చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత

చంద్రప్రభ సైకియాని
    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1925లో అసోంలోని నౌగావ్‌లో ఓ సాహిత్య సభ జరుగుతోంది. మహిళల విద్యను ప్రోత్సహించాలనే అంశంపై అందులో చర్చ జరుగుతోంది.

సభకు హాజరైనవారిలో పురుషులతోపాటు మహిళలు కూడా ఉన్నారు. కానీ, పురుషుల నుంచి విడిగా, వెదురు కట్టెలతో చేసిన తడకల వెనుక మహిళలను కూర్చోపెట్టారు.

చంద్రప్రభ వేదికపైకి ఎక్కి, మైక్‌లో గట్టిగా... ‘ఆ తడకల వెనుక ఎందుకు ఆగిపోయారు. ముందుకు రండి’ అంటూ అరిచారు.

వీడియో క్యాప్షన్, చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత

ఆమె మాట వినగానే, మహిళలు ఆ తడకలను విరగ్గొట్టి, వచ్చి పురుషులతోపాటు కూర్చున్నారు.

చంద్రప్రభ ఇచ్చిన ఈ పిలుపు... అసోంలో అప్పుడు కొనసాగుతున్న పర్దా పద్ధతి తొలగించేందుకు జరిగిన పోరాటంలో కీలకంగా మారింది.

చంద్రప్రభ సైకియాని
ఫొటో క్యాప్షన్, నౌగావ్‌లో సాహిత్య సభ‌లో ఆమె ఇచ్చిన పిలుపు... అసోంలో పర్దా పద్ధతి వ్యతిరేక పోరాటంలో కీలకపాత్ర పోషించింది

అసోంలోని కామ్‌రూప్ జిల్లాలోని దోయిసింగారీ గ్రామంలో 1901 మార్చి 16న చంద్రప్రభ జన్మించారు.

ఆమె తండ్రి రతిరామ్ మజుందార్ అప్పట్లో ఆ గ్రామానికి పెద్దగా ఉండేవారు. కూతురును చదివించడంపై ఆయన దృష్టిపెట్టారు.

చంద్రప్రభ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, జైలుకు కూడా వెళ్లారు
ఫొటో క్యాప్షన్, చంద్రప్రభ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, జైలుకు కూడా వెళ్లారు

చంద్రప్రభ తాను చదువుకోవడంతోపాటు తమ గ్రామంలోని అమ్మాయిల సాధికారతపైనా దృష్టి పెట్టారు.

‘’13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె గ్రామంలోని అమ్మాయిల కోసం ప్రాథమిక పాఠశాల మొదలుపెట్టారు. ఆమె లాంటి యువ టీచర్‌ను చూసి స్కూల్ ఇన్‌స్పెక్టర్ ఆశ్చర్యపోయారు. చంద్రప్రభ సైకియానీకి నౌగావ్ మిషన్ స్కూల్ స్కాలర్‌షిప్ ఇప్పించారు. బాలికల విద్య విషయంలో ఉన్న వివక్షపై చంద్రప్రభ మిషన్ స్కూల్‌లో పోరాడారు’’ అని చంద్రప్రభ మనవడు అంతను సైకియా అన్నారు.

1920-21వ సంవత్సరంలో కిరోన్మయీ ఆగ్రవాల్ సాయంతో చంద్రప్రభ తేజ్‌పూర్‌లో మహిళా సంఘాన్ని ఏర్పాటు చేశారు.

Presentational grey line

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

Presentational grey line
స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు చంద్రప్రభ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేశారు
ఫొటో క్యాప్షన్, స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు చంద్రప్రభ రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేశారు

చంద్రప్రభ, ఇతర స్వాతంత్ర్య పోరాటకారులతో కలిసి విదేశీ దుస్తుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టారని, ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారని నిరుపమా బార్గోహాయి చెప్పారు. ఆ సమయంలో మహాత్మ గాంధీ తేజ్‌పూర్ వచ్చారని వివరించారు.

చంద్రప్రభ జీవితం ఆధారంగా ‘అభియాత్రి’ పేరుతో నిరుపమా ఓ నవల రాశారు. దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా వచ్చింది.

వీడియో క్యాప్షన్, రుకేయా ష‌కావ‌త్ హుస్సేన్: అమ్మాయిల జీవితాలను మార్చిన మహిళ

వెనుకబడిన వర్గానికి చెందిన చంద్రప్రభకు తక్కువ వయసులోనే తనకన్నా చాలా పెద్ద వ్యక్తితో వివాహం జరిగిందని, ఆమె ఆ వివాహాన్ని తిరస్కరించారని నిరుపమా చెప్పారు.

చంద్రప్రభ సైకియాని

‘‘ఆమె చాలా ధైర్యవంతురాలు. ఉపాధ్యాయురాలిగా ఉన్న సమయంలోనే, అయిష్టంగా ఆమె తల్లి కావాల్సి వచ్చింది. భర్తతో ఆమె విడిపోయారు. కుమారుడిని పెంచి, పోషించే బాధ్యతలను తనే తీసుకున్నారు’’ అని నిరుపమా అన్నారు.

చంద్రప్రభ సైకియానీ బాలికలకు చదువు చెప్పడమే కాదు, హక్కుల విషయమై వారికి అవగాహన కూడా కల్పించేవారు. స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆమె సైకిల్ యాత్ర చేశారు. రాష్ట్రంలో ఇలా సైకిల్ యాత్ర చేసిన తొలి మహిళగా చంద్రప్రభను భావిస్తారు.

చంద్రప్రభ సైకియాని

‘‘గ్రామంలో అంటరానివారిగా చూస్తూ కొందరిని చెరువు నీళ్లు ముట్టనిచ్చేవారు కాదు. ఈ పద్ధతికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేశారు. సఫలీకృతమయ్యారు. వారికి చెరువు నీళ్లు సాధించిపెట్టారు. గుళ్లలోకి కూడా వారికి ప్రవేశం కల్పించాలని ఆమె పోరాడారు. కానీ, అందులో విజయవంతమవ్వలేకపోయారు’’ అని చంద్రప్రభ మనవడు అంతను చెప్పారు.

1930లో చంద్రప్రభ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని, జైలుకు కూడా వెళ్లారు. 1947 వరకూ కాంగ్రెస్‌లో ఆమె కార్యకర్తగా పనిచేశారు.

చంద్రప్రభ చేసిన కృషికి గుర్తింపుగా 1972లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది.

వీడియో క్యాప్షన్, దేవదాసీలకు కొత్త జీవితమిచ్చిన ముత్తు లక్ష్మీరెడ్డి

చిత్రాలు: గోపాల్ శూన్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)