హైపర్‌సోనిక్ స్క్రామ్‌జెట్ టెక్నిక్.. ధ్వనికన్నా ఐదు రెట్ల వేగం గల క్షిపణులతో భారత్ సాధించేదేమిటి?

హైపర్‌సోనిక్ స్క్రామ్‌జెట్

ఫొటో సోర్స్, ANI

    • రచయిత, మానసీ దాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ సెప్టెంబర్ 7న ఒడిషా తీరం నుంచి హైపర్‌సోనిక్ స్క్రామ్‌జెట్ సాంకేతికతను పరీక్షించింది. దీనిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసింది.

డీఆర్‌డీఓ హైపర్‌సోనిక్ టెక్నాలజీ డిమానస్ట్రేషన్ వెహికల్ ఉపయోగించి ఒక క్షిపణిని ప్రయోగించింది. ఇది వాతావరణంలోకి వెళ్లిన తర్వాత మాక్-6 వరకూ వేగాన్ని సాధించింది.

రక్షణ సాంకేతికత అంశంలో దీనిని ఒక పెద్ద విజయంగా డీఆర్‌డీఓ పేర్కొంది. కానీ, అసలు స్క్రామ్‌జెట్ టెక్నాలజీ అంటే ఏంటి. దేశరక్షణ వ్యూహాల్లో ఇది ఎలా సహాయపడుతుంది. ఇవన్నీ తెలుసుకోడానికి శాస్త్రవేత్త గౌహర్ రజాతో బీబీసీ మాట్లాడింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

హైపర్‌సోనిక్ స్పీడ్ అంటే

ఈ టెక్నాలజీ ద్వారా ఒక క్షిపణిని సూపర్‌సోనిక్ స్పీడ్‌లో కాకుండా, హైపర్‌సోనిక్ స్పీడ్‌తో ప్రయోగించవచ్చని చెబుతున్నారు.

‘పాపులర్ మెకానిక్స్’ వివరాల ప్రకారం సైన్స్ పరిభాషలో హైపర్‌సోనిక్‌ను ‘సూపర్‌సోనిక్ ఆన్ స్టెరాయిడ్స్’ అంటారు.

సూపర్‌సోనిక్ అంటే ధ్వని వేగం కంటే ఎక్కువ వేగం(మాక్-1). హైపర్‌సోనిక్ స్పీడ్ అంటే సూపర్‌సానిక్ కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ వేగం. ఈ వేగాన్ని మాక్-5 అంటారు. అంటే ధ్వని వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ వేగం ఉండడం.

హైపర్‌సోనిక్ స్పీడ్ అంటే, దానిలో ఎంత వేగంగా ఉంటుందంటే, ఆ వేగంలో వెళ్తున్న వస్తువు చుట్టుపక్కల గాలిలో ఉన్న అణువులు కూడా ముక్కలైపోయి చెల్లాచెదురవుతాయి.

“మేం ప్రయోగించిన వెహికల్ మొదట ఆకాశంలో 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. తర్వాత అది మాక్-6 వేగాన్ని అందుకుంద”ని డీఆర్‌డీఓ చెబుతోంది.

హైపర్‌సోనిక్ టెక్నాలజీ

ఫొటో సోర్స్, DRDO

స్క్రామ్‌జెట్ టెక్నిక్ అంటే

దాని గురించి తెలుసుకునే ముందు మనం న్యూటన్ సిద్ధాంతాల్లో ఒక ముఖ్య సిద్ధాంతం గురించి మొదట తెలుసుకోవాలి అంటున్నారు గౌహర్ రజా.

న్యూటన్ గమన సిద్ధాంతంలోని మూడో సిద్ధాంతం ‘ప్రతి చర్యకు బదులుగా ఎప్పుడూ సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది’. అంటే రాకెట్ లోపల ఇంధనాన్ని మండించినప్పుడు దాని గ్యాస్ బయటకు వస్తుంది. అలా ప్రతిచర్య రూపంలో రాకెట్(వెహికల్)కు ఒక భారీ కుదుపు వస్తుంది. అది దాని వేగాన్ని పెంచుతుంది. దానినే జెట్ ప్రొపల్షన్ అంటారు.

మొదట్లో తయారైన జెట్‌లలో ఆక్సిజన్, హైడ్రోజన్ మిశ్రమంతో తయారైన ఇంధనాన్ని మండించేవారు. దానికోసం రాకెట్ లోపల ఇంధనం నింపేవారు.

1960వ దశకంలో ఇంధనాన్ని మండించడానికి ఆక్సిజన్‌ను రాకెట్‌లో నింపకుండా, దానిని వాతావరణం నుంచే తీసుకునేలా ఒక సాంకేతికత గురించి ఆలోచించారు. ఆ సాంకేతికతను ‘రామ్‌జెట్ టెక్నిక్’ అన్నారు.

1991 రాగానే అత్యధిక వేగంలో బయటి నుంచి ఆక్సిజన్ తీసుకోకుండానే సోనిక్ స్పీడ్ వరకూ చేరుకోవచ్చని అప్పటి సోవియట్ యూనియన్ నిరూపించింది. కానీ, సూపర్‌సోనిక్ స్పీడ్ వరకూ చేరుకోవడం అంటే చాలా కష్టం. దానికోసం మనకు స్క్రామ్‌జెట్ టెక్నాలజీ అవసరం అవుతుంది.

ఈ కొత్త స్క్రామ్‌జెట్ సాంకేతికతలో రాకెట్ వాతావరణం నుంచి ఆక్సిజన్ తీసుకుంటుంది. తన వేగాన్ని పెంచుకుంటుంది. దానివల్ల ఒక ప్రయోజనం ఉంది. రాకెట్‌లో రెట్టింపు ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు.

కానీ, ఈ సాంకేతికతను వాతావరణం లోపల మాత్రమే ఉపయోగించవచ్చు. రాకెట్ వాతావరణాన్ని దాటి వెళ్లిపోతే, ఈ సాంకేతికత విఫలమయ్యే ప్రమాదం ఉంది. 1991లో సోవియట్ యూనియన్ మొట్టమొదట తాము ఈ సాంకేతికతను ఉపయోగించామని, మాక్ స్పీడ్ అందుకున్నామని ప్రకటించింది.

సోవియట్ యూనియన్ ప్రయోగం జరిగిన చాలా ఏళ్ల తర్వాత అమెరికా, చైనాలు కూడా ఇదే సాంకేతికతను విజయవంతంగా పరీక్షించాయి.

అదే వరుసలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో స్క్రామ్‌జెట్ టెక్నాలజీ ఉపయోగించిన నాలుగో దేశంగా నిలిచింది.

హైపర్‌సోనిక్ స్క్రామ్‌జెట్

ఫొటో సోర్స్, DRDO

స్క్రామ్‌జెట్ సాంకేతికత ఉపయోగం

ఈ సాంకేతికతను ఉపయోగించి రాకెట్‌, క్షిపణిలో ఏమేం చేయవచ్చు అనేది గమనిస్తే, ఏ క్షిపణిలో అయినా మూడు విషయాలు చాలా ప్రధానం.

  • స్పీడ్-క్షిపణి ఎంత వేగంగా చేరుకోగలదు. స్క్రామ్‌జెట్ టెక్నాలజీ క్షిపణికి ఎంత బలంగా కుదుపు ఇచ్చి ముందుకు వెళ్లేలా చేయగలదు. కుదుపు మరీ బలంగా ఉంటే, ఆ క్షిపణి వాతావరణం నుంచి బయటకు వెళ్లిపోతే, అప్పుడు అక్కడ దానికి ఆక్సిజన్ అందదు, దానివల్ల అది విఫలం అవుతుంది.
  • ఇంధనం మండే సమయం-ఇంధనం ఎంతసేపటి వరకూ మండుతుంది. అది క్షిపణిని ఎంతసేపటి వరకూ అదే వేగంతో వెళ్లేలా చేయగలదు. మరో మాటలో చెప్పాలంటే ఇంధనం ఎంత సమయం వరకూ మండుతూ ఉండచ్చు.
  • లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం-ఈ సాంకేతికతతో క్షిపణి లేదా రాకెట్ తన లక్ష్యం వరకూ సరిగ్గా చేరుకోగలుగుతోందా, లేదా. ఎందుకంటే వేగంతోపాటూ లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించడం కష్టం కావచ్చు. అంత వేగంగా వెళ్తున్నప్పుడు ట్రాక్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. క్షిపణి వెహికల్ నుంచి విడిపోయినప్పుడు, అది సరిగా వేరయ్యేలా ఉండాలి. అది సరైన లక్ష్యాన్ని ఛేదించడం చాలా ముఖ్యం.

ఈ సాంకేతికత వల్ల భారత్‌కు రెండు పెద్ద ప్రయోజనాలు ఉంటాయని గౌహర్ రజా చెప్పారు. మొదటిది, రక్షణ రంగానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. ఎందుకంటే క్షిపణి లక్ష్యం వరకూ చేరుకునే సమయం తగ్గిపోతుంది.

ఇక రెండోది, రాకెట్ ప్రయోగించే సమయంలో, ముఖ్యంగా అది వాతావరణంలో ఉన్నంతవరకూ ఇంధనం ఆదా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలా వెహికల్ బరువు కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)