భారత్ - నేపాల్ సరిహద్దు వివాదం: ‘రెండు దేశాల మధ్య సంబంధాల్లో మతానికి స్థానం లేదు‘ - నేపాల్ విదేశాంగ మంత్రి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్-నేపాల్ ప్రపంచంలోనే హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉన్న రెండు దేశాలు. రెండు దేశాల్లో మత సమానత్వమే కాదు సాంస్కృతిక సమానత్వం కూడా ఉంది.
హిందీ, నేపాలీ భాషలను కూడా గమనిస్తే దేవనాగరి లిపి కనిపిస్తుంది. అంతేకాదు.. శబ్దావళి కూడా దాదాపు ఒకేలా ఉంటుంది. హిందీ తెలిసినవారు లేదా చదవగలిగినవారు నేపాలీని కూడా కాస్తోకూస్తో అర్థం చేసుకోవచ్చు.
నేపాల్-భారత్ మధ్య ‘బేటీ-రోటీ’ బంధం ఉందనే ఒక నానుడి కూడా ఉంది. నేపాల్ సరిహద్దులు మూడు వైపుల నుంచి భారత్‌తో కలిసి ఉంటాయి. ఒకవైపు టిబెట్ ఉంది. ఇన్ని ఉన్నప్పటికీ నేపాల్-భారత్ మధ్య సంబంధాలు ఇటీవల గాడి తప్పాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పదవీకాలంలో నాలుగేళ్లలో మూడుసార్లు నేపాల్ పర్యటనకు వెళ్లారు. మోదీ 2018లో మూడోసారి నేపాల్ వెళ్లారు. ఆ సమయంలో నేపాల్‌తో బంధాలు బలోపేతం చేసుకోడానికి మతపరమైన మార్గాన్ని ఉపయోగించారు. ఈ పర్యటనలో మోదీ నేరుగా జనక్‌పూర్, తర్వాత ముక్తినాథ్ వెళ్లారు.
నేపాల్‌లో ఆలయాలకు వెళ్లినప్పుడు ఆయన మనసులో రెండు దేశాల్లో ఉన్న మతపరమైన గుర్తింపు విస్తృత సమానత్వం గురించి కచ్చితంగా ఆలోచనలు వచ్చే ఉంటాయి.
అయినప్పటికీ, మోదీ ప్రభుత్వంలో నేపాల్‌తో సంబంధాలు చారిత్రక స్థాయిలో పాడయ్యాయి. అలా ఎందుకు అయ్యాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోడానికి నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ గవాలీతో బీబీసీ ఫోన్లో మాట్లాడింది.
బీబీసీ ప్రశ్నలకు నేపాల్ విదేశాంగ మంత్రి ఇచ్చిన సమాధానాలు ఆయన మాటల్లోనే...

ఫొటో సోర్స్, VLADIMIR GERDO
బీబీసీ: రెండు దేశాల్లో మెజారిటీ జనాభా హిందువులు. భారత్, నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలను ఇది మెరుగుపరచగలదా?
ప్రదీప్ గవాలీ: భారత్, నేపాల్‌కు చాలా స్థాయిల్లో సమానత్వం ఉంది. రెండు దేశాల సంబంధాలను బలోపేతం చేసే అత్యంత ముఖ్యమైన అంశం సాంస్కృతిక సమానత్వం. రెండు దేశాలు అద్భుతమైన నాగరికతకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇరు దేశాల్లో అపార జ్ఞాన పరంపర ఉంది. ఆయుర్వేదం, యోగా, జ్యోతిష్యం భారత్, నేపాల్ రెండు దేశాల్లో సమానంగా ఉన్నాయి. రెండు దేశాల ఉమ్మడి సంస్కృతి ప్రజల మధ్య పరస్పర సంబంధాలను బలోపేతం చేస్తుంది.
కానీ సంస్కృతిని, మతాన్ని కలపకూడదనే విషయం మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మతం, సంస్కృతి రెండు వేరు వేరు కోణాలు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసం. అది పూర్తిగా వ్యక్తిగతం. నాకు తెలిసి దేశ అంతర్గత అంశాల్లోకి, ఇతర దేశాలతో సంబంధాల కోసం మతాన్ని మధ్యలోకి తీసుకురాకూడదు.
బీబీసీ: నేపాల్ లౌకిక దేశంగామారకూడదని నేపాల్ మీద భారత్ ఒత్తిడి తీసుకొస్తోందా?
ప్రదీప్ గవాలీ: నా దగ్గర దాని గురించి కచ్చితమైన సమాచారం లేదు. కానీ నేపాల్ రాజ్యాంగంలో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనేది నేపాల్ ప్రజలే నిర్ణయిస్తారు. మేం లౌకిక దేశంగా ఉండాలో, వద్దో మా నేత, పార్లమంట్, నేపాల్ ప్రజలు నిర్ణయిస్తారు. అది ఎవరి ఒత్తిడితో అయ్యేది కాదు. దీనిపై ఏదో ఒత్తిడి ఉందని నాకైతే అనిపించడం లేదు. ఒకవేళ ఒత్తిడి ఉన్నా అది వారి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. నేపాల్ తన నిర్ణయం స్వయంగా తీసుకుంటుంది. మా గురించి వేరే వారు నిర్ణయాలు తీసుకోజాలరు.

ఫొటో సోర్స్, NurPhoto
బీబీసీ: కశ్మీర్ అంశం పరిష్కారం కాకుండా భారత్‌తో సంబంధాలు మెరుగుపడవని పాకిస్తాన్ చెబుతుంది. అలాగే నేపాల్ కూడా లిపులేఖ్ వివాదం పరిష్కారం అయ్యేవరకూ భారత్‌తో సంబంధాలు మెరుగుపడవని భావిస్తోందా?
ప్రదీప్ గవాలీ: నేపాల్, భారత్ మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోక తప్పదు. వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిందే. కానీ వాటి వల్ల అన్నీ ఆగిపోవాలని మేం కోరుకోవడం లేదు. మాకు భారత్‌తో చాలా అంశాల్లో సంబంధాలు ఉన్నాయి. వాటిని కొనసాగిస్తూనే, ఈ సరిహద్దు వివాదాన్ని కూడా పరిష్కరించుకోవాలని మేం కోరుతున్నాం. కానీ భారత్ దీనిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందో మాకు అర్థం కావడం లేదు.
బీబీసీ: భారత్‌ను బ్లాక్‌మెయిల్ చేయడానికే నేపాల్, చైనాతో కలిసిందని, మరోవైపు నేపాల్ లాండ్‌లాక్డ్ దేశం కాబట్టి భారత్ దానిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోందని ప్రశ్నలు వస్తున్నాయి?
ప్రదీప్ గవాలీ: మా భౌగోళిక స్థితి వల్ల వెనకబడిపోవాలని మేం కోరుకోవడం లేదు. ఏదైనా ఒక దేశంపై ఆధారపడి ఉండాలని కూడా అనుకోవడం లేదు. మేం పరస్పర ఆధారం అనే దిశగా చూస్తున్నాం. అందుకే మేం నేపాల్ రవాణా సౌకర్యాలను మరింత విస్తరించాలని అనుకుంటున్నాం. భారత్ ద్వారా మేం ఆ సౌకర్యం ఉపయోగించేవాళ్లం. మేం ఇప్పుడు చైనాతో రవాణా సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది నేపాల్ జాతీయ అవసరం. ఈ విషయంలో ఏదైనా ఒక దేశం అనుచిత లాభం పొందాలని చూస్తుందని నేను అనుకోను. మేం భారత్, చైనా రెండు దేశాల అభివృద్ధి యాత్రలో కలిసి ముందుకు సాగాలని అనుకుంటున్నాం. పొరుదేశాల అభివృద్ధి, శ్రేయస్సును మేం మా కోసం ఒక అవకాశంలా చూస్తున్నాం. మా పొరుగు దేశాలు కూడా సుసంపన్న నేపాల్ వల్ల తమకు ప్రయోజనం ఉందని అర్థం చేసుకోవాలి.

ఫొటో సోర్స్, PRAKASH SINGH
బీబీసీ: భారత్ - నేపాల్ ఉద్రిక్తతలకు సంంధించి దౌత్య చర్చలు మొదలవుతాయా? గూర్ఖాలు భారత సైన్యంలో ఉండడం గురించి నేపాల్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
ప్రదీప్ గవాలీ: గూర్ఖాల అంశం రెండు దేశాల మధ్య ఒక సున్నితమైన అంశం. మేం ఆ అంశంపై అప్పుడే వివరంగా ఏదీ చెప్పలేం. రెండు దేశాలకు ఉమ్మడి సంస్కృతి ఉంది. దాని మూలాలు చాలా బలంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఇలాంటి వివాదాస్పద అంశాలు చాలా ఉన్నాయి. కానీ, మేం వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం.
బీబీసీ: మోదీ ప్రభుత్వం హయాంలో భారత్-నేపాల్ సంబంధాలు గాడితప్పాయా?
ప్రదీప్ గవాలీ: దానికి రెండు కోణాలు ఉన్నాయి. చాలా అంశాల్లో పనులు మెరుగ్గా జరిగాయి. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే వివిధ స్థాయిల్లో పనులు జరిగాయి. భూకంపం తర్వాత మా పునర్నిర్మాణంలో భారత్ చాలా సాయం చేసింది. అది కాకుండా పెట్రోలియం పైప్‌లైన్ పనులు జరిగాయి. కొన్ని అంశాలు జటిలం కూడా అయ్యాయి. ముఖ్యంగా సరిహద్దు వివాదాలు. మోదీ మొదటి పదవీ కాలంలో ‘దిగ్బంధం’ కూడా జరిగింది.

ఫొటో సోర్స్, NurPhoto
బీబీసీ: చైనాతో భారత్ శత్రుత్వం, నేపాల్ స్నేహంపై మీరు ఏం చెబుతారు?
ప్రదీప్ గవాలీ: మేం రెండు దేశాల మధ్య అన్ని రకాల సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నాం. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన కోరుకుంటున్నాం. మా పొరుగు దేశాలైన భారత్, చైనా రెండూ కలిసి ఉండాలనే మేం కోరుకుంటున్నాం. అది నేపాల్‌కు కూడా మంచిది. గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణ తర్వాత నేపాల్ ఒక మీడియా ప్రకటన ద్వారా దానిపై మా ఉద్దేశం తెలియజేసింది.
బీబీసీ: నేపాల్ పట్ల భారత్ పక్షపాతం చూపిస్తోందా?
ప్రదీప్ గవాలీ: నేపాల్ తన పొరుగు దేశాలన్నిటితో విశ్వవ్యాప్త సమానత్వం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటుంది. ఒక దేశం వివిధ అంశాల్లో మరో దేశం కంటే తక్కువగా ఉండచ్చు. కానీ సౌర్వభౌమాధికారం అన్నిటికీ ఒకేలా ఉంటుంది. దానిని కాపాడుకోడానికి, సమాన సంబంధాల కోసం దేశాలు పనిచేస్తాయి. నేపాల్ విదేశాంగ విధానంలో కూడా సౌర్వభౌమాధికార గౌరవం, సంబంధాల్లో సమానత్వం కీలకం.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
బీబీసీ: భారత్ పాత్రను తగ్గించాలని నేపాల్ చూస్తోందా?
ప్రదీప్ గవాలీ: ఇక్కడ సమస్య పాత్రను తగ్గించడం గురించి కాదు. భారత్‌తో మాకు బహుముఖ సంబంధాలు ఉన్నాయి. మేం ఏదైనా ఒక దేశంతో ఉన్న సంబంధాలను మరో దేశం సంబంధాలతో పోల్చం. మాకు అందరితో పూర్తి స్వతంత్ర సంబంధాలు ఉన్నాయి. భారత్‌తో మరింత బలమైన సంబంధాలు ఏర్పరుచుకోవాలని నేపాల్ చూస్తోంది. మేం భారత్‌తో మరింత బలమైన ఆర్థిక సంబంధాలతో ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. అందులో మేం విజయవంతం కూడా అయ్యాం. భారత్‌తో మాకు పరిష్కారం కాని సమస్యలు చాలా ఉన్నాయి. సరిహద్దు వివాదంతోపాటూ, అలాంటి ఏకపక్ష నిబంధనలు ఉన్న చాలా ఒప్పందాలు ఉన్నాయి. హెచ్చుతగ్గులు లేకుండా, రెండు దేశాలకు ప్రయోజనాలు కలిగేలా మేం భారత్‌తో నమ్మకం పునాదిగా సమాన సంబంధాలను కోరుకుంటున్నాం.
ఇవి కూడా చదవండి:
- భారత రైతులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన నేపాల్ పోలీసులు
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- భారత్ - చైనా ఉద్రిక్తతలు: లద్దాఖ్‌లో క్షణక్షణం... భయం భయం
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








