దేవ్లీ క్యాంప్: 3 వేల మంది చైనా సంతతి ప్రజలు భారత్‌లో బందీలుగా మారినప్పుడు ఏం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Joy Ma
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 1962 నవంబర్ 19. మధ్యాహ్నం షిల్లాంగ్ డాన్ బాస్కో స్కూల్లోకి హఠాత్తుగా ఒక భారత సైనిక దళం వచ్చింది. అక్కడ చదువుతున్న చైనా సంతతి విద్యార్థులందరినీ ఒక దగ్గరకు చేర్చడం మొదలుపెట్టింది. వారిలో 16 ఏళ్ల యింగ్ షాంగ్ వాంగ్ ఒకరు.
తర్వాత రోజు సాయంత్రం నాలుగున్నరకు భారత సైనికుల ఒక దళం షాంగ్ ఇంటికి చేరుకుంది. అతడి కుటుంబంలో అందరూ తమతో రావాలని చెప్పింది. “త్వరగానే పంపించేస్తాం, మీతోపాటూ కొంత సామాను, డబ్బు కూడా తెచ్చుకోండి” అని సైనికులు షాంగ్ తండ్రికి చెప్పారు.
యింగ్ షాంగ్ వాంగ్ కుటుంబంలో తల్లిదండ్రులు, ఆరుగురు పిల్లలు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకుని షిల్లాంగ్‌లో జైలుకు తీసుకెళ్లారు.
చరిత్రలో ఈ ఘటనపై రచయిత దిలీప్ డిసౌజా ‘ద దేవ్లీ వాలాజ్’ పేరుతో ఒక పుస్తకం రాశారు.
అందులో ఆయన “1962లో భారత్, చైనా మధ్య యుద్ధం జరిగింది. అప్పుడు భారత్‌లో నివసిస్తున్న చైనా సంతతి వారందరినీ అనుమానంగా చూడడం మొదలైంది. వారిలో చాలామంది భారత్‌తో తరతరాల నుంచీ ఉంటున్నారు. భారతీయ భాషల్లో మాత్రమే మాట్లాడగలిగే వార”ని చెప్పారు.
“భారత అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ‘డిఫెన్స్ ఆఫ్ ఇండియా యాక్ట్’ మీద సంతకాలు చేశారు. దాని ప్రకారం శత్రు దేశాల సంతతికి చెందిన ఎవరి మీద సందేహం వచ్చినా, వారిని అరెస్ట్ చేయవచ్చు.
అంతకు ముందు 1942లో అమెరికాలో కూడా ‘పర్ల్ హార్బర్’ దాడి తర్వాత, అక్కడ ఉంటున్న దాదాపు లక్ష మంది జపనీయులను ఇలాగే అదుపులోకి తీసుకున్నారు”.

ఫొటో సోర్స్, joy ma
అరెస్ట్ చేసినవారిని ప్రత్యేక రైళ్లలో ఎక్కించారు
వాంగ్ కుటుంబాన్ని నాలుగు రోజులు షిల్లాంగ్ జైల్లో ఉంచాక, వారిని గువాహటి జైలుకు పంపించారు. అక్కడ ఐదురోజులు గడిపిన తర్వాత రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు.
అక్కడ ఒక రైలు వారికోసం వేచిచూస్తోంది. ఆ రైలు మాకూమ్ స్టేషన్ నుంచి మొదలైంది. ఆ రైల్లో సైన్యం అదుపులోకి తీసుకున్న వందలాది చైనా సంతతి వారు ఉన్నారు. వారిలో ‘ద దేవ్లీ వాలా’ పుస్తక సహ- రచయిత జాయ్ మా తల్లి ఎఫా మా కూడా ఉన్నారు.
“ఆ ప్రయాణంలో ఒక్కో ప్రయాణికుడికి రోజుకు రెండున్నర రూపాయల చొప్పున, పిల్లలకు రోజుకు రూపాయి పావలా చొప్పున భత్యం ఇచ్చేవారు. మధ్యాహ్నం బయల్దేరిన రైలు మూడు రోజుల తర్వాత రాజస్థాన్‌లోని దేవ్లీ చేరుకుంది” అన్నారు ఎఫా మా.
“మాతో 8 మంది సిలిగురి పోలీస్ కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వారు మాకు బోగీ తలుపు దగ్గరకు వెళ్లద్దని, ఫ్లాట్‌ఫాంపై మీద దిగవద్దని చెప్పారు. వాళ్లు అలా ఎందుకు చెబుతున్నారో, మాకు కాసేపట్లోనే అర్థమైంది. కొన్ని స్టేషన్లలో ఆ రైలు ఆగగానే.. మాపైన జనం పేడ విసురుతున్నారు”.

ఫొటో సోర్స్, joyma
రైలుపై ‘ఎనిమీ ట్రైన్’ అని రాశారు
ఒక స్టేషన్లో దాదాపు 150-200 మంది గుమిగూడారు. వాళ్ల చేతుల్లో చెప్పులు ఉన్నాయి. వాళ్లు ‘చీనీ తిరిగి వెళ్లండి’ అని అరుస్తున్నారు. మా రైలుపై చెప్పులు వేయడంతోపాటూ రాళ్లు కూడా విసరడం మొదలెట్టారు” అని యింగ్ షాంగ్ వాంగ్ చెప్పారు.
“మేం వెంటనే మా బోగీల కిటికీలు మూసేశాం. ఈ రైల్లో చైనీయులు ఉన్నారని బయటవారికి ఎలా తెలిసిందా.. అనుకున్నాం. ఆ రైలు బయట ‘ఎనిమీ ట్రైన్’ అని రాసుందనే విషయం మాకు తర్వాత తెలిసింది”.
ఆ తర్వాత నుంచి లోపల ఉన్నవారికి వంట చేసేందుకు రైలును స్టేషన్లో కాకుండా కాస్త ముందే ఆపేసేవారు.
ఈ ఘటనపై వచ్చిన మరో పుస్తకం ‘డూయింగ్ టైమ్ విత్ నెహ్రూ’. రచయిత్రి యిన్ మార్ష్ అందులో మరిన్ని వివరాలు రాశారు.
“భారత్‌పై దాడి చేసినందుకు చైనీయులను శిక్షించి, వారిని జైల్లో పెడుతున్నామని దేశ ప్రజలకు చూపించాలనే ప్రతి స్టేషన్లో వారు ఆ రైలును ఆపాలనుకున్నారని మా నాన్నకు అనిపించింది. సాయంత్రం మానాన్న రైలు అటెండెంట్ నుంచి కొన్ని పరాఠాలు తీసుకొచ్చారు. మాకు ఇంకా కావాలని అడిగాం. కానీ వాటికి పరిమితి ఉండడంతో మాకు ఒక్కొక్కరికి ఒక్కో పరాఠానే వచ్చింది. తర్వాత మాకు టీ ఇచ్చారు. కానీ అది సరిలేకపోవడంతో వదిలేశాం” అని రాశారు.

ఫొటో సోర్స్, Joy Ma
వణికే చలిలో స్వెటర్లు లేకుండా...
మూడు రోజుల తర్వాత రైలు దేవ్లీ చేరుకుంది. క్యాంప్ బయటే ఉన్న అధికారులు అందరి వివరాలూ రాసుకున్నారు. వారి దగ్గర ఎంత డబ్బు, బంగారం ఉందో కూడా నోట్ చేసుకున్నారు. ఖైదీలందరికీ నంబర్లు, ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు. వారికి టీ బ్రెడ్ ఇచ్చారు. కానీ ఆ బ్రెడ్ ఎంత గట్టిగా ఉందంటే వారు దాన్ని టీలో ముంచుకుని తినాల్సి వచ్చింది.
దిలీప్ డిసౌజా తన పుస్తకంలో “అక్కడ సైనికులు గుడారాలు వేసుకున్నారు. అది నవంబర్ నెల. ఖైదీలు చలికి వణుకుతున్నారు. వారిని తీసుకెళ్తున్నప్పడు మీతో ఒక జత బట్టలు తీసుకోండి అనడంతో వారి దగ్గర స్వెటర్లు, ఉన్ని దుస్తులు కూడా లేవు. కానీ బాగా అలిసిపోయి ఉండడంతో అంత చలిలోనూ వాళ్ల కళ్లు మూతలుపడ్డాయి. అప్పుడే హఠాత్తుగా ఎవరో పాము, పాము అనడంతో మళ్లీ ఆ నిద్ర ఎగిరిపోయింది” అని రాశారు.
ఉడకని అన్నం, మాడిన కూరలు
ఈ క్యాంప్‌లో వంటలు చేయడానికి బయటివారికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అంతమందికి వంటలు చేయడంలో వారికి అనుభవం లేదు. దాంతో, మొదట్లో ఖైదీలకు సగం ఉడికిన అన్నం, మాడిన కూరలు వడ్డించేవారు.
సుమారు రెండు నెలలు అలాగే తిన్నారు. తర్వాత జనం తిరగబడడంతో కమాండెంట్ ప్రతి కుటుంబానికి రేషన్ అందించే వ్యవస్థ ఏర్పాటు చేశాడు. మీ వంట మీరే చేసుకోండని చెప్పాడు.
వారానికి సరిపడా ఇచ్చే రేషన్‌లో అప్పుడప్పుడు గుడ్లు, చేపలు, మాంసం కూడా ఇచ్చేవారని ‘ద దేవ్లీ వాలాజ్’ సహ-రచయిత్రి జాయ్ మా రాశారు.
“క్యాంపులో ఒక్కొక్కరికి నెలకు ఐదు రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఆ డబ్బును సబ్బు, టూత్‌పేస్ట్, వ్యక్తిగత సామాన్లు కొనుక్కోడానికి ఖర్చు చేసేవారు. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటో తెలీకపోవడంతో కొన్ని కుటుంబాలు ఆ డబ్బు కూడా పొదుపు చేసేవ”ని తెలిపారు.
యింగ్ షాంగ్ వాంగ్ అప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ “పగలు ఎలాగోలా గడిచిపోయేది. కానీ రాత్రి సరిగా నిద్రపట్టేది కాదు. చీకట్లో మంచంపై పడుకుని ఆకాశం వైపు చూస్తుండేవాడిని. ఇక్కడ నుంచి ఎప్పుడు బయటపడతామా, మళ్లీ ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని ఆలోచిస్తూ ఉండేవాడిని” అన్నారు.

ఫొటో సోర్స్, Joy Ma
వార్తా పత్రికల్లో రంధ్రాలు
“వేడిని తట్టుకునేందుకు నేను, మా ఫ్రెండ్ కిటికీలకు, తలుపులకు గోనెసంచులు తడిపి వేలాడదీసేవాళ్లం. దాంతో గది చీకటిగా, కాస్త చల్లగా ఉండేది. అక్కడ నీళ్లకు మాత్రం ఏ లోటూ ఉండేది కాదు. ఆ క్యాంప్‌లో ఏకైక వినోదం హిందీ సినిమాల ప్రదర్శన. అక్కడ హిందీ సినిమాలు చూపించడానికి మైదానంలో ఒక స్క్రీన్ ఏర్పాటుచేశారు. ఖైదీలందరూ తమ గదుల్లోంచి మంచాలు బయటకు లాగి వేసుకుని వాటిపైనే కూర్చుని ఆ సినిమాలు చూసేవారు” అంటారు షాంగ్.
“రిక్రియేషన్ రూమ్‌లో వార్తాపత్రికలు వచ్చేవి. కానీ వాటిలో రంధ్రాలు ఉండేవి. ఎందుకంటే చైనా సంబంధిత రాజకీయ వార్తలను పత్రికల్లో కత్తిరించి తీసేసేవారు. మేం పోస్ట్ కార్డుపై ఇంగ్లిష్‌లో లేఖలు రాసేవాళ్లం. మధ్యలో సెన్సార్ కోసం వాటిని దిల్లీకి పంపించడం వల్ల అవి ఆలస్యంగా చేరుతున్నాయని మాకు తర్వాత తెలిసింది”.

ఫొటో సోర్స్, Joy Ma
ముసలి ఒంటె మాంసం పెట్టారు
దేవ్లీ క్యాంపులో ఉంటున్న మరో బందీ స్టీవెన్ వాన్ కూడా ఆ రోజులు గుర్తు చేసుకున్నారు.
“అధికారులు క్యాంపులో వారికి మగ్గులు, స్పూన్లు లాంటి పాత్రలేవీ ఇవ్వలేదు. దాంతో మేం బిస్కెట్ల ఖాళీ డబ్బాలు, లేదంటే ఆకుల్లో తినేవాళ్లం. వంటవాళ్లు బియ్యం కడగకుండా నేరుగా సంచిలోంచి తీసి గిన్నెలో పోసి ఉడికించేవారు. అది చూసి మేం షాకయ్యాం. ఎక్కువ మంది కోసం వంట చేయాల్సి రావడంతో అది అప్పుడప్పుడు అది సగం ఉడికేది లేదంటే మాడిపోయేది” అన్నారు.
“జనం క్యూలలో నిలబడి తమ భోజనం కోసం ఆతృతగా ఎదురుచూసేవారు. అందుకే వంటవాళ్లు సమయానికి ముందే పొయ్యి మీద నుంచి అన్నం దించేసేవారు. చాలాసార్లు మాకు వడ్డించాక మళ్లీ పొయ్యి మీద పెట్టి దానిని ఉడికించడం మేం చూశాం’’ అంటారు యిమ్ మార్ష్.
“ఒకసారి మాకు మాంసం పెట్టారు. కానీ, అది నమల్లేనంత గట్టిగా ఉంది. అది ఒక ముసలి ఒంటె మాంసం అని మాకు తర్వాత తెలీడంతో షాక్ అయ్యాం. దానిని వ్యతిరేకించడంతో ఆ తర్వాత నుంచి మాకు ఒంటె మాంసం వడ్డించడం ఆపేశారు”.
ఆ సమయంలో దేవ్లీ క్యాంపులోనే గడిపిన మరో వ్యక్తి మైకేల్ చాంగ్.
“నేను ఆ క్యాంపులో భోజనం రుచిని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే, వాళ్లు ఆ వంటల్లో ఆవ నూనె ఉపయోగించేవారు. ఇప్పటికీ నేను ఎవరి ఇంట్లో అయినా ఆ నూనెతో చేసిన వంటలు తింటే, నాకు వెంటనే దేవ్లీ క్యాంపులో గడిపిన ఆ రోజులే గుర్తుకొస్తాయి”
“మా వంట మేమే చేసుకోవడం మొదలుపెట్టాక దూరంగా వెళ్లి కట్టెలు ఏరుకొచ్చేవాడిని. కానీ కొన్ని రోజులకు అక్కడ అవి కూడా అయిపోయాయి. తర్వాత మేం చెట్ల వేళ్లు తవ్వి తీసుకొచ్చేవాళ్లం. ఉండేలుతో ఏవైనా పక్షులను కూడా కొట్టి, వాటిని తినేవాళ్లం” అన్నారు చాంగ్.

ఫొటో సోర్స్, Joy Ma
గిన్నెలు తోమి చర్మం పాడైంది
“మా ఇంట్లో వాళ్లు నాకు గిన్నెలు తోమే పని అప్పగించారు. అవి తోమడానికి సబ్బులేవీ ఉండేవి కాదు. దాంతో, నాకు హిందీ సినిమాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బూడిదతో గిన్నెలు తోమే సన్నివేశాలు గుర్తొచ్చాయి. దాంతో నేనూ దాన్నే ఉపయోగించాను. నా గిన్నెలు తళతళ మెరిసేవి. కానీ తర్వాత క్యాంప్ నుంచి విడుదలయ్యే సమయానికి నా అర చేతులు చర్మం పాడైంది. ఉల్లిపాయ తొక్కలా అది ఊడిపోయేది. అది చాలా ఏళ్ల తర్వాత నయమైంది” అంటారు సహ రచయిత్రి యిన్ మార్ష్.
లాల్ బహదూర్ శాస్త్రి దేవ్లీ క్యాంప్ పర్యటన
దేవ్లీ క్యాంపులో టాయిలెట్లకు పైన కప్పు ఉండేది కాదు. చాలాసార్లు వర్షంలోనే అందులో పనులు పూర్తి చేసుకునేవారు. రోజూ టిఫిన్ చేశాక వారంతా ఫుట్‌బాల్ ఆడుతూ టైంపాస్ చేసేవాళ్లు. ఆశ్చర్యం ఏంటంటే మొత్తం క్యాంపులో ఒకేఒక ఫుట్‌బాల్ ఉండేది.
1963లో అప్పటి హోంమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి దేవ్లీ క్యాంపుకు వచ్చారని తన తల్లి ఎఫామా చెప్పారని జాయ్ మా తెలిపారు.
“మమ్మల్ని పరిచయం చేయగానే ఆయన మాతో భారత్‌లో ఉండాలని అనుకుంటున్నవారు ఒక వైపు నిలబడండి, చైనా వెళ్లాలనుకుంటున్నవారు ఇంకోవైపు నిలబడండి అన్నారట. దాంతో, మా అమ్మనాన్నలు భారత్‌లోనే ఉండాలనుకుంటున్న వారి వైపు నిలబడ్డారు. కానీ, ఆ తర్వాత ఏం జరగలేదు”.
“కొన్ని నెలల తర్వాత మా అమ్మ క్యాంప్ కమాండెంట్ ఆర్‌హెచ్ రావ్‌ను హోంమంత్రి మాకు మాట ఇచ్చారు. భారత్‌లో ఉండాలనుకుంటే వారిని ఇళ్లకు పంపిస్తామని చెప్పారు కదా? అని అడిగారు.
దాంతో కాసేపు ఆలోచించిన కమాండర్ ‘మీరు భారత్‌లో ఉండాలనుకుంటే, మీరు ఎక్కడ నిలబడ్డారో అది కూడా భారతే కదా’ అన్నారని” తెలిపారు.

ఫొటో సోర్స్, Joy Ma
యుద్ధ ఖైదీలను కూడా ఉంచారు
ఈ బందీల్లో చాలామంది సుమారు నాలుగేళ్లపాటు దేవ్లీ జైల్లోనే గడిపారు. కొందరు అక్కడ క్యాంపులో ఉన్నప్పుడే చనిపోయారు. జాయ్ మా లాంటి కొంతమంది పిల్లలు అక్కడే పుట్టారు.
చైనా ప్రభుత్వం అక్కడున్న వారిని పట్టించుకోలేదు. భారత ప్రభుత్వం ఒక విధంగా వారిని అక్కడ ఉంచిన విషయమే మర్చిపోయింది.
రఫీక్ ఇలియాస్ ఈ మొత్తం ఘటనను ‘బియాండ్ బార్బడ్ వైర్స్: ఎ డిస్టెంట్ డాన్’ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీగా తీశారు.
బ్రిటిష్ ప్రభుత్వం 1930 నుంచే ఈ దేవ్లీ కాంపును రాజకీయ బందీలను ఉంచడానికి ఉపయోగించేది.
40వ దశకంలో జయప్రకాశ్ నారాయణ్, శ్రీపాద అమృత్ డంగే, జవహర్ లాల్ నెహ్రూ, బీటీ రణదివేలను ఇక్కడ ఖైదీలుగా ఉంచారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ, జపాన్, ఇటలీ యుద్ధఖైదీలను కూడా ఇక్కడే ఉంచారు. 1947 విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన పదివేల మంది సింధీలు కూడా కొన్నిరోజులు ఇక్కడే ఉన్నారు.
1957లో దీనిని సీఆర్పీఎఫ్ క్యాంప్‌గా మార్చారు. ఇక్కడ రెండు సీఆర్పీఎఫ్ బెటాలియన్లు ఉండేవి. 1980లో తర్వాత దీనిని సీఆర్పీఎఫ్‌కే అప్పగించారు. 1984 నుంచి ఇది సీఆర్పీఎఫ్‌లో చేరేవారికి పరీక్షా కేంద్రంగా ఉంది.

ఫొటో సోర్స్, Joy Ma
బందీలు విధిలేక చైనా వెళ్లారు
భారత్‌లో చైనా సంతతి వారిని బందీలుగా దేవ్లీలో ఉంచారని కొన్నిరోజుల తర్వాత చైనాకు తెలిసింది. వారిని తమ దేశానికి పిలిపించాలని అనుకుంటున్నట్లు ఒక ప్రతిపాదన చేసింది.
దాంతో ఆ ప్రతిపాదనకు అంగీకరించిన చాలామంది బందీలు చైనా వెళ్లిపోయారు. చైనాలో కరువు వచ్చిందనే వదంతులు రావడంతో కొంతమంది చైనా వెళ్లకూడదని అనుకున్నారు.
మొదట్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, తైవాన్ ప్రభుత్వాన్ని సమర్థించిన చైనా సంతతి వారందరూ చైనా వెళ్లకూడదని అనుకున్నారు. కానీ భారత్‌లో తమకు ఎలాంటి భవిష్యత్తు లేదనే విషయం తెలిశాక, వారంతా మనసు చంపుకుని చైనా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వారి ఎన్నో తరాలు భారత్‌లోనే నివసించాయి. వారందరూ హిందీ, బంగ్లా, లాంటి భారతీయ భాషల లోనే మాట్లాడుకునేవారు. అందుకే వారు చైనాను పరాయిదేశంగానే భావించారు.

ఫొటో సోర్స్, Joy Ma
భారత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
జైలు నుంచి విడుదలైన చాలామంది తమ పాత ఇళ్లకు వెళ్లేసరికి, అప్పటికే ఇతరులు వాటిని ఆక్రమించుకున్నారు. దాంతో చాలామంది కెనడా, అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
వారిలో చాలామంది ఇప్పటికీ కెనడాలోని టొరంటోలో ఉంటున్నారు. ‘అసోసియేషన్ ఆఫ్ ఇండియా దేవ్లీ క్యాంప్ ఇంటర్నీస్ 1962’ అనే సంఘాన్ని కూడా స్థాపించారు.
2017 ప్రారంభంలో వారు కెనడాలో భారత రాయబార కార్యాలయం ముందు ప్రదర్శనలుకూడా చేశారు. అప్పుడు తమతో దురుసుగా ప్రవర్తించినందుకు భారత ప్రభుత్వం తమను క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు.
ఆ ప్రదర్శనల తర్వాత తిరిగి వెళ్తున్న సమయంలో సంఘంలో వారు యింగ్ షాంగ్ వాంగ్‌ను ఒక పాట పాడమని అడిగారు. ఆయన ఏదో చైనీస్ పాట పాడుతాడులే అనుకున్నారు.
కానీ యింగ్ వాంగ్ హిందీ సినిమా ‘దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయీ’లో ఓ పాట అందుకున్నారు. అది వినగానే బస్సులో ఉన్న అందరి కళ్లూ చమర్చాయి.
“ఎన్నో దశాబ్దాల క్రితం విషాదవశాత్తూ భారత్ వదిలి వెళ్లిన ఒక చైనా భారతీయుడు ఒటావా నుంచి టొరంటో వెళ్తున్న బస్సులో ఒక పాత హిందీ పాట పాడడమే దానికి కారణం”.
“చైనీయుల రూపం, చర్మం రంగు చూస్తుంటే నాకు వాంగ్, ఆయనతోపాటూ వేలాది చైనీయులను దేవ్లీ క్యాంప్‌కు పంపించిన వారు అప్పుడు ఏమనుకున్నారో, దాదాపు అలాగే అనిపించింది. వారు చైనీయుల్లా కనిపించడం ఒక్కటే వారు చేసిన నేరం” అంటారు దిలీప్.
ఇవి కూడా చదవండి:
- చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ ఏం మాట్లాడారు?
- ‘రెండు దేశాల మధ్య సంబంధాల్లో మతానికి స్థానం లేదు‘: నేపాల్
- దేశంలో ఇంకెక్కడా లేనంత స్థాయిలో తెలంగాణలో వైద్య సిబ్బంది కరోనావైరస్ బారిన పడుతున్నారెందుకు
- టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- లాక్డౌన్ ఎఫెక్ట్: ఏపీలో ప్రజలకు కరెంటు బిల్లుల షాక్... అదనపు భారం వేయలేదంటున్న ప్రభుత్వం
- కరెంట్ లేనప్పుడు సెల్‌ఫోన్ చార్జ్ చేయడమెలా?
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








