10 కి.మీ దూరంలో భారతీయ మహిళ మృతదేహం.. తీసుకురావాలంటే 2291 కి.మీ. ప్రయాణించాలి

భారత్‌లోని ప్రాంతాల నుంచి పాకిస్తాన్‌లోని బల్తిస్తాన్‌ వైపు షెవాక్ నదిలో కొన్ని సార్లు మృతదేహాలు కొట్టుకుపోతుంటాయి. వాటిని సాధారణంగా అక్కడే పూడ్చిపెడుతుంటారు

ఫొటో సోర్స్, FACEBOOK/SHER ALI

ఫొటో క్యాప్షన్, భారత్‌లోని ప్రాంతాల నుంచి పాకిస్తాన్‌ నియంత్రణలోని బల్టిస్తాన్‌ వైపు షెవాక్ నదిలో కొన్ని సార్లు మృతదేహాలు కొట్టుకుపోతుంటాయి. వాటిని సాధారణంగా అక్కడే పూడ్చిపెడుతుంటారు
    • రచయిత, ఫర్హత్ జావెద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘భారత్‌లో ఉన్న పెద్ద సార్లకు, పాకిస్తాన్‌లో ఉన్న పెద్ద సార్లను వేడుకుంటున్నాం. మా కూతురి శవాన్ని ఎలాగోలాగా మాకు అప్పగించండి’’... అంటూ ఓ వృద్ధ జంట దీనంగా అభ్యర్థిస్తూ ఫేస్‌బుక్‌లో వీడియో పెట్టారు.

ఈ జంటది లద్ధాఖ్‌లోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న బ్యుగాంగ్ గ్రామం. వీరి కూతురి పేరు ఖైరున్నిసా. ఆమె వయసు 30 ఏళ్లు.

ఆమె సోమవారం ఉదయం పాకిస్తాన్ నియంత్రణలోని గిల్గిత్-బల్టిస్తాన్‌లో సరిహద్దుకు సమీపంలోని థాంగ్మోస్ నదిలో శవమై కనిపించారు.

అంతకుముందు చాలా సమయంపాటు ఖైరున్నీసా జాడ కోసం ఆమె కుటుంబం వెతుకుతూ ఉంది. లద్దాఖ్‌లోని సరిహద్దు గ్రామాలకు ఆమె ఫొటోతో ఉన్న ప్రకటనను పంపి, ఆమె కోసం గాలిస్తూ ఉంది.

ఖైరున్నీసా ఎలా మరణించారన్నది ఇంకా తెలియరాలేదు. ఆమెది హత్యా? ఆత్మహత్యా? ప్రమాదవశాత్తు మరణించారా? అన్నది కనిపెట్టే విషయమై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు కథనాలు వచ్చాయి.

ఉత్తర పాకిస్తాన్‌లోని స్కర్డు జిల్లా ప్రధాన ఆసుపత్రిలోని కోల్డ్ స్టోరేజీలో ప్రస్తుతం ఖైరున్నీసా మృతదేహం ఉందని, భారత్ నుంచి అభ్యర్థన వచ్చినప్పుడు ఆ మృతదేహాన్ని అప్పగిస్తామని అక్కడి అధికార వర్గాలు తెలిపాయి.

మరోవైపు సంక్లిష్టమైన నిబంధనలు, సుదూర ప్రయాణ మార్గం... ఇలాంటి ఘటనల సమయంలో శవాలను సరిహద్దును దాటించి తీసుకువచ్చేందుకు అడ్డుగోడలుగా మారాయని స్థానికులు అంటున్నారు.

నిజానికి ఈ రెండు సరిహద్దు ప్రాంతాల మధ్య పది కిలోమీటర్ల దూరమే. కానీ, ఈ మార్గాన్ని ప్రభుత్వాలు మూసేశాయి.

ఖైరున్నీసా తల్లిదండ్రులు

ఫొటో సోర్స్, FACEBOOK/SHERINE FATIMA BALTI

ఫొటో క్యాప్షన్, ఖైరున్నీసా తల్లిదండ్రులు

ఇలా భారతీయులు సరిహద్దులకు అవతలివైపు మృతదేహమై కనిపించడం ఇదేమీ మొదటిసారి కాదు.

పాకిస్తాన్‌లోని సరిహద్దు ప్రాంతాలకు షెవాక్ నదిలో గతంలోనూ చాలా సార్లు మృతదేహాలు కొట్టుకువచ్చాయి.

షెవాక్ అంటే బల్తీ భాషలో ‘మృత్యువు’ అని అర్థం. ఇక్కడున్న నదుల్లోకెల్లా షెవాక్‌ను అత్యంత ప్రమాదకరమైనదిగా స్థానికులు భావిస్తారు.

ఈ నదిలో ఏటా చాలా మంది ప్రమాదవశాత్తు చనిపోతుంటారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటుంటారు.

భారత్‌లోని ప్రాంతాల నుంచి ఈ నది ద్వారా కొన్ని సార్లు మృతదేహాలు అవతలివైపు కొట్టుకుపోతుంటాయి.

అలా కొట్టుకువచ్చిన మృతదేహాలను సాధారణంగా పాకిస్తాన్ వైపున్న బల్టిస్తాన్‌లోనే పూడ్చిపెడుతుంటారు. ఒకవేళ వారి వారసులు డిమాండ్ చేస్తే, తిరిగి అప్పగించేలా ‘సురక్షితంగా’ వారి అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ, శవాలు తిరిగి సరిహద్దు అవతలివైపు వారికి అప్పగించడమన్నది చాలా పెద్ద సవాలు.

ఖైరున్నీసా మృతదేహాన్ని పాకిస్తాన్ నుంచి వాయుమార్గంలో ఫార్నో గుండా తీసుకువచ్చి తమకు అందించాలని లద్దాఖ్ కమిషనర్‌కు ఆమె కుటుంబం లేఖ రాసింది.

వీలైనంత త్వరగా ఆమెకు అంత్యక్రియలు జరిగేలా, తమకు సహాయపడాలని కోరింది. సరిహద్దుల్లో ఉండే సైనిక సిబ్బంది సహకారాన్ని కూడా అభ్యర్థించింది.

కానీ, ఈ తరలింపు కష్టంగా మారింది. ఎందుకంటే, ఈ ప్రాంతాల మధ్య ఉన్నది భౌతికంగా పది కి.మీ.ల దూరమే అయినా, దశాబ్దాల క్రితమే అది వేల మైళ్ల సుదూర ప్రయాణంగా మారింది.

‘‘ఆ మహిళ శరీరాన్ని వాఘా సరిహద్దు ద్వారా భారత్‌కు పంపిస్తారు. కానీ, భారత్‌వైపు నుంచి అలాంటి అభ్యర్థనేదీ ఇంతవరకూ మాకు అందలేదు. అందుకే ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని ఉంచాం’’ అని బల్టిస్తాన్‌లోని గాంచె జిల్లా డిప్యుటీ కమిషనర్ బీబీసీతో చెప్పారు.

1971 యుద్ధం తర్వాత నుంచి భారత్, పాకిస్తాన్ రవాణా కోసం వాఘా సరిహద్దునే ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. మిగతా ఏ మార్గాలూ ఉపయోగించకుండా ఆంక్షలు ఉన్నాయని చెప్పారు.

షెవాక్ అంటే బల్తీ భాషలో ‘మరణం’ అని అర్థం
ఫొటో క్యాప్షన్, షెవాక్ అంటే బల్తీ భాషలో ‘మరణం’ అని అర్థం

1971లో ఏం జరిగిందంటే?

1971 డిసెంబర్‌లో భారత్, పాకిస్తాన్‌లో మధ్య మూడో సారి యుద్ధం జరిగింది. అప్పుడు బల్టిస్తాన్‌లోని చాలోంఖా, త్యాక్షి, తాంగ్, తర్టుక్ తదితర గ్రామాలను భారత్ స్వాధీనం చేసుకుంది. ఫలితంగా కొత్త సరిహద్దులు ఏర్పడ్డాయి.

అప్పటివరకూ కలిసి ఉన్న చాలా కుటుంబాలు, వేర్వేరు దేశాల పరిధిలోకి వెళ్లిపోయాయి.

రెండు వైపులా ఉన్న గ్రామాల మధ్య రహదారులు మూసుకుపోయాయి. ఖాప్లో (పాకిస్తాన్), తర్టుక్ (భారత్) రహదారులను, కార్గిల్, స్కర్దు రహదారులను తెరవాలని చాలా కాలంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

సరిహద్దుకు అవతలివైపు ఉన్న తమవారిని కలిసేందుకు మొదట్లో రెండు దేశాలు వీసాలు కూడా ఇచ్చేవి కాదని... ఒకవేళ అదృష్టవశాత్తు దక్కినా, వాఘా సరిహద్దు నుంచే దాటాల్సి ఉండటంతో వేల మైళ్లు ప్రయాణించాల్సి వస్తోందని ఇక్కడి వాళ్లు అంటున్నారు.

బల్టిస్తాన్‌లోని స్కర్డు నుంచి లాహోర్‌కు 984 కి.మీ.ల దూరం. అక్కడికి వాఘా సరిహద్దు 28 కి.మీ.ల దూరంలో ఉంది. వాఘా నుంచి అమృత్‌సర్ చేరుకోవచ్చు. అమృత్‌సర్ నుంచి మరో 898 కి.మీ.లు ప్రయాణిస్తే లద్దాఖ్‌ రాజధాని లేహ్‌కు చేరుకుంటాం. లేహ్ నుంచి మరో 213 కి.మీ.లు ప్రయాణిస్తే తాంక్ వస్తుంది. ఇది లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతం.

అంటే, పది కి.మీ.ల దూరం ప్రయాణిస్తే వచ్చే ప్రాంతానికి... చేరుకునేందుకు వారు చుట్టూ తిరిగి 2,291 కి.మీ.ల ప్రయాణం చేయాల్సి వస్తోంది. అది కూడా ఏళ్లకుఏళ్లు ప్రయత్నించి, వీసా పొందగలిగితే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)