వేసవి ఉష్ణోగ్రత 50C చేరితే మన శరీరానికి ఏమౌతుంది?

ఫొటో సోర్స్, iStock
గత కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటిన మండలాలు, ప్రాంతాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం శరీరంపై ఎలా ఉంటుంది?
2015లో వడదెబ్బ కారణంగా తెలుగు రాష్ట్రాలలో 1,700 మంది చనిపోయారు. గత కొన్నేళ్లుగా ఇదే సరళి కొనసాగుతూ వస్తోంది.
శిశువులు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ మహిళలు తీవ్ర ఉష్ణోగ్రతలకు ప్రధాన బాధితులు అవుతారు.
ఈసారి కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. గత కొన్ని రోజులగా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పదుల మండలాల్లో నమోదవుతున్నాయి.
భూతాపం ప్రభావంతో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయే తప్ప, తగ్గే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.
మరి ఇలాంటి సమయంలో మానవ శరీరం ఎలా స్పందిస్తుంది?
ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు శరీరం తన లోపలి వేడిని బయటకు తోస్తుంది. ఇది జరిగే ప్రక్రియలో శరీరం ఎక్కువ శాతం రక్త ప్రవాహాన్ని చర్మానికి పంపిస్తుంది.
అప్పుడు శరీరంలోని ఉష్ణోగ్రత చెమట రూపంలో బయటకు వస్తుంది. ఈ చెమట ఆవిరి అవ్వడంతో దేహం చల్లబడుతుంది.
శీతల ప్రదేశాల్లో బయటి ఉష్ణోగ్రత కంటే శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు శరీరం తనలోని వేడిని (బయటి వాతావరణానికి) కోల్పోతుంటుంది. దీన్ని ‘డ్రై హీట్ లాస్’ అని పిలుస్తారు.
కానీ, బయటి వాతావరణంలోని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి, శరీరంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు పైన చెప్పిన ‘డ్రై హీట్ లాస్’ సిద్ధాంతం వర్తించదు.
ఈ పరిస్థితుల్లో శరీరం (తనను తాను చల్లబర్చుకునేందుకు) పూర్తిగా చెమటమీదే ఆధారపడుతుంది.
మానవ దేహం సాధారణ ఉష్ణోగ్రత 37-38C ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ప్రకారం మానవ శరీరానికి చుట్టూ గాలి ఉష్ణోగ్రత 18C నుంచి 24C ఉంటే మంచిది.
వాతావరణం ఒక్కసారి 39-40C చేరిన వెంటనే కండరాలకు వేగం తగ్గించమని మనిషి మెదడు సందేశం పంపిస్తుంది, వెంటనే అలసట పెరుగుతుంది.
ఎప్పుడైతే ఉష్ణోగ్రత 41C దాటుతుందో, మానవ దేహం కీలక మార్పులకు గురవడo మొదలవుతుంది.
శరీరంలోని రసాయన చర్యలు ప్రభావితం అవ్వడంతో పాటు ముఖ్యమైన కణాలు క్షీణించటం మొదలవుతాయి. అది బహుళ అవయవ వైఫల్యానికి దారితీస్తుంది.
చర్మానికి రక్తం చేరడం కూడా కష్టం అవ్వడం వల్ల చెమటలు పట్టడం కూడా ఆగిపోతుంది. దీంతో శరీరం చల్లబడిపోతుంది. మొద్దుబారిపోతుంది.
40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిన తరువాత ఎప్పుడైనా వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది.
అధిక ఉష్ణోగ్రత వల్ల వడదెబ్బ తగిలిన వారికి తక్షణం వైద్య సేవలు అందించాలి. లేదంటే వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడొచ్చు.

ఫొటో సోర్స్, iStock
వేసవికాలంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
వడగాల్పుల సమయంలో ఎక్కువ మంచినీళ్లు తాగడం చాలా ముఖ్యం.
శరీరాన్ని కష్టపెట్టే వ్యాయామాలు అస్సలు చెయ్యకూడదు.
తేలికైన దుస్తులు మరియు లేత రంగు దుస్తులు వేసుకోవాలి.
అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చల్లని ప్రదేశంలో, నీడలో కూర్చోవాలి.
"పగలు రాత్రి తేడా లేకుండా ఉంటున్న ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి చల్లబడే అవకాశం దొరకదు. ఇటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్న ఎదో ఒక చల్లని ప్రాంతానికి చేరుకోవాలి. అది ఎయిర్ కండిషనింగ్ (ఏసీ) కావచ్చు, చల్లని గాలి వీచే ప్రాంతం కావచ్చు" అని ‘శరీరం మీద వేడి ప్రభావం’ అనే అంశంపై పరిశోధనలు చేసిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రొఫెసర్ వర్జీనియా ముర్రే అంటున్నారు.

ఫొటో సోర్స్, iStock
వడదెబ్బ తగిలితే.. వెంటనే ఏం చెయ్యాలి?
తక్షణమే చేరువలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం అత్యంత ముఖ్యం.
వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని నీటిలో ముంచడం కానీ, వారి మొల భాగం, చంకలలో ఐస్ ప్యాక్‌ను పెట్టడo కానీ చేయాలి.
ఇలా ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల కీలకమైన శరీర భాగాలు ఉన్న ఈ ప్రదేశాలు చల్లబడతాయి. ఇలా చేసినా కూడా మానవ దేహం ఎంతసేపు ఈ అధిక ఉష్ణోగ్రతలతో ఉందో దానిని బట్టి ఈ పద్ధతులు పని చేయవచ్చు, చేయకపోవచ్చు.
ఇలాంటి పరిస్థితులలో చెమటలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
"గాలిలోని ఉక్కపోత మన దేహం చెమట సామర్ధ్యాన్ని నిర్ణయిస్తుంది" అని లోవ్బోరొ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జార్జ్ హవినిత్ అన్నారు.
ఉక్కపోత ఎక్కువ ఉంటే మన దేహానికి చెమటలు పట్టే సామర్ధ్యం తగ్గుతుంది. అదే ఉక్కపోత తక్కువ ఉంటే చెమటలు ఎక్కువ పట్టి శరీరం ఉష్ణోగ్రతలను భరించగలదు.

మనుషులకే కాదు..
అధిక ఉష్ణోగ్రతలు, వడదెబ్బల వల్ల మనుషులకే కాదు భూమిపై ఉన్న చాలా జీవులకు ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతున్నాయి.
గత ఏడాది నవంబర్‌లో రెండు రోజుల వడదెబ్బ వల్ల ఆస్ట్రేలియాలోని మూడోవంతు గబ్బిలాలు అంతరించిపోయాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆ దేశంలో ఉన్న మొత్తం 75,000 గబ్బిలాలలో సుమారు 30,000 గబ్బిలాలు రెండు రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అన్ని జీవులూ ఊహించలేని విధంగా ప్రభావితం అవుతున్నాయి. జీవులకే కాకుండా వ్యవసాయం, మంచినీరు, బహిరంగ ప్రదేశాలలో పనిచేసే కార్మికులు, ప్రజల వలసలు, అడవిలో కార్చిచ్చు లాంటి ఎన్నో కీలక విషయాలపై ప్రభావం ఉంటుంది.
2003లో యూరప్‌లో వచ్చిన అత్యంత తీవ్రమైన వడగాల్పు వల్ల 70,000 మంది చనిపోయారు. యూరప్ చరిత్రలో నమోదైన అత్యంత ఘోరమైన వడగాల్పుల్లో అదొకటి.
ఇవి కూడా చదవండి:
- బ్రేక్‌ఫాస్ట్ నిజంగానే ఆరోగ్యానికి మేలు చేస్తుందా?
- ‘24 గంటల కరెంట్ మాకొద్దు’
- నమ్మకాలు-నిజాలు: పత్యం అంటే ఏమిటీ? చేయకపోతే ఏమవుతుంది?
- ‘మీరు అంటరానివాళ్లు అంటూ తుపాను పునరావాస శిబిరంలోకి మమ్మల్ని రానివ్వలేదు’
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
- మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? డీ విటమిన్ కోసం ఎండలో ఎంత సేపు ఉండాలి?
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- E69: ఈ హైవే ఎక్కితే ప్రపంచం అంచులకు వెళ్తాం
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- భూమిని సూర్యుడే కబళిస్తాడా?
- సూర్యుడు చేసే శబ్దం ఇది.. మీరెప్పుడైనా విన్నారా!!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










