చైనా తీరు మార్చుకునేలా చేసేందుకు ఇదే సరైన సమయం: ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆర్థిక సంబంధాల విషయంలో చైనా తన తీరు మార్చుకునేలా చేసేందుకు భారత్‌కు ఇదే సరైన సమయమని ఆర్థిక నిపుణురాలు ఆషిమా గోయల్ అంటున్నారు.
సరిహద్దుల్లో సంక్షోభం, చైనాకు సంబంధించి అంతర్జాతీయ రాజకీయాల్లో వస్తున్న మార్పులు ఇందుకు వీలు కల్పిస్తున్నాయని ఆమె చెబుతున్నారు.
భారత ప్రధానికి ఆర్థిక సలహాదారుల మండలిలో ఆషిమా తాత్కాలిక సభ్యురాలు. ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీసెర్చ్‌లో ఆమె ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
మేక్రో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, గవర్నెన్స్ లాంటి అంశాల్లో ఆషిమా నిపుణురాలు.
ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితులు, చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆషిమా బీబీసీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
‘‘భారత్ కఠిన వైఖరి అవలంబించాలి. చైనా వస్తువులను మనం అనుమతిస్తున్న స్థాయిలోనే, చైనా కూడా మన వస్తువులను అనుమతించేలా బేరసారాలు చేసుకోవాలి. నిబంధనల విషయంలో చైనా మరింత పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది. పరస్పరం సమానమైన అవకాశాలు కల్పించుకున్నప్పుడే, రెండు పక్షాలకూ ప్రయోజనకరంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా మనం చైనాతో వాణిజ్యం కొనసాగించాలి. చైనా ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందుతుండటం వల్ల మన ఎగుమతులు కూడా చాలావరకూ పెరిగాయి’’ అని డాక్టర్ ఆషిమా గోయల్ అన్నారు.
కానీ, సరిహద్దు ఉద్రిక్తతలు భారత్ వృద్ధికి అవరోధం కావా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె..
‘‘రెండు దేశాల దీర్ఘకాలిక వాణిజ్యంపై పడే ప్రభావాలైతే నాకు ఏమీ కనిపించడం లేదు. మొత్తంగా భారత్‌కే ప్రయోజనం. ఎందుకంటే, తాము చాలా కోల్పోవాల్సి వస్తుందని చైనా తెలుసుకుంటుంది’’ అన్నారు.
2014 నుంచి భారత్, చైనాల మధ్య వార్షిక వాణిజ్యం 70 బిలియన్ డాలర్లపైనే ఉంటోంది. 2018లో ఇది 95.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2019 జనవరి నుంచి నవంబర్ మధ్య ఎగుమతులు, దిగుమతులు నెమ్మదించాయి.
‘‘రెండు దేశాల మధ్య వాణిజ్యం ఊపందుకోవడం వల్ల చౌక ధరలకే వస్తువులు లభించడం వంటి కొన్ని ప్రయోజనాలు కలిగినా, ఏ దేశంతోనూ లేనంతగా చైనాతో భారత్‌కు వాణిజ్య లోటు పెరిగింది. ఈ లోటు రెండు వైపులా పదునున్న కత్తిలా మారింది. ఒకవైపు లోటు పరిమాణం ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ఏ ఏడాదికి ఆ ఏడాది అది పెరుగుతూ పోతోంది. 2018లో 58.04 బిలియన్ డాలర్లకు చేరుకుంది’’ అని భారత ప్రభుత్వం ఇదివరకు ఓ నోట్‌లో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
వాణిజ్య లోటు అంటే?
సూటిగా చెప్పాలంటే... చైనాకు భారత్ అమ్ముతున్నవాటి కన్నా, ఆ దేశం నుంచి కొంటున్నవే ఎక్కువగా ఉండటం.
‘‘చైనాతో వాణిజ్య లోటుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. చైనాకు మనం ఎగుమతి చేసే ఉత్పత్తుల జాబితా చాలా పరిమితంగా ఉండటం, ప్రాథమికమైన ఉత్పత్తులకే పరిమితమవడం మొదటిది. మన వ్యవసాయ ఉత్పత్తులు, మనం రాణిస్తున్న ఫార్మాసూటికల్స్, ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ వంటి రంగాల ఉత్పత్తులు చైనా మార్కెట్‌లోకి రాకుండా అవరోధాలు ఉండటం రెండోది’’ అని భారత ప్రభుత్వం ఆ నోట్‌లో పేర్కొంది.
2018, 2019ల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య జరిగిన సదస్సుల సందర్భంగా వాణిజ్య లోటు గురించి కూడా చర్చలు వినిపించాయి.
‘‘భారత్‌తో వాణిజ్యంలో మావైపు మిగులు ఉండేలా మేం కావాలనైతే చేయలేదు. గత కొన్నేళ్లలో భారత్ నుంచి బియ్యం, చక్కెర లాంటి ఉత్పత్తుల దిగుమతులను పెంచడం... ఔషధ, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం వంటి చర్యలు తీసుకున్నాం’’ అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ ఏడాది ఆరంభంలో వ్యాఖ్యానించింది.
చైనా మూలాలున్న యాప్‌లను నిషేధించడం, చైనా నుంచి వచ్చే పెట్టుబడులను నిశితంగా పరిశీలించడం వంటి భారత్ తీసుకున్న చర్యల గురించి ఆషిమా స్పందిస్తూ... ‘‘భారత్ కఠిన వైఖరి తీసుకోకతప్పదు. డేటా సెక్యూరిటీ చాలా ముఖ్యం. కన్జూమర్ సెంటిమెంట్ అంశం కూడా ఇందులో ఉంది’’ అని అన్నారు.
‘‘దీర్ఘకాలంలో పరిస్థితులు కుదురుకుంటాయి. చాలా దేశాలు కలిసిరావడం వల్ల మరింత శాంతియుత వాతావరణం నెలకొంటుంది’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES/ HINDUSTAN TIMES
‘పట్టణ ఉపాధి హామీ కావాలి’
రుణాల విషయంలో షరతులను సరళీకరించడం... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తక్కువ రేట్లకు గ్యారంటీల సమర్పణ, జనాభాలోని వివిధ వర్గాలకు నేరుగా నగదు ప్రయోజనం అందించడం వంటి చర్యలను ఆర్‌బీఐ, ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నాయి.
మరోవైపు పేదలకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వం అంత ఉత్సాహం చూపడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం దేశంలోని చాలా కుటుంబాలకు నగదు ప్రయోజనాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ దీన్ని అలాగే కొనసాగించాలని సూచించినా, జూన్‌లో ప్రభుత్వం నిలిపివేసింది.
‘‘బాధిత ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగం పెరుగుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ పంటలు పూర్తైతే, చాలా మంది ఉపాధి కోసం వెతుక్కుంటారు. ఉపాధి హామీ పథకం వంద రోజుల పాటే ఉపాధిని కల్పిస్తుంది. గ్రామీణ ఉపాధి హామీలాగే తాత్కాలిక పట్టణ ఉపాధి హామీ పథకం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తే, తిరిగి నగరాల్లోకి జనాలు వలస వస్తారు. ఆర్థికవ్యవస్థను పునరుత్తేజితం చేయడం అవసరం. పండుగల సీజన్ రాబోతోంది. దీని ద్వారా కలిగే ఉపాధి కల్పన, ఆదాయ వృద్ధి... డిమాండ్‌ను పెంచుతుంది. ఇదే మంచి సమయం అనిపిస్తోంది’’ అని ఆషిమా అన్నారు.
‘‘కేంద్ర మున్సిపాలిటీలకు నేరుగా నిధులు పంపి, వారి నుంచి అవసరమైన వారికి చేరవేయొచ్చు. వసతుల కల్పనపై వ్యయం కూడా మనం పెంచాలి. జీడీపీలో రెండు శాతం వెచ్చించడం ద్వారా ఇదంతా చేయొచ్చు’’ అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, NURPHOTO
ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ సమాచారాన్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) ఆగస్టు 31న విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ జీడీపీ 23.9 శాతం మేర క్షీణించినట్లు పేర్కొంది.
‘‘ఆర్థిక వ్యవస్థ దాదాపు 25 శాతం కుంచించుకుపోవడం తాత్కాలిక పరిణామం. అది రెండు నెలలపాటే జరిగింది. జూన్‌లో కార్యకలాపాలు తిరిగి మొదలవ్వడం మనం చూశాం. షాపింగ్ మాల్స్, రిటైల్, సేవల రంగాలు నష్టాన్ని పూడ్చుకోవడం అంత సులభం కాదు. కొత్తగా అవకాశాలు కల్పించే రంగాలు కూడా ఉంటాయి. వృద్ధి రేటు కుదుటపడుతుంది. తయారీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాలు మరింత వృద్ధి చెందుతున్నాయి’’ అని ఆషిమా అన్నారు.
‘‘కరోనా వ్యాధి దూరమయ్యేంత వరకూ పూర్తి స్థాయి అన్‌లాక్ ఉండదు. కాబట్టి, 2021 మార్చి 31 వరకు మొత్తంగా నెగటివ్ గ్రోత్ ఉండొచ్చు. కానీ, వచ్చే ఏడాది మన వృద్ధి రేటు ఆరు నుంచి ఏడు శాతం దాకా ఉండొచ్చు. రెండు విషయాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం దీర్ఘకాలిక సంస్కరణలను కొనసాగించింది. మిగతా దేశాలతో పోల్చితే మన తలసరి ఆదాయం తక్కువగా ఉంది. ఇంకా పెరిగే ఆస్కారం ఉంది. వేగంగా వృద్ధి చెందే పథంలోకి వెళ్లేందుకు మనకు రెండేళ్లు చాలు’’ అని ఆషిమా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనా యాప్స్‌ను భారత్ బ్యాన్ చేసింది... తరువాత ఏంటి?
- చైనా యాప్స్ బ్యాన్‌తో అయోమయంలో పడిన టిక్‌టాక్ స్టార్ భవితవ్యం
- చైనా యాప్స్‌పై భారతీయుల ఆగ్రహం - ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








