భారత్ - చైనా సరిహద్దు వివాదం: 1962 యుద్ధంలో చైనా గెలిచినా.. అరుణాచల్ ప్రదేశ్‌‌ను ఎందుకు వదులుకుంది?

అరుణాచల్ ప్రదేశ్

ఫొటో సోర్స్, DHRUBA JYOTI BARUAH/ISTOCK/GETTY IMAGES

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1962 నాటి విషయం. చైనా-భారత్ మధ్య యుద్ధం జరిగినప్పుడు చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లో సగానికి పైగా ఆక్రమించింది.

చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ ప్రకటించిన తర్వాత సైన్యం తిరిగి మెక్‌మోహన్ రేఖ నుంచి వెనక్కు వెళ్లిపోయింది.

అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదించిన చైనా, చివరికి 1962 యుద్ధం ముగిసిన తర్వాత, దాని నుంచి ఎందుకు వెనక్కు తగ్గిందనేది వ్యూహాత్మక అంశాల్లో నిపుణులకు కూడా అంతుపట్ట లేదు.

చైనా కావాలనుకుంటే, యుద్ధం తర్వాత సైన్యం ఆక్రమించిన ప్రాంతాన్నితమ దగ్గరే ఉంచుకోగలిగేది.

అరుణాచల్ ప్రదేశ్

ఫొటో సోర్స్, @NARENDRAMODI

చైనా అభ్యంతరాలు

అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్‌లో భాగమని, దానిని తాము రాష్ట్రంగా గుర్తించేది లేదని చైనా ఎల్లప్పుడూ చెబుతూనే ఉంది.

టిబెట్ బౌద్ధ గురువు దలైలామా నుంచి భారత ప్రధానమంత్రి వరకూ ఎవరు అరుణాచల్ ప్రదేశ్ వెళ్లినా చైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అదే కారణం.

2009లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించినపుడు కూడా చైనా దానిపై అభ్యంతరాలు తెలిపింది.

తర్వాత 2014లో ఎన్నికల్లో గెలిచాక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. అప్పుడు కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.

అరుణాచల్ ప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదన

దిల్లీలో ఉన్న అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్)లో వ్యూహాత్మక అంశాలపై పరిశోధన విభాగం చీఫ్ హర్ష్ పంత్ దీనిపై బీబీసీతో మాట్లాడారు.

ఇక్కడ అతిపెద్ద సమస్య మెక్‌మోహన్ రేఖ స్పష్టంగా లేకపోవడమేనని ఆయన అన్నారు.

“దౌత్యస్థాయిలో అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తూ చైనా ఈ అంశంలో పైచేయి సాధించాలని కోరుకుంటోంది. కానీ, దాని ‘యాక్టివ్ కంట్రోల్’ తమ దగ్గర ఉంచుకోవాలని అది ఎప్పుడూ అనుకోవడం లేదు” అని ఆయన పేర్కొన్నారు.

అందుకు కారణం.. అరుణాచల్ ప్రదేశ్‌ ప్రజలు ఎప్పుడూ చైనాకు అండగా ఉన్నట్టు కనిపించకపోవటమేనని చెప్పారు.

1914లో భారత్‌లో బ్రిటన్ పాలన ఉంది. అప్పటి భారత - టిబెట్ ప్రభుత్వాల మధ్య సిమ్లా ఒప్పందం జరిగింది.

ఆ ఒప్పందంపై బ్రిటన్ ప్రభుత్వ అధికారి సర్ హెన్రీ మెక్‌మోహన్, నాటి టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు.

భారత్ - చైనా సరిహద్దు

ఫొటో సోర్స్, Reuters

మెక్‌మోహన్ లైన్

ఒప్పందం ప్రకారం భారత్‌లోని తవాంగ్ సహా ఈశాన్య సరిహద్దు ప్రాంతాలకు, బయటి టిబెట్‌కు మధ్య ఉన్న ప్రాంతాన్ని సరిహద్దుగా అంగీకరించారు.

భారత్‌కు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. అటు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 1949లో ఉనికిలోకి వచ్చింది.

టిబెట్‌పై తమకు హక్కు ఉందన్న చైనా, టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేసిన ఏ ఒప్పందాన్నీ తాము అంగీకరించేది లేదంటూ సిమ్లా ఒప్పందాన్ని తోసిపుచ్చింది.

భారత్‌లో మెక్‌మోహన్ లైన్‌ను చూపించే మ్యాప్‌ను అప్పటి బ్రిటన్ ప్రభుత్వం మొదటిసారి 1938లో అధికారికంగా ముద్రించింది. అయితే, నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌గా 1954లో ఏర్పాటైంది.

టిబెట్

ఫొటో సోర్స్, BBC/BRISTOW

టిబెట్ స్వాధీనం

1951లో టిబెట్‌ను చైనా స్వాధీనం చేసుకున్నప్పుడు మొదటిసారి భారత్, చైనా సంబంధాలు పాడయ్యాయి.

తాము టిబెట్‌కు స్వతంత్రం ఇప్పిస్తున్నామని చైనా చెప్పింది. అందువల్ల టిబెట్‌ను భారత్ ప్రత్యేక దేశంగా గుర్తించింది.

1972 వరకూ నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అనే పేరుతో ఉన్న ప్రాంతానికి 1972 జనవరి 20న కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇచ్చి అరుణాచల్ ప్రదేశ్ అనే పేరు పెట్టారు.

1987లో అరుణాచల్‌ప్రదేశ్ పేరుతో ప్రత్యేక రాష్ట్రంగా ఉనికిలోకి వచ్చింది.

అరుణాచల్ ప్రదేశ్ తూర్పున అన్‌జావ్ నుంచి పశ్చిమంగా తవాంగ్ వరకూ ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) చుట్టుపక్కల 1,126 కిలోమీటర్ల ప్రాంతంలో చైనా కార్యకలాపాలు అంతకంతకూ పెరుగుతున్న విషయం కూడా వెలుగులోకి వచ్చింది.

మధ్యమధ్యలో చైనా మ్యాప్‌లు జారీ చేసింది. అందులో అరుణాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపిస్తూ వచ్చింది.

చైనా సైన్యం

ఫొటో సోర్స్, AFP

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ

చైనా సైన్యం కార్యకాలాపాలు ఎక్కువగా దిబాంగ్ లోయలో కనిపించాయి. అక్కడ నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చొరబాట్లకు పాల్పడిందనే వార్తలు కూడా వచ్చేవి.

నియంత్రణ రేఖ సమీప ప్రాంతాల్లో చైనా సైన్యం తమ ఉనికిని అంతకంతకూ పెంచుకుంటోంది. చాలా ప్రాంతాల్లో అది రోడ్లు, నదులపై వంతెనలు కూడా నిర్మించింది.

1962లో చైనా ఇప్పుడున్నంత బలంగా ఉండేది కాదని చాలా మంది నిపుణులు చెప్పేవారని వ్యూహాత్మక అంశాల నిపుణులు సుశాంత్ సరీన్ తెలిపారు. అందుకే యుద్ధం తర్వాత అది స్వయంగా వెనక్కు తగ్గిందని అన్నారు.

కానీ, ఇప్పటి భారత్ కూడా 1962లో ఉన్న భారత్ కాదనే విషయం కూడా మనం చెప్పుకోవాలి.

“భారత సైన్యం ఇప్పుడు బలహీనంగా లేదని చైనాకు తెలుసు. భారత్ ఇంతకు ముందుకంటే చాలా బలంగా ఉంది. అయినప్పటికీ తవాంగ్ మఠాన్ని ఆక్రమించి, దానిని తమ అధీనంలోకి ఉంచుకోవాలని చైనా అనుకుంటోంది. తవాంగ్ మఠం 400 ఏళ్ల పురాతనమైనది. ఆరో దలైలామా 1683లో తవాంగ్‌లోనే జన్మించారని భావిస్తార”ని సుశాంత్ సిరీన్ చెప్పారు.

అందుకే, అరుణాచల్ ప్రదేశ్‌ ప్రజలు చైనాలో ప్రవేశించడానికి వీసా అవసరం లేదని చైనా అంటోంది. కానీ, పెరుగుతున్న చైనా కార్యకలాపాలు అరుణాచల్ ప్రదేశ్‌ రాజకీయ పార్టీలు, స్థానికులను కవలరపెడుతున్నాయి.

చాలామంది నేతలు దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ (తూర్పు) ఎంపీ తాపిర్ గావో దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ కూడా రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)