ మహిళల గొంతుకగా మారారు.
మహిళలు, ముఖ్యంగా ముస్లిం మహిళల జీవితాలను మెరుగుపరచడానికి గళమెత్తిన రచయితగా, సంపాదకురాలిగా, సంఘ సంస్కర్తగా, సాహిత్యకారిణిగా, విద్యావేత్తగా ఈమె గుర్తింపు పొందారు.
బురఖాలో బందీలా ఉండే జీవితం నుంచి ఆమె స్వయంగా స్వేచ్ఛ పొందారు. హైదరాబాద్ దక్కన్ ప్రాంతంలో బురఖా లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిన మొదటి మహిళ ఆమేనని చెబుతారు. అప్పట్లో అలా చేయడం అంత సులభం కాదనేది అందరికీ తెలుసు. అలా చేయడానికి ఎంతో దృఢ సంకల్పం కావాలి.
సుగ్రా హుమాయూన్ మీర్జాలోని ఆ దృఢ సంకల్పమే భవిష్యతులో ఎన్నో తరాల మహిళల కోసం బలమైన పునాదులు వేసింది. ఆమె రచనలు, సామాజిక సేవ, సంస్థను నడిపే సామర్థ్యం మహిళల్లో, ముఖ్యంగా దక్కన్ ప్రాంతంలోని బాలికల జీవితాలపై చాలా ప్రభావం చూపాయి.

మహిళలు చదువుకోవడాన్ని సుగ్రా ప్రోత్సహించారు. మిగతా మహిళలకు తన గళాన్ని వినిపించేందుకు ఆమె కలం పట్టారు. ఆమె స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు సమాజ సేవల్లోకి వచ్చారు. ఆమె ఇప్పటికీ మహిళలకు ఒక ప్రేరణగా నిలిచారు.
సుగ్రా 1884లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మరియం బేగం, డాక్టర్ సఫ్దర్ అలీ. ఆమె పూర్వీకులు ఇరాన్, టర్కీ నుంచి నగరానికి వచ్చారు. కానీ ఆమె దక్కన్‌నే తన భూమిగా భావించారు. దాని కోసమే తన జీవితాన్ని ధారపోశారు. బాలికలు చదువుకోవాలని తల్లి ఆమెను చాలా ప్రోత్సహించేవారు. దాంతో సుగ్రా ఇంట్లోనే ఉర్దూ, పార్సీ శిక్షణ పొందారు.
సుగ్రాకు 1901లో పట్నాకు చెందిన సయ్యద్ హుమాయూన్ మీర్జాతో వివాహం జరిగింది. హుమాయూన్ మీర్జా బారిస్టర్. ఆయన లండన్‌లో చదువుకుని వచ్చారు. న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేందుకు ఆయన హైదరాబాద్ వచ్చారు.

అక్కడ ఆయన కొంతమంది బారిస్టర్స్ సాయంతో అంజుమన్-ఎ-తరక్కీ-ఎనిస్వాకు పునాదులు వేశారు. అప్పుడే ఆయనకు సుగ్రా గురించి తెలిసింది.
సుగ్రాను చూసి ఆయన చాలా ప్రభావితం అయ్యారు. ఆయనతో వివాహం తర్వాత ఆమె పేరు సుగ్రా హుమాయూన్ మీర్జా అయ్యింది. మహిళలు చదువుకోవడం, సమాజ సేవలో పాల్గొనడానికి ఆయన మద్దతుగా నిలిచేవారు. దాంతో సుగ్రా చదువుకోడానికి ఎలాంటి అడ్డంకులూ రాలేదు. దాంతోపాటు ఆమె సమాజ సేవలో మరింత చురుగ్గా పాల్గొనేవారు.
హుమాయూన్, సుగ్రాల మధ్య ఎంత అనుబంధం ఉందో ఆమె ఒక కవితలో చెప్పారు. అందులో “మౌత్ నే కర్ దియా బర్‌బాద్ ముఝే”(మరణం నన్ను నాశనం చేసింది) అని సుగ్రా రాశారు.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.
ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:
- ముత్తులక్ష్మి రెడ్డి: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత
- రుకేయా షకావత్: వేల మంది అమ్మాయిల జీవితాల్లో మార్పు తెచ్చిన రచయిత్రి
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- ఇందర్జీత్ కౌర్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు
- అన్నా చాందీ: భారత్‌లో హైకోర్టు తొలి మహిళా జడ్జి.. మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడిన న్యాయవాది
- అనసూయ సారాభాయ్: కార్మిక ఉద్యమానికి బాటలు వేసిన మహిళ

సుగ్రాను హైదరాబాద్ దక్కన్‌లో మొదటి మహిళా సంపాదకురాలుగా భావిస్తారు. అన్-నిసా(స్త్రీ) జేబ్-ఉన్-నిసా పత్రికలకు వచ్చే వార్తలను ఆమె సరిదిద్దేవారు.
హైదరాబాద్, లాహోర్ నుంచి ప్రచురించే ఆ పత్రికల్లో మహిళల జీవితాలకు సంబంధించిన రచనలు ఉండేవి. మహిళల సామాజిక స్థితిని మెరుగుపరచడంపై వాటిలో చర్చ జరిగేది.
ఆ రచనల్లో ఎక్కువగా మహిళలవే ఉండేవి. వాటిలో సుగ్రా రాసే సఫర్‌నామా(ట్రావెలాగ్)ను కూడా ప్రచురించేవారు. అన్-నిసా పత్రికలో ఎక్కువ పనిని సుగ్రానే చూసుకునేవారు.
సుగ్రా 1919లో తయ్యబా బేగమ్‌తో కలిసి అంజుమన్-ఎ-దక్కన్ ఏర్పాటుచేశారు. అంజుమన్ మహిళా విద్య కోసం పనిచేసేది. దీనితోపాటూ అంజుమన్-ఎ-ఖ్వాతీన్-ఎ-ఇస్లాం, ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఆమె మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి పనిచేసేవారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతోమంది నేతలతో, ముఖ్యంగా సరోజినీ నాయుడుతో సుగ్రాకు మంచి సంబంధాలు ఉండేవి.

సుగ్రా 1931లో లాహోర్‌లో జరిగిన ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ సదస్సులో కూడా పాల్గొన్నారు. అక్కడ అమ్మాయిలకు కూడా అబ్బాయిలతో సమానంగా విద్యాబోధన ఉండాలని వాదించారు. ఒక భార్య ఉన్న పురుషులు మరో పెళ్లి చేసుకోకూడదన్నారు. అంతే కాదు, భార్య ఉన్న వ్యక్తికి తల్లిదండ్రులు ఎవరూ తమ అమ్మాయిని ఇవ్వకూడదని గట్టిగా చెప్పారు.
ఆమె ఒంటరిగాను, భర్త హుమాయూన్ మీర్జాతో కలిసి చాలా దేశాల్లో పర్యటించారు. సుగ్రా ప్రపంచాన్ని ఒక స్త్రీ దృష్టితో చూశారు. యూరప్, ఇరాక్, దిల్లీ, భోపాల్ గురించి ఎన్నో సఫర్‌నామా(ట్రావెలాగ్)లు, నవలలు, కవితలు కూడా రాశారు.
1934లో సుగ్రా అమ్మాయిల కోసం స్వయంగా హైదరాబాద్‌లో ‘మదరసా సఫ్దరియా’ ప్రారంభించారు. ‘సప్ధరియా గర్ల్స్ హైస్కూల్’ పేరుతో ఆ స్కూల్ ఇప్పటికీ నడుస్తోంది. మహిళల జీవితాలను మెరుగుపరచాలనే సుగ్రా హుమాయూన్ మీర్జా కలలను నెరవేర్చడంలో ఆ స్కూల్ నిమగ్నమై ఉంది.

సుగ్రా ప్రముఖ రచనల్లో ముషీరెనిస్వా, మోహిని, సర్గుజష్తే హాజరా, సఫర్‌నామా యూరప్, రోజ్‌నామా దెహలీ టు భోపాల్, సఫర్‌నామా వాల్టర్ వగైరా, సైరే బిహార్ బెంగాల్, సఫర్‌నామా ఇరాక్ అరబ్, ముకాలాత్-ఎ-సుగ్రా ఉన్నాయి.
సుగ్రా హుమాయూన్ మీర్జా 1958లో మరణించారు. అయితే ఇవన్నీ చేయడానికి ఆమె తన జీవితాంతం ఎన్నో అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె లాంటి వారికి చరిత్రలో ఎలాంటి స్థానం ఉండాలో అది సుగ్రాకు ఇప్పటికీ లభించలేదు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్‌లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
- ‘వాట్సాప్-బీజేపీ చేతులు కలిపాయి’.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ
- సురేశ్ రైనా అత్తమామలపై దాడి.. ఐపీఎల్ నుంచి వైదొలగడానికి కారణం ఇదేనా?
- స్వీడన్: ఖురాన్‌ను తగలబెట్టిన అతివాద గ్రూప్.. ఆందోళనలతో అట్టుడికిన మాల్మో నగరం - BBC Newsreel
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?
- తండ్రి అమ్మేశాడు... ముగ్గురితో పెళ్లి... ముగ్గురు పిల్లలు... 16 మంది అత్యాచార నిందితులు
- మనుషులు చేరలేని మహాసముద్రాల లోతుల్లో ప్లాస్టిక్ సంచులు, చాక్లెట్ రేపర్లు
- హైదరాబాదీల్లో నిజాయితీ ఎంత?.. పర్సు దొరికితే తిరిగి ఇచ్చేది ఎందరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









